21, ఆగస్టు 2022, ఆదివారం

మాటల రాళ్లే కదా విసిరేస్తుంటాం

 

మాటల రాళ్లే కదా విసిరేస్తుంటాం

మాటల రాళ్లే కదా విసిరేస్తుంటాం
తూటాల కన్నా బలంగా విసిరేస్తుంటాం
ఒక్క క్షణం ఆగి ఆలోచించం
తగులుతుంది ఎక్కడని!
 

మాటల రాళ్లే కదా విసిరేస్తుంటాం
ఝటాలు పదేపదే చెబితే నమ్మేస్తుంటాం
ఒక్క క్షణం తర్కించి ఆలోచించం
బలయ్యేది ఎవరని!

మాటల రాళ్లే కదా విసిరేస్తుంటాం
నాటకాలను నమ్మి మోసపోతుంటాం
ఒక్కక్షణం ఉద్వేగాలను వదిలి నిజాయితీగా నీ మనసునడిగితే
చెబుతుంది నిజమేమిటని!
 

మాటల రాళ్లే కదా విసిరేస్తుంటాం
అది కొన్ని జీవితాలను
అది కొన్ని కుటుంబాలను
సమాజాన్ని శాశ్వతంగా నిశీధిలోకి
నెట్టేస్తుందని ఆలోచించం
వారికి చెప్పుకునే ఏ ఒక్క అవకాశాన్ని
మిగల్చకుండా
మాటల రాళ్లే కదా విసిరేస్తుంటాం

-- శివ భరద్వాజ్
భాగ్యనగరం.

16, ఆగస్టు 2022, మంగళవారం

నా గుండెలో బాధ మేఘసందేశమై వర్షిస్తుంది అందుకో ప్రియతమా!

నా గుండెలో బాధ మేఘసందేశమై వర్షిస్తుంది అందుకో ప్రియతమా!

నీ విరహపు తలపుల ఊహలలో
బరువెక్కిన కన్నుల చూచి
నింగినుండి మబ్బు తునక నను చేరి
కంటినున్న కన్నీటిని మోసుకెళ్లి
నా ప్రేమను వర్షిస్తానన్నది
నా గుండెలో బాధ
మేఘసందేశమై వర్షిస్తుంది అందుకో ప్రియతమా!


--శివ భరద్వాజ్
భాగ్యనగరం


15, ఆగస్టు 2022, సోమవారం

ఎగరేయండి భారత కీర్తి పతాకను - జరపండి స్వాతంత్ర్య అమృతోత్సవాలను

వజ్రోత్సవ స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్న ఈ దేశంలో
రావాలి స్వాతంత్య్రం ఆకలి చావుల నుండి
కావలి స్వాతంత్య్రం విద్య వ్యాపారం నుండి
తేవాలి స్వాతంత్య్రం వైద్య వ్యాపారం నుండి
రావాలి ఒకే దేశం, ఒకే చట్టం
కావలి ఒకే కులం, ఒకే మతం
ద్వేషం మరింత పెరిగి, స్వార్ధం మరింత కలిగి
ఉన్న దేశ భక్తి కరిగి స్వాతంత్రం పరతంత్రం
అయ్యేలా చేష్టలుడిగి జవచచ్చిన పౌరులారా
మేల్కొండి తిప్పండి ప్రగతి రధచక్రాలను
ఉచితాలకు బిక్షగాళ్ళై మిగలక
చేరండి సమున్నత శిఖరాలను
దేశభక్తిని విశ్వ శక్తిగా మార్చి
ఎగరేయండి భారత కీర్తి పతాకను.
జరపండి నిజమైన స్వాతంత్ర్య అమృతోత్సవాలను


--శివ భరద్వాజ్
భాగ్యనగరం

14, ఆగస్టు 2022, ఆదివారం

ఆగష్టు 14 అఖండ భారతి ముక్కలైన రోజు

ఆగష్టు 14 అఖండ భారతి ముక్కలైన రోజు

అఖండ భారతి ముక్కలైన రోజు
కుటిల నీతికి నేతలు తలవంచిన రోజు
ఈ రోజుకి ఆగని చితి రగిలి న రోజు

అన్నదమ్ముల బద్ధ శత్రువులజేసి  
మతము చేసిన మారణ హోమానికి
అమాయక ప్రజలు సమిధలైన రోజు

జన్మభూమితో బంధం తెగిపడి
ప్రాణాలరచేతినబట్టి పరిగెత్తిన రోజు
రాబందుల రాజ్యంలో రాబందులకాహారంగా
లక్షల పీనుగులు అనాధ ప్రేతలై మిగిలిన రోజు

ఆత్మ బంధాలు, రక్త బంధాలు
తెగిపడి రక్తం ఏరులై పారినరోజు
కుటిల నీతికి నేతలు తలవంచిన రోజు
ఈరోజే ఆరని చితి రేగిన రోజు

స్వతంత్రామృతం దక్కే ముందు
మతము పేరిట హాలాహలం  ప్రభవించిన రోజు
-- శివ భరద్వాజ్,
భాగ్య నగరం  

5, ఆగస్టు 2022, శుక్రవారం

చీకట్లో నీడైన నీ తోడు నిలవదు - వెలుగులో నీడ అవసరం నీకు ఉండదు

 

మిత్రులు ఎవ్వరు శత్రువులెవ్వరు
బంధువులెవ్వరు రాబందువులెవ్వరు
కన్నుల ముందర పొగుడునదెవ్వరు
కన్నుల దాటిన తెగుడునదెవ్వరు
కష్టములందు కాచునదెవ్వరు
సుఖములందు చేరునదెవ్వరు

చీకట్లో నీడైన నీ తోడు నిలవదు
వెలుగులో నీడ అవసరం నీకు ఉండదు
 
--శివ భరద్వాజ్  
భాగ్యనగరం 

ఓటు మన హక్కు - వదులుకోమాకు

 పిల్లలు బాగుండాలని మంచి కాలేజీ చూస్తావు! బతుకు బాగుండాలని మంచి ఉద్యోగం చేస్తావు! అమ్మాయి బాగుండాలని మంచి సంబంధం చూస్తావు! మనము బాగుండాలని  ...