26, ఆగస్టు 2024, సోమవారం

పెద్దగా చెప్పుకో దగ్గ పని కాదులెమ్మా

 ఆరోజు చివరి రైలు ఆ స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నుండి వెళ్ళిపో యింది. తదుపరి రైలు రేపు ఉదయం వరకు రాదనే విష యం తెలియక ఒక వృద్ధురా లు రైలు కొరకు ఎదురుచూస్తూ ప్లాట్‌ఫారమ్పై  కూర్చొని ఉంది. అది గమనించిన ఒక కూలీ ఆ తల్లిని అడిగాడు.అమ్మా,మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అని. దానికి సమాధానంగా ఆ పెద్దా విడ నేను నా కొడుకు వద్దకు ఢిల్లీ వెళ్ళాలి అని చెప్పింది. జవాబుగా కూలీ ఈరోజు ఇక రైలు లేదు  కదామ్మాఅనిచెప్పా డు. అందుకు ఆ స్త్రీ నిస్సహా యంగా చూసింది. అయితే ఆమెకు వెయిటింగ్ రూమ్‌లో ఆశ్రయం కల్పించాడు. అంత టితో ఆగ కుండా ఆ కూలీ ఆమె కొడుకు గురించి అడగగా ఆమె తన కొడుకు రైల్వేలో పని చేస్తున్నాడని బదులిచ్చింది. పేరు చెప్పండి, సంప్రదించడాని కి మేము ప్రయత్నిస్తాము అన్నాడు ఆ కూలి. మా అబ్బా యిని అందరూ
 లాల్ బహదూర్ శాస్త్రి అని పిలుస్తారు అని ఆమె బదులిచ్చారు. ఆ స్త్రీ మూర్తి కొడుకు అప్పుడు ఇండి యన్ రైల్వేస్ కేంద్ర కేబినెట్ మినిస్టర్. ఒక్క క్షణంలో స్టేషన్ మొత్తం దద్దరిల్లింది. వెంటనే సైరన్ కారు వచ్చింది. వృద్ధురాలు ఆశ్చర్యపోయింది. ఈ విష యం లాల్ బహదూర్ శాస్త్రికి ఏమీ తెలియకుండా భారతీయ రైల్వే అన్నిఏర్పాట్లు చేసింది. ఆవిడ ఢిల్లీలో తన కొడుకుని కలిసిన తర్వాత కొడుకుని ఈవిధంగా అడిగింది - "అబ్బాయి, నీవు రేల్వే లో ఏం పని చేస్తావు..."  

"ఆయన అన్నారు. పెద్దగా చెప్పుకో దగ్గ పని కాదులెమ్మా అని.."

ఇంత సాత్వికతతో వున్నారు కాబట్టే ...ఒక రైలు ఆక్సిడెంట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు తన బాధ్యతగా భావించి రాజీనామా చేశారు.

ఆతరం ఈ తరానికి ..
ఖచ్చితంగా ఆదర్శం...

23, ఆగస్టు 2024, శుక్రవారం

🔱 అంతర్యామి 🔱

 🔱 అంతర్యామి 🔱

🍁జ్ఞానార్జనపై ఉత్సుకత, అభివృద్ధిపై ఆకాంక్ష, లక్ష్యసాధనపై ఆసక్తి ఏర్పడినప్పుడు మానవుల మనో జ్ఞాననేత్రాలు వికసిస్తాయి. మేధా వికాసానికి, సమాజ పురోగతికి దారులు ఏర్పడతాయి. అలాంటి జ్ఞాన సంపత్తి పొందడానికి జిజ్ఞాస అవసరం. ఆ జిజ్ఞాసే మానవుల్ని ఇతర జీవులకన్నా ఉన్నతుల్ని చేసింది.

🍁మహాభారతం అరణ్యపర్వంలో యక్షప్రశ్నల ఘట్టంలో యమధర్మరాజు పాండవాగ్రజుని అనేక అంశాలపై ప్రశ్నిస్తాడు. వాటికి చక్కటి సమాధానాలు చెప్పి తన సోదరులను పునర్జీవితులను చేసుకుంటాడు ధర్మరాజు. సాక్షాత్తు యమధర్మరాజు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేంత ప్రజ్ఞ ధర్మరాజుకు  కలగడానికి కారణం ఆయనకున్న జిజ్ఞాసే. తన సోదరులతో కలిసి పన్నెండేళ్లపాటు ధర్మరాజు చేసింది అరణ్యవాసం మాత్రమే కాదు. అరణ్యమనే విశ్వవిద్యాలయంలో ఓ జిజ్ఞాసిగా విద్యాభ్యాసం చేశాడు. యక్షప్రశ్నలు ఆయనకు స్నాతక పరీక్ష వంటివి. దానికి పరీక్షాధికారి యమధర్మరాజు. అరణ్యవాస కాలంలో అనేకమంది మహర్షులను ప్రశ్నించి, ఆకళింపు చేసుకున్న విషయ పరిజ్ఞానమే ధర్మజుడి చెవి జ్ఞానులు మెచ్చే సమాధానాలను చెప్పించింది. నలుగురు తమ్ముళ్ల ప్రాణాలను నిలబెట్టింది.

🍁జిజ్ఞాస పెంచుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. వృద్ధాప్యం, రోగం, మరణాల మూలాలను తెలుసుకుని వాటిని అరికట్టే మార్గాన్ని అన్వేషిస్తూ సన్యాసిగా మారి ధ్యానించాడు సిద్ధార్థుడు. ఆయనలోని జిజ్ఞాసే జ్ఞానోదయం కలిగించి గౌతమ బుద్ధుడిగా ఆధ్యాత్మిక వెలుగులు పంచేలా సహాయపడింది.

🍁'విజ్ఞుడవును నరుడు జిజ్ఞాస చేతనే' అన్నట్టు ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకుని అద్భుతాలు సాధించారు కొందరు శాస్త్రజ్ఞులు. అలాంటివారిలో అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ రాబీ ఒకరు. రాబీకి నోబెల్ బహుమతి ప్రకటించగా ఒక విలేకరి ఆయన్ని విజయరహస్యం చెప్పమన్నాడు. అందుకాయన'నా తల్లే' అని బదులిచ్చాడు. ఆశ్చర్యపోయిన విలేకరి వివరంగా చెప్పమని కోరినప్పుడు 'నేను పాఠశాల నుంచిఇంటికి వెళ్లేసరికి బడిలో ఉపాధ్యాయుణ్ని ఏమైనా ప్రశ్నించావా' అనడిగేది అమ్మ. బడిలో నేను ప్రశ్నించాలంటే ఆలోచించాల్సి వచ్చేది. అలా ఆలోచనలకు పదును పెట్టేవాడిని. అమ్మ నేర్పిన ప్రశ్నలడిగే తత్వమే నాకు నోబెల్ బహుమతిని ఇప్పించింది' అని చెప్పాడు రాబీ.

🍁ప్రశ్నించే తత్వాన్ని పెంచుకుంటూ జ్ఞానమార్గంలో నిరంతరమూ పయనించడమే జిజ్ఞాసువు లక్షణం. అనుక్షణం జ్ఞాన సముపార్జన దిశగా అడుగులేసేవారు మేధావిగా రూపుదిద్దుకుంటారు. అనేకమంది మేధావుల అన్వేషణా శ్రమ ఫలితమే నేటి తరం అనుభవిస్తున్న కృత్రిమ మేధ సహా అనేక సదుపాయాలు, సౌకర్యాలు, 'కఠినంగా ఉన్నదాన్ని సరళంగాను, సరళం ఉన్నదాన్ని అలవాటుగాను, అలవాటుగా ఉన్నదాన్ని ఆహ్లాదంగానూ తయారు చేసుకున్నప్పుడే విజయం సులభం' అని గ్రంథాలు చెబుతాయి. అందరూ జిజ్ఞాసువులై నూతన విషయాలు ఆకళింపు చేసుకుని జగత్ప్రయోజనకర కార్యాలు చేపట్టినప్పుడే మానవాళికి మేలు జరుగుతుంది.🙏

✍️- నారంశెట్టి ఉమామహేశ్వరరావు

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

9, ఆగస్టు 2024, శుక్రవారం

జయము జయము చౌడేశ్వరి

జయము జయము చౌడేశ్వరి,
జయము నీకు జగదీశ్వరి,
ఈ జగాన సాటి ఎవ్వరు ఓయమ్మ నీకు.
దేవాంగుల కులదేవతవు ఓయమ్మ నీవు.  "జయము"

శంకరుని ఆనతిన, విష్ణుమూర్తి నాభినుండి,
నూలు పోగు వెలికితెచ్చి, దేవలుడు వెళుతుంటే,
రక్కసులు మాయచేసి, ప్రాణములు తీయరాగ,
నీ పుత్రుని కాపాడి ప్రాణ భిక్ష పెట్టినావు.
నిజముగ నువు మహా శక్తివే  ఓయమ్మ నీవు. "జయము"

ఆషాఢ మాసాన, అమావాస్య చీకటిలో,
సూర్యుడంటి చూడముతో, అర్ధరాత్రి సమయాన,
దనుజులను ఉత్తరించ, వెలసితివి ఓయమ్మా ,
నిజముగ నువు పరాశక్తివే ఓయమ్మ నీవు.  "జయము"

దేవలుని ప్రార్థనకు, పిలిచినా పలికెదనని,
అమావాస రోజులలో, ఆరాధన చేయమని,
దేవాంగుల కాపాడగ, కుల దేవతవైనావు,
నిజముగ మము కన్న తల్లివే ఓయమ్మ నీవు.  "జయము"

-శివ భరద్వాజ్ 

 

8, ఆగస్టు 2024, గురువారం

సుభాషితం - ఆగష్టు 2024

సుభాషితం - 1:                                                

तावन्मौनेन नीयन्ते कोकिलश्चैव वासराः ।
यावत्सर्वं जनानन्ददायिनी वाङ्न प्रवर्तते॥

తావన్మౌనేన నీయన్తే కోకిలశ్చైవ వాసరాః
యావత్సర్వం జనానన్దదాయినీ వాఙ్న ప్రవర్తతే

భావము: 

తనకు కూత వచ్చేవరుకు కోయిల మౌనంగా ఉండి రోజులు గడుపుతుంది. కాలక్రమంలో మధురమైన స్వరంతో అందరినీ ఆకర్షిస్తుంది. అదే విధంగా సమయం వచ్చినప్పుడే సందర్భోచితమైన మాట పలికి అందరినీ మెప్పించాలి. సమయం సందర్భం రానంతవరుకు మౌనం వహించడమే ఉత్తమం.

సుభాషితం - 2:

गच्छन् पिपीलको याति योजनानां शतान्यपि ।
अगच्छन् वैनतेयोऽपि पदमेकं न गच्छति ॥

గచ్ఛన్ పిపీలకో యాతి యోజనానాం శతాన్యపి ।
అగచ్ఛన్ వైనతేయోపి పదమేకం న గచ్ఛతి ॥ 

భావము: 

ప్రయాణం మొదలుపెట్టిన చీమ వందలాది యోజనాలు ప్రయాణం చేయగలదు, ప్రయాణం మొదలు పెట్టకపోతే గరుత్మంతుడు కూడా ఒక్క అడుగు ముందుకు వేయలేడు.

నిరంతరం కదిలే చీమ, క్రమంగా వంద యోజనాలు (చాలా దూరం) చేరుకుంటుంది. కానీ కదలడానికి ఇష్టపడని డేగ ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు.

ప్రయత్నం మొదలుపెట్టినవాడు ఎంత చిన్న వాడైనప్పటికి ఎన్ని లక్ష్యాలనైనా అధిగమించగలడు.
ప్రయత్నమే చేయనివాడు ఎంత పెద్దవాడైన, శక్తివంతుడైనా ఒక్క లక్ష్యాన్ని చేధించలేడు, ఒక్క విజయమైనా అందుకోలేడు.

3, ఆగస్టు 2024, శనివారం

🔱 అంతర్యామి - పని బాట 🔱

 🔱 అంతర్యామి 🔱

# పని బాట #

🍁మనిషికి పని జీవనాధారం. పని కేవలం జానెడు పొట్ట నింపుకోవడానికి మాత్రమే కాదు. తెలివికి, సృజనకు అది పట్టం కడుతుంది. పని ద్వారా పొందే ఫలితం మానవుడికి గొప్ప సంతృప్తినిస్తుంది. లోకంలో పనిని ఎంతగానో ప్రేమించేవారు ఉంటారు. సృష్టిలో ఏ పనైనా ముఖ్యమైనదే. పనిలో చిన్నది, పెద్దది అన్న తారతమ్యం ఉండదు. వివిధ రంగాల్లో మానవ కార్యనిర్వహణ జగతిని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. లోక కల్యాణ కారకమవుతుంది.

🍁శ్రద్ధ. క్రమానుగత అభ్యాసం పనిలో మానవుణ్ని నిష్ణాతుణ్ని చేస్తాయి. సవ్యసాచిగా అర్జునుడు గుర్తింపు పొందడం వెనకాల అతడి విశేష సాధన, ప్రజ్ఞ ఉన్నాయని గ్రహించాలి. నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేవారిలో నిరాశకు తావుండ దుంటారు▸ అనుభవజ్ఞులు అంటారు. పనిలో వ్యక్తిగతంగా సాధించే విజయం, సమాజానికి సామర్థ్యంగా పరిచయం అవుతుంది. పనితనం పదుగురి మన్ననలు పొందేలా చేస్తుంది. ఒక్కోసారి చిరునామాగా నిలుస్తుంది. తాజ్మహల్, ఐఫిల్ టవర్, బుర్జ్ ఖలీఫాలాంటి అపూర్వ నిర్మాణాలు పరిధిలేని ఆలోచనలకు, అవధిలేని కళాతృష్ణకు తార్కాణాలు.

🍁మనిషి కాయకష్టం చేయడానికి కావాల్సిన  శక్తిని ఆహారంతో అందించే రైతు ప్రపంచంలో ప్రథమపూజ్యుడు. మరణపు అంచులకు చేరుకున్న వ్యక్తిని పునర్జీవింపజేసే వైద్యుడు నరలోక నారాయణుడు. సరిహద్దు రేఖ దాటకుండా శత్రువులను కట్టడి చేస్తూ, ఆ క్రమంలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడే సైనికుడు ప్రాతఃస్మరణీయుడు.

🍁భారీ బహుళార్థసాధక కార్యాలకు రూపకల్పన
చేసి, సాకారంగా నిలిపి అత్యద్భుత, అనూయ్య ఫలితాలనందించే శాస్త్రజ్ఞుల మేధాసంపత్తికి నిత్య స్మరణ జోతలర్పించాలి. ఊహకందని సునిశిత పనితనంతో ఆభరణాలకు రూపాన్నిచ్చే నేర్పరులు, పనిముట్లు, భారీ యంత్రాలను రూపొందించే ప్రజ్ఞావంతులు, చెక్కను అనేక రూపాలుగా మలచేవారు. మట్టికి వివిధ ఆకృతులనిచ్చేవారు. రాతిని వెన్నలా చెక్కి ఆరాధనీయ శిల్పంగా తీర్చిదిద్దేవారు... ఇలా ఎన్నెన్నో చేతి వృత్తులకు తమదైన నైపుణ్యాన్ని జోడించి పేరొందిన వారెందరో ఉన్నారు. వారి అడుగుజాడలు అనుభవ మార్గాలు.

🍁వెదురుతో వేణువు రూపొందించేవారు, బుట్టలు అల్లేవారితో పాటు తాటాకులతో సరదాగా పిల్లల ఆటబొమ్మలు చేసేవారూ ఉంటారు. కాగితం కళాకృతులకు జపాన్ ఒరిగమి పెట్టింది పేరు. పనిలో ప్రత్యేకత కారణంగా బొమ్మలకు కొండపల్లి, పట్టుచీరలకు కంచి, చికాన్ వస్త్రాలకు లక్నో పేరుగాంచాయి. వయసులో ఉన్నప్పుడు పని చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. వృద్ధాప్యంలో ఆ కమ్మని అనుభూతులను నెమరు వేసుకోవాలి. జగతిలో ఆవిష్కరణ రోజురోజుకు అనూహ్యపుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త విద్యలు, పనులు వెల్లువెత్తుతున్నాయి. విస్తృతమవుతున్న విజ్ఞానం వల్ల సాంకేతిక ఉపకరణాల ప్రాధాన్యం పెరిగింది.

🍁కాలంతో పాటు మనమూ మారాలి. ఆయా ఉపకరణాలనుఅవగాహన చేసుకోవడం కోసం అవసరమైనసమయం వెచ్చించి, మెలకువలు గ్రహించి,ఉత్తమ ఫలితాలు సాధించాలి.
ఏ పనికైనా పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు నాంది పలుకుతాయి. పనిపట్ల చూపే శ్రద్ద జీవికి జీవితాన్నిస్తుంది. కార్యదక్షత మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలంటారు. అనుభవజ్ఞులు. విద్య ఏర్పరచే పనిబాట  సర్వత్రా గౌరవనీయం, పూజనీయం అవుతుంది.

🍁బుద్ధి, జ్ఞానం, ఆలోచన, చేతివేళ్ల అమరిక మానవజన్మకు వరప్రసాదితాలు. భూమ్మీదకు వచ్చినందుకు ఇతర జీవుల్లా తిని, బతికి, వెళ్లిపోవడం కాకుండా ఉన్నతమైన పనికి కర్తగా నిలిచి నిష్క్రమించే వ్యక్తి కీర్తి అజరామరం.🙏

✍️-ప్రతాప వెంకట సుబ్బారాయుడు

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహా శివ రాత్రి : శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?

శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగివున్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి?             తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమ...