3, ఆగస్టు 2024, శనివారం

🔱 అంతర్యామి - పని బాట 🔱

 🔱 అంతర్యామి 🔱

# పని బాట #

🍁మనిషికి పని జీవనాధారం. పని కేవలం జానెడు పొట్ట నింపుకోవడానికి మాత్రమే కాదు. తెలివికి, సృజనకు అది పట్టం కడుతుంది. పని ద్వారా పొందే ఫలితం మానవుడికి గొప్ప సంతృప్తినిస్తుంది. లోకంలో పనిని ఎంతగానో ప్రేమించేవారు ఉంటారు. సృష్టిలో ఏ పనైనా ముఖ్యమైనదే. పనిలో చిన్నది, పెద్దది అన్న తారతమ్యం ఉండదు. వివిధ రంగాల్లో మానవ కార్యనిర్వహణ జగతిని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. లోక కల్యాణ కారకమవుతుంది.

🍁శ్రద్ధ. క్రమానుగత అభ్యాసం పనిలో మానవుణ్ని నిష్ణాతుణ్ని చేస్తాయి. సవ్యసాచిగా అర్జునుడు గుర్తింపు పొందడం వెనకాల అతడి విశేష సాధన, ప్రజ్ఞ ఉన్నాయని గ్రహించాలి. నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేవారిలో నిరాశకు తావుండ దుంటారు▸ అనుభవజ్ఞులు అంటారు. పనిలో వ్యక్తిగతంగా సాధించే విజయం, సమాజానికి సామర్థ్యంగా పరిచయం అవుతుంది. పనితనం పదుగురి మన్ననలు పొందేలా చేస్తుంది. ఒక్కోసారి చిరునామాగా నిలుస్తుంది. తాజ్మహల్, ఐఫిల్ టవర్, బుర్జ్ ఖలీఫాలాంటి అపూర్వ నిర్మాణాలు పరిధిలేని ఆలోచనలకు, అవధిలేని కళాతృష్ణకు తార్కాణాలు.

🍁మనిషి కాయకష్టం చేయడానికి కావాల్సిన  శక్తిని ఆహారంతో అందించే రైతు ప్రపంచంలో ప్రథమపూజ్యుడు. మరణపు అంచులకు చేరుకున్న వ్యక్తిని పునర్జీవింపజేసే వైద్యుడు నరలోక నారాయణుడు. సరిహద్దు రేఖ దాటకుండా శత్రువులను కట్టడి చేస్తూ, ఆ క్రమంలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడే సైనికుడు ప్రాతఃస్మరణీయుడు.

🍁భారీ బహుళార్థసాధక కార్యాలకు రూపకల్పన
చేసి, సాకారంగా నిలిపి అత్యద్భుత, అనూయ్య ఫలితాలనందించే శాస్త్రజ్ఞుల మేధాసంపత్తికి నిత్య స్మరణ జోతలర్పించాలి. ఊహకందని సునిశిత పనితనంతో ఆభరణాలకు రూపాన్నిచ్చే నేర్పరులు, పనిముట్లు, భారీ యంత్రాలను రూపొందించే ప్రజ్ఞావంతులు, చెక్కను అనేక రూపాలుగా మలచేవారు. మట్టికి వివిధ ఆకృతులనిచ్చేవారు. రాతిని వెన్నలా చెక్కి ఆరాధనీయ శిల్పంగా తీర్చిదిద్దేవారు... ఇలా ఎన్నెన్నో చేతి వృత్తులకు తమదైన నైపుణ్యాన్ని జోడించి పేరొందిన వారెందరో ఉన్నారు. వారి అడుగుజాడలు అనుభవ మార్గాలు.

🍁వెదురుతో వేణువు రూపొందించేవారు, బుట్టలు అల్లేవారితో పాటు తాటాకులతో సరదాగా పిల్లల ఆటబొమ్మలు చేసేవారూ ఉంటారు. కాగితం కళాకృతులకు జపాన్ ఒరిగమి పెట్టింది పేరు. పనిలో ప్రత్యేకత కారణంగా బొమ్మలకు కొండపల్లి, పట్టుచీరలకు కంచి, చికాన్ వస్త్రాలకు లక్నో పేరుగాంచాయి. వయసులో ఉన్నప్పుడు పని చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. వృద్ధాప్యంలో ఆ కమ్మని అనుభూతులను నెమరు వేసుకోవాలి. జగతిలో ఆవిష్కరణ రోజురోజుకు అనూహ్యపుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త విద్యలు, పనులు వెల్లువెత్తుతున్నాయి. విస్తృతమవుతున్న విజ్ఞానం వల్ల సాంకేతిక ఉపకరణాల ప్రాధాన్యం పెరిగింది.

🍁కాలంతో పాటు మనమూ మారాలి. ఆయా ఉపకరణాలనుఅవగాహన చేసుకోవడం కోసం అవసరమైనసమయం వెచ్చించి, మెలకువలు గ్రహించి,ఉత్తమ ఫలితాలు సాధించాలి.
ఏ పనికైనా పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు నాంది పలుకుతాయి. పనిపట్ల చూపే శ్రద్ద జీవికి జీవితాన్నిస్తుంది. కార్యదక్షత మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలంటారు. అనుభవజ్ఞులు. విద్య ఏర్పరచే పనిబాట  సర్వత్రా గౌరవనీయం, పూజనీయం అవుతుంది.

🍁బుద్ధి, జ్ఞానం, ఆలోచన, చేతివేళ్ల అమరిక మానవజన్మకు వరప్రసాదితాలు. భూమ్మీదకు వచ్చినందుకు ఇతర జీవుల్లా తిని, బతికి, వెళ్లిపోవడం కాకుండా ఉన్నతమైన పనికి కర్తగా నిలిచి నిష్క్రమించే వ్యక్తి కీర్తి అజరామరం.🙏

✍️-ప్రతాప వెంకట సుబ్బారాయుడు

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే!

 డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే! డబ్బు చేసిన మనిషి, జబ్బు చేసిన మనిషి ఒకటే, ఇదీ నిజమే! పడవ పయనం సాగాలంటే, నీటి అవసరం నిజమే! పడవలోకి నీరు పయనిస్...