23, సెప్టెంబర్ 2024, సోమవారం

🔱 అంతర్యామి 🔱 - మానసిక గాయానికి మందు...

 🔱 అంతర్యామి 🔱

# మానసిక గాయానికి మందు...

🍁ఆటలో గెలిచిన వ్యక్తికి ప్రశంస ఎంత ముఖ్యమో, ఓడిన మనిషికి ఓదార్పు అంతే అవసరం. ఓడిన వ్యక్తి తన అభ్యాసం, శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని దిగులు పడుతుంటాడు. అలాంటి సమయంలో, గెలుపు కన్నా ఓటమి ఇచ్చే అనుభవం గొప్పదని, ఆటలోని మెలకువలను మరింతగా ఒడిసిపట్టుకుని, ద్విగుణీకృత ఉత్సాహంతో పోటీపడితే విజయం తథ్యమన్న స్ఫూర్తిదాయక మాటలు చెబితే అతడి మనసు కుదుటపడి, తదుపరి పోటీకి సిద్ధమవుతారు.

🍁*విజయానికి మిత్రులుంటారు, అపజయం ఒంటరిదన్నది లోక విదితం.* పోటీ ఏదైనా ఓటమి పాలైన వ్యక్తి పట్ల మనం చూపే సంఘీభావ తత్వం అతడికి వెన్నుదన్నవుతుంది. విపత్కర పరిస్థితిలో తనకు తోడుగా నిలిచిన వారిని అతడు ఎన్నటికీ మరచిపోలేడు. జీవితమంటే కష్టసుఖాల పడుగుపేక. ఇవాళ సంతోషంగా ఉన్నాం కాబట్టి, రేపు బాధ కలగదన్న నమ్మకం లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరం ఊహించలేం. అందుకే బాధల్లో ఉన్నవారిని ఓదార్చడం, ఆదుకోవడం మానవత్వ భావనకు తొలి మెట్టుగా భావించాలి. ఆపన్నుల పట్ల ఈనాటి మన ప్రవర్తన, రేపటి మన కష్టానికి వారి సహకారాన్ని ముందస్తుగా సిద్ధం చేసుకోవడమవుతుంది.

🍁మనుషులు కొందరు అకారణంగా మాటల ఈటెలతో ఎదుటివారి మనసును గాయపరుస్తారు. శరీరానికి తగిలిన దెబ్బలా, మానసిక గాయం బయటకి కనిపించదు కానీ, ఆలోచనలను అస్థిరపరుస్తుంది. మనం ఉపశమనంగా చెప్పే నాలుగు మాటలు, వారి మనసుకు చల్లని లేపనమై ఊరడిస్తాయి.  ఒకరి ఆనందాన్ని పంచుకోకపోయినా ఫర్వాలేదు. బాధను పంచుకొని భరోసా ఇవ్వాలి. మానసిక దుర్బలులను ఒక కంట గమనిస్తూ వీలైనంతవరకు వారితో గడుపుతూ వారిలోని దైన్యాన్ని పటాపంచలు చేయాలి.

🍁కొంతమంది పరిస్థితుల ప్రభావానికి లోనై కుంగిపోతుంటారు. సమస్యలను భూతద్దంలో చూసి భయపడుతూ ఉంటారు. మాటలతో వారిలోని నైరాశ్యాన్ని పారదోలాలి. అశోకవనంలో సీత చుట్టూ శత్రు రాక్షసగణం, నా అన్నవారు లేరు. అలాంటి సమయంలో త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతం ఆ తల్లి మనసుకు ఎంతటి సాంత్వన చేకూర్చి ఉంటుందో ఊహించండి. యుద్ధానంతరం సీతమ్మతల్లి అయోధ్యకు వెళ్లినా త్రిజటను మరచిపోలేదు. విశాలంగా పరచుకొన్న రావిచెట్టుపై అనేక పక్షులు చేరినట్టు, కోపమన్నది ఎరగని, శాంత వచనాలతో సంభాషించేవారిని చాలామంది అంటిపెట్టుకొని ఉంటారు. అటువంటివారి సత్సంగమే మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది.

🍁మాటలతో ఓదార్చి ఊరటనివ్వడం భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన వరం. మాటలతో మరో మనసుకు ఉపశమనాన్ని ఇవ్వగలిగితే మానవజన్మకు ప్రయోజనం సిద్ధించినట్లే. మానవుడి నుంచి భగవంతుడు ఆశించేది అదే!

✍️-ప్రతాప వెంకట సుబ్బారాయుడు.

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మహా శివ రాత్రి : శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?

శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగివున్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి?             తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమ...