జీవితాన్ని మీరు వదిలేస్తే అది పిచ్చిగీతలుగా మారి గందరగోళం చేసేస్తుంది.
జీవితాన్ని మీరు క్రమపరిస్తే అది ఒక అద్భుత జీవన చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది.
మనం అనుకున్నవన్నీ దొరకకపోవచ్చు
కానీ దొరికినవన్నీ అవకాశాలుగా మార్చుకోవచ్చు.
మీ సానుకూలత, సృజనాత్మకత, ప్రయత్నంలోనే అంతా దాగి ఉంది.
-శివ భరద్వాజ్
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
29, అక్టోబర్ 2023, ఆదివారం
Shape your life as a wonderful picture
27, అక్టోబర్ 2023, శుక్రవారం
జీవితం సద్దుబాట్లు - రాజీల కలయిక
ఆటవెలది:
సర్దుకొనుడు నిన్ను వాంఛించు వారితో,
సమ్మతించు నీకు వాంఛ యున్న,
బతుకు సద్దుకొనుడు, రాజీల మిళితంబు
శివకుమారు మాట సిరులమూట
భావం:
నిన్ను కావాలనుకునే వారితో సర్దుకుపోవాలి.
నువ్వు కావాలనుకునేవారితో రాజీ పడాలి.
జీవితం సద్దుబాట్లు - రాజీల కలయిక
వివరణ:
మనల్ని కావాలనుకునేవారు, మనల్ని ఇష్ట పడేవారు ఉంటారు. మన స్నేహాన్ని కోరుకునే వారుంటారు. వారితో సర్దుకు పోవాలి. మనకు నచ్చని వాటిని వదిలేస్తూ ఉండాలి. వీలైతే సుతిమెత్తగా వారికి వివరించి చెప్పాలి.
మనం కొంతమందిని ఇష్ట పడతాం, అభిమానిస్తాం, వారి స్నేహాన్ని కోరుకుంటాం, కానీ వారిలో కొన్ని మీకు నచ్చక పోవచ్చు. ఆ నచ్చని వాటితో రాజీ పడాలి. అప్పుడు మీరు వారితో కలిసి ఉండగలుగుతారు.
జీవితం అంటేనే సద్దుబాట్లు, రాజీల మిశ్రమం. కానీ మిమ్మల్ని మీరు కోల్పోయేలా చేసే ఏ బంధాన్ని మీరు స్వీకరించకండి. ఆవేశంతో కాక అలోచించి అడుగేయండి.
-శివ భరద్వాజ్
26, అక్టోబర్ 2023, గురువారం
అష్టాదశ శక్తి పీఠ స్తోత్రం
लङ्कायां शाङ्करीदेवी कामाक्षी काञ्चिकापुरे ।
प्रद्युम्ने शृङ्खलादेवी चामुण्डी क्रौञ्चपट्टणे ॥ 1 ॥
अलम्पुरे जोगुलाम्बा श्रीशैले भ्रमराम्बिका ।
कॊल्हापुरे महालक्ष्मी मुहुर्ये एकवीरा ॥ 2 ॥
उज्जयिन्यां महाकाली पीठिकायां पुरुहूतिका ।
ओढ्यायां गिरिजादेवी माणिक्या दक्षवाटिके ॥ 3 ॥
हरिक्षेत्रे कामरूपी प्रयागे माधवेश्वरी ।
ज्वालायां वैष्णवीदेवी गया माङ्गल्यगौरिका ॥ 4 ॥
वारणाश्यां विशालाक्षी काश्मीरेतु सरस्वती ।
अष्टादश सुपीठानि योगिनामपि दुर्लभम् ॥ 5 ॥
सायङ्काले पठेन्नित्यं सर्वशत्रुविनाशनम् ।
सर्वरोगहरं दिव्यं सर्वसम्पत्करं शुभम् ॥ 6 ॥
లంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే ।
ప్రద్యుమ్నే శృంఖళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే ॥ 1 ॥
అలంపురే జోగుళాంబా శ్రీశైలే భ్రమరాంబికా ।
కొల్హాపురే మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీరా ॥ 2 ॥
ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికా ।
ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటికే ॥ 3 ॥
హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరీ ।
జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగళ్యగౌరికా ॥ 4 ॥
వారణాశ్యాం విశాలాక్షీ కాశ్మీరేతు సరస్వతీ ।
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం ॥ 5 ॥
సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనం ।
సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం ॥ 6 ॥
ఇతి అష్టాదశ శక్తి పీఠ స్తోత్రం సంపూర్ణం ||
సకల శత్రు నాశనానికి ప్రతి రోజూ సాయంత్రం పూట ఈ మంత్రాన్ని పఠించాలి. ఇది దివ్యమైనది మరియు మంగళకరమైనది మరియు అన్ని వ్యాధులను నశింపజేస్తుంది మరియు సకల సంపదలను ప్రసాదిస్తుంది.
25, అక్టోబర్ 2023, బుధవారం
నిజాన్ని మాట్లాడు
నీవు మాట్లాడకపోతే మౌనంగా ఉన్నావంటారు
నీవు మాట్లాడుతుంటే వాగుతున్నావంటారు
కొద్దిగా మాట్లాడుతుంటే ముక్తసరి అంటారు
నీ గురించి చెబుతుంటే సొంత డబ్బా అంటారు
ఎదుటివాడి గురించి చెబితే విమర్శ అంటారు
నెమ్మదిగా మాట్లాడుతుంటే గొణిగావంటారు
గట్టిగా మాట్లాడితే గొడవ పెడుతున్నావంటారు.
నీవు ఎలా మాట్లాడిన విమర్శించేవారు
విమర్శిస్తూనే ఉంటారు, వంకలు పెడుతూనే ఉంటారు.
నీవు అనుకున్నది, నమ్మింది మాట్లాడు,
నిజాయితీగా, నిర్భయంగా మాట్లాడు,
నిజాన్ని హాయిగా, అద్భుతంగా మాట్లాడు.
-శివ భరద్వాజ్
24, అక్టోబర్ 2023, మంగళవారం
భారతీయుల శక్తి ఆరాధన మూఢమా! - విజ్ఞాన శాస్త్ర విశేషమా!
భారతీయుల శక్తి ఆరాధన మూఢమా! - విజ్ఞాన శాస్త్ర విశేషమా!
స్త్రీ శారీరకంగా పురుషులంత శక్తివంతురాలు కాదు. కానీ భారతీయులు శక్తి ప్రదాయినిగా అమ్మ ఆది పరాశక్తిని ఎందుకు ఆరాధిస్తారు? అమ్మను శరన్నవరాత్రి ఉత్సవాలలో, వివిధ రూపాలలో ఎందుకు పూజిస్తారు? ఈ దసరా రోజులలో ఒక ఆర్టికల్ నాకు కనిపించింది. అది చదివిన తరువాత ఈ విషయం మన పూర్వీకులకు ముందే తెలుసునేమో! అందుకే అమ్మను శక్తిగా కొలిచే పధ్ధతి ప్రవేశ పెట్టరేమో అనిపించింది. దాని హెడ్డింగ్
"మన తల్లుల నుండి మాత్రమే మైటోకాన్డ్రియల్ DNA ను ఎందుకు వారసత్వంగా పొందుతాము?"
అప్పుడు చిన్నప్పుడు మనం సైన్స్ పాఠాల్లో చదువుకున్న ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది, ఆ వాక్యం "మైటోకాండ్రియా కణ శక్తి భాండాగారం". మనందరికీ తెలిసిందే మన శరీరం కొన్ని కోట్ల కణాల సముదాయమని. మనం శక్తివంతంగా ఉండాలంటే కణాలు ఆరోగ్యంగా ఉండాలి, వాటికి కావలసిన శక్తి మైటోకాండ్రియా నుండి లభిస్తుంది.
చాలా కాలంగా, జీవశాస్త్రవేత్తలు మన DNA కేవలం మన కణాల నియంత్రణ కేంద్రం, కణకేంద్రకంలో మాత్రమే ఉంటుందని భావించారు.
కానీ 1963లో, స్టాక్‌హోమ్ యూనివర్శిటీలో ఒక జంట న్యూక్లియస్ వెలుపల DNAని కనుగొన్నారు. వారు మన కణాల శక్తి కేంద్రాలైన మైటోకాండ్రియాలలో DNA ఫైబర్‌లను గమనించారు. కానీ ఇది న్యూక్లియస్‌లోని DNAలా కాకుండా ప్రత్యేకంగా భిన్నంగా ఉంది. న్యూక్లియర్ DNA తల్లిదండ్రులిరువురి నుండి 50%-50% అంటే సగం, సగం వస్తుంది, కానీ మైటోకాన్డ్రియల్ DNA తల్లి నుండి మాత్రమే వస్తుంది. అంటే దీనర్ధం, మీరు మీ మైటోకాన్డ్రియల్ DNA ను మీ తల్లి నుండి వారసత్వంగా పొందారు, ఆమె తన తల్లి నుండి వారసత్వంగా పొందింది. ఇదే ఆది పరాశక్తి భావనకు మూలం. మీరు స్త్రీ అయినా, లేక పురుషుడైనా, మీ కణాలకు శక్తిని అందించేది మీరు మీ తల్లినుండి పొందిన మైటోకాన్డ్రియల్ DNA.
అందుకే అమ్మను శక్తి దాయినిగా పూజించాలి మరియు అమ్మలందరికీ మూలపుటమ్మ ఆ జగదాంబను మనసారా ధ్యానించాలి.
సర్వం శక్తిమయం జగత్
-శివ భరద్వాజ్
source: https://www.nytimes.com/2016/06/24/science/mitochondrial-dna-mothers.html
22, అక్టోబర్ 2023, ఆదివారం
మేల్కొలుపు…
మేల్కొలుపు…
పూర్వం ఇద్దరు రాజులు రథాలపై ప్రయాణం చేస్తూ ఇరుకైన ఒక వంతెన మీద ఎదురయ్యారు.
ఒక రథం వెనక్కి వెళ్తేనే, మరో రథం ముందుకు వెళ్లగలదు.
రథసారధులిద్దరూ నీ రథం వెనక్కి తీసుకెళ్ళంటే... నీదే తీసుకెళ్ళమని వాదించుకోడంమొదలెట్టారు.
ఇద్దరు రాజులూ ఏం జరుగుతుందా అని చూస్తున్నారు...
చివరికీ ఇద్దరు సారధులూ ఒక ఒప్పందానికి వచ్చారు.
వాళ్ళు తమ రాజుల గొప్పదనం చెప్పేట్టు... ఏ రాజు గొప్పవాడో ఆరాజుకు రెండో రాజు ముందు దారి ఇచ్చేట్టు...!
మొదటి రధసారధి ఇలా అన్నాడు...
మా రాజ్యంలో మా రాజుగారు రోజుకి వందమంది అభాగ్యులకి, ఆకలి బాధతో ఉన్నవారికి భోజనం ఏర్పాటుచేసి గానీ వారు భుజించరు. కట్టుకోవడానికి గుడ్డలు కూడా లేని వారిని రోజుకి ఐదారువందలమందిని ఎంపిక చేసి వారికి వస్త్రదానం చేస్తారు. ఎన్నో అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలూ స్థాపించారు...!!
రెండవ సారధి తలదించుకుని, కంట నీరుపెట్టుకుని మారుమాట లేకుండా తన రథం వెనక్కి తీయడానికి సిద్ధమయ్యాడు!!
దానికి ఆరాజు గారిలా అడిగారు... ఏమయ్యా... మీ రాజుగారికి దాన గుణంలేదా?...
అలా ఏమీ చెప్పకుండా రథం వెనక్కి తిప్పుకుంటున్నావు.
దానికా... రెండో రథ సారధి, వినయంగా ఇలా అన్నాడు...
హే రాజా!.... మా రాజుగారు దానం చేస్తుండగా చూసే అదృష్టం మా రాజ్యం లో ఎవరికీ కలగలేదు; మా రాజ్యం లో దానం చేద్దామంటే సామాన్యులమైన మాకే ఒక్క దీనుడు కూడా కనిపించడు. ఇంక మారాజుగారికి దానం చేసే అవకాశం ఎలా దక్కుతుంది. వృద్ధాశ్రమాల్లో ఉండాల్సిన అవసరమూ ఏనాడూ ఎవరికీ కలగలేదు; ఇంక వృద్ధాశ్రమాలు నిర్మించే అవసరం ఏమి ఉంటుంది. దానం చేసే, వృద్ధాశ్రమాలు నిర్మించే అవసరం అవకాశం మా రాజ్యంలో లేదు ప్రభూ! అన్నాడు.
వెంటనే... మొదటి రథంలో రాజు, రథం దిగి... రెండవ రాజుకు పాదాభివందనం చేసి... తన రథం వెనక్కి తీయించి దారి ఇచ్చాడు...
వేల వృద్ధాశ్రమాలూ!... రాయితీలు!... సంక్షేమపథకాలూ!... ఉచితాలూ!... అభాగ్యులకు సేవలూ!... సమానత్వం కోసం రిజర్వేషన్లు!... దశాబ్దాలుగా అమలు చేసే పరిస్థితులున్న దేశము... ఆశించే పౌరులు... ఉన్నట్టి ఏ దేశమూ మంచి పాలనలో ఉన్నట్టు కాదు... అది సరైన పాలనా కాదు...
పాలకుల...పాలితుల... దౌర్భాగ్యానికి... చిహ్నం ఆ దేశం...!!
ఏ దేశంలో రాయితీల అవసరం ఉండదో... ఆ దేశం కంటే గొప్ప దేశం మరొకటి ఉండదు.
రాయతీలు హీన పరిస్థితికి అద్దాల వంటివి. కేజీ బియ్యం తక్కువ ధరకి యిచ్చే ప్రభుత్వం కంటే... ఎంత ధరకయినా కొనగలిగే ప్రజలుండే ప్రభుత్వం గొప్పది. ఈ విషయం ఎన్నో విధి విధానాలకు వర్తిసుంది...
ఇవన్నీ అవగాహన చేసుకుని... ఆలోచించి... ఉత్తమ రాజ్యంగా...
మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని... నిర్మించుకునేదెప్పుడు??!
మన ప్రజలు మేల్కొనేదెప్పుడు?!! భరత జాతి చైతన్యవంతమయ్యేది ఎప్పుడు?!!
🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
మనం మారదాం - బంగారు భారత దేశాన్ని తిరిగి నిర్మిద్దాం
21, అక్టోబర్ 2023, శనివారం
ఎర్ర జీర వెనకున్న ఎండిన మంజీర - నాన్న
నాన్న జేబు ఎత్తుగా ఉందని,
తడిమే కొడుకుకు తెల్వదు,
నాన్న జేబు క్రింద ఉన్న
బిల్లుల చిల్లుల గురించి.
ఏ! మా నాన్న పీసోడు, అని
ముఖం చిట్లించేటోనికి తెల్వదు,
ఆ పీసుతనం వెనుక బతుకు
పీసులు కాకుండా అడ్డుకుంటుండని.
ఇస్మార్టు ఫోను కిస్తిలా కొనలే,
మా బాపు! అనేటోనికి తెల్వదు,
జీతపు గాలిని పిడికిట పట్టిండని,
తెర్వంగానే, కిస్తీల జిక్కి ఖాళీ అవుతుందని.
సిన్మాకు దొస్తుగాళ్లతో పోతానంటే,
ఎర్రబడ్డ నాయన కంటిలా
దాక్కొన్న నీటి చుక్కకే తెలుసు,
ఎర్ర జీర వెనకున్న ఎండిన మంజీర.
- శివ భరద్వాజ్
18, అక్టోబర్ 2023, బుధవారం
ముసలితనం
ఎంతో గొప్పగా బతికి,
ఎంతో ఎత్తుకు ఎదిగి,
చేవ ఉన్నన్ని రోజులు
చల్లగా నీడనిచ్చిన నన్ను,
మోడువారగానే అనాధచేసి
ఎండిన కట్టెగానే చూస్తున్నారు.
పచ్చటి సంపదతో,
కోరికల ఫలాలు అందించినన్ని రోజులు
రోజు వచ్చి తియ్యగా పలకరించేవారు.
ఇప్పుడు రిటైర్ అయ్యి,
పచ్చటి ఆకుల కాసుల గలగలలు ఆగి
దగ్గరకు వస్తే కోరికల ఫలాలు దొరకవని,
నీళ్లు పోస్తే దండగని, నా నీడన బతికిన వారే!
దూరంనుంచి చూసి వెళ్లిపోతున్నారు.
పలకరించే దిక్కులేక
ఎండిపోయిన కొమ్మల చేతులు దోసిలి పట్టి,
గుక్కెడు నీటి చుక్కలు పొసే వారి కోసం,
పొడిబారి పగిలిన కాళ్ళ వేళ్ళతో
బలహీనంగా నుంచొని రోజులు లెక్క పెడుతున్నా.
ఇది కలి మాయయా!
కాలం మార్చిన మనుషుల పోకడా!!
అర్ధంకాక, కృతజ్ఞత మరిచిన వారిని,
పొడి కళ్ళతో చూస్తూ,
దూరంగా ఎండిన చెట్టు
పక్కన ఇంటిలో పండిన ముసలి,
ఇరువురి ఆలోచన ఒక్కటే.
ఎవరున్నా, లేకున్నా,
నా కట్టెకు, నీ కట్టె తోడుగా,
సహదహనమవుదామన్న
ఇరువురికి ఓదార్పు ఒక్కటే,
- శివ భరద్వాజ్
17, అక్టోబర్ 2023, మంగళవారం
నాయకుల గ్యారంటీ మాటలకు వారంటీ ఉండదు
ఓటునడగ వచ్చిన నాయకుల గ్యారంటీ
మాటలకు వారంటీ యుండదు.
ఏమి చేయునో చెప్పే నాయకులు
ఎలా చేయునో అడిగితే మరలరారు.
ఉద్దరింపగ ఉచితంగిచ్చేది
పైపంచెన నూనె పట్టిన తీరుగ నుండు
పంచె క్రిందన టాక్సుల పీపాలు రెడీగ నుండు
లేకుండిన తెచ్చు అప్పుల కుప్పలు,
చేయును ధరల పెంపులు,
కాకుండిన భూములు వేలము వేయు
తవ్వి అమ్ము ఇసుకను, మట్టిని,
పిండి చేయును కొండలు గుట్టలు.
కాలుష్యమున ముంచే పారిశ్రామిక ప్రగతితో
బతుకుకు కాన్సరు బహుమతిగ వచ్చు
అడవుల తరిగించి, కొండలు కరిగించి
ఉచితమైన నీటికి, గాలికి ఖరీదు కడుతూ
మందుల కుంపటి లేని ఇల్లు ఒకటైనా ఉందా?
కల్పించాల్సింది పని కల్పన
పెంచాల్సింది తలసరి సంపాదన.
ప్రతి చేయి పని చేయడానికి లేవాలి.
విసిరే ఎంగిలి మెతుకులు దోసిట పట్టేందుకు కాదు.
-శివ భరద్వాజ్
14, అక్టోబర్ 2023, శనివారం
మనస్సు - స్థితి
ఆటవెలది:
కఠిన స్థితి ఎదుటబడ, బలహీన మనసు
మనిషి, అది సమస్యవలెను చూడు,
సమునకది సవాలు. అవకాశమనిపించు
బలమగు మనసుకల మనషులకది.
భావం: కఠినమైన పరిస్థితులు ఎదురైనపుడు, బలహీనమగు మనస్సు కల వ్యక్తి దానిని సమస్యవలె చూస్తాడు, సమతుల్యమైన మనస్సు కలవాడు దానిని ఛాలెంజ్ లా స్వీకరిస్తాడు. కానీ బలమైనటువంటి మనస్సుగల మనుషులకు కఠినమైన పరిస్థితులు అవకాశాలుగా కనిపిస్తాయి.
-శివ భరద్వాజ్
రాబందులు రెక్కి
నవ్వుతున్న గాంధీ నోటులిచ్చి
నిజాయితీగా ఓటునడుగుతున్న
నాయకుల గెలిపించిన ఓటరు
మహాశయులారా మీకు "వంద"నాలు.
బీరు సారానిచ్చి బేషరతుగ
నీతి తప్పక ఓటు నడుగుతున్న
నాయకుల గెలిపించిన ఓటరు
మహాశయా నీకు మన"సారా" దీవెనలు.
దమ్ము బిరియాని తినిపించి
దయ చూపించమని ఓటునడుగుతున్న
దమ్మున్న నాయకుని గెలిపించిన ఓటరు
మహాశయా నీ "దమ్ము"కు జేజేలు.
కుక్కలు వేసే ఎంగిలి విస్తరి,
నక్కలు వేసే బొక్కల పులుసుకు,
జలగలు వేసే రక్తపు కూటికి,
రాబందులు వేసే మాంసపు ముక్కకి,
ఆశపడి ఓటు వేశావా! మాపటేలకు
నీ విస్తరి ఉండదు.
ఆకలినలమటించి బొక్కలు తేరిన
నిన్ను పీక్కు తినడానికి నక్కలు నక్కి,
రాబందులు రెక్కి చేస్తూ
సడి చేయక ఉంటాయి.
జలగలు మెత్తగ రత్తము
పీలుస్తుంటాయి
- శివ భరద్వాజ్
- శివ భరద్వాజ్
13, అక్టోబర్ 2023, శుక్రవారం
సంతోషం ప్రాణం ఉన్న నీలో ఉంది.......
సంతోషం ప్రాణం ఉన్న నీలో ఉంది.......
ఆనందపు విత్తనాలు జల్లితే
సంతోషాల పూలు విరుస్తాయి.
విచారపు విత్తనాలు జల్లితే
దుఃఖపు మొలకలు మొలుస్తాయి.
కాలపు ఒడిలో సేదతీరుదామంటే
అది ఎప్పుడు తీరిగ్గా కూర్చోదు.
సంతోష సమయాన గడియారం ఆగదు
దుఃఖంలో ఉన్నావని జాలి తలచదు.
సంతోషం ప్రాణం లేని వస్తువులలో లేదు.
సంతోషం ప్రాణం ఉన్న నీలో ఉంది.......
12, అక్టోబర్ 2023, గురువారం
నా పిల్ల! నిదుర పిల్ల!!
అటు ఇటు దొర్లి దొర్లి
పొర్లు దండాలు పెట్టినా
దయచూపని దేవతలా
కటిక చీకటిన ఎంత వెదికిన
కంటి ఆర్తి తీర్చగ కానరాదు
శ్రమ లేని ఒంటికి
మింటినున్న తారకలా
ఒంటరినై ఉన్న నను వలచి రాదు
రంగుల రంగేళి చరవాణిని వదిలిపెట్టి
సాగే సీరియల్ టివికి బొంద పెట్టి
కళ్ళు మూసి తననే ధ్యానిస్తే వస్తానని
కండిషనులు ఖరాకండిగా చెప్పేసింది.
ఎంత బతిమాలిన రాను పొమ్మంది
పుస్తకాల పూలు జల్లి పడకనేక్కితే
వస్తానంది నా పిల్ల! నిదుర పిల్ల!!
- శివ భారద్వాజ్
10, అక్టోబర్ 2023, మంగళవారం
ఒంటరితనపు ఎడారిలో - జ్ఞాపకాల ఎండమావులతో - విరహపు దాహం తీరదు
సాయంత్రం ఆరు కాగానే ఎపుడెపుడు
ఇంటికి వెళదామని ఎదురుచూచిన నేను
సాయంత్రం ఆరు దాటినా అపుడేనా
ఇంటికి వెళ్లడం అని అనుకుంటున్నాను.
కాలింగ్ బెల్ కొట్టకనే చిరునవ్వుతో
కాఫీ కప్పుతో ఎదురొచ్చి నిలిచే నువ్వు
కాఫీ కలుపుకుంటున్నపుడు గుర్తొస్తున్నావు.
స్నానానికి సబ్బు అందించే నీ చేతుల
మెత్తటి స్పర్శ ఇపుడు తగలడం లేదు.
వేడివేడిగా నీవు వడ్డించే గుత్తి వంకాయ
కమ్మదనం నా నాలుకకి తెలియడం లేదు.
అహంకరించి, హుంకరించి మాటల కత్తులతో
దాడిచేసి గాయం చేసిన నాకు,
ఇంటికి వెళ్లిన ప్రతిక్షణం నీ మెమొరీలు గుండెల్లో,
మెత్తటి మేకులై దిగబడుతూనే ఉన్నాయి.
పుష్కలంగా దొరికే మురిపాల బంధాల విలువ
చేజారి ఒలికినపుడు మాత్రమే తెలుస్తుంది.
ఒంటరితనపు ఎడారిలో, నీ జ్ఞాపకాల ఎండమావులతో
విరహపు దాహం తీరక నిను వెదుకుతు గడిపేస్తున్నాను.
ఎన్నటికీ తీరని నీ సాంగత్యపు
దాహంతో ఒంటరినై బతికేస్తున్నాను.
- శివ భరద్వాజ్
9, అక్టోబర్ 2023, సోమవారం
పిల్లల సందడి
గణ గణ మని గంటలు మోగెను
జనగణమన పిల్లలు పాడెను
త్వర త్వరగా బ్యాగులు సద్దెను
బిల బిల మని బయటకువచ్చెను
గభ గభమని ఇంటికి వచ్చెను
గల గలమని నవ్వులు నవ్వెను
టక టకమని గంతులు వేసెను
అబ్బబ్బయని అమ్మలు అరిచెను
చిటపటమని చినుకులు కురిసెను
టపటపయని డాన్సులు చేసెను
సరసరమని అమ్మలు వచ్చెను
సురసురమని చూపులు రువ్వెను
మెలమెల్లగా పిల్లలు వచ్చెను
యేడియేడిగా బజ్జీలొచ్చెను
కరకరమని అందరు తినెను
అమ్మను పొగుడుతూ పిల్లలు పండెను
నాన్నలు నవ్వుతూ అమ్మల చూసెను
-శివ భరద్వాజ్
7, అక్టోబర్ 2023, శనివారం
జీవితం వర్ణ మయం - ఎండుటాకులా రాలిపోతావో - ఇంద్ర ధనస్సులా శోభిస్తావో
తెల్లని ముఖమున్ననేమి సుఖము
నల్లని మనసున్న నిను మించిన వికారి ఎవడు?
నవనవలాడే వంకాయలా గలగల కాసులున్న గాని,
బీదల యెడ ఉదారత చూపక పుచ్చువంకాయల మిగలకు,
విచారంతో పీనుగ నీలం పొందిన నీ ముఖం చూసుకో,
ఈర్ష్య ద్వేషాలతో పచ్చటి బతుకుని పాడు చేసుకుంటూ,
పసుపు పచ్చని నీ జీవితాన్ని ఎండిపోనీయకు.
శిశిరపు వేళ పచ్చటి ఆకు కూడా నారింజరంగు పొంది రాలవలిసిందే!
బలవంతుడవని ఇతరుల ఎర్రటి రక్తం కళ్ల చూస్తే,
నీ శిశిరపువేళ పిల్లగాలికే రాలిపడి ముగుస్తుంది నీ జీవితం.
నల్లని ముఖమున్నంత మాత్రాన విచారమెందుకు?
తెల్లని మనసున్న నిను మించిన సుందరుడెవడు!
పుచ్చులేని వంకాయలా వంకలేని రారాజులా బతుకు,
అంతర్ముఖుడవై నీలోకి నీవు పయనించు, ఉదారత చూపించు,
కారుణ్య నీలపు కాంతులు సర్వ జీవులయెడ ప్రసరించు,
పచ్చటి ప్రకృతితో మమేకమై జీవించు,
పసుపు పచ్చగా అందరి ఇల్లు సంతోషాలతో నిండి పోవాలని,
ఉదయించే నారింజ సూర్యుని శక్తి పొంది, ఉరికే జలపాతమై,
ఎర్రటి గులాబీలా నీ ప్రేమ అందరికీ అందించు.
ఇంద్రధనస్సులా ఉత్సాహం నింపుతూ కలకాలం జీవించు.
-శివ భరద్వాజ్
6, అక్టోబర్ 2023, శుక్రవారం
మధుర భావన
*మధుర భావన*
ఉదయపు తలుపులు తెరవగానే,
ఎర్రటి సూర్యుని పలకరింపు
ఒక మధుర భావన.
వర్షపు చినుకులు తడపగానే
నేల గుభాళింపు
ఒక మధురమైన వాసన.
ఉదయపు నడకన చెలిని చూడగానే,
తనువు పులకరింపు,
ఒక చక్కనైన భావన.
-శివ భరద్వాజ్
4, అక్టోబర్ 2023, బుధవారం
వాడే, వాడు కలలుగన్న లక్ష్యాలు సాధించగలడు.
నిశ్శబ్ద నిశీధి అంతరంగంలోకి చూస్తూ
నిశ్చల జలధి మధ్యలో నిల్చొని ఉన్నా
ఆశగా, ధైర్యంగా కలలు కన్న మానవుడు
నిరాశ నిస్పృహలో కూరుకుపోయినపుడు
ఆశ్చర్యంగా, భయపడుతూ కలలు
నిజంగా నిజమవుతాయా అని సందేహిస్తూ,
నడిచే శవమై మిగులుతాడు
తానున్న చోటే సమాధి అవుతాడు
ఏ ప్రయత్నం లేకుండా, శిలలా నిలబడితే
లక్ష్యం, విజయం, విప్లవం అని అరిస్తే
అది తిరిగి ప్రతిధ్వనిస్తుంది తప్ప
మరేది తిరిగి ప్రతిఫలంగా లభించదు.
కానీ ఎవడైతే ఆ ఎడతెగని నిశ్శబ్దాన్ని ఛేదించి
దాని మెడలు వంచి, ఆలోచన దారాలను
అల్లెతాడుగా పెనవేయగలడో,
తన ప్రయత్నాలను ముడి వేసి విల్లుగా మార్చగలడో,
అంతులేని ఆత్మ స్థైర్యంతో ఎక్కుపెట్టగలడో
వాడే, వాడు కలలుగన్న లక్ష్యాలు సాధించగలడు.
-శివ భరద్వాజ్
మహా శివ రాత్రి : శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?
శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగివున్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి? తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమ...
-
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు మాయెడల దయ చూపు ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
కరోనా సంతోషం కలిగించింది జనాలను నిలువు దోపిడి చేస్తున్న వైద్యాలయాలకు టీకాల తో వ్యాపారం చేస్తున్న మందుల కంపెనీ లకు మందులను బ్లాక్ మార్కెట్ చ...