30, సెప్టెంబర్ 2024, సోమవారం

మంచి పంచిన నువు! మంచి వచ్చు కదరా!

 *మంచి పంచిన నువు!  మంచి వచ్చు కదరా!*

ఆటవెలది:

చర్యకు ప్రతిచర్య  సమముగా యుండును,
నీవు ఇచ్చినదది తిరిగి వచ్చు,
మంచి పంచిన నువు!  మంచి వచ్చు కదరా!
శివ కుమారు మాట సిరుల మూట!

-శివ భరద్వాజ్

 

*మారు జీవితము, భవితయు  నిజముగాను*

ఆటవెలది:

జరుగుతున్న దానినంగీకరించుడు,
వదలివేయుడు మరి జరిగినదియు,
తగిన మార్పు చేసి కర్మచేసిన, మారు
జీవితము, భవితయు  నిజముగాను! 

-శివ భరద్వాజ్

26, సెప్టెంబర్ 2024, గురువారం

🔱 అంతర్యామి 🔱

 🔱 అంతర్యామి 🔱

# జన జీవన సుధా...

🍁భారతీయ సమాజంలో రామాయణం గురించి
తెలియని వారుండరు. ఈ కావ్యాన్ని విని, చదివినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. అందులోని విలువలను అర్థం చేసుకొని పాటించినప్పుడే మన ప్రవర్తనలో పరివర్తనకు అవకాశం ఉంటుంది. రామాయణంలో నాయక పాత్రల్ని గుర్తుచేసుకొంటే ఏదో తెలియని  ఉత్తేజం, ఉల్లాసం ఎగిసిపడతాయి. వారిపట్ల ఆరాధనాభావం కలుగుతుంది. కానీ ప్రతినాయకుల్ని గుర్తుచేసుకొంటే ఆవేశం పెల్లుబికి వారిపట్ల ప్రతీకార, తిరస్కార భావాలు ఏర్పడతాయి. మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే విచక్షణా జ్ఞానం అందరిలోనూ ఉంటుంది. కాకపోతే తనలో ఉన్నవన్నీ నాయకుడి లక్షణాలే, ప్రతినాయకుడి గుణాలు మచ్చుకైనా లేవని ఎవరికివారు భావిస్తుంటారు. ఎదుటి వాణ్ని మాత్రం ప్రతినాయకుడిగా ఊహించడం చాలామందిలో ఉన్న దుర్గుణం. ఈ తత్త్వం మనిషి ఎదుగుదలకు అడ్డుగోడ వంటిది. ప్రతి ఒక్కరిలోనూ రెండు రకాల గుణాలూ ఉంటాయి. నాయకుడి గుణాలు బయటికొస్తే ప్రశంసలు కురుస్తాయి. ప్రతి నాయకుడి లక్షణాలు విజృంభిస్తే అరాచకం, అశాంతి నెలకొంటాయి..

🍁రామాయణాన్ని మంధర మలుపు తిప్పింది. మాయమాటలతో కైక మనసు విరిచింది. కేవలం మంధర వక్రబుద్ధే రాముణ్ని అడవులకు పంపి, దశరథుడి ప్రాణాలు తీసింది. వ్యక్తిలోని దుర్గుణాలు బయటికి వచ్చాయంటే ఊహకు అందని విషవలయం ఏర్పడి అపార్థాలు సృష్టిస్తుంది. మంధరలా మాట్లాడేవారు సమాజంలో చాలామంది ఉంటారు. అయోధ్యకు తిరిగొచ్చిన భరతుడు జరిగినదంతా తెలుసుకుని కోపంతో తల్లిని దూషించాడు. తిన్నగా రాముడి దగ్గరికెళ్లి అయోధ్యకు తిరిగి రమ్మని బతిమలాడాడు. చివరికి పాదుకల్ని తీసుకెళ్ళి పట్టాభిషేకం చేసి అధికారానికి, కీర్తి ప్రతిష్ఠలకు అతీతుడినని నిరూపించుకొన్నాడు. ఇవన్నీ చూసి భరతుణ్ని కొనియాడుతున్నామే కానీ ఆయన ఆదర్శభావాలను మనం ఎంతవరకు ఆచరించగల్గుతున్నాం?

🍁రామలక్ష్మణులను చూసి శూర్పణఖ మోహించింది. వారు తిరస్కరించారు. అందుకామె తన అన్న రావణుడితో వారిపై లేనిపోనివన్నీ కల్పించి చెప్పింది. ఫలితంగా యుద్ధం జరిగి రావణుడు మరణించాడు. రావణుడు సీతమ్మను తీసుకువెళ్తుండగా జటాయువు అడ్డుపడి అతడితో పోరాడి అసువులు బాసింది. నేటి సమాజంలో పట్టపగలే ఆడపడచుల పట్ల అకృత్యాలు, అత్యాచారాలు జరుగుతుంటే చూస్తూ వెళ్లిపోతుంటారు చాలామంది.

🍁ప్రతి వ్యక్తి తన జీవితంలో ప్రేమ, దయ, నిస్వార్థం, త్యాగం, పరోపకార గుణం అనే ఐదు దైవీ గుణాలను అలవరచుకొని మంచి మార్గాన ముందుకెళ్లాలి. క్రూరత్వం, కపట స్వభావం, నిర్దయ, స్వార్ధ బుద్ధి వంటి అసుర గుణాలను దరిచేరనివ్వకూడదు. మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో రామాయణ • పాత్రలు చక్కగా చెప్పాయి. ఈ కావ్యం బోధించిన జీవన విలువల్ని అర్థం చేసుకొని పాటించగలిగితే మానవజన్మ ధన్యం.🙏

- ✍️యం.సి. శివశంకర శాస్త్రి

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

నీ దాసుడనే ఈశా.. సదా నా ఎదలో నీ ధ్యాస..

నీ దాసుడనే ఈశా.. సదా నా ఎదలో నీ ధ్యాస..

 
ఆటవెలది:


ఆది మధ్యాంత రహితుడౌ ఆత్మభవుని
యోగ సంభోగ సహితుడా జంగముడిని
వేద విజ్ఞాన విహితమౌ విదితమునిని
విశ్వసాహితి శరణని వినతులిడగ..!!

- విశ్వసాహితి

***************

విశ్వ గురుని వేడ విద్యలొసగు

ఆటవెలది:

మొదలు తుదియు లేని మొదటి యోగి యతడు,
జగము నేలు జంగమాతడు, చిరు
నగవు మౌన మునియు, జ్ఞాన మిచ్చెడివాడు,
విశ్వ గురుని వేడ విద్యలొసగు.

-శివ భరద్వాజ్

24, సెప్టెంబర్ 2024, మంగళవారం

గోదావరిపిలిచింది!

 గోదావరిపిలిచింది!
                 ➖➖➖✍️

‘ఇంత చదువూ చదివించింది #ఇండియాలో పనిజేయటానికా?’

‘ఏమయ్యా, గురజాడ అప్పారావుగారి ఇల్లు చూశావా?’ అని అడిగాడు దక్షిణామూర్తి.

దానికా అబ్బాయి... ‘#అప్పారావుగారంటే ఎవరండీ?’ అని ఎదురడిగాడు.

అవును, బీటెక్‌ చదివిన ఆ కుర్రాడికి గురజాడ అప్పారావు అవసరం ఏముందీ?
*****

*ఇక కథ లోకి వెళదాం...

కొత్తగా పెళ్లైన కూతుర్నీ అల్లుడినీ అన్నవరం సత్యనారాయణస్వామి దర్శనం చేయించి,భోజనాలయ్యేసరికి ఒంటిగంటయింది. కొత్త దంపతుల్ని వెంటబెట్టుకుని కారెక్కారు దక్షిణామూర్తి దంపతులు.

ఆ సమయంలో దక్షిణామూర్తికి తన పెళ్ళి జ్ఞాపకానికొచ్చింది. అప్పుడు కూడా ఇలాగే పెళ్లైన వెంటనే అన్నవరం తీసుకొచ్చి దర్శనం చేయించారు అమ్మా, నాన్న.
ఆ మాటకొస్తే దక్షిణామూర్తే కాదు, గోదావరి జిల్లాలో ఏ ఇంట్లో పెళ్ళయినా కొత్త జంట మొదటగా చేసేది సత్యనారాయణస్వామి దర్శనం.

కారు నేషనల్‌ హైవే మీద పరిగెడుతోంది. చుట్టూ పచ్చదనం కమ్ముకున్న పొలాలూ, దూరంగా పచ్చదుప్పటి కప్పుకున్నట్లున్న కొండలూ గజిబిజిగా వేగంగా కనుమరుగవుతున్నాయి. దక్షిణామూర్తి కడుపు నిండింది, మనసు మాత్రం వెలితిగా ఉంది. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.

ఈమధ్యనే అమ్మాయి పెళ్ళి చేశాడు. అల్లుడికి అమెరికాలో ఉద్యోగం. మంచి స్థితిమంతుల కుటుంబం. భార్య తరఫు బంధువుల ద్వారా వచ్చిన సంబంధం అని, మరో ఆలోచన లేకుండా పెళ్ళి జరిపించాడు. ఒక వారంరోజుల్లో కూతురూ అల్లుడూ అమెరికా వెళ్ళిపోతారు.
తనసలు చుట్టుపక్కల మంచి సంబంధం చూసి చేద్దామనుకున్నాడు-మంచీ చెడ్డా కళ్ళెదురుగుండా ఉంటే బావుంటుందని!

భార్య పట్టుపడితే కాదనలేక ఒప్పుకున్నాడు.

అప్పటికీ ఉండబట్టలేక నిశ్చితార్థమప్పుడు వియ్యంకుడితో అనేశాడు.. “మీకు పది తరాలకూ తరగని ఆస్తి- అబ్బాయి పదేళ్ళుగా అమెరికాలో సంపాదించుకున్నాడు. నాకూ ఒక్కగానొక్క కూతురు. నాదంతా నా కూతురికే. ఇంకా అమెరికా దేనికంటారూ! ఇక్కడే ఉండమని చెప్పకూడదా బావగారూ” అని.

‘ఇంత చదువూ చదివించింది ఇండియాలో పన్జేయటానికా?’ అని రాచనాగు లేచినట్టు లేచింది వియ్యపురాలు.

ఇంకేం చేయాలో తోచక అన్యమనస్కంగానే నిశ్చితార్థం కానిచ్చేశాడు దక్షిణామూర్తి.

1960లలో చెన్నైలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాడు దక్షిణామూర్తి. తల్చుకుంటే ఆ రోజుల్లోనే మంచి ఉద్యోగంలో సెటిలైపోయేవాడే. కానీ, సొంతగడ్డ మీద మమకారం, ఏం చేసినా మన వూరికే చేయాలనే సంకల్పం అతన్ని సొంత వూళ్ళోనే స్థిరపడేలా చేశాయి. స్వగ్రామంలోనే వ్యవసాయ పనిముట్లు తయారుచేసే ఇంజినీరింగ్‌ వర్క్‌షాప్‌ ప్రారంభించాడు. తన చదువునంతా సొంత గడ్డకే ఉపయోగించాడు. తండ్రి ఇచ్చిన పదెకరాల పొలం పాతికెకరాలకు పెంచాడు. చుట్టుపక్కల వాళ్ళందరికీ తల్లో నాలుకై   వూరికి పెద్దదిక్కుగా మారాడు. అందరూ పిల్లల్ని ఇంజినీర్లూ డాక్టర్లూ లేదా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా చూడాలనుకుంటే దక్షిణామూర్తి మాత్రం తన కూతుర్ని అగ్రికల్చరల్‌ బిఎస్సీ చేయించాడు. మన రైతుల కోసం ఏదైనా చేయాలని నూరిపోశాడు.

కానీ, పిల్ల పెళ్ళిచేశాక మన చేతుల్లో విషయం కాదు కదా! మనకి ఒంట్లో బాగుండకపోతే మన బిడ్డ మన దగ్గరుండదు. మనం బెంగపడితే మన కంటికి కనపడదు.
ఈ అమెరికాకి మన పిల్లలు తప్ప దిక్కులేదా?
మన పిల్లలకి అమెరికా తప్ప దారిలేదా? మంచి జీవనం కోసం కొంత డబ్బు చాలు. కొంత డబ్బు కోసం మొత్తం జీవితాలే మారిపోవాలా?
వేల మైళ్ళు ఏళ్ళకు ఏళ్ళు దూరమైపోవాలా?

“కడియంలో కాసేపు ఆపాలయ్యా” డ్రైవర్‌కి చెప్పి కారాపించాడు.
వియ్యపురాలు ఏవో పూలమొక్కలు కొనుక్కుంటానంది మరి.

కడియంలో కారాగింది. అందరూ దిగారు. అదొక పూలస్వర్గం.
వియ్యపురాలు ఎప్పుడూ చూడలేదేమో తెగ సంబరపడిపోయింది. రంగురంగుల పూలూ... ఒకటా రెండా వందల రకాల పువ్వులు తివాచీ పరిచినట్టు ఎరుపూ, పసుపూ, నీలం, తెలుపు గులాబీలూ, చామంతులూ అదొక పూల సామ్రాజ్యం.

కారు ధవళేశ్వరం బ్యారేజ్‌ సమీపించింది.   “నాన్నా, కాటన్‌ మ్యూజియంకి వెళ్దాం” దక్షిణామూర్తి కూతురు అంది.

“సాయంత్రం అయింది. చీకటిపడేలా ఉంది. ఇప్పుడు మ్యూజియం అంటావేవిఁటే! ఇంటికెళ్ళాక బోలెడు పనుంది. తర్వాత చూద్దాంలే! అయినా చూడ్డానికేవుందీ? మీ నాన్నా, నువ్వూ ఎప్పుడూ చూసేది అదే కదా!” అంది దక్షిణామూర్తి భార్య హైమ.

“అదికాదమ్మా, ఆయనకి ఒకసారి చూపిద్దామని!” కూతురనేలోగా దక్షిణామూర్తి కారు దిగాడు.

ధవళేశ్వరం వచ్చినప్పుడల్లా దేవుడి గుడికెళ్ళినట్టు కాటన్‌ మ్యూజియానికి వెళ్ళక మానడు.

బ్రిడ్జ్‌ పక్కనే ఉన్న పదడుగుల విగ్రహం చూసి అల్లుడు కిరణ్‌ అడిగాడు- “అది ఎవరి విగ్రహం మామయ్యగారూ?” అని.

హైదరాబాద్‌లో పెరిగి, అమెరికాలో పనిజేసేవాళ్ళకి కాటన్‌ గురించి తెలియదు కదా!
చానాళ్ళక్రితం ఒకసారి ట్రెయిన్‌లో వస్తుండగా విజయనగరం కుర్రాడు తగిలాడు. ‘ఏమయ్యా, గురజాడ అప్పారావుగారి ఇల్లు చూశావా?’ అని అడిగాడు దక్షిణామూర్తి.

దానికా అబ్బాయి... ‘అప్పారావుగారంటే ఎవరండీ?’ అని ఎదురడిగాడు.

అవును, బీటెక్‌ చదివిన ఆ కుర్రాడికి గురజాడ అప్పారావు అవసరం ఏముందీ? విజయనగరంలో పుట్టి, విజయనగరంలో పెరిగినవాడికి గురజాడ అప్పారావంటే తెలియకపోగాలేందీ, హైదరాబాద్‌లో పెరిగి అమెరికాలో సెటిలైనవాడికి కాటన్‌ తెలియకపోవడంలో తప్పేంలేదనుకున్నాడు దక్షిణామూర్తి.

మ్యూజియం ముందుభాగంలో 1840సం. లలో ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించిన యంత్రాలూ, పనిముట్లూ, వాహనాలూ ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా లండన్‌ నుంచి కాటన్‌ తెప్పించారు.

కొంచెం ముందుకువెళ్తే డెల్టాలో 10 లక్షల ఎకరాలకు నీరందించే గొప్ప ప్రాజెక్టును కేవలం 5 సంవత్సరాల్లో పూర్తిచేసిన “కర్మయోగి ద గ్రేట్‌ సర్‌ సి.ఆర్ధర్‌ కాటన్.”
ఆ రోజుల్లో నివాసం ఉన్న బంగ్లా! దానినే ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. లోపలికెళ్ళాక ప్రాజెక్టు వివరాలూ, ఫొటోలూ, చిత్రాలూ ఒక్కొక్కటీ వివరించి చెబుతోంది కూతురు- అల్లుడికి. అల్లుడు చాలా ఆసక్తిగా వింటున్నాడు.

“ఆ రోజుల్లో అంటే 183 ఏళ్ళక్రితం ఇక్కడ తినటానికి వరి లేదు. ఇంట్లో పెళ్ళయితేనో    లేదంటే శుభకార్యాలప్పుడో మాత్రమే వరి అన్నం. మామూలు రోజుల్లో జొన్నసంకటే. గోదారికి వరదొస్తే అడ్డే లేదు. కరవూ కాటకాలూ, జనాభా క్షయం..! ఇదే ఆనాటి డెల్టా పరిస్థితి.

అప్పుడే కాటన్‌ అనూహ్య ప్రవేశం.

ప్రాజెక్ట్‌ కట్టి, ప్రజల కన్నీళ్ళు తుడవటం అనేది నిజానికాయన పనికాదు. కేవలం ఈ ప్రాంత ‘పన్ను వసూలు అధికారి మాత్రమే!’ కానీ, కష్టం నష్టం తెలుసుకున్నాడు. కంపెనీకి నచ్చజెప్పాడు. అయిదేళ్ళంటే అయిదేళ్ళలోనే అంచనా వ్యయంలోపే ఖర్చుపెట్టి రూ.4,75,572/- లతో పని పూర్తిచేసి చూపించాడు!”... దక్షిణామూర్తి చెప్పుకుంటూ పోతున్నాడు.

“మన వూళ్ళో పుట్టలేదు, మన దేశమే కాదు, మన భాష కాదు, మన మనిషే కాదు... అయినా మనకోసం పదిలక్షల ఎకరాలకు నీరిచ్చి మనకింత అన్నం పెట్టిన ఆ దేవుడు చేసిన దాంట్లో వందోవంతు మన నాయకులూ మన విద్యావంతులూ ఏదో ఒక రంగంలో కృషిచేస్తే మనదేశం ఇలా ఉంటుందా బాబూ?” అల్లుడితో అన్నాడు దక్షిణామూర్తి.

ఇంటికెళ్ళేసరికి రాత్రి ఎనిమిది గంటలయింది. అల్లుడు ఏదో ఆలోచనలతో ఉన్నట్టున్నాడు. ‘నా మాటలు విసుగనిపించాయో ఏమో’ అనుకున్నాడు దక్షిణామూర్తి.

మర్నాడు అల్లుడూ కూతురూ బయల్దేరారు. చీరా, సారె, కానుకలూ అన్నీ సర్ది పక్కన పెట్టారు. పెళ్ళి ఫొటోలు వచ్చాయి. చూసుకున్నారు. వీడియో కూడా చూశారు. సాయంత్రమే ట్రెయిన్‌ ఎక్కటం. అనుకున్న సమయం రానే వచ్చింది. సాయంత్రం అయిదు గంటలయింది. అల్లుడూ కూతురూ రెడీ అయ్యారు. దక్షిణామూర్తికీ, భార్య హైమకీ కాళ్ళకు నమస్కారం చేశారు. హైమ కూతుర్ని పట్టుకుని బావురుమంది. వియ్యపురాలు ఓదార్చింది. ఆరున్నరకి రాజమండ్రిలో ట్రెయిన్‌ ఎక్కించారు.
“వెళ్ళొస్తాం మామయ్యగారూ!”అల్లుడు చేతిలో చెయ్యేసి నొక్కుతూ చెప్పాడు.

“సరే, జాగ్రత్త!  హైదరాబాద్‌లో దిగగానే ఫోన్‌ చేయండి.” కళ్ళు చెమరుస్తుండగా గద్గదస్వరంతో అన్నాడు.

ట్రెయిన్‌ కదిలింది. చెయ్యూపి ఇంటికి బయల్దేరారు దక్షిణామూర్తి దంపతులు.

దక్షిణామూర్తి రొటీన్‌లో పడిపోయాడు... తన వ్యవసాయం, వర్క్‌షాప్‌ పనీ, ఊరి పనీ. క్షణం తీరిక లేకపోవటంతో కూతురి బెంగమాట అటుంచి కూతురి గురించే మరిచిపోయాడు. మళ్ళీ వాళ్ళు తిరిగి స్వదేశం వస్తారని ఆశలేదు కాబట్టి, బాధ కూడా లేదు దక్షిణామూర్తికి.

సరిగ్గా పదిరోజుల తర్వాత ఒక ఫైన్‌ మార్నింగ్‌ హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్న దక్షిణామూర్తి, భార్య హైమ పిలుపుతో లోపలికెళ్ళాడు “ఏమండీ, అమెరికా నుంచి అమ్మాయి ఫోను...!”
దక్షిణామూర్తి ఫోనందుకున్నాడు.
“నాన్నా, బావున్నారా?”
“బావున్నానమ్మా. నువ్వూ, కిరణ్‌ ఎలా ఉన్నారు?”
“ఫైన్‌ నాన్నా. ఆయన నీతో ఏదో మాట్లాడతారట నాన్నా...”
ఫోన్‌ అల్లుడికిచ్చింది.

“మామయ్యగారూ బావున్నారా?”
“బావున్నాను. మీరిద్దరూ ఎలా ఉన్నారు? అమ్మాయికి అక్కడ అలవాటయిందా? ఇబ్బంది ఏమీ లేదు కదా?”
“అదేంలేదు మామయ్యా. మరి మీతో ఓ విషయం చెప్పాలి మామయ్యా”మాటల్లో ఏదో తటపటాయింపు.
“చెప్పు కిరణ్‌, ఫర్వాలేదు!”
“నేను ఇండియా వచ్చేద్దామనుకుంటున్నా మామయ్యా. రాజమండ్రిలోనే నలుగురైదుగురు ఫ్రెండ్స్‌ కలిసి సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెడదామని అనుకుంటున్నాం. ఇక్కడ రిలీవ్‌ కావటానికి ఇంకో మూణ్ణెల్లు పడుతుంది. ఈలోపు అక్కడ ఏర్పాట్ల విషయంలో మీ సహాయం కావాలి...!” కిరణ్‌ చెబుతున్నాడు.

దక్షిణామూర్తికి ఎగిరి గంతేయాలనిపించింది…”అలాగే అల్లుడూ. మన ఊరు వచ్చి, మన వూళ్ళో బిజినెస్‌ చేసి, మనవాళ్ళకే ఉద్యోగాలిస్తామంటే అంతకంటే కావాల్సిందేముంది. నేనేం కావాలన్నా చేస్తాను.” సంతోషంగా అన్నాడు.
“థాంక్స్‌ మామయ్యా..!”

“సరే కానీ కిరణ్‌, పెళ్లైన నెలలోపే ఇండియా వచ్చేయాలని ఎలా అనుకున్నావు, చాలా ఆశ్చర్యంగా ఉందే!” దక్షిణామూర్తి నవ్వుతూ అన్నాడు.

“మనదేశం కాదు, మన భాషా కాదు, మన మనిషే కాదు... అయినా మన నేలకు   కాటన్‌ చేసినదాంట్లో వందో వంతైనా చేయాలి కదా, మామయ్యా! మీరు మీ ఊరికి చేసిన దాంట్లో పదో వంతైనా చేయాలి కదా!"

దక్షిణామూర్తికి ఆ మాటలు వింటుంటే ఏమీ కన్పించట్లేదు.
గోడమీద ‘కాటన్‌’ ఫొటో నవ్వుతూ కనపడింది.
‘నీ మంచి మనసుతో మా డెల్టానే కాదు... నా అమెరికా అల్లుణ్ణి కూడా మార్చేశావా! కాటన్‌ దొరా...  !!
నీకు కోటి నమస్కారాలు’ అనుకున్నాడు దక్షిణామూర్తి మనసులో.

దూరంగా గోదావరి నింపాదిగా, నిర్మలంగా సాగిపోతోంది...
తన బిడ్డల్ని ఎక్కడికో కాకుండా తన ఒడి చెంతే ఉండమని పిలుస్తోంది మౌనంగా...✍️
#Proud_Be_An_Indian
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

23, సెప్టెంబర్ 2024, సోమవారం

🔱 అంతర్యామి 🔱 - మానసిక గాయానికి మందు...

 🔱 అంతర్యామి 🔱

# మానసిక గాయానికి మందు...

🍁ఆటలో గెలిచిన వ్యక్తికి ప్రశంస ఎంత ముఖ్యమో, ఓడిన మనిషికి ఓదార్పు అంతే అవసరం. ఓడిన వ్యక్తి తన అభ్యాసం, శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని దిగులు పడుతుంటాడు. అలాంటి సమయంలో, గెలుపు కన్నా ఓటమి ఇచ్చే అనుభవం గొప్పదని, ఆటలోని మెలకువలను మరింతగా ఒడిసిపట్టుకుని, ద్విగుణీకృత ఉత్సాహంతో పోటీపడితే విజయం తథ్యమన్న స్ఫూర్తిదాయక మాటలు చెబితే అతడి మనసు కుదుటపడి, తదుపరి పోటీకి సిద్ధమవుతారు.

🍁*విజయానికి మిత్రులుంటారు, అపజయం ఒంటరిదన్నది లోక విదితం.* పోటీ ఏదైనా ఓటమి పాలైన వ్యక్తి పట్ల మనం చూపే సంఘీభావ తత్వం అతడికి వెన్నుదన్నవుతుంది. విపత్కర పరిస్థితిలో తనకు తోడుగా నిలిచిన వారిని అతడు ఎన్నటికీ మరచిపోలేడు. జీవితమంటే కష్టసుఖాల పడుగుపేక. ఇవాళ సంతోషంగా ఉన్నాం కాబట్టి, రేపు బాధ కలగదన్న నమ్మకం లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరం ఊహించలేం. అందుకే బాధల్లో ఉన్నవారిని ఓదార్చడం, ఆదుకోవడం మానవత్వ భావనకు తొలి మెట్టుగా భావించాలి. ఆపన్నుల పట్ల ఈనాటి మన ప్రవర్తన, రేపటి మన కష్టానికి వారి సహకారాన్ని ముందస్తుగా సిద్ధం చేసుకోవడమవుతుంది.

🍁మనుషులు కొందరు అకారణంగా మాటల ఈటెలతో ఎదుటివారి మనసును గాయపరుస్తారు. శరీరానికి తగిలిన దెబ్బలా, మానసిక గాయం బయటకి కనిపించదు కానీ, ఆలోచనలను అస్థిరపరుస్తుంది. మనం ఉపశమనంగా చెప్పే నాలుగు మాటలు, వారి మనసుకు చల్లని లేపనమై ఊరడిస్తాయి.  ఒకరి ఆనందాన్ని పంచుకోకపోయినా ఫర్వాలేదు. బాధను పంచుకొని భరోసా ఇవ్వాలి. మానసిక దుర్బలులను ఒక కంట గమనిస్తూ వీలైనంతవరకు వారితో గడుపుతూ వారిలోని దైన్యాన్ని పటాపంచలు చేయాలి.

🍁కొంతమంది పరిస్థితుల ప్రభావానికి లోనై కుంగిపోతుంటారు. సమస్యలను భూతద్దంలో చూసి భయపడుతూ ఉంటారు. మాటలతో వారిలోని నైరాశ్యాన్ని పారదోలాలి. అశోకవనంలో సీత చుట్టూ శత్రు రాక్షసగణం, నా అన్నవారు లేరు. అలాంటి సమయంలో త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతం ఆ తల్లి మనసుకు ఎంతటి సాంత్వన చేకూర్చి ఉంటుందో ఊహించండి. యుద్ధానంతరం సీతమ్మతల్లి అయోధ్యకు వెళ్లినా త్రిజటను మరచిపోలేదు. విశాలంగా పరచుకొన్న రావిచెట్టుపై అనేక పక్షులు చేరినట్టు, కోపమన్నది ఎరగని, శాంత వచనాలతో సంభాషించేవారిని చాలామంది అంటిపెట్టుకొని ఉంటారు. అటువంటివారి సత్సంగమే మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది.

🍁మాటలతో ఓదార్చి ఊరటనివ్వడం భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన వరం. మాటలతో మరో మనసుకు ఉపశమనాన్ని ఇవ్వగలిగితే మానవజన్మకు ప్రయోజనం సిద్ధించినట్లే. మానవుడి నుంచి భగవంతుడు ఆశించేది అదే!

✍️-ప్రతాప వెంకట సుబ్బారాయుడు.

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

20, సెప్టెంబర్ 2024, శుక్రవారం

ప్రేమ - మరణం

మృత్యువుకు ప్రతి ఒక్కరూ భయపడతారు కానీ జనన మరణాలు సృష్టి నియమాలు. విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం. లేకపోతే, మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు.

        ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతనిని కలిసి "ఓ స్వామీ! నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి" అని అడిగాడు. అప్పుడా సన్యాసి "ఓ రాజా ! దయచేసి మీరు ఎదురుగా వున్న రెండు పర్వతాలను దాటండి.అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది. దాని నీరు త్రాగండి. మీరు అమరత్వం పొందుతారు."అని చెప్పాడు.

         రెండు పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపించింది. అతను నీరు తాగడానికి  వెళ్ళబోతున్నప్పుడు అతనికి బాధాకరమైన మూలుగులు వినిపించాయి. అతను నీరు తాగకుండా ఆ గొంతును అనుసరించాడు. చాలా బలహీనమైన వ్యక్తి ఒకడు పడుకుని నొప్పితో బాధపడుతున్నాడు. రాజు కారణం అడగగా..
        "నేను సరస్సులోని నీటిని తాగి అమరుడనయ్యాను. నాకు నూరేళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటి వేశాడు.గత యాభై ఏళ్లుగా నన్ను చూసుకునే వారు లేకుండా పడి వున్నాను. నా కొడుకు చనిపోయాడు. నా మనుమలు ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు త్రాగటం మానేశాను.అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను."

          రాజు ఆలోచించాడు... "అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి ? నేను అమరత్వంతో పాటు యవ్వనం పొందితే?" పరిష్కారం కోసం మళ్లీ సన్యాసి దగ్గరకెళ్ళి అడిగాడు. "నాకు అమరత్వంతో పాటు యవ్వనంకూడా లభించే మార్గం తెలుపండి "అని

         సన్యాసి ఇలా అన్నాడు... "సరస్సు దాటిన తర్వాత మీకు మరొక పర్వతం కనిపిస్తుంది. దాన్ని కూడా దాటండి. అక్కడ మీకు పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది, వాటిలో ఒకటి తీసుకుని తినండి. మీరు అమరత్వంతో పాటు యవ్వనం కూడా పొందుతారు."

         రాజు బయలుదేరి మరో పర్వతాన్ని దాటాడు.అక్కడ  అతనికి పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపించింది. పండ్లను తెంపి తినబోతుంటే... కొందరు గట్టిగా అరస్తూ పోట్లాడుకోవడం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచించాడు.

         నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అలా వాదించుకుంటూ ఈ మారు మూలలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు వాళ్ళని అడిగాడు. వారిలో ఒకరు "నాకు 250 ఏళ్లు, నా కుడి వైపున ఉన్న వ్యక్తికి 300 సంవత్సరాలు. అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. రాజు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు..."నా కుడి వైపున మా నాన్న వున్నాడు. అతనికి 350 సంవత్సరాల వయస్సు. అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు, నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి వున్న 400 సంవత్సరాల వయస్సు గల అతని తండ్రిని సూచించాడు. ఆస్తి కోసం  అంతులేని మా పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుండి వెళ్లగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు.

         రాజు దిగ్భ్రాంతికి గురై  సన్యాసి వద్దకు తిరిగి వచ్చి...

      "మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియచేసినoదుకు ధన్యవాదాలు" అన్నాడు.  

        అపుడు ఆ సన్యాసి ఇలా అన్నారు...

     మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది

        "మరణాన్ని నివారించే బదులు,మీ ప్రతి రోజూ, ప్రతి క్షణం సంతోషంగా జీవించండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అపుడు ప్రపంచం మారుతుంది.

18, సెప్టెంబర్ 2024, బుధవారం

మాస్టారు‌ - The Teacher

 మాస్టారు‌ - The Teacher

పడక కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకుని ఉన్నారు విద్యాసాగర్ గారు..
ఆయన రిటైరయ్యి నాలుగేళ్లు అయ్యింది...
స్వస్థలం కర్నూల్ పట్టణం..అక్కడే ఎక్కువకాలం లెక్చరర్ గా పని చేసారు.. ఎన్నో అనుభూతులు... గతం ప్రసాదించిన వరం.. ఆ అనుభూతుల్లోనికి తొంగి చూడటం అలవాటయ్యింది విద్యాసాగర్ గారికి..
ఆయనో పిజిక్స్ లెక్చరర్ ఆ రోజుల్లో.. అప్పుడు ఆయన వయస్సు పట్టుమని ముప్పై ఏళ్ళు లేవు...అప్పటికే సీనియర్ కాలేజీ లెక్చరర్... స్టూడెంట్స్ కి ఇష్టమైన లెక్చరర్ కూడా..

ఆయన పనిచేస్తున్న కాలేజీ ఒక రెసిడెన్షియల్ కాలేజీ..మొత్తం నాలుగు వందల మంది విద్యార్థులు ఉండేవారు..దాదాపుగా తొంభై శాతం విద్యార్థులు నిరుపేదలే...కష్టపడి చదివి, ఎంట్రెన్స్ పరీక్ష వ్రాసి ఉత్తీర్ణులై వచ్చిన వారే అందరూ.. నెలకు వంద రూపాయలు స్టైఫండు  ఇచ్చేవారు ప్రతి విద్యార్థికి .. అవి వారి తిండికే సరిపోయేవి...

ఇంకో రెండు రోజుల్లో దసరా పండుగ సెలవులు.. ఆ రోజు రాత్రి  పది గంటల తరువాత విద్యార్థులు ఉన్న హాస్టల్ నిరీక్షణకు వెళ్ళారు ఆయన ...ఆ కళాశాల లో పని చేస్తున్న ప్రతి లెక్చరర్ కి అదో ప్రత్యేకమైన డ్యూటీ...

హాస్టల్ లో నలభై గదులున్నాయి. రెండు వందల మంది మాత్రమే హాస్టల్ లో ఉన్నారు..మిగతా రెండు వందల మంది కాలేజీకి దగ్గర్లో ఉన్న కాలనీల లో అద్దెకు ఉండేవారు .హాస్టల్ లో ఖాళీ అయినప్పుడు వచ్చి చేరేవారు..

హాస్టల్ నిరీక్షణకు దాదాపు రెండు గంటల సమయం పట్టేది.. నలభై గదుల్లో ఉన్న విద్యార్థులు  ఎలా చదువుతున్నారో చూడాలి ..నిరీక్షణ చేస్తున్న లెక్చరర్..

నిరీక్షణ మొదలయ్యింది ఆ రోజు రాత్రి..
మధ్య మధ్యలో గదుల్లోనికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి ముందుకు కదులుతున్నారు..

8 వ నంబర్ రూము.... తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయి.. ఏవో మాటలు వినిపిస్తున్నాయి..చదువు కోకుండా ఈ మాటలేమీటీ.. అనుకుంటూనే దగ్గరగా వెళ్లి  మాటలు విన్నారు... ఆ తరువాత ముందుకు కదిలారు.. ఒక గంట తరువాత స్కూటర్ స్టార్ట్ చేసి ఇంటికి బయలు దేరారు విద్యాసాగర్ మాష్టారు...

ఆ రోజు రాత్రి చాలా సేపటి వరకూ ఆయనకు నిద్ర పట్టలేదు..

ఎప్పుడో తెల్లవారు ఝామున నిద్ర పట్టింది ఆయనకు...

టైం కి కాలేజీకి వెళ్ళడం ఆయనకు అలవాటు..
మొదటి పీరియడ్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ క్లాసుకి వెళ్ళారు...
పాఠం మొదలు పెట్టే ముందు మాములుగా అందరినీ అడిగారు .

"దసరా సెలవులు వస్తున్నాయి కదా .. ఈ పది రోజులు ఇంటికి వెళ్ళే వారు ఎందరు ? "

మొత్తం క్లాసులో ముప్పై రెండు మంది విద్యార్థులు ఉన్నారు.. ముగ్గురు తప్పించి అందరూ ఇంటికి వెళ్తున్నామని చేతులు యెత్తారు..చేతులు ఎత్తని ముగ్గురి పేర్లు ఆయనకు తెలుసు..
"హాయిగా సెలవులు గడిపి రండి..కొన్ని రోజులు కాలేజీని మరచి పొండి..."నవ్వుతూ అన్నారు ఆయన..
క్లాసు చెప్పడం మొదలు పెట్టారు..గంటన్నర తరువాత క్లాసు ముగించి స్టాఫ్ రూమ్ కి వెళ్ళారు ఆయన....

ఒక అరగంట తరువాత ప్రిన్సిపాల్ రూం లో ఉన్నారు ఆయన..

"సర్..నిన్న రాత్రి హాస్టల్ విజిట్ కి వెళ్ళాను..ఒక రూం లోనుండి విద్యార్థులు మాట్లాడుకున్న మాటలు విన్నాను.."
"సర్ ! దసరా సెలవులు కొంతమంది పిల్లలకు కష్టం కలిగిస్తున్నాయి.. కొంత మందికి తల్లి దండ్రులు లేరు..ఎవరి పంచనో ఉండి చదువుతున్నారు ఇన్నాళ్లూ..ఇప్పుడు ఇక్కడికి వచ్చారు.. ఈ సెలవుల్లో ఎక్కడికి వెళ్ళాలో వాళ్లకు అర్థం కావటం లేదు ..హాస్టల్ కూడా మూసేస్తున్నాం .. తిండి కూడా ఉండదు పిల్లలకు.. సెలవుల్లో.."
"నాదో రిక్వెస్ట్ సర్ .. హాస్టల్ తెరిచి ఉంచుదాం ..రెండువందల మందిలో కనీసం ఒక ఇరవై మంది హాస్టల్ లోనే ఉండే అవకాశం ఉంది.. వీలయితే మెస్ కూడా ఏర్పాటు చేయాలి మనం...చెప్పడం ఆగారు.. విద్యాసాగర్ గారు..

ప్రిన్సిపాల్ అంతా విని ఆశ్చర్య పోయారు.. "అయ్యో.. ఇన్నాళ్లూ ఈ విషయం నా దృష్టికి ఎవరూ తీసుకు రాలేదు..."బాధ పడ్డారు ఆయన..

ఆలోచనలో పడ్డారు  ప్రిన్సిపాల్..కాసేపటి తరువాత తేరుకుని అన్నారు..

"హాస్టల్ తెరిచి ఉంచడం కష్టం కాదు ..మెస్ ఏర్పాటు చేయడం కష్టం.. మెస్ లో పని చేస్తున్న వాళ్లకు సెలవులు ఇచ్చి తీరాలి.. ఏం చేయాలి ? .." ఆలోచనలో పడ్డారు ఆయన..

"అది పెద్ద కష్టం కాదు సర్.. దాదాపు పాతిక మంది లెక్చరర్లము ఉన్నాము..పిల్లలు మా ఇళ్ళల్లో భోజనం చేస్తారు..ఆ సంగతి నేను చూసుకుంటాను..మీరు హాస్టల్ తెరిచే ఉంచి పుణ్యం కట్టుకోండి.." బ్రతిమ లాడారు విద్యాసాగర్ గారు..

"అలాగే ..తప్పకుండా హాస్టల్ తెరిచే ఉంచుదాం...ఇక్కడే ఉండాలనుకునే విద్యార్థులు నిరభ్యంతరంగా ఉండవచ్చు సెలవు రోజుల్లో...వాచ్ మన్లు గా ఒకరిద్దర్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేద్దాం...ఇక భోజనాల సంగతి...మా ఇంట్లో కూడా నలుగురికి నేను ఏర్పాటు చేస్తాను .."అన్నారు ప్రిన్సిపాల్..

ఆయనకు నమస్కారం చేసి స్టాఫ్ రూం కి నడిచారు విద్యాసాగర్ గారు..

లంచ్ సమయం లో స్టాఫ్ రూం లో ఉన్న ఆయన దగ్గరకు వచ్చారు ఉదయం ఫస్ట్ ఇయర్ పీరియడ్ లో సెలవులకు ఇంటికి వెళ్ళని ముగ్గురు విద్యార్థులు..

"ఏమిటి ? చెప్పండి .."అడిగారు ఆయన. ..

ఒక నిముషం మాటలు లేవు..నెమ్మదిగా ఒక విద్యార్థి చెప్పాడు..
"మాకు కూడా ఇంటికి వెళ్ళాలని ఉన్నది ..అమ్మని, నాన్నని చూడాలని ఉంది..అలాగే తమ్ముళ్ళను చెల్లాయిలను కూడా..కానీ వెళ్ళడానికి మా దగ్గర డబ్బులు లేవు .అందుకే మేం ఉదయం చేతులు ఎత్తలేదు సర్..."చెప్పాడు ఒక విద్యార్థి..మిగతా ఇద్దరూ ..అవును సర్...అన్నారు... ఈ విషయం అందరి ముందు చెప్పలేక పోయాం సర్... క్షమించండి...అన్నారు ఆ ముగ్గురూ..

"సరే..మీరు క్లాసుకి వెళ్ళండి....మీతో తరువాత మాట్లాడుతాను.. " అంటూ వాళ్ళను పంపేశారు విద్యాసాగర్ గారు...

పిల్లలు ఇంత కష్ట పడుతూ ఉన్నారా ? సెలవులకు  ఇంటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవా ?? ఆయన మనసు  ఎంతో బాధ పడింది.. ఏం చేయాలి.. ఏం చేయాలి...

ఆ పిల్లలు ముగ్గురికి ..సెలవులకు ఇంటికి వెళ్ళడానికి ట్రెయిన్ టిక్కెట్లు కొన్నారు...మళ్ళీ రావడానికి, ఖర్చులకు ..ఒక్కొక్కరికి వంద రూపాయలు అదనంగా ఇచ్చారు...విద్యా సాగర్ గారు...

అయినా ఆయన మనసులో ఏదో బాధ...ఇలా విషయం చెప్పకుండా తమలో తాము బాధ పడుతున్న విద్యార్థులు ఎందరో..?

ఆయన మదిలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది....

దసరా , సంక్రాంతి సెలవులకు ..వారం రోజుల ముందు ..విద్యార్థులకు ఫిజిక్స్ సబ్జెక్టు లో పరీక్ష పెట్టేవారు ..వంద మార్కులకు..కనీసం ఎనభై మార్కులు వచ్చిన విద్యార్థులకు ..వంద రూపాయలు నగదు పారితోషికం...అందజేసేవారు....ఇంకేముంది.... ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మరియు థర్డ్ ఇయర్ విద్యార్థులకు..ఇలా ఇవ్వసాగారు.. దసరా , సంక్రాంతి పండుగలకు..విద్యాసాగర్ గారు ఇరవై వేలు పైనే ఖర్చు పెట్టేవారు.. ఆ  రోజుల్లో.. ఆ కాలేజీలో ఆయన ఉన్న ఐదేళ్ల లో ఇలాగే గడిచింది .ఆయనకు తృప్తిగా ఉంది...ప్రిన్సిపాల్ కూడా మెచ్చుకున్నారు..ఆయన కూడా కొంత సాయం చేసే వారు మిగతా గ్రూప్ విద్యార్థులకు..

ఆ రోజులు గుర్తుకు వచ్చి ..నవ్వుకున్నారు ఆయన..ఆ పిల్లలు ఎలా ఉన్నారో...ఎక్కడ ఉన్నారో... వాళ్ళు కనిపించినా గుర్తు పట్టడం కష్టం..

"కాఫీ తీసుకోండి.. "అంటూ వచ్చింది ఆయన శ్రీమతి..

"దసరా పండుగ వస్తోంది కదా.. మన పని మనిషి పిల్లలకు బట్టలు కొందామా ?" అడిగింది ఆవిడ...

ఆవిడ వంక తదేకంగా చూశారు విద్యాసాగర్ గారు..

"అలాగే..."అంటూ ఆలోచనలో పడ్డారు..

ఒక గంట తరువాత శ్రీమతి కి చెప్పారు... "అలా ..మా కాలేజీ వరకూ వెళ్లి వస్తాను.."

"మీ కాలేజీ ఏమిటి ? మీరేమైనా కట్టించారా ? "నవ్వింది ఆయన శ్రీమతి..

ఆయన కూడా నవ్వారు..

హైదరాబాదు లో డిప్యూటీ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు ఆయన..విద్యా విభాగంలో.. ప్రస్తుతం కర్నూల్ లో సెటిల్ అయ్యారు...

* * *

కాలేజీ కి చేరుకుని ..తిన్నగా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ కి వెళ్ళారు..అక్కడ ఉన్నవారికి ఆయన తెలుసు..నమస్కారం చేసారు అందరూ... కాసేపు వారితో గడిపి...ప్రిన్సిపాల్ రూం లోనికి అడుగు పెట్టారు ఆయన...

"నమస్కారం ప్రిన్సిపాల్ గారు..నా పేరు విద్యా సాగర్.. ఈ కాలేజీలో ముప్పై ఏళ్ల క్రితం లెక్చరర్ గా పనిచేశాను..ఒకసారి చూసి పోదామని వచ్చాను...." చెప్పారు ఆయన..
ప్రిన్సిపాల్ .. అక్కడున్న మిగతా వాళ్ళు చూస్తూ ఉండగానే .. విద్యాసాగర్ గారి కాళ్ళకు నమస్కారం పెట్టారు...

"సర్...మీరు నాకు తెలుసు....నేను కూడా ఇదే కాలేజీ లో కామర్స్ చదివాను... మీరిచ్చిన వంద రూపాయల్లో సగం నాకిచ్చేవాడు నా రూం మేట్...మీ పేరు చెప్పుకుని మేము సెలవుల్లో ఇంటికి వెళ్ళేవాళ్ళం .."వినయంగా చెప్పారు...ప్రిన్సిపాల్..

విద్యాసాగర్ గారికి ఆశ్చర్యం.. ఎన్ని ఏళ్ల క్రితం మాట... కొన్ని వందల రూపాయల సాయం... అదీ పిల్లలకు.... ఇంకా ఇలా కొంతమంది గుర్తు పెట్టుకోవడం ఆనందంగా ఉంది...

జేబులో నుండి చెక్కు తీశారు...ఇరవై వేల రూపాయలు...వ్రాసి సంతకం చేసి..ప్రిన్సిపాల్ చేతికి అంద జేశారు..
"పిల్లల కోసం ఖర్చు పెడితే సంతోషిస్తాను..."చెప్పారు విద్యా సాగర్ గారు..

"అలాగే సర్...తప్పకుండా.."

"మీరు నేర్పిన బాట లోనే నేను నడుస్తున్నాను.. పండుగల ముందు పరీక్షలు పెట్టి..కొంతమందికి నగదు బహుమతి ఇవ్వడం మొదలు పెట్టాను.. మీరు వెలిగించిన కాగడా ..ఇంకా వెలుగుతూనే ఉంది మాష్టారూ... నా ముందు వాళ్లు కూడా ఇలాగే చేసారు..అవసరం ఉన్న వాళ్లకు ..వాళ్ల ఆత్మాభిమానానికి అడ్డు రాకుండా ..మీరు చేసిన పనిని మేం కొనసాగించాం..
మీకు అభ్యంతరం లేక పోతే అప్పుడప్పుడూ వస్తూ ఉండండి .."వేడుకున్నాడు ..ప్రిన్సిపాల్...

ప్రిన్సిపాల్ తో బాటుగా టీ త్రాగి..తృప్తిగా బయటకు నడిచారు...కాదు..కాదు..కారు వరకూ..దాదాపు అందరు లెక్చరర్లు వచ్చి దిగ బెట్టారు.. ప్రిన్సిపాల్ కారు డోర్ తీసి పట్టుకుని.. అన్నాడు.. "మమ్మల్ని ఆశీర్వదించండి మాష్టారూ.."

విద్యాసాగర్ గారికి..కళ్ళల్లో నీళ్ళు ఉబికాయి...ప్రతి జన్మ లో ఉపాధ్యాయుడుగా పుట్టాలని కోరుకు న్నారు .. దేవుణ్ణి..
* *
"మీకోసం  ఆయన ఎవరో వచ్చారు.... ఇంకో గంట లో వస్తానని వెళ్ళారు...ఏదో పేరు చెప్పారు...ఆc.. సుబ్బారావు గారట....పెద్ద రైల్వే  ఆఫీసర్ లా ఉన్నారు ఆయన. .." చెప్పింది ఆయన శ్రీమతి..

ఎవరో సుబ్బారావు...గుర్తుకు రాలేదు విద్యాసాగర్ గారికి..

ఇంకో అరగంట లో వచ్చారు ఆ సుబ్బారావు గారు

షరా మామూలే ...వచ్చిన సుబ్బారావు గారు  ఆయన కాళ్ళకు నమస్కరించడం ...
వచ్చిన సుబ్బారావు గారు  చెప్పారు ..
"ముప్పై ఏళ్ళ క్రితం.. ఒక మధ్యాహ్నం..మీ రూం కి వచ్చిన ముగ్గురిలో నేను ఒకడిని మాష్టారూ.. అప్పుడు మీరు ట్రెయిన్ టికెట్ కొనిపెట్టి..వంద రూపాయలు డబ్బులు ఇచ్చారు ఇంటికి వెళ్ళడానికి..
ఈ రోజున ..అదే రైల్వేలో ..రైల్వే బోర్డు మెంబరుగా పని చేస్తున్నాను... అంతా మీ చలవే..వినయంగా చెప్పాడు.. సుబ్బారావు..
 ఎంతో సంతోష పడ్డారు విద్యాసాగర్ గారు... సుబ్బారావు ని దీవించి పంపారు ..విద్యాసాగర్ గారు.. అతను తెచ్చిన స్వీట్ ని తిన్నారు ఆప్యాయంగా...
ఆ రుచి గొప్పగా ఉంది ఆయనకు.... అలా ఎప్పుడూ అనిపించలేదు ..
ఆయనకు బాగా నిద్ర పట్టింది ఆ రాత్రి.. నిద్రలో వెలుగుతున్న  కాగడా ...కనిపిస్తూనే ఉంది.. సంతోషంగా ట్రెయిన్ లో వెళుతున్న విద్యార్థులు కూడా కనిపించారు..కలలో..

మాష్టారు గా విద్యను అందరూ బోధిస్తారు... విద్యార్థుల అవసరాలను గుర్తించి ఆదుకునే .. విద్యాసాగర్ లాంటి కూడా మాస్టార్లు అరుదుగా  ఉంటారు... చేసిన సాయం బయటకు చెప్పడం వారికి ఇష్టం ఉండదు.... వారే నిజమైన మాష్టార్లు.... విద్యా సాగరులు..

గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః

17, సెప్టెంబర్ 2024, మంగళవారం

మారేడు చెట్టు

 లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు.

అందుకే
ఆ చెట్టుకు పండిన కాయను

‘శ్రీఫలము’

అని పిలుస్తారు.

సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. ●

అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.●

మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి●●● దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. ●

మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది. ●

ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది.●

అందుకే

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!

త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!

అని
తలుస్తాము.

దళములు దళములుగా ఉన్నవాటినే కోసి
పూజ చేస్తారు.

ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది.

అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది.
అది మూడు,
తొమ్మిది కూడా ఉంటాయి. ●

పుష్పములను

పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి.

కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా
ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. ◆

మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు.●

అందులో
మారేడు దళము ఒకటి.●

మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె
శివలింగమునకు తగిలితే
ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది.◆

అందుకే
ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా,
పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా●●●

మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు. ●

శివుడిని మారేడు దళంతో పూజ చేయగనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట.◆

‘బాల్యం,
యౌవనం,
కౌమారం
ఈ మూడింటిని నీవు చూస్తావు’

అని ఆశీర్వదిస్తాడుట.◆

కాబట్టి

ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. ◆

శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు.●

మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే●●● జ్ఞానం సిద్ధిస్తుంది.

ఇంత శక్తి కలిగినది కాబట్టే

దానికి "శ్రీసూక్తం"లో

‘అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’

(అమ్మా అలక్ష్మిని= దరిద్రమును పోగొట్టెదవుగాక)

అని

చెప్తాము.

మనిషికి మూడు గుణములు,
మూడు అవస్థలు ఉంటాయి.●
నాల్గవదానిలోకి వెళ్ళడు.
నాల్గవది తురీయము.●

తురీయమే జ్ఞానావస్థ.◆

అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.◆

మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే

మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ●

ఇంట్లో మారేడు చెట్టు ఉంటె >>
ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా>> అపారమయిన సిద్ధి కలుగుతుంది.◆

యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు
ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి >>పీట వేసి >>ఆయనను అక్కడ కూర్చోపెట్టి >>
భోజనం పెడితే >>
అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.◆

శాస్త్రము మనకు లఘువులు నేర్పింది.●

మారేడు చెట్టు అంత గొప్పది.◆

మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.●

అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది.◆

‘మా-రేడు’

తెలుగులో
రాజు ప్రకృతి,
రేడు వికృతి. ◆

మారేడు అంటే మా రాజు. ◆

ఆ చెట్టు పరిపాలకురాలు.●
అన్నిటినీ
ఇవ్వగలదు.◆

ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు.◆

అది పువ్వు పూయవలసిన అవసరం లేదు.◆

ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా >>>
మారేడు
పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. ●

అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.◆

అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా >>మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి.●

అందులో
1●మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం,

2● రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట,

3● మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట. ●

ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.◆◆◆

అమ్మలఁ గన్నయమ్మ

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.

 

దుర్గాదేవి తల్లు లందరికి తల్లి సప్తమాతృకలను కన్నతల్లి, ముల్లోకాలకు మూల మైన లక్ష్మి సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి, అందరు అమ్మల కన్నా అధికురా లైన మహాతల్లి, రక్కసి మూకలను అడగించిన యమ్మ, నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి. అట్టి మా అమ్మ దయాసముద్రి అయ్యి నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక. 

16, సెప్టెంబర్ 2024, సోమవారం

మీ బిడ్డ మేధావి - ఈ పాఠశాల అతనికి చాలా చిన్నది!

 Enlightenment Story
🔅🍂🔅 🍂🔅🍂 🔅🍂🔅🍂
పేదరరికంలో ఉన్న తల్లి గర్భాన పుట్టిన థామస్ ఆల్వా ఏడిసన్ గురించి చదివిన చాలా, చాలా విశేషాల్లో ఇది ఒకటి.

ఒక రోజు థామస్ ఎడిసన్ తన క్లాస్ టీచర్ నుండి ఒక ఉత్తరాన్ని తీసుకుని క్లాసు మధ్యలోనే ఇంటికి వచ్చాడు. తన క్లాసు టీచర్ తన తల్లికి ఇమ్మన్న ఉత్తరాన్ని ఆమెకిచ్చాడు. దీనిని నా టీచర్ నీకు మాత్రమే ఇమ్మన్నారు, ఇంకెవరికీ ఇవ్వవద్దని మరీ మరీ చెప్పారు అని కూడా చెప్పాడు.

ఆమె  ఆ ఉత్తరాన్ని లోలోపల చదువుకుంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.ఆమె కన్నీటిపర్యంతమయ్యింది. ఆత్రుత పడిన ఎడిసన్ అమ్మా అందులో ఏం రాసుంది? అని ఉత్సుకతగా అడిగాడు. నా గురించి ఏమైనా ఆరోపణగా అందులో రాయబడి ఉందా? అని కూడా అడిగాడు. అయితే, ఆ పేద తల్లి ఏమీ లేదు నాయనా! గట్టిగా చదువుతాను నువ్వూ విను అని ఇలా ఆ లేఖను పైకి గట్టిగా చదివింది.

"అమ్మా మీ బిడ్డ మేధావి. ఈ పాఠశాల అతనికి చాలా చిన్నది మరియు అతనికి శిక్షణ ఇవ్వడానికి తగిన మంచి ఉపాధ్యాయులు ఇక్కడ లేరు. దయచేసి అతనికి మీరే చదువు నేర్పండి."

ఇది విని ఎడిసన్ ముఖం బల్బులా వెలిగిపోయింది. ఆనందపడ్డాడు. ఆ తరువాత  చాలాకాలం గడిసింది. ఎడిసన్ తల్లి మరణించింది. ఎడిసన్ చాలా సంవత్సరాల తరువాత, ఎలక్ట్రిక్ బల్బ్ కనుగొని ఈ శతాబ్దపు గొప్ప శాస్త్రీయ ఆవిష్కర్తలలో ఒకడు అయ్యాడు.

ఒక రోజు, అతను పాత ఇంటి సామానులన్నింటినీ సర్దిస్తూ, అతని తల్లికి సంబందించిన టేబుల్ సొరుగు మూలలో చిన్నప్పుడు తన గురువు ఇచ్చిన కవరులో పెట్టిన ఉత్తరాన్ని కనుగొన్నాడు. అతను ఆనాటి సంఘటన గుర్తు చేసుకుని ఆ ఉత్తరాన్ని చదివాడు. అందులో ఇలా వ్రాయబడి ఉంది.

అమ్మా! మీ కొడుకు మానసిక అనారోగ్యంతో చాలా బలహీనంగా ఉన్నాడు. ఇతను దేనినైనా చాలా నెమ్మదిగా అర్ధం చేసుకొంటున్నాడు. మీరు బడికి పంపించి మిగతా పిల్లలతో సరి సమానంగా నేర్పించాలనుకోవడం సమయం వృధా తప్ప వేరొకటి కాదు. ఇలాంటి అనారోగ్యపు పిల్లలు జీవితంలో ఎప్పటికీ ఏ విజయాన్నీ సాధించలేరు. అందుచేత మేము మీ కుమారుడిని ఇకపై మా పాఠశాలకు అనుమతించలేము

ఆ ఉత్తరాన్ని చదివిన ఎడిసన్ కొంత సేపు గుండెను బాదుకుంటూ అరిచాడు, ఏడ్చాడు. రోధనతో విలవిల్లాడాడు. తరువాత తేరుకుని ఈ విషయాన్ని తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు. "థామస్ ఆల్వా ఎడిసన్ మానసిక అనారోగ్యంతో ఉన్న ఓ పిల్లవాడు, గొప్ప హీరోలాంటి తల్లి చేత శతాబ్దపు గొప్ప మేధావి అయ్యాడు"

ఎడిసన్ తల్లిని నమ్మాడు. తల్లి మాటలను ఎంతగానో నమ్మాడు, అందుకే అతడు గొప్ప మేధావి అయ్యాడు 🙏

🔅🍂🔅 🍂🔅🍂 🔅🍂🔅🍂
🔅🍂🔅 🍂🔅🍂 🔅🍂🔅

కళ్ళముందే ప్రపంచ ఎంతగా మారిపోయిందో

 మన కళ్ళముందే ప్రపంచ ఎంతగా మారిపోయిందో గమనించండి.

కొడాక్ కంపెనీ గుర్తుందా?
1997లో కోడాక్‌లో దాదాపు 160,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
మరియు ప్రపంచంలోని 85% ఫోటోగ్రఫీ కొడాక్ కెమెరాలతో జరిగింది.
గత కొన్ని సంవత్సరాలుగా మొబైల్ కెమెరాల పెరుగుదలతో,
కొడాక్ కెమెరా కంపెనీ మార్కెట్ నుండి దూరంగా ఉంది.
కోడాక్ కూడా పూర్తిగా దివాళా తీసింది మరియు అతని ఉద్యోగులందరినీ తొలగించారు.

అదే సమయంలో చాలా ప్రసిద్ధ కంపెనీలు తమను తాము ఆపుకోవలసి వచ్చింది.
HMT (గడియారం)
ఆల్విన్ ( గడియారం )
బజాజ్ (స్కూటర్)
డైనోరా (టీవీ)
మర్ఫీ (రేడియో)
నోకియా (మొబైల్)
రాజ్‌దూత్ (బైక్)
అంబాసిడర్ (కారు)
పైన పేర్కొన్న కంపెనీల్లో ఏదీ కూడా నాణ్యత లేనిది కాదు.
మరి ఈ కంపెనీలు ఎందుకు మూతపడ్డాయి?
ఎందుకంటే వారు కాలానుగుణంగా తమను
తాము మార్చుకోలేదు.

ప్రస్తుత తరుణంలో నిలబడి,
రాబోయే 10 సంవత్సరాలలో ప్రపంచం ఎంతగా మారిపోతుందో మీరు బహుశా ఆలోచించకపోవచ్చు
మరియు నేటి 70%-90% ఉద్యోగాలు రాబోయే 10 సంవత్సరాలలో పూర్తిగా ముగిసిపోతాయి.
మనం నెమ్మదిగా
"నాల్గవ పారిశ్రామిక విప్లవం"
యుగంలోకి ప్రవేశిస్తున్నాము.

నేటి ప్రసిద్ధ కంపెనీలను చూడండి
-UBER- అనేది కేవలం
సాఫ్ట్‌వేర్ పేరు.
వారికి సొంత కార్లు లేవు.
అయితే నేడు ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీ-ఫెయిర్ కంపెనీ -UBER-.

-Airbnb- నేడు ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ కంపెనీ
కానీ తమాషా ఏమిటంటే ...
ప్రపంచంలో వారికి ఒక్క హోటల్ కూడా లేదు.
అదేవిధంగా, -Paytm,
-Ola Cab-, -Oyo గదులు-, -Tea Time- మొదలైన లెక్కలేనన్ని కంపెనీలకు ఉదాహరణలు ఇవ్వవచ్చు.

ఈ రోజు అమెరికాలో కొత్త లాయర్లకు పని లేదు, ఎందుకంటే -IBM వాట్సన్- అనే చట్టపరమైన సాఫ్ట్‌వేర్ ఏదైనా కొత్త లాయర్ కంటే మెరుగ్గా వాదించగలదు.
అందువల్ల, దాదాపు 90% మంది అమెరికన్లకు రాబోయే
10 సంవత్సరాలలో ఉద్యోగాలు ఉండవు.
మిగిలిన 10% ఆదా అవుతుంది.
వీరిలో 10% నిపుణులు ఉంటారు.

కొత్త డాక్టర్ కూడా పనికి రాకుండా కూర్చున్నాడు.
-వాట్సన్ సాఫ్ట్‌వేర్- క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులను మనుషుల కంటే 4 రెట్లు ఎక్కువ ఖచ్చితంగా గుర్తించగలదు.
కంప్యూటర్ ఇంటెలిజెన్స్ 2030 నాటికి మానవ మేధస్సును అధిగమిస్తుంది.

నేటి 90% కార్లు రాబోయే 20 ఏళ్లలో రోడ్లపై కనిపించవు
మిగిలిపోయిన కార్లు -విద్యుత్- లేదా -హైబ్రిడ్- కార్ల ద్వారా నడుస్తాయి.
రోడ్లు నెమ్మదిగా ఖాళీ అవుతాయి.
గ్యాస్ వినియోగం తగ్గుతుంది
మరియు చమురు ఉత్పత్తి చేసే అరబ్ దేశాలు నెమ్మదిగా దివాలా తీస్తాయి.

మీకు కారు కావాలంటే ఉబర్ వంటి సాఫ్ట్‌వేర్ నుండి కారును అడగాలి.
మరియు మీరు కారు అడిగిన వెంటనే,
పూర్తిగా డ్రైవర్ లేని కారు వచ్చి మీ డోర్ ముందు పార్క్ చేస్తుంది.
మీరు ఒకే కారులో చాలా మంది వ్యక్తులతో ప్రయాణిస్తే,
ఒక వ్యక్తికి కారు అద్దె,
బైక్ కంటే తక్కువగా ఉంటుంది.
డ్రైవర్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాల సంఖ్య 99% తగ్గుతుంది.
మరియు దీని వలన కారు
భీమా ఆగిపోతుంది మరియు కారు భీమా కంపెనీలు మూత బడుతాయి
భూమిపై డ్రైవింగ్ చేయడం లాంటివి ఇక మనుగడలో ఉండవు
90% వాహనాలు రోడ్డు నుండి అదృశ్యమైనప్పుడు
ట్రాఫిక్ పోలీసులు మరియు పార్కింగ్ సిబ్బంది అవసరం లేదు.

ఒక్కసారి ఆలోచించండి
10 సంవత్సరాల క్రితం కూడా వీధుల్లో STD బూత్‌లు ఉండేవి.
దేశంలో మొబైల్ విప్లవం వచ్చిన తర్వాత ఈ ఎస్టీడీ బూత్‌లన్నీ మూతపడాల్సి వచ్చింది.
బతికున్నవి మొబైల్ రీఛార్జ్ షాపులయ్యాయి.
మొబైల్ రీఛార్జ్‌లో మళ్లీ ఆన్‌లైన్ విప్లవం.
ప్రజలు ఇంట్లో కూర్చొని తమ మొబైల్‌ని ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేయడం ప్రారంభించారు.
మళ్లీ ఈ రీఛార్జ్ షాపులను భర్తీ చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు ఇవి షాపులను కొనడానికి మరియు విక్రయించడానికి మరియు మరమ్మతు చేయడానికి మొబైల్ ఫోన్లు మాత్రమే.
అయితే ఇది కూడా అతి త్వరలో మారుతుంది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుండి నేరుగా మొబైల్ ఫోన్ అమ్మకాలు పెరుగుతున్నాయి.

డబ్బు నిర్వచనం కూడా మారుతోంది
ఒకప్పుడు నగదు ఉండేది
కానీ నేటి యుగంలో అది "ప్లాస్టిక్ మనీ"గా మారిపోయింది.
క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ రౌండ్ కొన్ని రోజుల క్రితం
ఇప్పుడు అది కూడా మారి మొబైల్ వాలెట్ యుగం రాబోతోంది
-Paytm- యొక్క పెరుగుతున్న మార్కెట్,
మొబైల్ డబ్బు యొక్క ఒక క్లిక్.

గుర్తుంచుకోండి కాలంతో వయస్సుతో మారలేని వారిని భూమి నుండి తొలగిస్తుంది
కాబట్టి కాలంతో పాటు మనం కూడా మారుతూ ఉండాల్సిందే.

15, సెప్టెంబర్ 2024, ఆదివారం

'భారతరత్న' మోక్షగుండం విశ్వేశ్వరయ్య

 'భారతరత్న' మోక్షగుండం విశ్వేశ్వరయ్య


 సెప్టెంబర్ 15 - ఇంజనీర్  దినోత్సవం సందర్భంగా

"ప్రజల సంపాదనాశక్తిని, కార్యదక్షతను నైపుణ్యాన్ని వివిధములైన చేతిపనుల ద్వారా పెంపొందించాలి. చేతనైన వారందరూ కష్టించి పని చేసే వీలు కల్పించాలి. యాంత్రిక శక్తిని ఉపయోగించుకుని దేశ పారిశ్రామిక ప్రగతికి ముందంజ వేయాలి. భారతీయులలో ప్రబలంగా ఉన్న 'అంతా తలరాత' అన్న అలస భావం రూపుమాపి నిరంతర కృషి ద్వారా సంపదను సాధించే దీక్షను, కర్తవ్య పాలనను ప్రజలలో రేకెత్తించుట ప్రభుత్వం కర్తవ్యం."

1912 మైసూరు సంస్థాన దివానుగా అధికారాన్ని చేపడుతూ శ్రీ విశ్వేశ్వరయ్య చేసిన ప్రసంగం నుండి పై వాక్యాలు ఉటంకింపబడినాయి. విశ్వవిఖ్యాత ఇంజనీర్‌గా, పాలనాదక్షుడుగా, రాజనీతిజ్ఞుడుగా, నిష్కామ దేశభక్తుడిగా అఖండ కీర్తిని ఆర్జించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

విశ్వేశ్వరయ్య పూర్వీకులు నేటి ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామం నుండి సుమారు రెండు శతాబ్దాల క్రితం, కర్ణాటక రాష్ట్రం (అప్పట్లో మైసూరు) లోని, చిక్క బళ్ళాపుర సమీపంలోని ముద్దేనహళ్ళిలో స్థిరపడినారు. అక్కడే విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15వ తేదీన జన్మించారు. తండ్రి శ్రీనివాస శాస్త్రి. తల్లి వెంకట లక్ష్మమ్మ. వారిదో సామాన్య కుటుంబం. బాల్యంలోనే తండ్రి మరణించాడు. మేన మామ రామయ్య బాలుడైన విశ్వేశ్వరయ్యను చేరదీసి బెంగుళూరు సెంట్రల్ కాలేజీలో చదువుకునే ఏర్పాటు చేశాడు.

విశ్వేశ్వరయ్య గారి విద్యార్థి జీవితం విద్యాభ్యాసం సాగించే వారందరికీ దిక్సూచి. మేనమామ ఇంట్లోవుంటూ కాలేజీ ఫీజులకోసం ప్రైవేట్ ట్యూషన్ చెబుతూ 1881లో పట్టభద్రులయ్యారు. సెంట్రల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఛార్లెస్ వాటర్స్ విశ్వేశ్వరయ్య నెంతగానో ప్రోత్సహించాడు. గణితంలో అసామాన్య ప్రతిభకల విశ్వేశ్వరయ్య గారి నుండి అధ్యాపకులే తమ సంశయాలను పరిష్కరించుకునేవారు. శిష్యుని కుశాగ్ర బుద్ధికి ముగ్ధుడైన ప్రిన్సిపాల్ తాను ఉపయోగించుకునే వెబ్‌స్టర్ డిక్షనరీని బహుమానంగా ఇచ్చాడు. తన కోటుకున్న బంగారు బొత్తాములను భార్యద్వారా శిష్యుడు విశ్వేశ్వరయ్యకు పంపారు. అదీ ఆనాటి గురుశిష్యుల అనుబంధం - శిష్యవాత్సల్యం.

ఇటువంటి పెద్దలు ఆదరించినందువల్లనే బాలుడైన విశ్వేశ్వరయ్య, ఆ తర్వాత డా. ఎం.వి; సర్. ఎం.వి; భారతరత్న ఎం.వి. అంటూ ప్రస్తుతింపబడినారు. అప్పట్లో మైసూరు సంస్థాన దివానుగా వుండిన దివాన్ రంగాచార్లుగారు విశ్వేశ్వరయ్య విద్యావినయములను గుర్తించి ఇంజనీరింగ్ విద్యాభ్యాసం సాగించేందుకు స్కాలర్‌షిప్ మంజూరు చేసి, పూనేకు పంపారు. ఇంజనీరింగ్ పరీక్షలో బొంబాయి రాష్ట్రంలో సర్వప్రథముడుగా ఉత్తీర్ణులైన విశ్వేశ్వరయ్యగారిని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అసిస్టెంట్ ఇంజనీర్ గా నియమించింది. ఏడాది లోపునే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా నియమించారు. ఆ రోజుల్లో అందులోను ఆంగ్లేయుల పాలనలో అంత త్వరలోనే పదవీ ఉన్నతి పొందడం చాల అరుదు. పూనేలో ఉన్నప్పుడే గోఖలే, తిలక్, రనడే వంటి మహనీయుల సాహచర్యం విశ్వేశ్వరయ్య గారికి లభించింది. గాంధీజీ, నెహ్రూల కంటే వయస్సులో పెద్ద విశ్వేశ్వరయ్య.

ఆంగ్ల పాలకులు విశ్వేశ్వరయ్యగారి కార్యదీక్షను గుర్తించి ప్రపంచ జలాశయాలలో ఒకటిగ పెద్దదైన బరాజ్ (సింధురాష్ట్రం) నిర్మాణానికి ప్రత్యేక ఇంజనీర్ గా నియమించారు. బ్రహ్మాండమైన ఈ జలాశయ నిర్మాణం నాలుగేళ్ళలో పూర్తి అయింది.

1901లో భారత ప్రభుత్వ ప్రతినిధిగ విశ్వేశ్వరయ్యగారు జపాన్ దేశం వెళ్ళి అచట కుటీర పరిశ్రమల తీరుతెన్నులను అవలోకించారు. ఆ పద్ధతిలో కుటీర పరిశ్రమల అభివృద్ధికి బృహత్ పధకాన్ని సిత్థపరచి ప్రభుత్వానికి అందించారు. జపాన్ పర్యటనానంతరం, విశ్వేశ్వరయ్యగారు పూనా నగర నీటి సరఫరా పధకాన్ని రూపొందించారు. ఆ నిర్మాణ కాలంలోనే ఆటోమేటిక్ స్లూస్‌గేట్ రూపొందించారు. ఈ స్లూస్‌గేట్ నిర్మాణం ప్రపంచ ఇంజనీర్ల మన్ననలందుకున్నది. ఈ కొత్త పరిశోధనను తన పేరు మీద పేటెంట్ చేసుకోవలసిందిగ మిత్రులు సూచించారు. తన కార్యనిర్వహణలో భాగంగా సాగినదికాన పేటెంట్ తీసుకోవటం సముచితం కాదన్నాడు. లార్డ్ కిచనర్ స్లూస్‌గేట్ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య ప్రతిభను కొనియాడాడు.

1906లో ఏడెన్ నగరం నీటి, సరఫరా ప్రణాళికను రూపొందించారు. ప్రభుత్వం విశ్వేశ్వరయ్యగారిని సూపరింటెండెంట్ ఇంజనీర్ గా నియమించింది. అప్పుడే కొల్హాపూర్, ధార్వాడ, బిజాపూర్ మొదలగు పట్టణాలలో మంచినీటి పథకాలను సిద్ధపరచారు. బొంబాయి రాష్ట్ర ప్రభుత్వోద్యోగాన్ని స్వయంగా వదులుకున్నారు. రెండు సంస్థానాల నుండి ఛీఫ్ ఇంజనీర్ పదవులు చేపట్టమని ఆహ్వానాలు వచ్చాయి. అన్నిటిని తిరస్కరించి ఇటలీ, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, మొదలగు దేశాలలోని బృహన్నిర్మాణాలను పరిశీలించి, ఆయాదేశ శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి 1909లో స్వదేశం వచ్చారు.

ఇటలీ పర్యటనలో ఉన్నపుడే హైదరాబాద్ నగర రక్షణా పథకం నిర్మించుటకు స్పెషల్ చీఫ్ ఇంజనీర్ గా ఆహ్వానించాడు నిజాం. విశ్వేశ్వరయ్యగారి నేతృత్వంలో సాగినవే హుసేన్‌సాగర్, హైదరాబాదు నగర విస్తృత పథకాలు.

స్వరాష్ట్రమైన మైసూరు సంస్థానాన్ని ఆదర్శ సంస్థానంగా తీర్చి దిద్దిన వారు ఆయన. చీఫ్ ఇంజనీర్ గా, ఆ తర్వాత దివాన్ గా పనిచేసిన ఆరేళ్ళలో అరువదేళ్ళ అభివృద్ధిని సాధించారు. హెబ్బాళ్ వ్యవసాయ కళాశాల, మైసూరు విశ్వవిద్యాలయం, ఛేంబర్ ఆఫ్ కామర్స్, సోప్ ఫ్యాక్టరీ, కన్నడ సాహిత్య పరిషత్ మున్నగు వాటిని నెలకొల్పారు.

విశ్వేశ్వరయ్య గారి ప్రజ్ఞా ప్రతిఫలంగా నిర్మింపబడినదే కృష్ణరాజసాగర్, లక్షలాది ఎకరాల మెట్ట భూములు సస్యశ్యామలంగా మారాయి. బృందావన్ ఉద్యానవనం వారి ప్రకృతి ప్రేమకు నిదర్శనం. భారతదేశ సంస్థానాలలో మొదటి ఉక్కు కర్మాగారం నెలకొల్పినది మైసూరు.

మైసూరు మహారాజా గారితో అభిప్రాయభేదం రాగా రాజీనామా చేసి బొంబాయి వెళ్ళిపోయారు. విదేశీ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ప్రారంభింపబడిన భద్రావతి కర్మాగార నిర్మాణ కార్యక్రమం దెబ్బతినింది మహారాజా గత్యంతరం లేక బొంబాయిలోని విశ్వేశ్వరయ్య గారిని ఆహ్వానిస్తూ 'ఈ కర్మాగార పథకం మీదే, అది ఇప్పుడు రోగ గ్రస్తమైంది. మీరు ప్రారంభించిన ప్రజాప్రతినిధి సభ సభ్యులు దీనిని తెల్ల ఏనుగ అంటూ ఎగతాళి చేస్తున్నారు. మీరు వచ్చి దీనిని పునరుద్ధరించాలి' అని వ్రాశారు.

కర్మాగార పర్యవేక్షణ, వ్యయం మున్నగు వాటిపై అన్ని అధికారాలు విశ్వేశ్వరయ్య గారు చేపట్టారు. కార్మికులకు కొద్దిగా కూలీ పెంచారు. అవినీతిపరులైన విదేశీ ఇంజనీర్లను తొలగించారు. రేయింబగళ్ళు కార్మికులను ప్రోత్సహిస్తూ నష్టాల ఊబిలో నుండి లేవనెత్తి రెండేళ్ళలో లాభాలు చూపించారు. పెద్ద కర్మాగారాల్లో సుశిక్షితులైన భారతీయులనే నియమించాలని అందుకు శిక్షణావకాశాలు పెంచాలన్నారు. భద్రావతి కర్మాగారం పర్యవేక్షకులుగా మహారాజా గారి నుండి లభించిన లక్షా యాభైవేల రూపాయలను తిప్పి పంపుతూ, ఆ పైకంతో పారిశ్రామిక శిక్షణ సంస్థను నెలకొల్పమని రాజాగారిని కోరారు విశ్వేశ్వరయ్య. ఆ సంస్థకు తన పేరు పెట్టుటకు సమ్మతింపలేదు. ఆ విధంగా వెలిసిందే జయ చామరాజేంద్ర ఆక్యుపేషనల్ ఇన్‌స్టిస్టూట్.

విశ్వేశ్వరయ్యగారు 1921లో భారత ఉత్పత్తిదారుల సమాఖ్యను నెలకొల్పి జీవి తాంతం ఆ సమాఖ్య అధ్యక్షులుగా పనిచేశారు. 1922 లో అఖిలపక్ష రాజకీయ సమ్మేళనానికి, 1923లో ఇండియన్ సైన్స్ కాంగ్రెసుకు అధ్యక్షత వహించారు.

విశ్వేశ్వరయ్య స్వదేశీ సంస్థాన ప్రజలు బ్రిటిష్ ఇండియాలోని ప్రజలకంటే ఎక్కువ బాధలు పడుతున్నారని గ్రహించి వారి స్వేచ్ఛకోసం గొప్ప కృషి చేశారు. మైసూరు సంస్థానంలో ప్రజాప్రతినిధి సభను ప్రారంభించారు.

కర్తవ్య నిర్వహణలో, నిజాయితీలో అటువంటి వారు అరుదు. దివాన్ పదవి స్వీకరించే ముందు బంధుమిత్రులను ఆహ్వానించారు. " నేను దివాన్ పదవిలో వుండగా ఎటువంటి ఉద్యోగాలు కోరమని, సిఫార్సులు చేయమని వాగ్ధానం చేయమన్నారు." తన బంధువులను ప్రభుత్వోద్యోగాల నుండి తప్పించి, ఇతర వృత్తులను చేపట్టుటకు సొంతపైకం యిచ్చారు.

మైసూరు సంస్థానంలో మోటార్ కార్ల నిర్మాణం ప్రారంభించాలనుకున్నారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తిరస్కరించింది. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఇండియాలో విమాన నిర్మాణం అత్యవసరమైనది. విశ్వేశ్వరయ్య గారి సలహా మేరకు బెంగుళూరులో భారత ప్రభుత్వం విమాన కార్ఖానా నెలకొల్పింది. విశాఖ పట్నంలోని నౌకా నిర్మాణ పధకాన్ని రూపొందించి వాల్ చంద్ హీరాచంద్ గారిచే ప్రారంభింపచేసిన వారాయనే.

గాంధీజీ - విశ్వేశ్వరయ్యగారులు దేశాభివృద్ధి సాధనలో భిన్న దృక్పధాలు కలవారు. గాంధీజీ గ్రామీణ పరిశ్రమలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. విశ్వేశ్వరయ్యగారు భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చి కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహించాలన్నారు.

" నా అభిప్రాయాలు ఎలా ఉన్నా, మీ సహకారం లభించే అదృష్టానికి నోచుకున్నందుకు సంతోషిస్తున్నాను. నా అభిప్రాయాలను వ్యతిరేకించినా మీ దేశ భక్తి, శక్తిసామర్ధ్యాల పట్ల నాకున్న గౌరవం ఏనాటికీ తరగదు." అన్నారు గాంధీజీ.

"మీరేమైనా చెప్పండి. భారత గ్రామీణుల గురించి నాకు మీకంటే ఎక్కువగా తెలుసు" అని గాంధీజీ అన్నప్పుడు, "నేను మీకంటే పదేళ్ళు పెద్దవాడినన్న విషయం గమనించ మనవి. దేశ ఆర్ధిక ప్రగతి విషయంలో మీ కంటే ఎక్కువ అవగాహన నాకుంది " అంటూ బదులు వ్రాశారు విశ్వేశ్వరయ్యగారు, గాంధీజీకి వ్రాసిన జాబులో.

భారతదేశంలోని పెద్ద జలాశయాలు, ఆనకట్టలు నిర్మించుటలో వారి సలహాలను ప్రభుత్వం గొప్పగా భావించేది.

తొంభై ఏళ్ళ వయసులో ప్రధాని నెహ్రూ ఆహ్వానాన్ని మన్నించి పాట్నా వద్ద గంగానదిపై వంతెన నిర్మాణ పథకాన్ని, కొందరు ఇంజనీర్ల బృందంతో రూపొందించారు. తుంగభద్ర ప్రాజెక్టు పథక శిల్పి వారే.

విశ్వేశ్వరయ్య నిజాయితీకి సాకారం. ఒక మారు విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. కొంత పైకం కావాల్సి వచ్చింది. మైసూరు బ్యాంక్ మేనేజర్ బి. వి. నారాయణరెడ్డి గారికి ముందుగా ఫోన్ చేసి, బ్యాంక్ కు వెళ్ళారు. మేనేజర్ వారినెంతో గౌరవంగా లోపలికి తీసుకెళ్ళారు. అన్ని దరఖాస్తులు సిద్ధమైనాయి. విశ్వేశ్వరయ్య తమ వద్దవున్న భారత ప్రభుత్వ రుణ పత్రాలను ఇచ్చి తాకట్టు పెట్టుకోమన్నారు. మేనేజర్ ఆశ్చర్యంతో "తాము తాకట్టు పెట్టడమా! ఇది మీరు నెలకొల్పిన బ్యాంక్" అంటూ తిప్పి ఇవ్వగా విశ్వేశ్వరయ్య తీసుకోలేదు. బ్యాంకు వారు తక్కువ వడ్డీ సూచించగా - అందరికీ విధించే వడ్డీ వేయమన్నారు. ఎక్కువ వడ్డీ వేయమని కోరిన వారు విశ్వేశ్వరయ్య గారొక్కరే, అన్నారు బ్యాంక్ మేనేజర్.

విశ్వేశ్వరయ్య వ్యక్తిగత జీవితం అతి క్రమశిక్షణతో వుండేది. రెండు సార్లు భార్యావియోగం కల్గింది. మూడోసారి పెళ్ళాడిన భార్య వ్యవహారం నచ్చక ఆమెకు విడాకులిచ్చారు. కాల నియమాన్ని, ఆహార విహార నియమాలను కచ్ఛితంగా పాటించిన విశ్వేశ్వరయ్య 100 సం. వయస్సులో కళ్ళద్దాలు లేకుండా చదివేవారు. "గంధపు చెక్క వలె సేవలొ అరిగిపో, కాని ఇనుములా తుప్పు పట్టవద్దు." అనునది వారి జీవన ధ్యేయం. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాలు వారిని సత్కరించాయి. 1961లో విశ్వేశ్వరయ్య గారి శతజయంతి ఉత్సవాలకు భారత ప్రధాని నెహ్రూ విచ్చేశారు." మేము మాటలతో కాల యాపన చేశాం. మీరు నిరంతర క్రియాశూరులై నవభారత నిర్మాణానికి కృషి చేసిన మహనీయు" లంటూ నివాళులర్పించారు నెహ్రూ.

భారత ప్రభుత్వం విశ్వేశ్వరయ్యగారిని 'భారతరత్న' బిరుదంతో సత్కరించింది. విశ్వేశ్వరయ్య ప్లాన్‌డ్ ఎకానమి ఆఫ్ ఇండియా రికన్‌స్ట్రక్టింగ్ ఇండియా, మెమాయిర్స్ ఆఫ్ మై వర్కింక్ లైఫ్ (ఆత్మకథ) రచించారు.

జీవితాంతం దేశ ప్రగతికి, ప్రజా శ్రేయస్సుకు కృషి చేసిన విశ్వేశ్వరయ్యగారు 12-4-1962న దివంగతులయ్యారు

...సేకరణ;
✍ నర్రా వేణు

10, సెప్టెంబర్ 2024, మంగళవారం

గణ గణ గణ గణ గణనాథ

గణ గణ గణ గణ గణనాథ| శంకర పుత్ర వినాయక||
గణ గణ గణ గణ గజవదనా | పార్వతి నందన వినాయక||

మార్గము చూపే గజవదనా| నీకు మాచీ పత్రము గజానన||
బృహత్ స్వరూప గజానన| నీకు బృహతీ పత్రము గజానన||
బిర బిర వచ్చే గజవదనా| నీకు బిల్వమునిచ్చెద గజానన||
గర్వమునణిచే గజానన| నీకు గరికను ఇచ్చెద గజానన||

భక్తుల కాచే గజవదనా| నీకు దత్తూరమిచ్చెద గజానన||
భయమును బాపే గజానన| నీకు బదరీ పత్రము గజానన||
ఆపద కాచే గజవదనా| నీకు ఆపమార్గము గజానన||
తప్పులు కాచే గజానన| నీకు తులసీ దళములు గజానన||

మహాకాయ శ్రీ గజానన| నీకు మామిడియాకులు గజవదనా||
కామిత ఫలదా గజానన| నీకు కరవీరాకులు గజానన||
విష్ణుస్వరూప గజవదనా| నీకు విష్ణుక్రాంతము గజానన||
దయాసాగర గజవదనా| నీకు దాడిమి పత్రము గజానన||

దేవ దేవ శ్రీ గజానన| నీకు దేవదారునిచ్చెద గజానన||
మరువకు మమ్ము గజానన| నీకు మరువక పత్రము గజానన||
దయాసింధు శ్రీ గజానన| నీకు సింధువారము గజానన||
సర్పభూషణ గజానన| నీకు సన్నజాజి దళములు గజానన||

గండము కాచే గజవదనా| నీకు గండకీ పత్రము గజానన||
శరణము నీకే గజానన| నీకు శమీ పత్రము గజవదనా||
రాజ రాజ శ్రీ గజానన| నీకు రావియాకులు గజానన||
మర్మము తెలిపే గజానన| నీకు మద్దియాకులు గజానన||
మోహనాశ శ్రీ గజానన| నీకు జిల్లేడాకులు గజానన||

- శివ భరద్వాజ్ 

మహా శివ రాత్రి : శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?

శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగివున్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి?             తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమ...