7, అక్టోబర్ 2023, శనివారం

జీవితం వర్ణ మయం - ఎండుటాకులా రాలిపోతావో - ఇంద్ర ధనస్సులా శోభిస్తావో

 

తెల్లని ముఖమున్ననేమి సుఖము
నల్లని మనసున్న నిను మించిన వికారి ఎవడు?
నవనవలాడే వంకాయలా గలగల కాసులున్న గాని,  
బీదల యెడ ఉదారత చూపక పుచ్చువంకాయల మిగలకు,
విచారంతో పీనుగ నీలం పొందిన నీ ముఖం చూసుకో,
ఈర్ష్య ద్వేషాలతో పచ్చటి బతుకుని పాడు చేసుకుంటూ,
పసుపు పచ్చని నీ జీవితాన్ని ఎండిపోనీయకు.
శిశిరపు వేళ పచ్చటి ఆకు కూడా నారింజరంగు పొంది రాలవలిసిందే!
బలవంతుడవని ఇతరుల ఎర్రటి రక్తం కళ్ల చూస్తే,
నీ శిశిరపువేళ పిల్లగాలికే రాలిపడి ముగుస్తుంది నీ జీవితం. 


నల్లని ముఖమున్నంత మాత్రాన విచారమెందుకు?
తెల్లని మనసున్న నిను మించిన సుందరుడెవడు!
పుచ్చులేని వంకాయలా వంకలేని రారాజులా బతుకు,
అంతర్ముఖుడవై నీలోకి నీవు పయనించు, ఉదారత చూపించు,
కారుణ్య నీలపు కాంతులు సర్వ జీవులయెడ ప్రసరించు,
పచ్చటి ప్రకృతితో మమేకమై జీవించు,
పసుపు పచ్చగా అందరి ఇల్లు సంతోషాలతో నిండి పోవాలని,
ఉదయించే నారింజ సూర్యుని శక్తి పొంది, ఉరికే జలపాతమై,
ఎర్రటి గులాబీలా నీ ప్రేమ అందరికీ అందించు.
ఇంద్రధనస్సులా ఉత్సాహం నింపుతూ కలకాలం జీవించు.

-శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మహా శివ రాత్రి : శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?

శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగివున్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి?             తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమ...