1, మార్చి 2022, మంగళవారం

శివుడు - Big Bang Theory - శివ రాత్రి మహత్యం

శివుడు - Big Bang Theory - శివరాత్రి మహత్యం


శివ అంటే "లేనిది"  లేక "శూన్యము" లేక "కల్మషం లేనిది" లేక "అస్తిత్వం లేనిది" అని వివిధ గురువులు అర్ధాలు చెప్పారు. ఏది ఉన్నదో దానిని కల్మషం అంటటానికి ఆస్కారం ఉన్నది, ఏది లేదో దానికి ఏ కల్మషము అంటదు. కానీ అది అంతటా ఉన్నది. అదే శూన్యము. అది పరమాణువులో ఉంది, ఈ అనంత విశ్వంలో ఉంది. శూన్యము లోనే ఈ విశ్వమంతా విస్తరించి ఉంది, ఈ విశ్వములోను శూన్యముంది, ప్రతి జీవ, నిర్జీవములలో ఉంది. విశ్వమంతా శూన్యము నుండి పుట్టి శూన్యం లొకే వీలీనమైపోతుంది అని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అభిప్రాయ పడుతున్నారు! వేదాలలో చెప్పబడిన ఈ జ్ఞానం  మరల ఇప్పుడు వారి ద్వారా చెప్పబడుతుంది.  శివుడు ఆద్యంత రహితుడు అని శివరాత్రి కధ మనకు వివరిస్తున్నది. సృష్టికర్త(బ్రహ్మ) మరియు స్థితికర్త(విష్ణువు) ఇరువురు కూడా శివుని యొక్క ఆది అంతములు తెలుసుకోలేకపోయారు. శూన్యంలోకి జ్ఞానమనే వెలుగురూపమున పరమ శివుడు విస్తరిస్తున్న కొలది అది విస్తరిస్తునే ఉంటుంది. దీనిని లోతుగా పరిశీలిస్తే మనకు అసలు విషయం అర్ధమవుతుంది, మానవ పరిమితి బోధపడుతుంది. ఎవరైతే అంతా తానే సృష్టించాననుకున్నాడో అతను, ఎవరైతే అంతా తానే పోషిస్తున్నాను, నడిపిస్తున్నాను అనుకుంటున్నాడో అతను ఇద్దరు కూడా లయము(నశించిన )తరువాత ఏమి జరుగుతుందో తెలుసుకోలేక పోయారు. ఎందుకంటే నశించిన పిమ్మట మిగిలేది శూన్యము.  మరి శూన్యానికి ఆది అంతము ఎక్కడ ఉంటుంది. అలాగని శూన్యము లేదని అనలేము. మనము లేదన్న శూన్యం ఉండకుండా పోదు. శూన్యానికి ఆది అంతములు లేవు, ఆది అంతటా ఉంది అందుకే బ్రహ్మ విష్ణువులు అహంకారం తో ఉన్నప్పుడు ఆది అంతములు రెండు కనుగొనలేక పోయారు. ఎంత దూరం పయనించిన శివ(శూన్యం) స్వరూపం కనిపిస్తూనే ఉన్నది. ఇప్పుడు మానవుడు కూడా అదే అజ్ఞానంలో ఉన్నాడు. తానూ సృష్టిస్తున్నాను అనుకొంటున్నాడు. తన పోషణ తాను చేసుకోగలుగుతున్నాను అనుకొంటున్నాడు. తన పరిమితి తనకు తెలియటం లేదు. అందుకు అత్యుత్తమ ఉదాహరణ ప్లాస్టిక్. ఎప్పుడైతే అహంకారం పోతుందో అప్పుడు నీ లోనే ఉన్న శూన్యాన్ని, శివుడ్ని కనుగొనగలవు. అప్పుడు అంతా నీవేనని, అందరూ శివ స్వరూపమని తెలుసుకోగలవు.

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||


పూర్ణము అంటే శూన్యము అని మరొక అర్ధము.  దానిని పై శ్లోకానికి అన్వయించి చూస్తే

"అది శూన్యము ఇది పూర్ణము. శూన్యము నుండి పూర్ణము పుట్టింది. అలాగే శూన్యము నుండి పూర్ణము తీసివేస్తే మిగిలేది శూన్యమే"

ఏది వ్యక్తమవుతుందో అది పూర్ణము, ఏది అవ్యక్తమో అది శూన్యము. అవ్యక్త శూన్యము నుండి వ్యక్తమగు పూర్ణ స్వరూపమైన ఈ సకల చరాచర జగత్తు పుట్టింది. ఈ జగత్తు చివరికి మరలా అవ్యక్త  శూన్యములోకి విలీనమై పోతుంది.

అందుకే శివుడు అంతటా ఉన్నాడు. కావున సర్వాంతర్యామి. వ్యక్త రూపమున(ప్రకృతి, పార్వతి, విష్ణువు ముగ్గురు ఒక్కటే) అలాగే అవ్యక్త రూపమున(శివుడుగా )ఉన్నాడు , అందుకే శివ కేశవుల బేధము లేదన్నది. అలాగే పార్వతి దేవి శివుడిలో సగంగా అర్ధనారీశ్వర తత్వం చెపుతున్నది. శివుడు లేని ప్రదేశం లేదు. అవ్యక్తమగు శివునికి ఏ విధమైన కల్మషము అంటదు. శూన్యమునకు ఏ గుణము ఉండదు కనుక ఆయన త్రిగుణాతీతుడు అయ్యాడు. శూన్యమునుండే సర్వం పుట్టింది కనుక ఆయనకు జన్మా లేదు, తల్లిదండ్రులు లేరు.


--శివ భరద్వాజ్
భాగ్యనగరం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మహా శివ రాత్రి : శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?

శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగివున్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి?             తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమ...