28, ఫిబ్రవరి 2022, సోమవారం

ప్రియతమా ! నాలో సగమా! అర్ధాంతరంగా నన్ను వదిలేసిపోతే నే తట్టుకోతరమా

ప్రొద్దున్నే లేచాను నీ చిరునవ్వుల పలకరింపులేదు
స్నానానికి వెళ్ళాను నీ పైట కొంగు నా తల తుడవలేదు.
టిఫిన్ తింటున్నపుడు కొసరి తినిపించే నీ చెయ్యి లేదు.
ఆఫీసుకు వెళ్తుంటే ముగ్ధమనోహర నీ రూపం ఎదురు రాలేదు.
లంచ్ అవర్లో నీ ఆప్యాతకలగలిసిన కాల్ రాలేదు.
సాయంత్రం ఇంటికి వస్తే నీవందించే కాఫీ లేదు.
రోజంతా పడిన శ్రమను సేదతీర్చే నీ మాటల లాలింపు లేదు.

మగమహారాజుల తిరిగే నా మగసిరికి సిరివైన నా అర్ధంగామా
అర్ధాంతరంగా నన్ను వదిలేసిపోతే నే తట్టుకోతరమా
అయిన జీవితకాలం నీవన్దించిన జ్నాపకాలు నెమరువేస్తూ
నీవు మీగిల్చిన పిల్లల భాధ్యతలను నేరవేరుస్తాను,
నీవు నేనై పిల్లలను లాలిస్తాను, నిను మరపిస్తాను.
ప్రతీక్షణం నిన్నే స్మరిస్తూ నీవులేని లోటు తీరుస్తాను.
నిన్ను నాలో నిరంతరం బ్రతికించుకుంటాను.

మరలి రాని లోకాలకు తరలి వెళ్ళిన నేస్తమా! నాలో సగమా!
మరుజన్మకు తోడై మరల రా నేస్తమా! నాలో సగమా!

-- శివ భరద్వాజ్
భాగ్యనగరం

 

27, ఫిబ్రవరి 2022, ఆదివారం

సాధించేదేమిటి శూన్యము తప్ప

కులమని మతమనివిభజించి
సాధించేదేమిటి శూన్యము తప్ప

ఒక మతాన్ని మరో మతం ప్రేమిస్తుందా?
ఒక కులాన్ని మరో కులం ప్రేమిస్తుందా?
మానవత్వాన్ని ప్రతి మతం ప్రేమిస్తుంది
జన్మభూమిని ప్రతి కులం ప్రేమిస్తుంది
నాయకులందరూ, ప్రజలందరూ
మానవత్వపు సువాసనలు వెదజల్లితే
దేశభక్తి  కమ్మని రుచి రుచిచూపిస్తే
ప్రతి మనిషి అమరుడై నిలుస్తాడు
ప్రతి పౌరుడు స్వర్గాన్నిక్కడే చూస్తాడు

కులమని మతమనివిభజించి
సాధించేదేమిటి శూన్యము తప్ప

--శివ భరద్వాజ్
భాగ్యనగరం  


ప్రేమించునా ఒక మతము మరొకదానిని
ప్రేమించునా ఒక కులము  మరొకదానిని
ప్రేమించును ప్రతి మతము మానవ తత్వమును
ప్రేమించును ప్రతి కులము మన జన్మభూమిని

నాయకులందరూ, ప్రజలందరూ

మానవత్వపు సువాసనలు వెదజల్లితే
మనదేశభక్తి  కమ్మని రుచిని చూపితే
మనుషులంతా   అమరులై  నిలిచెదరిచ్చట
మనుషులంతా స్వర్గమును చూచెదరిచ్చట

26, ఫిబ్రవరి 2022, శనివారం

మొబైల్ మాయ

 మొబైల్ మాయ

నీవు లేక ఉండలేను
నీవు లేక వెళ్లలేను
క్షణం విడిచి ఉండలేను
విరహంతో వేగలేను
నీవున్న లోకంతో పని లేదు
నిదురించు వేళ పక్కన నీవు
జలకాలాడువేళ పక్కన నీవు
భోజనం చేస్తున్నా నీవు
ప్రయాణం చేస్తున్నా నీవు
ఎందున్న నీవు
ఎక్కడున్నా నీవు
అరచేతిలో అన్నీ చూపిస్తావు
నా మెదడుకి మేతే లేకుండా చేశావు
నిన్ను గుప్పిట ఇరికించాను
కానీ తెలియలేదు నీతో నేనిరుక్కు పోయానని
నీ మాయలో నే పడిపోయానని
జేబుల్లో చరవాణి మాయల్లో మహారాణి
వ్యసనాల యువరాణి అంతర్జాల రారాణి

-- శివ భరద్వాజ్
భాగ్యనగరం

25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

గీతా సారం

 భగవద్గీత


ఏది లేదో ఏది ఉండదో దానిని(మాయ) సృష్టించుకొని దాని గురించి మనిషి పాకులాడతాడు. వాస్తవాన్ని మరచి వెంపర్లాడతాడు. ఈ సృష్టిలో ప్రతి జీవి ఆలోచన ఆహారం వరకే, ఆత్మ రక్షణ కొరకే, పునరుత్పత్తి వరకే.  కాని మనిషి మాత్రమే ఈ రెండిటిని దాటి ముందుకు వెళ్లగలిగాడు. ఆలోచించగలిగాడు. ఆ ఆలోచనిచ్చిన మనస్సు గొప్పది. దానిలోని తర్కము, విచక్షణ జ్ఞానమే బుద్ధి. ఇది మనస్సు కంటే గొప్పది.  కానీ ఈ మనస్సు, బుద్ధి లకు ఏది ఆధారభూతం? రూపము,బుద్ధి, మనస్సు కాలంతో మారుతుంటుంది. కానీ ఇవన్నీ మారినా ఏది మారదో, ఏది నీ పుట్టుక యందు (బ్రహ్మ) , ఏది నీ ప్రస్తుత స్థితి(విష్ణువు) యందు, ఏది నీ అంత్య(శివ)మందు ఉన్నదో, దేనికి ఈ వికారములు అంటవో అదియే నేను అనెడి ఆత్మ. ఈ నేను అనేది సర్వభూతములయందు ఉంది. నీరు ఎటులయితే అది ఆశ్రయించిన పాత్ర రూపం పొందునో, ఎటులయితే అది కలసిన పదార్ధము యొక్క గుణములు పొందునో అటులే అన్ని ఆత్మలు "నేను" అనే ఆత్మ(పరమాత్మ) స్వరూపమే అయిన అది ఆశ్రయించియున్న శరీరమును బట్టి రూపమును, బుద్ధిని బట్టి గుణమును పొందును. ఎప్పుడయితే నీ ఇంద్రియాలను బాహ్యమునుండి వేరుచేసి, మనస్సు లగ్నం చేసి నీ బుద్ధిని నీలోకి పయనింప చేస్తావో అప్పుడు నీకు ఆత్మ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు నీ ఇంద్రియాలను నిగ్రహించుకొని కోరికలు అనే శత్రువును జయించగలుగుతావు. అప్పుడు అంతా నేనే అనే స్పృహ కలుగుతుంది.  

-- భగవద్గీత నుండి నాకు అర్ధమైనది మీ కోసం
-- శివ భరద్వాజ్
భాగ్యనగరం

24, ఫిబ్రవరి 2022, గురువారం

నాయకుడా? మాయకుడా?

 

నాయకుడా? మాయకుడా?

 

నువ్వు అమాయకంగా బట్టలు చింపుకోమని నాయకుడు చెప్పాడా?

ప్రచార ర్యాలీలో ఎండలో మాడిపొమ్మని నాయకుడు చెప్పాడా?

ఇంట్లో ఉన్నదమ్ముకుని అభిమానంగా తనతో తిరగమన్నాడా ?

ఎండా వాన లెక్కచేయకుండా తనకోసం అరవమన్నాడా ?

నా(మా)యకుడేది నీకు చెప్పలేదు!

అయినా ఒక సీసా ఒక పొట్లం కోసం నువ్వు తిరిగి 

నోటుకోసం ఓటు వేసి 

ఆ క్షణికానందం కోసం 

ఓటు అమ్ముకునే నీకు 

ఒళ్ళమ్ముకునేవారికి తేడా ఏముంది?

నా(మా)యకుడికి అది ఒక  పెట్టుబడి 

నీవు నోరెత్తకుండా ఒక పథకమిచ్చి 

తన పథకమైన అధికారం నిలబెట్టుకొంటాడు

తన కావాల్సింది పక్కనెట్టుకొంటాడు 

తన పెట్టుబడి రాబట్టుకొంటాడు

నీకెందుకు అందుబాటులో ఉంటాడు 

పనులు ప్రక్కన పెట్టి నీ జీవితాన్ని తాకట్టు పెట్టి 

గెలిపించాలన్న తపన నీకెందుకు

నీ నాయకుని నిజ చరిత్ర నీకు తెలిసినప్పుడు 

ఏదైనా ఉచితంగా రాదనే ఇంగితం నీకు లేనప్పుడు 

ఎప్పుడైతే విలువలకు కాక 

డబ్బుకు విలువివ్వటం నేర్చావో 

ఆనాడే నిజమైన నాయకులు తెరమరుగయ్యారు 

ఈనాడు నిజమైన మాయకులే మన ముందున్నారు

ఎప్పుడైతే నా(మా)యకుని మీద కాక

నీ పైన నమ్మకముంచి ఏదైనా సాధించగలనని 

అమాయకంగా కాక బలంగా నమ్మి 

ఆలోచనతో ఆచరించి ముందుకు సాగుతావో

ఆనాడు నీవే నిజమైన నాయకుడవుతావు 

నీ పిల్లలు కూడా MD CEO అవుతారు. 


బానిస మనస్తత్వముంటే బానిసగా మిగులుతావు

నాయక మనస్తత్వముంటే నాయకునిగా ఎదుగుతావు

 

 ఎదుటివానిని విమర్శించడం మాని ఆత్మ విమర్శ చేసుకో

నీ తలరాత నీ చేతుల్లోనే మిత్రమా

 --శివ భరద్వాజ్
భాగ్యనగరం

23, ఫిబ్రవరి 2022, బుధవారం

కరోనా మారణహోమం

కరోనా మారణహోమం

ఎంత కష్టం ఎంత కష్టం
మానవాళికి ఎంత కష్టం
బ్రతకాలంటే పనిచేయక తప్పదు
పని చేయాలంటే బయటకు రాక తప్పదు
బయటకు పోతే కరోనా ముప్పు తప్పదు
ముప్పు తప్పాలంటే ఇంటిలో ఉండక తప్పదు
ఎంత కష్టం ఎంత కష్టం
మానవాళికి ఎంత కష్టం

తూటాలు పేలలేదు
బాంబులు దద్దరిల్ల లేదు
శతఘ్నులు  గర్జించ లేదు
ప్రపంచ యుద్ధాలకు మించిన కరోనా మారణహోమం
ఎంత కష్టం ఎంత కష్టం
మానవాళికి ఎంత కష్టం

కని పెంచిన కన్నవారు కడతేరి పోతుంటే
స్నేహం పంచిన స్నేహితులాయువు తీరిపోతుంటే
బంధాలన్నీ కరోనా రక్కసి  పాలవుతుంటే
ఎందుకోసం నీ జన్మం మానవాళికి ఎంత కష్టం

నాగరికత పేరుతో నోరులేని జంతువుల ఆవాసాలు జనారణ్యాలుగా మార్చినందుకా
మానవ ధర్మమైన మానవత్వం మరిచినందుకా
తరచి చూచిన కారుణ్యం  కాన రానందుకా
ఎందుకోసం ఈ కష్టం మానవాళికి ఎంత  కష్టం

- లోకాః సమస్తా సుఖినోభవంతు

-- శివ భరద్వాజ్

భాగ్య నగరం.


22, ఫిబ్రవరి 2022, మంగళవారం

ప్రాతః స్మరణీయులు

ప్రాతః స్మరణీయులు

పగలనక రేయనక
ఎండనక వాననక

నీ సుఖమయ జీవనము కొరకు
సరిహద్దుల కావలికాయు
జవాను స్మరించు

నీ ఆకలి సమరము గెలుచుటకు
ఆహారము ఫలింపచేయు
కిసాను స్మరించు

నీ జీవన సమరము గెలువగ
విద్యను నేర్పు
గురువును స్మరించు

నీకు జన్మనిచ్చి నీన్ని లోకము నిల్పిన
నీవెదుగు వరకు నిన్నుకాచిన
నీ తలిదండ్రుల స్మరించు

వీరందరినిచ్చిన
నిన్ను నిలిపిన
ఈ భువిని స్మరించు
ఈ ప్రకృతి స్మరించు
ఆ దేవుని స్మరించు

--శివ భరద్వాజ్
భాగ్యనగరం

21, ఫిబ్రవరి 2022, సోమవారం

ఓ తల్లి వ్యధ

21 ఫిబ్రవరి 2022

మాతృభాష దినోత్సవం సంధర్భముగా
బ్రతికించండి తల్లిని తల్లి లాంటి తెలుగు తల్లిని

ఓ తల్లి వ్యధ

నాదు రక్తం నాడు ఇస్తిని
పదో మాసం వరకు కంటిని
మనిషి రూపం మలచి ఇస్తిని
కంటిపాపల పెంపు చేస్తిని
కంటి సూపు తగ్గెనని కసురుకొంటివా కొడుకా

నా రక్తమంతా పాలు  చేస్తిని
ఆకలైతే కూడు పెడితిని
నా ఎదను తన్నిన ముద్దు చేస్తిని
కష్టమంతా నేను పడితిని
నిన్ను పెంచి పెద్ద చేస్తే
నట్టింట బరువని వృద్దాశ్రమందు చేర్చి పోతివి కొడుకా

నే తల్లడిల్లితి రోగమొస్తే
అల్లలాడితి దెబ్బతింటే
నా కడుపు కట్టుకు తిండి పెడితే
నీ బ్రతుకు బాగుకు దండమెడితే
నా రెక్క చాటున పెంపు చేస్తే
రెక్కలొచ్చి ఎగిరిపోతివా కొడుకా

రెక్కలుడిగి నేను ఉంటే
దన్ను ఇచ్చి వెన్ను వవక
నా వెన్ను వంగెనని వదిలిపోతివా  కొడుకా

నా  ఆశ చంపితి నీ పెంపు కొరకు
నా పైట దుప్పటి చేసి కాచితి
నన్ను కాచు వేళ
చలిలోన దయ లేక వదిలి వెలితివా కొడుకా

నీవు కాన రాక నిరాశ పడితి  కొడుకా
గుండె బరువెక్కి మోయలేక జన్మచాలించితి కొడుకా

--శివ భరద్వాజ్
భాగ్యనగరం

20, ఫిబ్రవరి 2022, ఆదివారం

చప్పట్లు ఎప్పుడూ ఒక చేత్తో మోగవు

చప్పట్లు ఎప్పుడూ ఒక చేత్తో మోగవు

పొసగ లేదని గొడవపడి కలత చెంది
విడివడి బ్రతుకుటమేలని
విడిపోవుచున్న జంటలు చూసి
ఏమనుకోవాలి
ఒకరిని విడిచి ఒకరుండలేమని బాస చేసి
మూడు ముళ్ళు వేసి
ముందుకు సాగిన వైవాహిక బంధము
మూడు నాళ్ళు గడవక ముందే
బలహీనపడి విడిపోవుటకు
సిద్ధమగుటను ఏమను కోవాలి
తనను తాను మార్చుకొనక
ఎదుటి వారిని మార్చాలని
వారి నుండి ప్రేమ అందడం లేదని
బాధ పడేకంటే
గొడవపడి విడిపోయే కంటే
ప్రేమ పంచటానికి సిద్ధ పడి
సమస్యకు మూల కారణం గుర్తించి
సమస్యను సామరస్యంగా పరిష్కరించ గలిగితే
ఆ బంధం మరింత దృఢ మవుతుంది
అనుబంధం మరింత సుదృఢ మవుతుంది

ఆశించే ముందు ఇవ్వడం నేర్చుకో
మారమనే ముందు మారడం నేర్చుకో
వేలెత్తి చూపే ముందు నిన్ను నువ్వు చూసుకో
అనుమానించే ముందు అవగతం చేసుకో
అవమానించేముందు అభిమానించడం నేర్చుకో
కూల్చేముందు నిర్మించడం తెలుసుకో

--శివ భరద్వాజ్
భాగ్యనగరం

19, ఫిబ్రవరి 2022, శనివారం

సమస్తం మనలోనే ఉంది

 అనంత ఆకాశంలో
నక్షత్రాల మాటున
అగాధ సాగరంలో
పగడపు దీవుల చాటున
అద్భుత హిమ శిఖరాల
చల్లని హిమానీ నదాలలో  
కాకులు దూరని కారడవుల్లో
చీమలు దూరని చిట్టడవుల్లో
నిశ్శబ్ధపు నిశీధిలో
అబ్ధపు ఆవలి అంచులలో
అలుపెరుగని పయనం చేశాను
అవనీమండలమంతా తిరిగాను
సెలయేటి సవ్వడిలో నాగేటి సాలల్లో
పిల్ల కాలువల్లో మహానదుల్లో
సాగరాల్లో మహా సంద్రాల్లో
ఎడారుల్లో మైదానాల్లో
కొండల్లో కోనల్లో
ప్రతి పగలు ప్రతి రేయి
పున్నమి వెన్నెల్లో  అమాస చీకట్లో
ఎందని వెదకను ఎక్కడని వెదకను
నిన్ను వెతకని క్షణం లేదు
నిన్ను తలవని నిముషం లేదు
చివరకు తెలిసింది నీవెక్కడో లేవని
నా శ్వాసలో నా  రక్తంలో
నా తలపుల్లో నా తనువులో
నా మనసంతా నీవేవని
నీవే నాలో ఉన్నావని

మనశ్శాంతి విజయం సుఖం ఆనందము
సమస్తం మనలోనే ఉన్నాయి ఎక్కడో వెతకాల్సిన పని లేదు

--శివ భరద్వాజ్
భాగ్యనగరం 

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

మంచిని పంచు - మంచినది పెంచు
ప్రక్కవాడు బావుంటే - మనము బాగుంటాం

 మనకు మనకంటే ప్రక్కవాని మీద ఆలితి ఎక్కువ
మనకు దక్కలేదనే భాద కంటే
వానికి దక్కలేదనే ఆనందమెక్కువ
ప్రక్కనోడి కంటే ఒక రూపాయి ఎక్కువొస్తే ఆనందం
వాని కొడుకంటే మనవాడికి మార్కులొస్తే ఆనందం
మన ఆలోచన ఎప్పుడు వాని గురించే
వాని గురుంచి మంచిగా చెబితే అసూయ
వాని గురించి చెడు చెప్పె దాక ఊరుకోము
నలుగురు పొగుడుతుంటే
వానితో మనమెంత క్లోజో చెప్పేదాకా ఊరుకోము
నలుగురు తెడుతుంటే వానిపై
రాళ్ళేయ్యడానికి మనమే ముందుంటాం
మన ఆలోచన ఎప్పుడు ప్రక్కవాని
బాగుగురుంచే వాడెక్కడ బాగుపడిపోతాడో అని
ప్రక్కవాడెప్పుడు మనకంటే తక్కువే
ఉండాలని తెగ తపన పడిపోతాం

కర్మ సిద్ధాంతముందని తెలుసు
మనమిచ్చినదే మనకొస్తుందని తెలుసు
ప్రక్కవాని బాగు మన బాగని తెలుసు
నీ చుట్టూ ఉన్నవాళ్లు గొప్పవాళ్లయితే
నువ్వు కూడా తప్పక గొప్పవాని వవుతావు
ప్రక్కవాని గురించి ఆలోచన మాని
నిరంతరం నిన్ను నువ్వు మెరుగుపరుచుకో
తరం తరం మారుతుంది నువ్వు చూసుకో
వాని చూరు నంటుకున్న నిప్పు
నీ చూరునంటుకొనగ మానదు
వానింటికొచ్చిన కరోనా
నీ ఇంటికి రాక మానదు
వానింటికొచ్చిన అదృష్టం
నీ ఇంటికి రాక మానదు
నీ చుట్టూ సాధ్యమైనంత మంచిని పంచు
నీ చుట్టూ "అసాధ్య మైనంత మంచినది పెంచు"

రాజువి బానిసగ మారి యాచకుడయ్యావ్

రాజులు చేయగ ప్రజలను, వజ్రాయుధ సదృశ, ఓటు రాజ్యాంగ మిచ్చె! భాజాలు కొట్టుటలవడి, రాజువి బానిసగ మారి యాచకుడయ్యావ్!!  -శివ భరద్వాజ్