26, సెప్టెంబర్ 2023, మంగళవారం

విద్య ఒసగవలెను వినయమును

విద్య ఒసగవలెను వినయమును

ఆటవెలది:

విద్య ఒసగవలెను వినయమును, గుణము
గురువు హెచ్చుచేయవలెను,  తల్లి
దయను, ధర్మ వర్తనమును తండ్రియ నేర్ప
వలెను, నడత తాను నడవవలెను.

25, సెప్టెంబర్ 2023, సోమవారం

మార్గమగుపడదు ప్రయత్నమాగిన మనసా

 

కంద పద్యం:

మార్గములన్నియు మూసిన
మార్గమొకటి దొరకు పట్టు వదలక సాగిన,
మార్గము దొరకదు ఆగిన,
మార్గమగుపడదు ప్రయత్నమాగిన మనసా

24, సెప్టెంబర్ 2023, ఆదివారం

కోటియున్న కొంచమాకలి పుట్టించలేము - కొంచమైనా కునుకు కొనలేము సోదరా!

కోటియున్న కొంచమాకలి పుట్టించలేము
కోటియున్న కొంచమాయువు పెంచలేము
కోటియున్న కొద్ది బాధను పంచలేము.
కోటియున్న పట్టు పరుపులు కొనవచ్చు గాని,
కొంచమైనా కునుకు కొనలేము సోదరా!
భావం:
కోటి రూపాయలు వలన సహజమైన ఆకలి పుట్టించలేము. ఒక్క నిముషమైన ఆయువుని పెంచలేము, మన బాధను ఇంకొకరికి ఇవ్వలేము. అలాగే పట్టు పరుపులు కొనవచ్చుగాని కొంచెము సేపు సహజమైన నిద్రను కొనలేము.

21, సెప్టెంబర్ 2023, గురువారం

కోటియున్న నిద్ర కొన లేము - కోటిఇచ్చిన బాధ వేరొకరు పడరు

కోటియున్నను నిద్రను కొనగ లేము!
కోటిఇచ్చిన బాధ వేరొకరు పడరు!
నీవు చేసిన తప్పుకు శిక్ష, నీకు 
పడుట సత్యము. అక్రమార్జనమువలదు.

భావం:
కోటి రూపాయలు నీ వద్ద ఉన్నాగాని నిద్రను కొనలేము. కోటి రూపాయలు ఇచ్చిన నీ బాధ వేరొకరు నటించునేమో గాని, బాధ పడవలసింది నీవే. అక్రమ మార్గంలో ఎంత సంపాదించినా, ఏదో ఒకరోజు శిక్ష పడక తప్పదు. అందుకే అక్రమార్జన వదిలిపెట్టవలెను. 

20, సెప్టెంబర్ 2023, బుధవారం

కుత్సితమున కోట్లు కూడబెట్టినను - ఉత్సుకతన ఒక్కనోటును రాదు

కుత్సితమున కోట్లు కూడబెట్టినను
ఉత్సుకతన ఒక్కనోటును  రాదు
ధర్మముగా పది వందలు పొంది
ధర్మము చేసిన పది రూప్యములును
ధర్మము నీ వెంటవచ్చు తోడుగను
ధర్మపరుడను కితాబు మిగులును

భావం:
చెడు మార్గాల ద్వారా కోట్లు కూడబెట్టినా కూడా నీవు చనిపోయినప్పుడు ఉత్సాహంగా నీవెంట ఒక్క నోటు కూడా రాదు. కానీ ధర్మ మార్గముల ద్వారా పది వందలు సంపాదించి, అందులోనుంచి పది రూపాయలు దానం చేస్తే, ఆ ధర్మం నీవు చనిపోయాక కూడా నీ తోడు వస్తుంది. పైగా ధర్మ పరుడని అందరు నిన్ను గుర్తుంచుకుంటారు. 

19, సెప్టెంబర్ 2023, మంగళవారం

కలిగున్న దాని యడల తృప్తి శుభము - కలతవలన తరుగును ఆయువానందములు

మేడ లేదు నాకని భాదను పడుతుంటిని,
గూడు లేని వానిని చూసి కుదుట పడితిని.
కలిగున్న దాని యడల తృప్తి శుభము. వదులు
కలతవలన తరుగును ఆయువానందములు.

భావం:
మేడ లేదని భాద పడుతున్నాను. అప్పుడు నేను ఇల్లే లేని వానిని చూసాను. అపుడు నా మనసు కుదుటపడింది. మనం మనకున్న దాని పట్ల తృప్తితో ఉండాలి. అప్పుడు మనకు అన్ని విధాల మంచి జరుగుతుంది అలా కాకుండా మనకు అది లేదు, ఇది లేదు అని ఎప్పుడూ బాధ పడుతూ కూర్చుంటే, మనం ఉన్నదానితో ఆనందంగా ఉండలేము. దీనిని వదిలి వేయాలి, లేకుంటే మనం సంతోషంగా గడపలేము. మన ఆరోగ్యం క్షీణిస్తుంది, దానితో పాటు మన ఆయుర్దాయం తగ్గిపోతుంది.

 

 


18, సెప్టెంబర్ 2023, సోమవారం

తొలి పూజ దేవుడు - విఘ్న హరుడు - వినాయకుడు

తొలి పూజ దేవుడు - విఘ్న హరుడు - వినాయకుడు

తొలి పూజ దేవుడు విఘ్న హరుడు.  
హర పుత్రుడు, ఉండ్రాళ్ళ బంటు సుమా!
ఉమా సుతుడు,మూషికాసుర గర్వ సంహారి.
హరికి మేనల్లుడు,హరిద్రా స్వరూపుడు.
రూపమున గజాననుడు, షడానన సోదరుడు.
ధరణి,పాతాళ,స్వర్గములను ముల్లోకముల
లోక నాయకుడై పూజలందు కొనునమ్మా!
అమ్మానాన్నలే ముల్లోకములని తెలిపిన సుబుద్ధి.
బుద్ధిపతి,మా గణపతి పొందె గణాధిపత్య సిద్ధి.
సిద్ధిపతి, సర్వలోకముల తొలి పూజ దేవుడు.

-శివ భరద్వాజ్

17, సెప్టెంబర్ 2023, ఆదివారం

తనవారల సంతస పెట్టు - జనులు ధన్యులు

చలనవాణిని పక్కన పెట్టి
దూరవాణిని దూరము పెట్టి
తన్మయ వాణిన తనవారల
సంతస పెట్టు  జనులు ధన్యులు

భావం: 

మొబైల్ ఫోన్ పక్కన పెట్టి, TV దగ్గర కూర్చొని పోకుండా, తన్మయ పరిచే మాటలతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను సంతోష పెట్టువారు ధన్యులు.

16, సెప్టెంబర్ 2023, శనివారం

బాధల పుటమున మెరయు మంచివారు

బాధల పుటమున మెరయు మంచివారురా

బురదనున్న  బంగరు  విలువు తగ్గదు
నింద పడిన తొలగు నిజము గాను
బాధల పుటమున మెరయు మంచివారురా   
శివకుమారు మాట సిరుల మూట

భావం:
బురదలో ఉన్న కారణంగా బంగారం విలువ తగ్గుతుందా?
అలాగే మంచివారిపై నింద  పడినంత మాత్రాన తొలగకుండా పోతుందా?
మంచివారిని బాధల పుటం పెట్టినప్పటికీ వారు బంగారంలా మెరుస్తారు.

15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

పాలకులారా మీకు జోహార్లు

పాలకులారా మీకు జోహార్లు  


రాయితీలు మనకిచ్చి
ఉచితాలు పంచిచ్చి
జనాలకు రూపాయల నూకలు జల్లి
ఎగరగలిగే శక్తి నిచ్చే ఈకలన్నీ పీకి
ఉన్నదంతా ఊడ్చుకుపోయేలా
గంజాయి మత్తులోన యువతను ముంచి
మద్యపు మత్తులోన పెద్దలను ఉంచి
భూ బకాసురులై కొండల సైతం ఉండలుగా మార్చి
రియల్ వ్యాపారులకు పంచిచ్చి
కనీస అవసరాల రేట్లు పెంచి
మా బాగా పాలిస్తున్నారు గంగి గోవులై
పాలకులారా మీకు జోహార్లు.

14, సెప్టెంబర్ 2023, గురువారం

నీరు - బీరు : మాన్యుడు - సామాన్యుడు

 

నీరు సీసానుంచి ఎంత కుదిపిన గాని
తొణకుచుండు కుదుపు ఉండు వరకు
బీరు సీసానుంచి కొంత కుదిపిన గాని
తొణికి పొరలుచుండు కుదుపాగిన గాని
మాన్యుండు స్పందించు నీటి రీతిగాను
సామాన్యుండు పొరలు బీరు రీతిగాను

--శివ భరద్వాజ్

పై పదాలకు మూలం:
మనందరికీ జీవితంలో వివిధ రకాల సమస్యలు వచ్చి మన జీవితాన్ని కుదిపేస్తుంటాయి. ఉద్రేకాలు పెరుగుతుంటాయి.
అయితే దానికి మనం ఆవేశంతో స్పందించినప్పుడు మనం మాట తూలవచ్చు, చేయి చేసుకోవచ్చు, ఒకోసారి మనల్ని మనం కోల్పోవచ్చు.
కానీ మనం ఆలోచించి స్పందిస్తే మనకు మన సమస్యనుండి బయటపడే మార్గం తప్పక కనిపిస్తుంది. మన ఉద్రేకము తగ్గుతుంది. ఆవేశంలో జరిగే అనార్ధాలను అపవచ్చు.
గొప్పవారికి, సామాన్యులకు తేడా ఇదే.

13, సెప్టెంబర్ 2023, బుధవారం

కలిమాయయో జగతి మారేనో

 *కలిమాయయో జగతి మారేనో*

అబద్ధాల కోట కట్టెడివాడు ఆప్తుడు
సన్నాసియగు సాయమందించువాడు
నటించువాడు నారాయణ సముడు
మోసాలు చేయువాడు మొక్కేటి దేవుడు
నిజము నిక్కముగా చెప్పువాడు నీచుడు
నీతి  పాటించువాడు నిత్య ఛాందసుడు
నిజాయితిపరుడు బతుకుట రానివాడు

కలిమాయయో జగతి మారేనో
లోకమీరీతి ఉన్నదిపుడు

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

ధర్మం సనాతనమైనది - మతం కాలానుగుణంగా మారునది

*ధర్మం సనాతనమైనది - మతం కాలానుగుణంగా మారునది*

ధర్మంబెప్పుడు నిత్యము

మర్మంబెరిగిన మతంబు కాలవశమురా!

ధర్మమతములొకటౌనా!

చర్మశరీరంబు ఆత్మకమలంబొకటా!

 

10, సెప్టెంబర్ 2023, ఆదివారం

సత్యం కానగ మనసున నలుపు తొలగవలె

సత్యాసత్యాల నడుమ
నిత్యం  నలుగుతున్న ఓ మనిషి  నీ కంటికి
సత్యం  కనబడ లేదా
సత్యం కానగ మనసున నలుపు తొలగవలె

విద్యాదానం - గొప్పదనం

 న్నదానము గొప్పనవచ్చునే గాని
న్నంబు జాములో రిగి పోవు
స్త్రదానము గూడ వ్యదానమె గాని
స్త్రమేడాదిలో పాతదగును
గృహదానమొకటి యుత్కృష్ట దానమె గాని
కొంప కొన్నేండ్లలో కూలిపోవు
భూమిదానము మహా పుణ్యదానమె గాని
భూమి యన్యుల జేరి పోవవచ్చు 


అరిగిపోక , ఇంచుకయేని చిరిగిపోక           
కూలిపోవక యన్యుల పాలుగాక             
నిత్యమయి, వినిర్మలమయి,నిశ్చలమయి          
యొప్పుచుండు విద్యాదానమొకటి జగతి 

- చిలకమర్తి లక్ష్మి నరసింహం  


https://qph.cf2.quoracdn.net/main-qimg-8fe9455c4212523f5a6867af7c8c6d11-lq

9, సెప్టెంబర్ 2023, శనివారం

సనాతన ధర్మ నిర్మూలన

గత కొన్ని రోజులుగా సనాతన ధర్మం గురించి ఒక వ్యక్తి వ్యాఖ్యనాల గురించి అనుకూల అననుకూల చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఖండిస్తున్నారు. కొందరు వ్యతిరేకిస్తున్నారు. కొందరు సమర్థిస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ఇంతకుముందు చాలామంది చేసిన ఇప్పుడెందుకు ఇంత రచ్చ జరుగుతుంది. ముఖ్య కారణం అతను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొడుకు, ఆ రాష్ట్రానికి మంత్రి మరియు ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి, మీడియా రేటింగ్ పెంచుకోవడానికి కల్పిస్తున్న విపరీత ప్రచారం. 


అసలు సనాతన ధర్మం ఏమిటి? ఇది తెలుసుకొనే ముందు సనాతన ధర్మ లోపాలు ఏమిటి?

 
1. అది కులాలు పుట్టించింది. వైరాలు పెంచింది.
2. అంటరానితనాన్ని పెంచి పోషించింది. - ప్రస్తుతం లేదు
3. బాల్య వివాహాలను ప్రోత్సహించింది. - ప్రస్తుతం లేదు
4. దేవదాసి,జోగిని వ్యవస్థను తీసుకు వచ్చింది. - ప్రస్తుతం లేదు
5. వితంతువులకు వివాహం వ్యతిరేకించింది. - ప్రస్తుతం లేదు
6. సతీ సహగమనం ప్రోత్సహించింది. - ప్రస్తుతం లేదు
7. శూద్రులకు వేద విద్యను వ్యతిరేకించింది.- ప్రస్తుతం లేదు
8. వరకట్నం, కన్యాశుల్కం వంటి దురాచారాలను తీసుకువచ్చింది. - ప్రస్తుతం చట్ట పరంగా నేరం
9. తలక్కారం, ముళకరం వంటి పన్నులకు కారణం అయ్యింది.  - ప్రస్తుతం లేవు.

ఇక మిగిలింది, నిర్మూలించాల్సింది కుల వ్యవస్థను.  దీనిని అందరు భావిస్తున్నట్టు సనాతన ధర్మం పుట్టించిందని అనుకున్నా ఇంకా పెంచి పోషిస్తున్నది సనాతన ధర్మమా? కాదు ప్రజలు, ప్రభుత్వాలు మరియు పార్టీలు మాత్రమే. ఈ వ్యాఖ్యలకు మూలమైన డిఎంకె వాళ్ళు వీటిని పక్కన పెట్టగలరా ? అసలు కులాల వారిగా రిజర్వేషన్లు 69 శాతానికి పెంచింది వాళ్ళే కదా. కులాలు పుట్టింది వారు చేసే పనిని బట్టి కాని జన్మననుసరించి కాదు.  మరి అన్ని కులాల వాళ్ళు అన్ని పనులు చేస్తున్నప్పుడు ఇంకా కులమనే పదం మనకు అవసరమా? అది కదా అసలు నిర్ములించాల్సింది. భారత దేశం నుంచి వెలివేయాల్సింది కులాన్నికానీ సనాతన ధర్మాన్ని కాదు. అది ఏ పార్టీ చేసిన దానిని స్వాగతించాల్సిందే,కానీ ఎవ్వరు దాని జోలికి పోలేరు, వెళితే ఆ పార్టీల మనుగడే ఉండదు. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేయరు. నాకు కులం వద్దని ప్రజలు బలంగా కోరుకున్నప్పుడు కుల వ్యవస్థ పోతుంది, కానీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తే కాదు. ఎందుకంటే ధర్మం అనేది కులమతాలకు అతీతమైనది. అది భారతీయుల జీవన విధానం. అది వసుధైక కుటుంబాన్ని కోరుకున్నది, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకున్నది. ప్రకృతితో మమేకమై జీవించడం నేర్పింది. అన్నిటా దేవుణ్ణి దర్శించటం నేర్పింది.  దీనికి వ్యతిరేకంగా వచ్చిన ఆచారాలు, వ్యవహారాలు ఏవైనా వస్తే అవి కొందరు పాలకుల పైత్యం వల్ల, అప్పటి పరిస్థుతుల వల్ల, అవిద్య, అజ్ఞానం ద్వారా వచ్చాయి.

6, సెప్టెంబర్ 2023, బుధవారం

కృష్ణాష్టమి సందేశం

కృష్ణాష్టమి సందేశం:

మనలో చాలా మందికి సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలను మనం ఎలా చూస్తున్నాం?ఎలా అర్ధం చేసుకుంటున్నాం? ఎలా స్పందిస్తున్నాం?అన్న దాని మీద అతని ఎదుగుదల, జీవితంలోని విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి. అయితే చాలామంది తమకు మాత్రమే వచ్చిన సమస్య పెద్దదని, తనలాంటి సమస్య మరొకరికి లేదని, తనకున్న సమస్యలు కారణంగానే ఇలా ఉండిపోయానని, మారిపోయానని అంటూ ఉంటారు. 


కర్ణుడు సమస్యలు :
1. పుట్టగానే తల్లి వదిలేసింది.
2. సూతుడి ఇంట్లో పెరిగాడు.
3. నువ్వు క్షత్రియుడవు కాదు అని కారణం చెప్పి ద్రోణుడు విద్య నేర్పలేదు.
4. క్షత్రియుడని అబద్ధం చెప్పి పరశురాముడు దగ్గర విద్య నేర్చుకున్నాడు.
5. అబద్ధం బయటపడి పరశురాముడు అవసరమైన సమయంలో విద్యను మరిచిపోయేలా శాపం ఇచ్చాడు.
6. కర్ణుడు, ఒకసారి శబ్దభేది బాణం ప్రయోగిస్తున్నప్పుడు, ఒక ఆవును అడవి జంతువుగా భావించి, దానిపై ప్రయోగించి చంపుట కారణంగా ఆ గోవు యజమాని అయిన బ్రాహ్మణుడి వల్ల శపించబడ్డాడు.
7. ద్రౌపది స్వయంవరంలో సూత పుత్రుడినని పరాభవం జరిగింది.
8. దుర్యోధనుడు ఒక్కడే నాకు గౌరవం ఇచ్చాడు. అందువల్ల నేను అతని పక్షాన యుద్ధం చేయటం తప్పెలా అవుతుందని సమర్ధించుకొన్నాడు. తన ప్రాణాలని కోల్పోయాడు.

కృష్ణుడు సమస్యలు:
1. చెరసాలలో పుట్టాడు. పుట్టగానే తల్లి నుండి వేరుచేయబడ్డాడు.
2. రాజకుమారుడిలా పెరగాల్సినవాడు గోశాలల దగ్గర పెరిగాడు.
3. పుట్టినప్పటినుండి ఎంతోమంది చంపటానికి ప్రయత్నించారు.
4. 16 సంవత్సరాలకు గాని విద్య నేర్చుకోవడం ప్రారంభించలేదు.
5. కోరుకున్న యువతిని పెండ్లి చేసుకోలేకపోయాడు.
6. జరాసంధుని నుండి తనవారిని రక్షించుకోవడంకోసం స్వంత ఊరిని వదలి ద్వారకకు వెళ్లాల్సి వచ్చింది. పిరికివాడు అని అందరిచేత అనిపించుకున్నాడు.
7. అతని మొదటి కొడుకుకూడా పుట్టగానే అతని నుండి వేరు చేయబడ్డాడు.
8. శమంతకమణి అపహరించావని అవమానిస్తే ఆ అపవాదుని కష్టపడి తొలగించుకొన్నాడు.
కానీ కృష్ణుడు ఎప్పుడు కుంగిపోక యోగ సాధనపై దృష్టి పెట్టాడు. అందరికి పూజ్యుడయ్యాడు. గీతను ఉపదేశించి జగద్గురువయ్యాడు.

ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు, సవాళ్ళు ఉంటాయి. ఏ ఒక్కరి జీవితం పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగా సాగదు. ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుస్తుంది.. మనకు ఎంత అన్యాయం జరిగినా..ఎన్ని అవమానాలు ఎదురైనా మనకు దక్కాల్సింది దక్కకపోయినా.. ఏ సందర్భంలోనైనా మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం. ఇదే మనిషికి చాలా ముఖ్యమైంది. ఎన్ని బాధలు పడ్డా, అవమానాలు ఎదురైనా ధర్మాన్ని వదులరాదన్న జీవిత సారం  కృష్ణుడు బోధించాడు.

జయహో కృష్ణం వందే జగద్గురుం

5, సెప్టెంబర్ 2023, మంగళవారం

జన్మదిన శుభాకాంక్షలు నాలోని సగమా

 నీవు లేనిదే నేను పూర్తికాను
చావు రానిదే నిను వదలిపోను.
జన్మదిన శుభాకాంక్షలు నాలోని సగమా
మన్మదిలో సతతం శోభించే నా ప్రియ ఉమా!

4, సెప్టెంబర్ 2023, సోమవారం

తననుకున్నది జరగకపోతే చావాలి! - తనకనుకూలంగా జరగకపోతే చంపాలి!. ఇదెక్కడి సంస్కారం?

 తననుకున్నది జరగకపోతే చావాలి
తాను కోరుకున్నది దక్కకపోతే చావాలి
తనను తిరస్కరిస్తే చావాలి
తనను తిరస్కరిస్తే చంపాలి
తనకు కావాల్సింది దక్కకుంటే చంపాలి
తనకనుకూలంగా జరగకపోతే చంపాలి

చావటంలోనైనా చంపటంలోనైనా
ముగిసిపోయేది ఒక జీవితమని
మిగిలిపోయేది కన్నవారి కలలని
మిగిల్చిపోయేది అంతులేని విషాదమని
పగిలిపోయేది వారి గుండెలని
ఒక్క క్షణకాలం ఆలోచించలేని
ఆలోచింప చేయలేని కులమెందుకు?
మతమెందుకు? ధనమెందుకు?
పరువెందుకు? చదువెందుకు?

అరచేతిన ప్రపంచ జ్ఞానం ఒడిసి పట్టిన మానవుడా!
మర బొమ్మల చేసి మర బొమ్మవైన రాక్షసుడా!
మధురమైన బంధమంటే మగువ పొందొకటే కాదు.  
నువు బ్రతికి, బ్రతికించటం నేర్చుకో
పోయేదంతా మంచికని తెలుసుకో
ధర్మం వీడకుంటే అంతకు మించి దక్కుతుందని తెలుసుకో
నిత్యం గీతను స్మరించుకో
నిన్ను నువ్వు సంస్కరించుకో

3, సెప్టెంబర్ 2023, ఆదివారం

తోడబుట్టిన అక్కను చంపె, పాడు మోహము

తోడబుట్టిన అక్కను చంపె,

పాడు మోహము, పాపము చేసె

తోడుగ ప్రియుండు ఉమరుడుండ.

చూడు నీ బతుకును


బాగుచేయతరమా! అందరు

వాగుచుందురు చులకన చేసి

వేగు చుందురు వేడినూనెన

కాగు మిడతల వలె


కామానికి, మోహానికి, ప్రేమకు

తేడా తెలియక క్షణికావేశంలో

ఎంతకైనా తెగించే

ఈ వైఖరికి కారణం ఎవ్వరు?

 

సాధించాలని సరదా పడితే చాలదు

సాధించాలని సరదా పడితే చాలదు
సాధించగలనన్న నమ్మకం సడల రాదు
సాధించాలన్న తపన వదల రాదు
సాధించాల్సిన లక్ష్యం నుండి దృష్టి మరల రాదు
సాధించాల్సిన లక్ష్యం వైపు పయనం ఆపరాదు

రాజువి బానిసగ మారి యాచకుడయ్యావ్

రాజులు చేయగ ప్రజలను, వజ్రాయుధ సదృశ, ఓటు రాజ్యాంగ మిచ్చె! భాజాలు కొట్టుటలవడి, రాజువి బానిసగ మారి యాచకుడయ్యావ్!!  -శివ భరద్వాజ్