29, మార్చి 2022, మంగళవారం

నా వెంట ఎందరున్నా నే ఒంటరినే నా పయనం నీతోనే

నా వెంట ఎందరున్నా నే ఒంటరినే

అనాదిగా గెలవాలని, నా నమ్మకం
పునాది చేసి ప్రయత్నిస్తూనే ఉన్నా
సనాతన ధర్మం చెప్పిన విధానలతో
ఆధునిక విజ్ఞాన శాస్త్ర నియమాలతో

నా జీవన కాలం కొద్దిగా పెరుగుతుంది గాని
నేనెంత పెనుగులాడిన పీనుగవడం సత్యమని
నేనెంతవాడను నీ ముందని తెలిసిన, శాశ్వతమని
మిధ్యలో నిరంతరం బ్రతికేస్తూనే వున్నా

నిన్ను చూసిన నాడు నాకెంత బలమున్నా
నాకెంత ధనమున్నా, నా పదవేదైనా
నా మతమేదైనా, నా కులమేదైనా
నా వెంట ఎందరున్నా నే ఒంటరినే


--శివ భరద్వాజ్
భాగ్యనగరం

23, మార్చి 2022, బుధవారం

తరుణమిపుడు మేల్కొనగ - తరుణమిపుడు అడుగేయగ

తరుణమిపుడు మేల్కొనగ - తరుణమిపుడు అడుగేయగ

తరుణమిపుడు మేల్కొనంగ
తరుణమిపుడు అడుగేయంగ
తరుణమిపుడు ఎంచుకొనగ
తరుణమిపుడు మేల్కొనంగ

మతము గొప్పదా ధర్మము గొప్పదా
కులము గొప్పదా కూరిమి గొప్పదా
నిజము గొప్పదా సత్యము గొప్పదా
బలము గొప్పదా ధైర్యము గొప్పదా

తేల్చుకొన  సమయమొచ్చెను

మతము మారవచ్చు గాని ధర్మము నిత్యము
కులము మారవచ్చు గాని కూరిమి నిత్యము
నిజము మారవచ్చు గాని సత్యము నిత్యము
బలము మారవచ్చు గాని ధైర్యము నిత్యము

-- శివ భరద్వాజ్

భాగ్యనగరం

 

17, మార్చి 2022, గురువారం

కాలమెప్పుడు సాపేక్షమని తెల్సుకో - బాధలో భారంగా ఆనందంలో దూది పింజలా

 కాలాన్ని గౌరవించడం నేర్చుకో

ముదురుతుంది వయస్సుని కాలం కరుగుతుందని
కుదురుగా కూర్చోలేక కాలం పరుగెడుతుందని
అదును చూసి అందరిని తనలో దాచేస్తుందని
ఎదురు చూస్తున్నాను ఐనా కాలం అగుతుందని

మదనమెంత పడినను మన కోసమాగదని
ఎదనెంత భారమును ఎత్తినను ఆగదని
ఎదురీత తప్పదని ఏమైన మారదని
మది నిండిన బాధను మరిచి నిను సాగమని

ఎలా ఉండవలెనో తెల్సుకో మసులుకో
కాలాన్ని గౌరవించడం నేర్చుకో
కాలాన్ని సద్వినియోగ పర్చుకో
కాలమెప్పుడు సాపేక్షమని తెల్సుకో

బాధలో భారంగా ఆనందంలో దూది పింజలా
అది ఉంటుంది ఏది ఏమైనా అది ఆగదు
లేనిదాని కోసం ఆరాటం కాక
ఉన్నదానితో ఆనందపడు గాక

--శివ భరద్వాజ్

భాగ్యనగరం.

 

11, మార్చి 2022, శుక్రవారం

కన్ను కన్ను కలసిన వేళ

కన్ను కన్ను కలసిన వేళ
నన్ను నిన్ను కలపిన వేళ
చేయి చేయి తాకిన వేళ
పదం పదం కలసిన వేళ  
వేయి వేణువులు మోగిన వేళ
రాగ మాలికలు పాడిన వేళ
కాలి అందియలు ఘల్లున మోగే
చేతి కంకణములు ఝల్లున మోగే
కోటి తారకాలు భువి చేరిన వేళ
పున్నమి చందురుడు పుడమి చేరిన వేళ
అధరం మధురం అయ్యిన వేళ
మన ప్రణయం పరిణయ మయ్యిన వేళ

ఒకరికొకరం అయ్యాం
ఒకే కుటుంబమయ్యాం

--శివ భరద్వాజ్
భాగ్యనగరం 

10, మార్చి 2022, గురువారం

ఉనికి - మనిషి జీవితం

 ఉనికి - మనిషి జీవితం


బాల్యంలో తీయటి నీటి ఊటలా
మొదలై కౌమారంలో సెలయేటిలా
ఉరకలెత్తి అందరినీ  మురిపించి
యవ్వనంలో ఉప్పొంగు ఉత్సాహ జలపాతమై
ఉరకలెత్తి ఉధృత నదిలా మారి
జీవిత అనుభవాలచే నడివయసున
మందగమనమై తన చుట్టూ ఉన్న అవనిని
సస్యశ్యామలం చేసి సుజలాన్ని పంచి
అందరి దాహర్తి తీర్చి సుందర డెల్టాలను
సృష్టించి, జీవితాలను సమృద్ధి చేసి
వృద్ధ దశలో తనను ప్రక్కనపెట్టినారని
కన్నీటి ఉప్పదనం నిండ ఎంత గొప్ప నదియైన
మృత్యు సముద్రంలో కలువక తప్పదు
తన ఉనికిని కోల్పోక తప్పదు

--శివ భరద్వాజ్
భాగ్యనగరం

9, మార్చి 2022, బుధవారం

అందంగా కనపడుతుందని అడుగేయబోతే అగాధ పాతాళానికి జారిపోతావు

అందంగా కనపడుతుందని అడుగేయబోతే

అగాధ పాతాళానికి జారిపోతావు

మధురంగా ఉందని మరింత లాగిస్తే

మధురానికి దూరం అవుతావు

చేదెక్కువని కాకర పక్కన పెడితే

ఆనక డాక్టరు గొట్టాలు చేసి పోస్తాడు

మత్తు గమ్మత్తుగ ఉందని అనుభవిస్తుంటే

కిక్కు వస్తుందేమోకాని మధురమైన జీవితం మరుగై పోతుంది

తొక్కితే సర్రున పోతుందని కారు నడిపితే

సాఫీగా సాగాల్సిన జీవితాలు తెర మరుగైపోతాయి.

 --శివ భరద్వాజ్
భాగ్యనగరం

 

8, మార్చి 2022, మంగళవారం

అమ్మ కష్టము నాకు ఏమి తెలుసు

 అమ్మ కష్టము నాకు ఏమి తెలుసు

నను లాలించి పెంచి పెద్దచేసిన
అమ్మను ఏమి తెలియని బేలగా చూసిన
నాకు ఏమి తెలుసు ఆమె పడిన కష్టము
తన వెచ్చటి గుండెలకు హత్తుకొని నా చలిని పోగొట్టింది
తన నాలుకతో నా కంటిన నలుసును తీసివేసింది
తను మెత్తగ నెత్తిన తట్టి  దగ్గును పోగొట్టింది
ఎక్కిల్లు వస్తే మంచినీటినిచ్చి నిలువరించింది
నే పక్క తడిపితే ఓపికతో మార్చింది
నా మాసిన బట్టలు ప్రేమగా ఉతికింది
నేను ఏడుస్తున్నది పాలకోసమా , బొమ్మ కోసమా
నలత వలనో, కలత వలనో కనిపెట్టి
పాలను పట్టి, బొమ్మను చూపెట్టి,
మందు వేసి కనిపెట్టి, గుండెలకు అదిమి పెట్టి
నా భయము పోగొట్టినట్టి అమ్మను
నిరంతరం తన కంటిపాపలా లాలించినట్టి అమ్మను
ఏమి తెలియని బేలగా చూసిన
నాకు ఏమి తెలుసు ఆమె పడిన కష్టము

మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో

--శివ భరద్వాజ్
భాగ్యనగరం

7, మార్చి 2022, సోమవారం

మద్యము మత్తు - బ్రతుకు గతి తప్పు

 

ముత్యాల సరము:
 
ద్యము మత్తులో మునిగినను
సాధ్యమా! నడుప వాహనమును
ధ్యము బ్రతుకు గతిని తప్పును
ద్యము మాని నడు ప్రగతి పథము

 

--శివ భరద్వాజ్
భాగ్యనగరం 

6, మార్చి 2022, ఆదివారం

నిజమైన స్నేహితుడు - True Friend

నిస్సత్తువ ఆవరించిన వేళ సత్తువనిచ్చి
అపాయమెదురైన వేళ ఉపాయంచెప్పి
ఎటూపాలుపోని వేళ సరైన సలహా చెప్పి
చెడిపోతున్న వేళ మంచివిలువనేర్పి

లోకం నిను వదలిన వేళ నీ తోడుగా నిల్చి
అత్యవసరమైన వేళ అండగా నిల్చి
నీ లోపాలను సరిదిద్దే సలహానిచ్చి
నీ బలాన్ని   గుర్తించగలిగే స్థైర్యాన్నిచ్చి

నీ స్థాయితో పనిలేకుండా తన స్థాయిని మరచి
నీ పరిస్థితేదైనా నిన్నర్ధం చేసికొని నీ స్థితి మార్చి
నిన్ను నిన్నుగా గుర్తించి ఎదగాలని ఆశించేవాడు
మనస్ఫూర్తిగా కోరుకునే ఒకే ఒక్కడు స్నేహితుడు

నీ బలహీనతలతో ఆడుకోకుండా
ఏ అరమరికలు లేకుండా
నీ మనసులోని భావమేదైనా
నిస్సంకోచంగా పంచుకోగలిగే
భరోసా నిచ్చే వాడే నిజమైన
నీ స్నేహితుడు, సన్నిహితుడు

చివరిగా ఒక మాట

ధుర్యోధనుని స్నేహంతో గొప్పవాడైన కర్ణుడు దీనంగా చనిపోతే
శ్రీకృష్ణుణి స్నేహంతో నరుడైన అర్జునుడు అజేయుడై నిలిచాడు.

నీవెన్నుకునే స్నేహం నీ తలరాతను మారుస్తుంది

5, మార్చి 2022, శనివారం

పుడమి తల్లి ఆక్రోశం - Save Mother Earth

 పుడమి తల్లి ఆక్రోశం

పుడమి తల్లి ఆక్రోశం ఎవ్వరు విందురు
అడవి అంతా గనులగా మార్చునదెవ్వరు
ఎడారిగ మారుటకు పచ్చటి అడవుల ఎదురుచూపులొకవైపు అవని
తడారి పగిలిన పంట పొలాలు ఒకవైపు
జడివానల భీతావహం ఇంకొకవైపు
కడగండ్లు పెట్టించు వడగండ్లు ఒకవైపు  ఎవరి స్వార్ధం ఫలితమిది

నడిరేయిన కూడా వేడి గాలి వీస్తుంటే
సడిచేయక ఏ‌సిల మాటున నిదురిస్తుంటే
నడి సంద్రమున మృత్యుఘోష హోరెత్తుతుంటే కనికరించునదెవరు
సుడులు తిరిగి పెను తుఫాను విరుచుకుపడుతుంటే
మడమ తిప్పక  సంద్రముప్పెనై మీద పడుతుంటే
వడిగా ఎవరు వచ్చి రక్షించి దయ చూప వలె?  అమ్మ  ధరణి గాక

మనిషి ఆశకు అంతులేదు
మనమున్న అవనిని పట్టించుకోక
కనరాని అంగారక ఆవాసం ఆలోచిస్తున్నాం!
తను కూర్చున్న కొమ్మనరికి సాధించేది ఏమిటి?

4, మార్చి 2022, శుక్రవారం

నేతి బీరకాయన నేతి వలె - నీతి ప్రతివాడిలో బ్రతికుంది

 "నేతి" బీరకాయన నేతి వలె - నీతి ప్రతివాడిలో బ్రతికుంది

వార్ధక షట్పద:

ధర్మాన్ని చెప్పు తాతయ్య దండగపేర
మర్మం తెలియక ఊరిలోనే ఉంచాము
నిర్మలమగు నీతి కథలు చెప్పు తాతమ్మను చేర్చితి వృద్ధాశ్రమున
ఖర్మ నీతి శాస్త్ర పిరియడ్ తీసివేస్తిమి
కమ్మగ చిన,  పెద బాల శిక్ష లకు శిక్షలు
సమ్మగా  వేసి, స్మగ్లర్స్ ను, రౌడీ, డాన్ లను హీరోలు చేస్తిమి మరి

నీతిగ బ్రతుకు వాడికి లౌక్యం తెలియదని
నీతి మాలి  పక్కన పెట్టినా,  బ్రతికుంది     
నీతి ప్రతివాడిలో "నేతి" బీరకాయన నేతి వలె, అవకాశముకు
నాత్రపడి రానంత వరకు  శ్రీరాములే,
నీతి మంతులే, అవకాశము దొరికిన ఏ
మాత్రంబు మారకుండు వాడే అచ్చమైన  సీతారాముడగు మరి

 --శివ భరద్వాజ్
భాగ్యనగరం

 

3, మార్చి 2022, గురువారం

తపించు - ఆచరించు - సాధించు

 తపించు - ఆచరించు - సాధించు

 

రావాలనుకుంటే రానిదేదీ లేదు
కావాలనుకుంటే  కానిదేదీ లేదు
చేయాలనుకుంటే  చేయలేనిది లేదు
దక్కాలనుకుంటే దక్కలేనిది లేదు

అనుకో
బలంగా అనుకో
కోరుకో
బలంగా కోరుకో
తపించు
ప్రతిక్షణం తపించు
ఆచరించు
అనుక్షణం ఆచరించు

అపుడు నువ్వు పొంద లేనిదేదీ ఉండదు
అపుడు నువ్వు సాధించ లేనిదేదీ ఉండదు

--శివ భరద్వాజ్
భాగ్యనగరం

2, మార్చి 2022, బుధవారం

విజయవంతమైన జీవితం కావాలంటే !!!

విజయవంతమైన జీవితం కావాలంటే

విజయ జీవితం కావాలంటే
త్యాగబుద్ధి ఇక రావలోయ్
బద్దకాన్ని నీ వదలలోయ్
వేకువఝామున లేవలోయ్
ధ్యానము నీవు చేయాలోయ్

విజయ జీవితం కావాలంటే
యోగము నీవు చేయాలోయ్
ప్రాణాయామం సాగాలోయ్
బుద్ధిని నీవు పెంచాలోయ్
కండను కలిగి ఉండాలోయ్

విజయ జీవితం కావాలంటే
కలలను పెద్దగ కనలోయ్
నీ లక్ష్యం రూఢి కావలోయ్
నిరతం మెరుగులు అద్దలోయ్
సతతం ప్రగతిని చూపాలోయ్

విజయ జీవితం కావాలంటే
లక్ష్యం దిశగా సాగాలోయ్
శ్రద్ధను నీవు నిలపాలోయ్
ఓర్పుతో ముందుకు సాగాలోయ్
లక్ష్యం ముంగిట నిలవలోయ్


-- శివ భరద్వాజ్
భాగ్యనగరం

1, మార్చి 2022, మంగళవారం

శివుడు - Big Bang Theory - శివ రాత్రి మహత్యం

శివుడు - Big Bang Theory - శివరాత్రి మహత్యం


శివ అంటే "లేనిది"  లేక "శూన్యము" లేక "కల్మషం లేనిది" లేక "అస్తిత్వం లేనిది" అని వివిధ గురువులు అర్ధాలు చెప్పారు. ఏది ఉన్నదో దానిని కల్మషం అంటటానికి ఆస్కారం ఉన్నది, ఏది లేదో దానికి ఏ కల్మషము అంటదు. కానీ అది అంతటా ఉన్నది. అదే శూన్యము. అది పరమాణువులో ఉంది, ఈ అనంత విశ్వంలో ఉంది. శూన్యము లోనే ఈ విశ్వమంతా విస్తరించి ఉంది, ఈ విశ్వములోను శూన్యముంది, ప్రతి జీవ, నిర్జీవములలో ఉంది. విశ్వమంతా శూన్యము నుండి పుట్టి శూన్యం లొకే వీలీనమైపోతుంది అని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అభిప్రాయ పడుతున్నారు! వేదాలలో చెప్పబడిన ఈ జ్ఞానం  మరల ఇప్పుడు వారి ద్వారా చెప్పబడుతుంది.  శివుడు ఆద్యంత రహితుడు అని శివరాత్రి కధ మనకు వివరిస్తున్నది. సృష్టికర్త(బ్రహ్మ) మరియు స్థితికర్త(విష్ణువు) ఇరువురు కూడా శివుని యొక్క ఆది అంతములు తెలుసుకోలేకపోయారు. శూన్యంలోకి జ్ఞానమనే వెలుగురూపమున పరమ శివుడు విస్తరిస్తున్న కొలది అది విస్తరిస్తునే ఉంటుంది. దీనిని లోతుగా పరిశీలిస్తే మనకు అసలు విషయం అర్ధమవుతుంది, మానవ పరిమితి బోధపడుతుంది. ఎవరైతే అంతా తానే సృష్టించాననుకున్నాడో అతను, ఎవరైతే అంతా తానే పోషిస్తున్నాను, నడిపిస్తున్నాను అనుకుంటున్నాడో అతను ఇద్దరు కూడా లయము(నశించిన )తరువాత ఏమి జరుగుతుందో తెలుసుకోలేక పోయారు. ఎందుకంటే నశించిన పిమ్మట మిగిలేది శూన్యము.  మరి శూన్యానికి ఆది అంతము ఎక్కడ ఉంటుంది. అలాగని శూన్యము లేదని అనలేము. మనము లేదన్న శూన్యం ఉండకుండా పోదు. శూన్యానికి ఆది అంతములు లేవు, ఆది అంతటా ఉంది అందుకే బ్రహ్మ విష్ణువులు అహంకారం తో ఉన్నప్పుడు ఆది అంతములు రెండు కనుగొనలేక పోయారు. ఎంత దూరం పయనించిన శివ(శూన్యం) స్వరూపం కనిపిస్తూనే ఉన్నది. ఇప్పుడు మానవుడు కూడా అదే అజ్ఞానంలో ఉన్నాడు. తానూ సృష్టిస్తున్నాను అనుకొంటున్నాడు. తన పోషణ తాను చేసుకోగలుగుతున్నాను అనుకొంటున్నాడు. తన పరిమితి తనకు తెలియటం లేదు. అందుకు అత్యుత్తమ ఉదాహరణ ప్లాస్టిక్. ఎప్పుడైతే అహంకారం పోతుందో అప్పుడు నీ లోనే ఉన్న శూన్యాన్ని, శివుడ్ని కనుగొనగలవు. అప్పుడు అంతా నీవేనని, అందరూ శివ స్వరూపమని తెలుసుకోగలవు.

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||


పూర్ణము అంటే శూన్యము అని మరొక అర్ధము.  దానిని పై శ్లోకానికి అన్వయించి చూస్తే

"అది శూన్యము ఇది పూర్ణము. శూన్యము నుండి పూర్ణము పుట్టింది. అలాగే శూన్యము నుండి పూర్ణము తీసివేస్తే మిగిలేది శూన్యమే"

ఏది వ్యక్తమవుతుందో అది పూర్ణము, ఏది అవ్యక్తమో అది శూన్యము. అవ్యక్త శూన్యము నుండి వ్యక్తమగు పూర్ణ స్వరూపమైన ఈ సకల చరాచర జగత్తు పుట్టింది. ఈ జగత్తు చివరికి మరలా అవ్యక్త  శూన్యములోకి విలీనమై పోతుంది.

అందుకే శివుడు అంతటా ఉన్నాడు. కావున సర్వాంతర్యామి. వ్యక్త రూపమున(ప్రకృతి, పార్వతి, విష్ణువు ముగ్గురు ఒక్కటే) అలాగే అవ్యక్త రూపమున(శివుడుగా )ఉన్నాడు , అందుకే శివ కేశవుల బేధము లేదన్నది. అలాగే పార్వతి దేవి శివుడిలో సగంగా అర్ధనారీశ్వర తత్వం చెపుతున్నది. శివుడు లేని ప్రదేశం లేదు. అవ్యక్తమగు శివునికి ఏ విధమైన కల్మషము అంటదు. శూన్యమునకు ఏ గుణము ఉండదు కనుక ఆయన త్రిగుణాతీతుడు అయ్యాడు. శూన్యమునుండే సర్వం పుట్టింది కనుక ఆయనకు జన్మా లేదు, తల్లిదండ్రులు లేరు.


--శివ భరద్వాజ్
భాగ్యనగరం

రాజువి బానిసగ మారి యాచకుడయ్యావ్

రాజులు చేయగ ప్రజలను, వజ్రాయుధ సదృశ, ఓటు రాజ్యాంగ మిచ్చె! భాజాలు కొట్టుటలవడి, రాజువి బానిసగ మారి యాచకుడయ్యావ్!!  -శివ భరద్వాజ్