ఓటు వేసేది నేనే…
పన్ను కట్టేది నేనే…
ఆట ఆడేది మాత్రం వారే!
కోట కట్టేది మాత్రం వారే!
అరాచక చదరంగంలో,
రాజు ప్రజలే అయినా…
మంత్రుల చేతిలోనే అధికార మంతా!
వారు పంచే ఉచితాల కిందే
ప్రజల జీవితమంతా!
-శివ భరద్వాజ్
Heart Beat - హృదయ స్పందన
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
9, మార్చి 2026, సోమవారం
ఓటు నా చేతిలో… అధికారం మాత్రం వారి చేతిలో!
20, ఫిబ్రవరి 2026, శుక్రవారం
మనసు గోడలపై వేలాడే జ్ఞాపకాలు - ఆ తరగతి గదులు
జ్ఞాపకాల తరగతి గది
అప్పుడు ప్రాణంగా గడిపిన కాలం...
ఇప్పుడు మౌనంగా వదిలేసిన తీరం...
మళ్ళీ వెళ్ళినా అందుకోలేని ఆ మధుర క్షణం...
ఇప్పటికీ వెదజల్లు జ్ఞాపకాల పరిమళం!
కాకి ఎంగిళ్లు.. పంచుకున్న చిరుతిళ్లు..
ప్రాణ స్నేహితులమై మెలిగిన ఆ రోజులు!
వీడలేమనుకున్న ప్రాణ బంధాలు..
నేడు చిరునామాలే తెలియని దూరాలు!
అయినా.. గుండెల్లో పదిలం ఆ జ్ఞాపకాలు.
స్వార్థం లేని స్నేహం.. కల్మషం లేని బంధం..
నవ్వులతో వికసించిన ఉదయాలు,
ఆటపాటలతో ముగిసిన సాయంత్రాలు!
చిన్న చిన్న అలకలు.. చెక్కబల్లలపై గీతలు..
నల్లబోర్డు సాక్షిగా సాగిన మన కథలు!
ఆ తరగతి గదులు.. మనసు గోడలపై చెదరని చిత్రాలు.
కాలం కరిగిపోయినా.. కదిలే ఆ క్షణాలు,
మన నవ్వుల ప్రతిధ్వనులు వినిపించే ఆ మూలలు!
బెంచీల మధ్యే మన బాల్యం ఆగిపోయింది..
మన కలలన్నీ ఆ గదిలోనే మిగిలిపోయాయి.
కాలం మనుషుల్ని దూరం చేసినా,
ఆ బెంచీల గీతల్లో మన పేర్లు ఇంకా పదిలం..
మనసు మాత్రం అక్కడే ఆగి ఉంది—
వరుసనున్న బెంచీలపై పేర్లలో..
పంచుకున్న చిరునవ్వుల గలగలలో..
మరువలేని ఆత్మీయ స్నేహంలో!
మళ్ళీ ఆ రోజుల్ని తాకలేమని తెలిసినా,
గుండె మాత్రం అక్కడే కొట్టుకుంటోంది..
మన స్నేహం ఇప్పటికీ ఊపిరి పీల్చుకుంటోంది!
అక్కడే సజీవమై మన బాల్యం నిలిచివుంది
మనసు గోడలపై వేలాడే జ్ఞాపకాల ఫోటోల రూపంలో.
మనసు గోడలపై ఇంకా వేలాడుతున్న మీ జ్ఞాపకాలకు —
నా స్నేహితులకు ఈ కవిత అంకితం.
-శివ భరద్వాజ్
25, జనవరి 2026, ఆదివారం
రథ సప్తమి ప్రాముఖ్యత - ఏడు సంఖ్య రహస్యం - భీష్ముడి 7 అవయవాలు - ఆరోగ్యం & ధర్మం
🌞 రథ సప్తమి ప్రాముఖ్యత
మన భారతీయ సంప్రదాయంలో పండుగలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు — అవి మన జీవన విధానాన్ని శుద్ధి చేసే మార్గదర్శకాలు.
అటువంటి పవిత్రమైన పండుగలలో రథ సప్తమి ఒకటి. ఈ పండుగ సూర్యారాధన, ఆరోగ్యం, ధర్మం, ఆత్మశుద్ధి — అన్నింటినీ ఒకే చోట కలిపిన మహత్తర దినం.
🌼 1. రథ సప్తమి ప్రాముఖ్యత
మాఘ మాసంలో వచ్చే సప్తమి తిథినే రథ సప్తమి అంటారు. ఇది మన భారతీయ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగ.
సంక్రాంతి రోజున ప్రారంభమైన సూర్యుని ఉత్తరాయణ ప్రయాణం, ఈ రోజున సరైన శక్తి స్థాయికి చేరుకుంటుందని విశ్వాసం.
పురాణాల ప్రకారం —
👉 సూర్యుడు తన ఏడు గుర్రాలతో లాగబడే రథాన్ని,
రాబోయే ఆరు నెలల ప్రయాణానికి ఈ రోజున సిద్ధం చేస్తాడని నమ్మకం.
అందుకే ఈ రోజును —
🌞 సూర్య జయంత్యోత్సవం
🌞 ఆరోగ్య సప్తమి
అని కూడా పిలుస్తారు.
🌞 2. "ఏడు" సంఖ్య ప్రాముఖ్యత
మన సంస్కృతిలో "ఏడు" అనే సంఖ్యకు అత్యంత పవిత్రత ఉంది.
- శ్రీరంగనాథుడు — ఏడు ప్రాకారాలలో
- తిరుమల వేంకటేశ్వరుడు — ఏడు కొండలపై
- సప్తమహర్షులు
- సూర్యుని రథం — ఏడు గుర్రాలతో లాగబడుతుంది
ఈ ఏడు గుర్రాలు సూచించేది:
- ఏడు వర్ణాలు
- ఏడు రోజులు
- ఏడు శక్తులు
- ఏడు ఇంద్రియాలు
ఈ రోజు సూర్యుని పూజ చేస్తే:
- ✔️ పాపాలు తొలగుతాయి
- ✔️ ఆరోగ్యం మెరుగవుతుంది
- ✔️ దీర్ఘాయుష్షు లభిస్తుంది
- ✔️ ఆత్మశుద్ధి కలుగుతుంది
అందుకే ఈ రోజున సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం, సూర్యారాధన చేస్తారు.
☀️ 3. రథ సప్తమి – శాస్త్రీయ ప్రాముఖ్యత
రథ సప్తమి సాధారణంగా జనవరి చివర లేదా ఫిబ్రవరి ప్రారంభంలో వస్తుంది.
- సూర్యకిరణాలు భూమిపై నేరుగా పడతాయి
- విటమిన్-D ఉత్పత్తి పెరుగుతుంది
- రోగనిరోధక శక్తి పెరుగుతుంది
- మానసిక ఉత్సాహం పెరుగుతుంది
అందుకే తెల్లవారుజామున స్నానం చేసి సూర్యుడిని దర్శించడం Natural Health Practice గా మారింది.
🌿 4. జిల్లేడు ఆకులతో స్నానం
రథ సప్తమి రోజు —
👉 జిల్లేడు మొక్క యొక్క 7 ఆకులతో స్నానం చేయడం సంప్రదాయం.
- జిల్లేడు సూర్యశక్తిని గ్రహిస్తుంది (నమ్మకం)
- 7 ఆకులు = 7 ఇంద్రియాల శుద్ధి
అంటే — శరీరం + మనస్సు + ఆత్మ శుద్ధి
🧠 5. భీష్ముడి ఏడు అవయవాలు
ఇవి కేవలం శరీర భాగాలు మాత్రమే కాదు — మన కర్మలకు కారణమయ్యే ద్వారాలు.
- 👁️ కళ్ళు — అన్యాయం చూసి మౌనం
- 👂 చెవులు — అన్యాయం విని స్పందించకపోవడం
- 👃 ముక్కు — అహంకారం, భోగలాలస
- 👅 నాలుక — అసత్యం, కఠిన మాటలు
- ✋ చేతులు — ధర్మరక్షణ చేయకపోవడం
- 🚶 కాళ్లు — తప్పు దారి
- 🧠 మనస్సు — లోభం, స్వార్థం
📜 6. భీష్ముడి కథ
మహాభారతంలో భీష్ముడికి ఇష్టమరణ వరం ఉంది. అతను ఉత్తరాయణంలో మోక్షం పొందాలని కోరుకున్నాడు.
కానీ ద్రౌపది అవమాన సమయంలో —
❌ చూశాడు – ఎదిరించలేదు
❌ విన్నాడు – మాట్లాడలేదు
❌ ఆలోచించాడు – చర్య తీసుకోలేదు
అందుకే వ్యాస మహర్షి అన్నాడు —
“నీ ఏడు అవయవాలూ పాపంతో కలుషితమయ్యాయి.”
🌼 7. రథ సప్తమి సందేశం
- 🌞 సూర్యుడిలా వెలుగునివ్వాలి
- 🧘 ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
- 🙏 ధర్మాన్ని పాటించాలి
- 🧠 మనస్సును నియంత్రించాలి
✨ సారాంశం
- 🌞 శక్తి పునరుద్ధరణ రోజు
- 🧘 ఆరోగ్య పరిరక్షణ రోజు
- 🙏 ఆత్మశుద్ధి రోజు
- 🌱 కొత్త జీవన ఆరంభం
“శరీరం, మనస్సు, జీవితం — మూడింటికీ వెలుగు నిచ్చే పండుగ”
🙏 ముగింపు
రథ సప్తమిని ఒక్కరోజు పండుగగా కాకుండా, మన జీవితానికి మార్గదర్శకంగా తీసుకుందాం.
సూర్యుడిలా వెలుగునిద్దాం…
ధర్మమార్గంలో నడుద్దాం…
ఆరోగ్యంగా జీవిద్దాం…
జై సూర్యదేవాయ నమః 🌞
16, జనవరి 2026, శుక్రవారం
ప్రకృతికి మనిషికి నడుమ పులకించే భావనే కనుమ - పంటలతో, పల్లెలతో శోభిల్లే తల్లి భారతిని కనుమా!
అన్నం పెట్టిన భువికి,
వెలుగు పంచిన రవికి,
సాయం చేసిన ఎడ్లకి,
జీవం పోసిన ప్రకృతికి,
గ్రామన్ని కాచే దేవతకి,
కృతజ్ఞతే కనుమ పండుగ.
ప్రకృతికి మనిషికి నడుమ
పులకించే భావనే కనుమ.
పంటలతో, పల్లెలతో
శోభిల్లే తల్లి భారతిని కనుమా!
14, జనవరి 2026, బుధవారం
భోగి శుభాకాంక్షలు!
భోగం పెరిగింది… భాగ్యం పెరిగింది,
కానీ సంతోషించలేని రోగం పెరిగింది.
తృప్తి తెలియని అహం పెరిగింది,
అనుభవించగలిగే కాలం తగ్గింది.
అరచేతిలో అన్నీ ఉన్నా,
అనుభూతులు దూరమయ్యాయి.
జీవనవేగం అదుపుతప్పి,
మనసు నెమ్మదించలేక పోతుంది.
బద్ధకం, అలసత్వం, లాలసత్వం,
సోషల్ మీడియా వికృతులు,
వాయిదాల గుణం, మోహం—
ఈ అన్నింటినీ భోగి మంటల్లో
బూడిద చేయగలిగితే…
ఈ భోగి
భోగమే కాదు,
నిజమైన భాగ్యాన్ని ప్రసాదిస్తుంది.
🔥 లోపాలన్నీ తొలగించుకుని,
లోపలి వెలుగును దర్శించుకుని,
మీ ఇంట సుఖ సంతోషాల వెలుగు,
నిత్యం ప్రసరించాలని కోరుకుంటూ,
భోగి శుభాకాంక్షలు! 🔥
26, డిసెంబర్ 2025, శుక్రవారం
ఓడిపోతున్న క్షణాల్లో విజయం సాధించిన సత్య కథ
"ఓడిపోతున్నట్టే అనిపించే రోజులు…
ఫలితం రాకపోయినప్పుడు వచ్చే నిరాశ…
ఇవే, మీ జీవితాన్ని మార్చే సీక్రెట్ కీ అవుతాయంటే… విశ్వసించగలరా?"
"ఈ కథలో, ఒక యువకుడు తన వైఫల్యాలను ఎలా విజయానికి మెట్టులుగా మార్చుకున్నాడో తెలుసుకుందాం."
"ఈ కథలోని ప్రతి క్షణం మీకు ప్రేరణ ఇస్తుంది! అంతేకాదు, మీ ప్రయాణాన్ని ఎలా విజయవంతం చేయాలో తెలుపుతుంది!"
"ఇది సత్య అనే యువకుడి కథ... ఆతను ప్రతి దినం విఫలమవుతూ... జీవితాన్ని ముగించాలనుకున్నాడు, కానీ ఒక ఫోన్ కాల్, కేవలం ఒక క్షణం అతని జీవితాన్ని మార్చింది. అతను ఆగిపోతాడా లేక మళ్లీ లేచి పోరాడుతాడా?"
సత్య ఆ రోజు కూడా ఓడిపోయాడు.
అతను వెళ్ళిన ఇంటర్వ్యూ ఫలితం rejected.
ఇంటికి వెళ్లే ధైర్యం లేక, రైల్వే ట్రాక్ పక్కన కూర్చున్నాడు.
"అమ్మ ఇంకోసారి నన్ను నమ్ముతుందా?"
"నాన్న మౌనంలో ఇంకెంత బాధ దాచుకుంటాడు?"
ఆ ఆలోచనలు గుండెను చీల్చాయి.
అప్పుడే మొబైల్ రింగ్ అయ్యింది.
అమ్మది.
"ఏమైందిరా సత్య?"
"ఆ ఒక్క మాటలోనే అమ్మ ప్రేమ, ఆశ…
అమ్మ అందించిన సానుభూతి…"
సత్య తట్టుకోలేకపోయాడు.
"నేను మళ్లీ ఫెయిల్ అయ్యానమ్మా…" అన్నాడు.
అక్కడ క్షణం మౌనం.
"ఆ మౌనం సత్యకి భయంగా అనిపించింది.…
ఒక క్షణం శూన్యం ఆవరించింది, చీకటి, … కమ్ముకున్నట్లయింది.
తర్వాత, మెల్లగా అమ్మ చెప్పింది."
"సెలెక్ట్ అయితేనే నా కొడుకవుతావా రా?"
"అమ్మ మాటల్లో ప్రేమ తగ్గలేదు…
ఆ మాటలు సత్యను ఆలోచింపజేశాయి."
సత్య కన్నీళ్లు ఆగలేదు.
"నువ్వు ప్రతి రోజూ ప్రయత్నిస్తున్నావు…
అదే మాకు విజయం.
నువ్వు నీ ప్రయత్నం ఆపకుండా, కొనసాగిస్తున్నావు…
అదే మాకు గర్వకారణం."
"ఆ మాటలతో సత్య…
పూర్తిగా కదిలిపోయాడు.
ట్రాక్ పక్కన కూర్చుని పిల్లాడిలా ఏడ్చాడు…"
"ఆ రాత్రి ఇంటికి వెళ్లాడు…
నాన్న మౌనంగా ఉన్నాడు…
కానీ, భోజనం పెట్టేటప్పుడు, ప్లేట్లో అదనంగా కూర వడ్డించాడు…
ఆది ప్రేమ…"
ఏళ్ల తర్వాత…
వేదికపై సత్య నిలబడ్డాడు…
చేతిలో అవార్డు మెరిసింది…
కెమెరాలు, చప్పట్లు, వెలుగులు…
కానీ అతని చూపు మాత్రం
ముందు వరుసలో కూర్చున్న
అమ్మ ముఖం మీదే నిలిచింది…
కింద కూర్చుని ఉన్న అమ్మ కళ్ళలో నీళ్లు…
అవి ఓటమి కన్నీళ్లు కాదు,
ఆకలితో చదివించిన రోజుల జ్ఞాపకాలు…
రైల్వే ట్రాక్ పక్కన కూర్చుని
“అమ్మా నేను ఓడిపోయాను” అన్న రోజు ప్రతిధ్వనులు…
ఈ రోజు అవే కన్నీళ్లు
విజయానికి సాక్ష్యాలయ్యాయి.
అవార్డు సత్య చేతిలో ఉన్నా,
గెలుపు మాత్రం అమ్మదే.
సత్య మైక్ పట్టుకుని ఒక్క మాట అన్నాడు:
"ఈ అవార్డు నేటి నా విజయానికి కాదు…
నన్ను నేను కోల్పోకుండా కొనసాగించిన నా ప్రయాణానికి."
వేదిక మీద నిలబడ్డప్పటికీ,
అతని ఆలోచనలు మాత్రం ఆ రోజు రైల్వే ట్రాక్ పక్కన
అమ్మ మాటలు విన్న ఆ క్షణానికే వెళ్లాయి."
"ప్రతి విఫలమైన ప్రయత్నం, అతన్ని మరింత ఉన్నతంగా ఎదిగేలా చేసింది.
కష్టాలు, బాధలు, అతన్ని ధృడ మనస్కుడిలా, మరింత బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి.
ప్రయత్నం ఆపక, నిలబడి పోరాడిన ప్రతి క్షణం, తన శక్తిని తనే తెలుసుకునేలా చేసింది.
జీవితం ముగించడానికి ఒక్క బలహీన క్షణం చాలు.
కానీ ఆ ఒక్క క్షణం ఆగి, ఆలోచిస్తే, మనం మన జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఆ క్షణం, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం కావచ్చు.
మన జీవితం, మరికొన్ని జీవితాల్లో వెలుగు నింపవచ్చు."
సరైన మార్గాన్ని ఎంచుకుని, ప్రయత్నించడమే నిజమైన విజయం.
"విజయం నీ గమ్యమైతే నిరాశ తప్పదు,
విజయం నీ మార్గమైతే నిరాశ కలగదు."
-శివ భరద్వాజ్
17, డిసెంబర్ 2025, బుధవారం
విజయం నీ గమ్యమైతే నిరాశ తప్పదు. విజయం నీ మార్గమైతే నిరాశ కలగదు.
విజయ్ ఒక చిన్న ఊరిలో పుట్టాడు. చదువంటే ఇష్టం, కానీ ఇంటిలో పరిస్థితుల వల్ల స్కూల్ కు వెళ్లే ముందు, వచ్చిన తరువాత ఇంటి పనిలో సహకరించాల్సివచ్చేది. ఫలితంగా పదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. ఊరంతా “వీడెక్కడ చదవగలడు, ఇతనితో ఏమవుతుంది?” అని మాట్లాడుకున్నారు. విజయ్ కూడా చాలా నిరాశపడ్డాడు. తనమీద తానే నమ్మకం కోల్పోయాడు.
కానీ ఒకరోజు తన ఊరి లైబ్రరీలో పాత పుస్తకాలు సర్దే పనికి వెళ్ళాడు. పని విరామంలో ఒక పుస్తకంలో పేజీలు తిప్పుతూ ఉండగా ఒక వాక్యం కనిపించింది:
“విజయం నీ గమ్యమైతే నిరాశ తప్పదు. విజయం నీ మార్గమైతే నిరాశ కలగదు.”
ఆ పదాలు
అతని మనసులో బాగా నాటుకుపోయాయి.
“నేను పరీక్షలో విజయం సాధించాలన్న ధ్యాసలోనే ఉన్నాను. దానిపై దృష్టి పెట్టాను. కానీ చదవడంపై దృష్టి పెట్టాలి. నేర్చుకోవడమే నా మార్గమైతే? ఆ మార్గంలో పయనించడాన్ని నేను ఆస్వాదించాలి ” అని అనుకున్నాడు.
ఆ రోజు నుంచి విజయ్ తన లక్ష్యాన్ని మార్చుకున్నాడు.
పాస్ కావడం తన లక్ష్యం కాదు, ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకోవడం తన ధ్యేయంగా మార్చుకుని, నేర్చుకోగలిన రోజు గెలుపుగా, నేర్చుకొని రోజు ఓటమిగా భావించాడు.
ఒకరోజు గణితం, ఒకరోజు తెలుగు, ఇంకొక రోజు ఇంగ్లీష్, మరో రోజు సైన్సు ఇలా అన్ని సబ్జెక్టులు నేర్చుకోవడం ఆస్వాదించాడు. క్రమేపి గెలుపు రోజులు పెరిగాయి. ఈ విజయ మార్గం బావుంది.
మళ్లీ పరీక్ష రాశాడు. ఈసారి క్లాస్ లో టాప్ రాలేదు. కానీ ఫెయిల్ కూడా కాలేదు. అప్పుడు అతనికి “నేను ముందుకు వెళ్తున్నాను” అన్న నమ్మకం ఏర్పడింది.
సంవత్సరాలు గడిచాయి. విజయ్ ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ కూడా పదోన్నతి వెంటనే రాలేదు. కానీ ప్రతి పనిని నేర్చుకునే అవకాశంగా తీసుకున్నాడు.
నెమ్మదిగా అతను టీమ్ లీడర్ అయ్యాడు. ఆ తర్వాత మేనేజర్. ఆ కంపెనీలో అతని పనితీరు, నేర్చుకునే స్వభావం, సమస్యలు పరిష్కరించే విధానాలు నచ్చి మరొక కంపెనీ ఏకంగా జనరల్ మేనేజర్ గా పదోన్నతి ఇచ్చి గౌరవించింది.
ఒక రోజు తాను చదువుకున్న స్కూల్ annual day కి అతన్ని ముఖ్య అతిథి గా పిలిచారు.
పిల్లలు అడిగారు:
“సార్, మీ విజయ రహస్యం ఏమిటి?”
విజయ్ నవ్వుతూ అదే వాక్యం చెప్పాడు:
“విజయం నా గమ్యం కాదు. నా ప్రయాణం. అందుకే నేను ఎప్పుడూ నిరాశపడలేదు.”
పిల్లల కళ్లలో ఆశ మెరిసింది.
అదే విజయ్ సాధించిన నిజమైన విజయం.
“విజయం నీ గమ్యమైతే నిరాశ తప్పదు.
విజయం నీ మార్గమైతే నిరాశ కలగదు.”
- శివ భరద్వాజ్
16, డిసెంబర్ 2025, మంగళవారం
అందరూ అడిగేవాళ్లైతే!— ఇచ్చే వారు ఎవరు?
తూరుపు కనుమల కొండల మధ్య, ఒక చిన్న అందమైన గ్రామం మనసాపురం.
ఆ గ్రామంలో ప్రతి ఉదయం కొండల మధ్య జరిగే సూర్యోదయం చాలా అద్భుతంగా ఉంటుంది.
అలాగే ప్రతి నిత్యం అక్కడి మనుషుల మనసుల్లో అందమైన ఊహలు ఉదయించేవి.
అందరూ మంచి విషయాలు జరగాలని కోరుకునే వారు…
గ్రామంలో జీవించే ప్రతి మనిషి మనసులో
ప్రతిరోజూ ఒకే స్వరం మోగుతూనే ఉండేది…
“ఇది ఇలా మారితే ఎంత బాగుంటుంది…
అది అలా జరిగితే ఎంత సంతోషం…
ఈ పని ఎవరో ఒకరు ముందుకొచ్చి చేస్తే…!”
కానీ
ఆ “ఎవరో” ఎవరు…
పక్కింటి వాడా? ఎదురింటి మనిషా?
లేదా కాలం తానే పంపే అద్భుతమా?
అందరి మనసుల్లో కోరిక ఉంది,
కానీ దాన్ని భుజాన వేసుకునే ధైర్యం మాత్రం
ఎవరూ తమదని అనుకోరు.
అలా…
కోరికలు వారి మనసుల్లోనే మిగిలిపోతాయి,
గ్రామం మాత్రం
ఎప్పటిలానే ఎదురు చూపుల్లోనే నిల్చుంటుంది.
రాఘవ – అదే గ్రామంలో నివసించే యువకుడు.
రాఘవకు మంచి మనసు ఉంది, కానీ ఒక అలవాటు ఉంది—
ఏదైనా పని తన చేతితో చేయకుండా, ఎదుటివారు చేయాలని కోరుకునేవాడు.
అతను ఎక్కడికైనా వెళ్లాలని రోడ్డుపై నిలబడినప్పుడు
“ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండేది…” అని ఆశపడేవాడు.
తన బాల్యంలో ఒలింపిక్స్ చూస్తూ “ఒక రోజు మన దేశం అత్యధిక గోల్డ్ మెడల్స్ గెలవాలి!”
అనుకుని గర్వపడేవాడు.
కానీ ఇప్పుడు తన చిన్న తమ్ముడు ఆటల్లో ఆసక్తి చూపితే మాత్రం,
“చదువు ముఖ్యంరా తమ్ముడు, ఊరికే ఆడుతూ కూర్చుంటే ఏదీ దక్కదు.”
అని అడ్డుకునేవాడు.
ఎన్నికల సమయాల్లో,
“రాజకీయాలు
పూర్తిగా చెడిపోయాయి… గుండాలు, రౌడీలు, నేర చరితులే ఎక్కువగా పోటీ
చేస్తున్నారు. ఇది మారాలి, మార్చగలిగే మంచివాళ్లు రాజకీయాల్లోకి రావాలి…”
అని అందరిలాగే తాను కూడా రోజుకి పది సార్లు ఇతరులతో మాట్లాడేవాడు.
కానీ నిజంగా ఓటు వేసే రోజున మాత్రం
“ఈసారి
తప్పనిసరిగా అతను గెలుస్తాడులే… నా ఒక్క ఓటు వేసినా, వేయకపోయినా ఫలితం ఏం
మారుతుంది. గెలిస్తే మాత్రం వాడేమి ఉద్ధరిస్తాడు. అనుకుని అసలుఓటు
వేయడానికివెళ్లేవాడు కాదు! ఇంట్లోనే కూర్చునేవాడు."
అతనికి ఈ విషయాలు తప్పు అని తెలిసినా మారడానికి గాని, మార్చడానికి కానీ ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు.
ఒకరోజు రాఘవ అత్యవసరంగా పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది.
వర్షం బాగా పడుతోంది.
బస్సులు రావడం లేదు.
మొబైల్ ఫోన్‌కి నెట్ లేదు.
రోడ్డు మధ్యలో అతను ఒంటరిగా నిలబడి ఉన్నాడు.
అతని ఒక్కటే మాట బలంగా అనుకున్నాడు.
“ఇప్పుడు ఎవరో సాయం చేస్తే… దేవుడిలా భావిస్తా.”
సుమారు అరగంట తర్వాత ఒక పాత జీప్ ఆగింది.
డ్రైవర్ జుట్టు తెల్లగా ఉంది, ముసలి వయసు.
అతను చిరునవ్వుతో అడిగాడు:
“ బాబు వర్షంలో నిలబడి ఉన్నావు. నేను పట్నానికి వెళుతున్నాను? నీవు పట్నానికే అయితే వచ్చి ఎక్కుబాబు.”
జీప్‌లో కూర్చున్న తరువాత రాఘవ అటు యిటూ చూసి అడిగాడు:
“తాతయ్య… మీరు కూడా నాలాగే రోడ్డుపై ఇబ్బంది పడుతుంటే, ఇలాగే ఎవరైనా సాయం చేస్తారా?”
ఆ ముసలివ్యక్తి మృదువుగా అన్నాడు:
“బిడ్డా… ఏదైనా మనం ఇస్తేనే తిరిగి వస్తుంది.
అందరూ అడిగేవాళ్లైతే, ఇచ్చేవాళ్లు ఎవరు ఉంటారు?” మా సంఘ శాఖలో ఒక పద్యం చెప్పేవారు
పరోపకారాయ ఫలన్తి వృక్షాః (చెట్లు పరుల కోసం పండ్లిస్తాయి)
పరోపకారాయ వహన్తి నద్యః (నదులు పరుల కోసం ప్రవహిస్తాయి)
పరోపకారాయ దుహన్తి గావః (గోమాతలు పరుల కోసం పాలిస్తాయి)
పరోపకారార్థమిదం శరీరమ్ (ఈ శరీరం కూడా పరుల సేవకే).
సారాంశం:
ఈ
శ్లోకం ప్రకృతిలోని జీవన విధానాన్ని వివరిస్తూ, మనిషి కూడా నిస్వార్థంగా
ఇతరులకు సహాయం చేయాలని, తన శరీరాన్ని పరుల హితం కోసం వినియోగించాలని
బోధిస్తుంది.
ఆ మాట… ఆ శ్లోకం
రాఘవ హృదయాన్ని బలంగా తాకింది.
పట్టణం చేరే దాకా, వాన చినుకుల మధ్య చిన్న చిన్న ప్రశ్నలు రాఘవను వెంటాడాయి:
నాకు లిఫ్ట్ కావాలి… అన్నప్పుడు ఎదురు చూసాను. కానీ నేను ఎప్పుడైనా ఇచ్చానా?
నాకు క్రీడల్లో గెలిచిన వారిని చూడాలి… అని కోరిక ఉంది. భారతదేశం
ఒలింపిక్ క్రీడల్లో అత్యధిక స్వర్ణాలు గెలవాలన్న కోరిక ఉంది. కానీ నా
తమ్ముడు ఆటలకు వెళతానంటే పంపానా?
నీతి, నిజాయితీ కల నాయకులు రావాలి… కానీ నేను ఎప్పుడైనా ఓటు వేసానా? నిజాయితీ గల అభ్యర్థిని సమర్థించానా?
నాకు ఎప్పుడూ ఎవరో ఒకరు సహాయం చేయాలన్న కోరిక ఉంది… కానీ నేను ఎప్పుడైనా ఇతరులకి సహాయం చేసానా?
జవాబు ఒక్కటే—
లేదు.
నిజం,
మనకి ఇతరుల నుండి సహాయం లభించనప్పుడు బాధగా ఉంటుంది. అదే బాధ వారికీ
ఉంటుంది కదా! ఆ ఆలోచనతో తన మీద తనకే అసహ్యం కలిగింది. తీవ్రంగా పశ్చాతాపం
పడ్డాడు.ఆ బాధే అతనిలో నిజమైన మార్పుకి శ్రీకారం చుట్టింది.
ఆ రోజు నుంచి రాఘవ కొద్దిగా మారడం మొదలుపెట్టాడు:
చిన్న సాయం:
రెండురోజుల
తర్వాత, రోడ్డుపై బైక్ మీంచి పడి దాని కింద చిక్కుకున్న యువకుడిని చూసి,
తానే స్వయంగా ముందుకు వెళ్లి సహాయం చేశాడు. అంబులెన్సుకి ఫోను చేసి
రప్పించాడు.
ఆ యువకుడు “అన్నయ్యా, నిజంగా ఈ రోజు మీరు నా ప్రాణం
కాపాడారు” అని చెప్పగానే, రాఘవకు ఆ రోజు జీప్ పై లిఫ్ట్ ఇచ్చిన
ముసలివ్యక్తి గుర్తొచ్చాడు.
తమ్ముడి కల:
రాఘవ తమ్ముడు ఒక రోజు క్రీడాపోటీలో పాల్గొనాలని అడిగాడు.
మొదట రాఘవ నోటికి వచ్చిన మాట—“చదువు ముఖ్యం…” కానీ వెంటనే ఆగిపోయాడు.
“వెళతావా తమ్ముడు… రా ! నేను నిన్ను తీసుకు వెళ్తాను. నీకు అండగా ఉంటాను”
అని ప్రోత్సహించాడు.
ఆ చిన్న తమ్ముడు చూపులోని ఆనందం…
రాఘవ గుండెల్లోకి జారి కరిగి తన కంట్లోనుండి వచ్చింది.
ఓటు నా బాధ్యత:
ఎన్నికల రోజు వచ్చింది.
ఈసారి రాఘవ ఉదయం నుంచే సిద్ధంగా నిలబడ్డాడు.
ఓటు వేసి బయటికి వస్తూ…
ఆ నీలిరంగు ముద్ర తన వేళ్లపై కనిపించినప్పుడు
అతనికి అది ఒక పెద్ద విజయంలా అనిపించింది.
“ఇది మార్పు వైపు వేసిన మొదటి అడుగు” అన్న భావన కలిగింది.
సహాయం చేసే అలవాటు:
రోజూ ఎవరో ఒకరికి చిన్నపాటి సేవ చెయ్యడం…
రాఘవ రోజువారీ జీవితంలో భాగం అయిపొయింది.
తాను చేసేవి పెద్ద పనులు కాదు—
ఎవరైనా పడిపోయిన తాతగారిని లేపడం,
తన పక్కింటి అమ్మాయికి పరీక్షలకు వెళ్లేందుకు లిఫ్ట్ ఇవ్వడం,
పొలంలో నీటితో ఇబ్బంది పడుతున్న రైతుకు సాయం చెయ్యడం…
కానీ ఆ అభిమానం మాత్రం గ్రామమంతా వచ్చేసింది.
“రాఘవంటే మంచి మనిషి” అనే మాట నెమ్మదిగా వ్యాపించింది.
రాఘవ చేసే ఈ చిన్నచిన్న సహాయాలు గ్రామంలోని పిల్లలు, యువత, పెద్దలు అనుసరించడం మొదలుపెట్టారు.
ఎవరికైనా ఇబ్బంది అయితే “నన్ను పిల్వయ్యా” అని పలకడం మొదలయ్యింది.
క్రీడల్లో పిల్లలను ప్రోత్సహించడం మొదలైంది.
గ్రామంలో ఓటింగ్ శాతం 90% దాటింది.
పక్కవాడికి సాయం అవసరమైతే ఎవరూ వెనుకంజ వేయడం లేదు.
మనసాపురం…
పేరు లాగానే, మనసులు మారిపోయాయి. సంవత్సరాలు గడిచిపోయాయి.
… ఒకరోజు
రాఘవ కారుపై వెళుతుండగా …
రోడ్డుపై ఒక వృద్ధ వ్యక్తి బస్సు కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు.
రాఘవ వెంటనే కారును ఆపి అతన్ని ఎక్కించుకున్నాడు.
ముసలివ్యక్తి ముఖంలో చిరునవ్వు.
అతను నిశ్శబ్దంగా అన్నాడు:
“ఈ ఊరి వాళ్లే రా బిడ్డా… నిజమైన మనుషులు.”
రాఘవ ఆశ్చర్యపోయి చూశాడు—
అతడే…
కొన్నేళ్ల క్రితం జీప్‌లో తనకి లిఫ్ట్ ఇచ్చిన అదే తాతయ్య.
తాతయ్య రాఘవ చేతిని పట్టుకుని అన్నాడు:
“లోకం మంచిగా మారాలి అనుకుంటే,
ఆ మారే మొదటివాడు ఎవరైనా కావాలి.
అది ఇప్పుడు నువ్వయ్యావు బిడ్డా.”
రాఘవ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
“మనకి మంచి జరిగితే బాగుంటుంది…” అని కోరుకోవడం సులభం.
కానీ ఆ మంచి జరగడం మనతోటే మొదలయితే ప్రపంచం నిజంగా మారుతుంది.
ఎందుకంటే—
ఇవ్వని చేతికి, అందుకునే అర్హత లేదు.
అందరూ అడిగేవాళ్లైతే— ఇచ్చే వారు ఎవరు?
21, నవంబర్ 2025, శుక్రవారం
ఒక్క మనిషి మారితే చాలు
ఈ రోజుల్లో మనం మనుషుల మధ్య ఉన్నామా…
లేక యంత్రాల మధ్య ఉన్నామా! తేడా తెలియడం లేదు.
చుట్టూ అందరూ ఉన్నారు… కానీ ఏ ఒక్కరూ మనతో లేరు.
అందరూ తమ తమ మొబైల్ తో బిజీ గా ఉన్నారు. పక్కవారిని పట్టించుకునే తీరిక లేదు.
ఒకప్పుడు మాటలతో బంధాలు ఏర్పడేవి,
ఇప్పుడు మెసేజ్‌లతో బంధాలు ఏర్పడి కుటుంబాలలో మాయమవుతున్నాయి.
ఒకప్పుడు నవ్వు పంచుకునేవాళ్ళం,
ఇప్పుడు లైక్ కోసం నవ్వుతున్నాం.
ఒక అమ్మాయి యూట్యూబ్‌లో ‘How to kill an old lady’ అని సెర్చ్ చేసి…
తన అత్తగారిని చంపింది.
ఒక అబ్బాయి ప్రమాదంలో ఉన్నవాడిని చూసి…
ఆతడిని కాపాడకుండా, అతని మొబైల్ దొంగిలించాడు.
తల్లిదండ్రులు పిల్లలకు భారంగా మారుతున్నారు.
బంధాలు బీటలువారి, వ్యక్తిగత సుఖాల కొఱకు తల్లిదండ్రులు బిడ్డలను, బిడ్డలు తల్లిదండ్రులను, భార్యలు భర్తలను, భర్తలు భార్యలను అంతం చేస్తున్నారు.
డబ్బుల కొఱకు ఏ పని చేయడానికైనా వెనుకాడడం లేదు.
“ఇంత దూరం మనం వచ్చేశామా?
మనిషి మనిషిని నమ్మలేని స్థితికి చేరుకున్నామా?
మనం కోల్పోయింది ఏమిటి? ప్రేమా? విలువలా? లేక మనసా?”
“కానీ…
ఈ చీకటిలో కూడా ఒక్క దీపం వెలిగితే చాలు.
ఒక్క మనిషి మనసు మేల్కొంటే చాలు.”
“ఒక మంచి పని,
ఒక చిరునవ్వు,
ఒక క్షమాపణ,
ఒక సహాయం —
అదే ప్రపంచాన్ని మార్చే మొదటి అడుగు.”
“మనమంతా మార్చాల్సిన అవసరం లేదు.
ఒక్క మనిషిని మార్చితే చాలు.
అతడు ఇంకొకరికి వెలుగు అవుతాడు.
ఆ వెలుగు ఇంకొకరిని తాకుతుంది.
అదే మార్పు యొక్క మొదటి అడుగు.”
“అంధకారాన్ని తిట్టకండి…
దీపం వెలిగించండి. చీకటి అదే మాయం అవుతుంది
ఎందుకంటే,
మార్పు ఎక్కడో కాదు — మనలోనే జరగాలి - మనతోనే మొదలవ్వాలి. అప్పుడు అది అందరిలోను మొదలవుతుంది. వెలుగులు నింపుతుంది”
ఒక్క మనిషి మారితే చాలు.
ప్రపంచంలో ప్రేమ, ఆప్యాయత, అనురాగం తిరిగి కొత్త చిగుర్లు వేస్తాయి.
ఈ మార్పుకు అతి సులువయిన మార్గం.........
ఆ మారే ఒక్కరు, మీరైతే చాలు.
ఎలా ఈ ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నారో అలా మీరుంటే చాలు.
-శివ భరద్వాజ్
ఓటు నా చేతిలో… అధికారం మాత్రం వారి చేతిలో!
ఓటు వేసేది నేనే… పన్ను కట్టేది నేనే… ఆట ఆడేది మాత్రం వారే! కోట కట్టేది మాత్రం వారే! అరాచక చదరంగంలో, రాజు ప్రజలే అయినా… మంత్రుల చేతిలోనే అధిక...
-
ఆకృతినీయుడు అవని మట్టితో, అలంకరించుడు ఓషధీయ పత్రితో, పూజచేయుడు నిజగృహ పూలతో, నివేదించుడు ముదమున మోదకములతో, నిమజ్జనచేయుడు విగ్రహము నీటితో, గ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
రోగ కారణానికి కాకుండా , రోగ లక్షణాలకు వైద్యం చేస్తే రోగం నయం కాదు. - శివ భరద్వాజ్ మనం శారీరకంగా కాదు, మానసికంగా లేదా ఆత్మీయంగా ఎదుర్కొనే సమ...
