31, మార్చి 2024, ఆదివారం

అమ్ముడు పోదామా! అడుక్కు తిందామా?

మనం కష్టపడుతున్నాం,
వారు సంపాదిస్తున్నారు.
మనం టాక్సులు కడుతున్నాం,
వారు దోచుకుంటున్నారు.
మనం చేయి చాస్తున్నాం,
మన సొమ్మునే భిక్షమేస్తున్నారు.

మనమేం చేద్దాం,ఏడుద్దామా!
మన ఓటు ఆయుధం చేద్దామా?
అమ్ముడు పోదామా! అడుక్కు తిందామా?

నీతిగా ఓటేద్దాం - అభివృద్ధిని గెలిపిద్దాం.

-శివ భరద్వాజ్

29, మార్చి 2024, శుక్రవారం

*సుభాషితం*

न राज्यं न च राजासीत् , न दण्डो न च दाण्डिकः |
धर्मेणैव प्रजास्सर्वा रक्षन्ति स्म परस्परम् ||

న రాజ్యం న చ రాజాసీత్ , న దణ్డో న చ దాణ్డికః |
ధర్మేణైవ ప్రజాస్సర్వా రక్షన్తి స్మ పరస్పరం ||

రాజ్యం లేదు, రాజు లేడు, శిక్ష లేదు, శిక్షించే వారు లేరు |
ధర్మం ద్వారానే ప్రజలందరూ ఒకరినొకరు రక్షించుకున్నారు ||
 

न राज्यं न च राजासीत् , न दण्डो न च दाण्डिकः ।
स्वयमेव प्रजाः सर्वा , रक्षन्ति स्म परस्परम् ॥ 

న రాజ్యం న చ రాజాసీత్ , న దణ్డో న చ దాణ్డికః ।
స్వయమేవ ప్రజాః సర్వా , రక్షన్తి స్మ పరస్పరమ్ ॥

రాజ్యం లేదు, రాజు లేడు, శిక్ష లేదు, శిక్షించే వారు లేరు. |
ప్రజలందరూ స్వయంగా ఒకరినొకరు రక్షించుకున్నారు. ||



न राज्यं न राजाऽसीन्न दण्डयो न च दाण्डिक: |
धर्मेणैव प्रजास्सर्वा रक्षन्ति स्म परस्परम् ||

న రాజ్యం న రాజాసీత్ , న దణ్డయో న చ దాణ్డికః |
ధర్మేణైవ ప్రజాస్సర్వా  రక్షన్తి స్మ పరస్పరం ||

రాజ్యం లేదు, రాజు లేడు, శిక్ష లేదు, శిక్షించే వారు లేరు |
ధర్మం ద్వారానే ప్రజలందరూ ఒకరినొకరు రక్షించుకున్నారు ||



25, మార్చి 2024, సోమవారం

బలము కలిగిన వాడే శాంతి స్థాపన చేయు - గెలిచినోడే చరిత్ర రాయు

బలము కలిగిన వాడే శాంతి స్థాపన చేయు,
దుర్భలుడు తనవారి దుఃఖ పెట్టు.
కనులు మూసుకున్నచో కీడు తెలియదు,
అలసత్వమున్నచో ఆపదలు కలుగు.
బల, ధైర్యములున్నచో కీడు విరుగు.

జాతి మనుగడకు ఐక్యత మూలము.
సంఘ మనుగడకు సంఖ్య బలము.
సంఖ్య పెరిగిన బలము పెరుగు,
బలము కలిగిన శాంతి కలుగు.
 
ధైర్యముగా నిలబడిన దాడులాగు.
ఐక్యత లేని జాతి కనుమరుగునగు.
ధైర్యము లేని జాతి దేబిరించు.
నీవెటులుందువో నిర్ణయించు.

నీ జాతి వెలుగు, నీ నిర్ణయమే అని మరువకు.
గెలిచినోడే, చరిత్ర మార్చునన్న నిజాన్ని మరువకు.
-శివ భరద్వాజ్

23, మార్చి 2024, శనివారం

అమరవీరుల దినోత్సవం



విప్లవ శంఖం పూరించిరదిగో త్రిమూర్తులు
రాజ్ గురు, భగత్ సింగ్, సుఖదేవులు.  
లాలాజీ రక్తాన్ని రుచి చూసిన శాండర్సు,
గుంటనక్క వేటాడగా సింహాలై గర్జించిరదిగో

బెబ్బులులై ముందుకురికి, మట్టుబెట్టి,
పంజాబు కేసరికి ఘన నివాళి ఘటియించే   
శాండర్సు రక్తము తోడ తర్పణాలు వదిలి,
జనులందరు ముదముతోడ హర్షించే.

ఉరికైనా వెరువక ముందుకు సాగిరి,
స్వాతంత్ర్య సమరాన అమరపురికేగిరి.  
వారు పూరించిన విప్లవ శంఖపు ధ్వని
ప్రతిధ్వనిస్తూనే ఉన్నది, నేటికీ ఈనాటికి.

ధన్యురాలివమ్మ నవభారత జనని,
నీ బిడ్డల తెగువ స్ఫూర్తినింపే భరత భూమికి.

అమరవీరుల దినోత్సవ సందర్భముగా
-శివ భరద్వాజ్

19, మార్చి 2024, మంగళవారం

మా పని - మా గౌరవం గెలవాలి.

ఉచితాలు వద్దే వద్దు - క్షేమం, సంక్షేమం ముద్దు
విద్యా ప్రైవటీకరణ రద్దు - అందరికీ  ప్రభుత్వ బడులే ముద్దు
ఆరోగ్య వ్యాపారం వద్దు - అందరికీ ప్రభుత్వ వైద్యం ముద్దు
ప్రకృతి హననం వద్దే వద్దు - ప్రకృతితో జీవనం ముద్దు

కుల విభజన ఇంకానా - వద్దే వద్దు.
మత ప్రాతిపాదిక రిజర్వేషన్లు చేయాలిక రద్దు,
ప్రజలందరికీ సమానావకాశాలే ముద్దు.
ఇప్పటివరకు ఉన్న అప్పులు తీర్చి,
అందరికీ పని కల్పించే ప్రభుత్వమే కద్దు.

ఎన్నాల్లీ చేయి సాచే బతుకులు
పని చేయాలి - సంపాదించాలి
మా పని, మా గౌరవం గెలవాలి.
న్యాయం అందరికీ సమానం కావాలి.

- శివ భరద్వాజ్

14, మార్చి 2024, గురువారం

వాకిట చిరుముంత నీరు - మూగ ప్రాణాలు నిలబెట్టు సారు

 
వృధా చేస్తారు గాని, నీరు
గుక్కెడైనా ఈయలేరా!
డబ్బులిచ్చి కొనలేము మేము,
చుక్క నీటిని పోయలేరా!
మరువక,  మీరు వాకిట పెట్టు
నీరు, మా ప్రాణాలు  కాచును,
కొంచెమాలోచించు సారూ!
మీ ఋణముంచుకోము సారూ!

 - ఇట్లు
మూగజీవులు, మీ సాటి ప్రాణులు

11, మార్చి 2024, సోమవారం

మనిషిని మనిషిగా ప్రేమిద్దాం - ప్రకృతితో కలిసి జీవిద్దాం.

ఒకప్పుడు గలగల పారే గోదారిలో నీళ్లు తాగేవాళ్ళం,
ఇంటి వద్ద కౌశికలో హాయిగా ఈత కొట్టే వాళ్ళం,
పాంచాల పక్కన చెట్టుపై కోతికొమ్మచ్చి ఆడేవాళ్ళం,
పచ్చని కొబ్బరితోటలో పంపుసెట్టు వద్ద స్నానాలు చేసే వాళ్ళం,
మనసారా హాయిగా నవ్వుకునేవాళ్ళం,
ఒకరినొకరు ఆట పట్టించుకునే వాళ్ళం,
మనసిచ్చిన అమ్మాయి గురించి కబుర్లాడుకునే వాళ్ళం,
ఏ కల్మషమంటని మనసులు మావి,
ఏ మర్మమెరుగని ఆలోచనలు అవి,

ఇప్పుడంతా మారిపోయింది,ఆశకు
గోదారి వ్యర్ధాలతో నిండిపోతుంది,
కౌశిక డ్రైనేజి కాలువ అయిపోయింది,
పెద్ద చెట్టు కనుమరుగయిపోయింది,
కొబ్బరితోటలు రొయ్యల చెరువులయ్యాయి.
జీవం లేని నవ్వులు పూస్తున్నాయి,
పార్టీలుగా చీలి కొట్లాటలాడుతున్నాం,
విమర్శలే కబుర్లుగా మారిపోయాయి,
మనసులు కుల,మత,వర్గ మంటలలో కాలుతున్నాయి,
మర్మమే మారిగా సోకి కుత్తుకలు తెగుతున్నాయి,

మార్పు రావాలంటే - భవిత మారాలంటే,
డబ్బుపై ప్రేమ తరగాలి - మనిషిపై ప్రేమ పెరగాలి.
మనిషిని మనిషిగా ప్రేమిద్దాం - ప్రకృతితో కలిసి జీవిద్దాం.
నేను సిద్ధం, మరి మీరు ...... 

-శివ భరద్వాజ్

ఏది లేదో దానిని స్మరిస్తున్నాము

లేని కాలము సృష్టి చేసి
కాలము చేతిలో బంధిలయ్యాము

లేని మతము సృష్టి చేసి
మతము చేతిలో బంధిలయ్యాము

లేని కులము సృష్టి చేసి
కులము చేతిలో బంధిలయ్యాము

లేని రూపాయి సృష్టి చేసి
రూపాయి చేతిలో బంధిలయ్యాము

ఏది ఉందో దానిని విస్మరిస్తున్నాము
ఏది లేదో దానిని స్మరిస్తున్నాము

- శివ భరద్వాజ్

10, మార్చి 2024, ఆదివారం

నాటకాలాడేవు నరుడా!

నాటకాలాడేవు నరుడా!
నాది నాదనుచు నలుదిక్కు తిరిగేవు నరుడా!
నీదన్నదేదీ నరుడా!
చిట్టచివరికి ఏకాకి నడకే నరుడా!    ||నాటకాలాడేవు||

ఎంత బలమున్నగాని నరుడా!
నిన్ను మోసేకి, ఇంకొకరు కావాలి నరుడా!
ఎంత ధనమున్నగాని నరుడా
కాలేది కట్టెలా నడుమేరా నీవు నరుడా!    ||నాటకాలాడేవు||

ఎంత గొప్పోనివైనా నరుడా!
ఈ బుడగ పేలేది నిక్కంబు నరుడా!
శివము పోయి శవమైతే నీవు నరుడా!
నిన్నోపలేరు నీ ఇంటనోయి నరుడా!    ||నాటకాలాడేవు||

ఏ బతుకు బతుకేవు నరుడా!
నలుగురితో నవ్వుతూ బతకాలి నరుడా!
చేయగలిగితే చేయి నరుడా!
సాయంబు శాశ్వతంబౌను నరుడా!    ||నాటకాలాడేవు||

- శివ భరద్వాజ్


మనసుకు ముసుగేసి బతికేస్తున్నాం.

*మనసుకు ముసుగేసి బతికేస్తున్నాం*

మనకి మనసులో ఉన్నది వేరు,
మనము చేసింది వేరు,
మనము చేస్తున్నది వేరు,
మనము చేయబోయేది వేరు.

ఆశలన్నీ చుట్టేసి,
లక్ష్యాలను మడతెట్టేసి,
అప్పుడు అలా చేయలేకపోయానని,
ఇప్పుడిలా నిట్టూరుస్తూ,
బతుకుబండి బలవంతంగా లాగించేస్తున్నాం.

మన చుట్టూ గిరిగీసుకొని,
మనసుని, మనల్ని అందులోనే
గిరగిరా తిప్పుకొంటూ,
భయం మాటున బతుక్కొంటూ,
మనలోని మననుండి తప్పుకొంటూ,
బయటపడదామని తొంగి చూస్తున్న,
మనసుని ముసుగేసి కప్పుకొంటూ,

నలుగురూ ఏమనుకుంటారోనని,
మనసు ఏమంటున్నా పట్టించుకోకుండా,
మనసు మాట వినకుండా,
మనసు గొంతుని నొక్కేసి,
నలుగురి మెప్పుకోసం,
మనసుకు ముసుగేసి బతికేస్తున్నాం.

- శివ భరద్వాజ్ 

9, మార్చి 2024, శనివారం

ఈశా..నీ దయేగద నా ప్రతి శ్వాస..!!

నీ దాసుడనే ఈశా
సదా నాయెదలో నీ ధ్యాస
నీ సిసుడను పరమేశా
నీ దయేగద నా ప్రతి శ్వాస   /నీ దాసుడనే

సర్వానికి యజమానివి
కానరాని ఓ నిజానివి
జగములనేలే రాజువి
మా తలరాత తరాజువి
నీ రచనేగా ఈశా
ఈ చరాచరముల దశ దిశ      /నీ దాసుడనే

ప్రాణులనెల్ల ముల్లోకాల్లో
పాత్రలుగా నీ కనుసన్నల్లో
ప్రాయము మాయగ నీ లీలల్లో
ప్రమేయ జాలపు మర్మములల్లో
నీ రచనేగా ఈశా
ఈ చరాచరముల దశ దిశ      /నీ దాసుడనే


-- విశ్వసాహితి

నీవు ఎలా ఉన్నా - నాలో సగానివి నువ్వు.

నీ కోపం అలల్లా ఎగసి పడుతుంటే,
ఎంత ఎగిసినా, ప్రేమతో కలుపునే సంద్రాన్ని నేను,
నీ అసహనం లావాలా ఎగజిమ్మినా,
నిన్ను సహనంతో హత్తుకునే పృథ్విని నేను,
నీ మాటలు పిడుగుల్లా మీద పడ్డా,
ఏ మాత్రం తొణకని సువర్ణ వాహకం నేను,
నీవు ఎలా ఉన్నా, నాలో సగానివి నువ్వు.
నిన్ను నిన్నులా ప్రేమించే నీ మగడిని/ఆలిని నేను.

-శివ భరద్వాజ్

8, మార్చి 2024, శుక్రవారం

ఆమె నా కెప్పుడు ప్రత్యేకం కాదు

ఆమె నా కెప్పుడు ప్రత్యేకం కాదు,
ఆమె నాతో సమానమెప్పుడు కాదు,
అమ్మలా కాపాడే ఆమె నాకు ప్రత్యేకం
అక్కలా ఆదరించే ఆమె నాకు ప్రత్యేకం
చెల్లిలా చిరునవ్వులు పూయించే ఆమె నాకు ప్రత్యేకం
చెలిలా స్నేహాన్ని పంచే ఆమె నాకు ప్రత్యేకం
ప్రియురాలిగా ప్రేమ మాధుర్యాన్ని పంచే ఆమె నాకు ప్రత్యేకం
భార్యగా నా కుటుంబాన్ని పెంచి పోషించే ఆమె నాకు ప్రత్యేకం
ప్రకృతిరూపమై నను పరిరక్షిస్తున్న ఆమె నాకు ప్రత్యేకం
ఆమె ఎప్పుడు నాతో సమానం కాదు,
నన్ను పుట్టించి, పెంచి, ఆదరించి,చిరునవ్వులు పూయించి,
స్నేహాన్ని, ప్రేమను పంచి, నా కుటుంబాన్ని పరిరక్షిస్తున్న ఆమె
నాతో సమానం కాదు. నేను పూజించే దేవత.

మహిళా మూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
-శివ భరద్వాజ్

పరమశివ నిను తలచి

పరమశివ నిను తలచి,
పరవశాన నను మరచి,
శ్వాసన ధ్యాసుంచి,
హంస గతి గమనించి,
నిను ధ్యానింప తత్వమందెనురా!
నన్ను నేను తెలిసేనురా!!


పరమశివ నిను తలచి,
పరవశాన నను మరచి,
నీ గతులు గమనింప,
సద్గతులు కలిగేనురా!!


నీ తత్వమును మది నిలిపి,
సర్వము సమమనుచు,
మనుగడను సాగించు,
భక్తులను కాచెవురా!!


సిరులన్ని మాకిచ్చి,
తిరిపెము నువు చేసి!
మా తల రాత మార్చేవురా,
మా బతుకంత నీ బిక్షరా!!




7, మార్చి 2024, గురువారం

ఎదురు చూస్తున్నా

ఎదురు చూస్తున్నా,
ప్రతి నిముషం నిన్ను తిరిగి పొందాలని,
ఎదురు చూస్తున్నా,
కాలంతో కనుమరుగైన నిన్ను రప్పించాలని,
మన మధ్య ఆ చిలిపి తగాదాలేవి?
మన మధ్య ఆ విరహపు వేదనలేవి?
నీ సమక్షమే ప్రపంచమని తలచాను నాడు!
నీ పరోక్షమే మిన్నని రాజీపడ్డాను నేడు.
నీ మాటల తియ్యదనం చవిచూసాను నాడు!
నీ మాటల కరుకుదనానికి తల్లడిల్లాను నేడు.
నా రాక పండుగలా చేసుకునేవు నాడు!
పులిని చూసిన జింకలా బెదిరేవు నేడు.
అభిప్రాయ బేధాలను పరిష్కరిద్దాం, కాకుంటే పక్కన పెడదాం
నా మాటే గెలవాలన్న పంతాన్ని మాత్రం కాటికంపుదాం.
కాలం చేసిన గాయాలకు చల్లని ప్రేమతో సాంత్వనచేద్దాం!
గతజీవన వైభవాన్ని ప్రస్తుతంలోకి తిరిగి తీసుకువద్దాం.
ఒకరికొకరు తోడై కలకాలం కలిసివుందాం.
ఆనందాల బృందావనంలో కలిసి విహరిద్దాం.

-శివ భరద్వాజ్


 
 

6, మార్చి 2024, బుధవారం

జీవిత పయనం

ఈ ఉదయం నీది,
ఈ అస్తమయమూ నీది,
ప్రతి అస్తమయం నవోదయానికి ఆరంభం,
ప్రతి ఉదయం అస్తమయానికి ప్రారంభం,
కానీ చీకటిలోనే నీవుండి పోతే,
రేపటి పగలు చూసేదెవ్వరు,
ఓటమికి భయపడుతూ ప్రయత్నం మానేస్తే,
గెలుపు నిన్ను చేరేదెప్పుడు?
గెలుపు వచ్చిందని అహంకారం తలకెక్కితే,
ఓటమి చీకటి నిన్ను కమ్ముకోవడం ఆగదు.
చక్ర భ్రమణం నీ జీవితం,
ఒకసారి కింద, ఒకసారి పైన
ఏదేమైనా ఆపకు నీ గమనం.
అదే నీ జీవిత పయనం.
 
-శివ భరద్వాజ్

5, మార్చి 2024, మంగళవారం

ఆలోచనలే జీవితం - ఆలోచనలే సర్వస్వం

ఆలోచనలే జీవితం, ఆలోచనలే సర్వస్వం
ఆలోచన మారితే, జీవితం మారుతుంది
ఆలోచన మంచిదైతే, జీవితం మంచిదవుతుంది.
ఆలోచనే నీ జీవితాన్ని మారుస్తుంది
ఆలోచనే నీ జీవితాన్ని ఏమారుస్తుంది.
ఆలోచనల ఉలి నీ నవజీవన శిల్పాన్ని ఆవిష్కరిస్తుంది.
ఆ శిల్పం సుందరేశ్వర రూపం పొందాలన్నా,
ఆ శిల్పం భయానక మృగంలా మారిందన్నా,
కారణం మాత్రం కేవలం నీ ఆలోచనే
అదే నీకు చేయెత్తి మొక్కేలా చేస్తుంది.
అదే నీపై దుమ్మెత్తి పోసేలా చేస్తుంది.

-శివ భరద్వాజ్

4, మార్చి 2024, సోమవారం

ప్రకృతిని మనం కాపాడితే, మన భావి తరాలను అది కాపాడుతుంది.

నియంత్రణ లేని నాగరికత,
నిలువరించ లేని జనాభా,
నిర్మూలించలేని కాలుష్యం,
ఆగని బహిరంగ మురుగునీటి పారుదల,

మానవుడు కాలుష్యం కోసం చాలా సృష్టించాడు.
పారిశ్రామీకరణతొ కాలుష్య కర్మాగారాలు,
విష వాయువులు వెదజల్లే పరిశ్రమలు,
హానికర వాయువులు విసర్జించే వాహనాలు,
భూమిని ఫలించకుండా చేసే రసాయన వ్యర్ధాలు,
ఒకటేమిటి సర్వం సృష్టించాడు,
కాలుష్య బ్రహ్మ అయ్యాడు.

తన సౌలభ్యం కోసం, సుఖం కోసం
పాకులాడుతూ పచ్చదనాన్ని హరిస్తున్నాడు,
చల్లదనం కోసం వాడే శీతల యంత్రాలతో
భూతాపాన్ని పెంచేస్తున్నాడు.
అనేక జీవుల మనుగడ ప్రశ్నార్ధకం చేస్తూ,
తనను తాను ఆత్మహత్య చేసుకుంటున్నాడు.
 
ప్రకృతికి తప్పనిసరి కష్టాలు కొనితెస్తున్న మానవుడు,
ప్రకృతిలో తానూ ఒకడని మరిచిపోతున్నాడు.

మిత్రులారా, జాగ్రత్తగా ఉండండి, మేల్కొనండి,
లేవండి,నడుం బిగించండి,
ప్రకృతితో చెలిమి చేయండి,
ప్రకృతితో మమేకం అవ్వండి.
ప్రకృతిని బాధ పడనీకండి,
ప్రకృతితో ఆడుకోవడం మానేయండి.
మానకుంటే ప్రకృతి ఆడడం ప్రారంభిస్తుంది.
అప్పుడు మన ఉనికే ప్రశ్నార్ధకం అవుతుంది.

చెట్లను, అడవులను సంరక్షించండి,
ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించండి.
ప్రకృతిని మనం కాపాడితే, మన భావి తరాలను అది కాపాడుతుంది.

-శివ భరద్వాజ్

రాజువి బానిసగ మారి యాచకుడయ్యావ్

రాజులు చేయగ ప్రజలను, వజ్రాయుధ సదృశ, ఓటు రాజ్యాంగ మిచ్చె! భాజాలు కొట్టుటలవడి, రాజువి బానిసగ మారి యాచకుడయ్యావ్!!  -శివ భరద్వాజ్