ఒకప్పుడు గలగల పారే గోదారిలో నీళ్లు తాగేవాళ్ళం,
ఇంటి వద్ద కౌశికలో హాయిగా ఈత కొట్టే వాళ్ళం,
పాంచాల పక్కన చెట్టుపై కోతికొమ్మచ్చి ఆడేవాళ్ళం,
పచ్చని కొబ్బరితోటలో పంపుసెట్టు వద్ద స్నానాలు చేసే వాళ్ళం,
మనసారా హాయిగా నవ్వుకునేవాళ్ళం,
ఒకరినొకరు ఆట పట్టించుకునే వాళ్ళం,
మనసిచ్చిన అమ్మాయి గురించి కబుర్లాడుకునే వాళ్ళం,
ఏ కల్మషమంటని మనసులు మావి,
ఏ మర్మమెరుగని ఆలోచనలు అవి,
ఇప్పుడంతా మారిపోయింది,ఆశకు
గోదారి వ్యర్ధాలతో నిండిపోతుంది,
కౌశిక డ్రైనేజి కాలువ అయిపోయింది,
పెద్ద చెట్టు కనుమరుగయిపోయింది,
కొబ్బరితోటలు రొయ్యల చెరువులయ్యాయి.
జీవం లేని నవ్వులు పూస్తున్నాయి,
పార్టీలుగా చీలి కొట్లాటలాడుతున్నాం,
విమర్శలే కబుర్లుగా మారిపోయాయి,
మనసులు కుల,మత,వర్గ మంటలలో కాలుతున్నాయి,
మర్మమే మారిగా సోకి కుత్తుకలు తెగుతున్నాయి,
మార్పు రావాలంటే - భవిత మారాలంటే,
డబ్బుపై ప్రేమ తరగాలి - మనిషిపై ప్రేమ పెరగాలి.
మనిషిని మనిషిగా ప్రేమిద్దాం - ప్రకృతితో కలిసి జీవిద్దాం.
నేను సిద్ధం, మరి మీరు ......
-శివ భరద్వాజ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి