30, డిసెంబర్ 2023, శనివారం

పరాజయాలు పలకరిస్తూనే ఉంటాయి

*పరాజయాలు పలకరిస్తూనే ఉంటాయి*

పరాజయాలు పలకరిస్తూనే ఉంటాయి
వాటిని పునాదులుగా చేసుకోనంత వరకు
పరాజయాలు పలకరిస్తూనే ఉంటాయి
నిరాశలోకి  తలవంచుకు దిగబడుతున్నంత వరకు
ఒక్కసారి శిరస్సు ఎత్తి ముందడుగు వేసామా
చేరుకోలేని  అంతస్తులు ఉండవు
మోకరిల్లని విజయ శిఖరాలు ఉండవు.
కావలసిందల్లా కేవలం నమ్మకం,
అంతులేని విశ్వాసం,
విరామ మెరుగని కృషి అంతే.

-శివ భరద్వాజ్

22, డిసెంబర్ 2023, శుక్రవారం

మా ప్రధానాచార్యులు

మా ప్రధానాచార్యులు

ముళ్ళపూడి వారింట ముద్దులొలుకుతూ,
సన్యాసి రాజు, సీతమ్మల కలలు పంటగా,
తండ్యం గ్రామానుదయించిన, చదువుల సూరీడు,
మారేడు దళ ప్రియుడు, కోటేశ్వర నామధేయుడు.

పొందూరులో ఉన్నత విద్య,
విజయనగరాన కళాశాల విద్య,
ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి B.Ed, M.Ed పట్టాలు పొంది,
SGT గా కొండబారిడి అనే చిన్న ఊరిలో,
చిన్నగా మొదలిడిన ప్రస్థానం, పదోన్నతితో B.Ed టీచర్ గా
శ్రీకాకుళం ప్రభుత్వ బాలికల పాఠశాలకు విస్తరించి,
విద్యా విస్తరణాధికారిగా, ఉప పర్యవేక్షణాధికారిగా ,
సారవకోట,లావేరు,రణస్థల ప్రాంతాల్లో వికసించింది.

ఆయన ప్రతిభకు పట్టం కట్టిన రాష్ట్ర ప్రభుత్వం,
లండన్ నగరాన పాఠశాల విద్యా స్థితిగతులపై అధ్యాయానానికి పంపింది.
యూనివర్సిటీ అఫ్ లండన్ నుండి బోధన, అభ్యాస ప్రక్రియలలో
శిక్షణా సర్టిఫికెట్ పొందేందుకు కారణమయ్యింది.

వెనుకబడిన తరగతుల అభ్యున్నతికై రాష్ట్ర ప్రభుత్వం,
సింహాద్రి నాధుని పాదాల చెంత ఆరంభించిన,
శ్రీ వరాహ లక్ష్మి నృసింహ  గురుకుల పాఠశాల
ప్రప్రథమ ప్రధానాచార్యులుగా, ఎందరో విద్యార్థులను
సమాజానికి వెలుగులు పంచేలా తీర్చిదిద్ది,
వారి తలరాతలు మార్చిన విద్యా విధాత.

జవహర్ నవోదయ విద్యాలయాల ప్రధానాచార్యులుగా,
విజయనగరం , కియోంఝర్, వరంగల్, శ్రీకాకుళంలలో పనిచేసిన,
అపార అనుభవంతో పాఠ్య పుస్తక రచయితగా శోభిల్లి,
పదవీ విరమణ చేసినా, విరామ మెరుగక సంబల్ పూర్, భర్గడ్
ప్రైవేట్ పాఠశాలల ప్రధానాచార్యులుగా,
విద్యార్థి కోటి భవితను వికసింప చేసి,
కోటేశ్వర సార్ధక నామధేయులు అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ నివాసితుల సంక్షేమ సంఘ సభ్యుడిగా,
స్వచ్ఛ భారత్ సేవలందించి నాలుగు సార్లు అవార్డులందుకున్న,
స్వచ్ఛమైన మనసున్న మారాజు, ప్రస్తుతం విశాఖ జిల్లా
నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శిగా,
తన మహా ప్రస్థానం కొనసాగిస్తూనే ఉన్నారు.

వారిలాగే వేయి పున్నముల చంద్రుడై,
వందేళ్లు ఆరోగ్యంగా తన జీవన ప్రస్థానం కొనసాగించాలని,
చంద్రబింబం లాంటి ఆ మోము,
ఎల్లప్పుడూ చిరునవ్వుల వెన్నెల కురిపించాలని, మనస్ఫూర్తిగా
ఆ సింహాద్రి నాధుని, మా విద్యార్థి కోటి ప్రార్థిస్తున్నాం.

- శివ భరద్వాజ్.

21, డిసెంబర్ 2023, గురువారం

మాయలో పడకండి - వాస్తవాలు గ్రహించండి

 *మాయలో పడకండి - వాస్తవాలు గ్రహించండి*

భారత్ లో ప్రస్తుతం టాక్స్ కట్టేవాళ్లు ఉన్నది, ఇంచుమించుగా 8 కోట్ల మంది ఉంటే జనాభా 150 కోట్లు.
ఎవరైతే ఉద్యోగి 5000 రోజుకు ఆదాయం ఉండి అందులో నేను అందులో టాక్స్ 30% కడుతున్నానని చెప్పాడో అది నిజమే, కానీ నిజానికి నిజం కాదు ఎలా అంటే.

ఉద్యోగి రోజు సంపాదన     - 5,000
నెలకి సంపాదన          - 1,50,000
సంవత్సరానికి సంపాదన    - 18,00,000
ఉద్యోగి చెప్పిన లెక్కన టాక్స్    - 5,40,000
వాస్తవానికి కట్టే గరిష్ట టాక్స్ మినహాయింపులు లేకుండా    - 2,34,000
అన్నీ మినహాయింపులు తీసేస్తే కట్టాల్సిన టాక్స్    - 1,33,000

అంటే అతను వాస్తవానికి కడుతున్న టాక్స్ కేవలం 13% మరియు అతను ఆదాయపన్నులో అన్నీ మినహాయింపులు ఉపయోగించు కుంటే కట్టేది కేవలం 7.5%
గరిష్ట లెక్క తీసుకున్న 13% ఆదాయ పన్ను మరియు 18% జి‌ఎస్‌టి కలుపుకుంటే కట్టేది అప్పుడు 31% అవుతుంది. మినహాయింపులు తీసివేస్తే కట్టే టాక్స్ 7.5% + 18% GST అప్పుడు అతను కట్టే టాక్స్ 25.5%

ఉచితాలు కాదు - ప్రజా సంక్షేమం కావాలి

*నవ భారతం - నవోదయం*

 *నవ భారతం - నవోదయం*

కుల రక్కసి చంపితే,
ప్రజాస్వామ్య రాజరికం వీడితే,
వారసత్వ నాయకత్వం వదిలితే,
లంచగొండితనం తొలిగితే,
దేశ భక్తి పెరిగితే,
వ్యక్తి పూజ తగ్గితే,
మానవత విరిస్తే,
నవ భారతం వికసిస్తుంది.
నవోదయం జరుగుతుంది.

-శివ భరద్వాజ్

అమ్మ పట్టిన ప్రేమ ఛత్రపు ఖరీదు నాన్న

*నాన్న కాక 'సలార్' ఇంకెవ్వరు?*

విరామ మెరుగక పనిచేస్తూ,
విధి ఎన్ని నాటకాలాడిన గుండెల్లో దాచేస్తూ,
వీసమెత్తు బాధనైనా కనిపించనీయక,
విరూపాక్షుని నీ బాగుకోసం సదా వేడుకుంటూ,

నీ చదువుకై ఆస్తులన్నీ తరుగుతున్నా,
నీ ఎదుగుదలకై కండలన్నీ కరుగుతున్నా,
విధి ఆడే నాటకంలో తాను ఓడినా, గెలిచినా,
నిన్ను గెలిపించాలని తపించేవాడు నాన్న.

మిమ్మల్ని భయపెడుతున్న నాన్న కళ్ళలో
మీరెక్కడ పక్క దారి పడతారోనన్న భయం చూశావా?
గంభీరంగా ఉన్న నాన్న కంటిన దాగిన,
కన్నీటి సంద్రాన్ని ఎపుడైనా చూసావా?
అందులో పుట్టే కష్టాల తుఫాన్న్లని,
కంటి తీరం చేరనివ్వక, కన్నీటిని ఒడిసిపట్టిన,
ఒకే ఒక్కడు, నాన్న కాక 'సలార్' ఇంకెవ్వరు?

అమ్మ పట్టిన ప్రేమ ఛత్రపు ఖరీదు నాన్న.
మీ కోసం కష్టాల వర్షంలో తడుస్తుంటాడు.
మీ బాగు కోసం ఖర్చుపెట్టే కాసుల్లో కనిపించే,
మూడు సింహాల వెనుక కనిపించని సింహం, నాన్న.

మీ కన్నీటికి కరిగే మహోన్నత హిమ శిఖరం నాన్న.
మీ జీవితాలకు వెలుగిస్తూ  కోడిగడుతున్న దీపం నాన్న
తాను కొండెక్కేలోగా నీకొక  దారి చూపాలన్న తపన నాన్న
తనను మించి తన బిడ్డ ఎదగాలన్న తపన నాన్న.

-శివ భరద్వాజ్

16, డిసెంబర్ 2023, శనివారం

ఒకరోజు కుల మత మాయ పొరలు తొలగక మానవు

మతాన్ని మారణాయుధం చేసి
మానవత్వం పై ఎక్కుపెట్టిన మత నాయకులారా!
కులాన్ని అడ్డం పెట్టి కుత్తుకలు కోసి,
కూసింత జాలి లేకుండా కుమ్ములాటలు పెట్టే పాలకులారా!

రాజరికం పోయి, ప్రజాస్వామ్య రాజరికం పురుడు పోసుకుంది,
పదవి కోసం ప్రాణ త్యాగాలే తప్ప, ప్రజల కోసం చేసేవారేరి,
మేము కట్టే టాక్సులనే, మాకు బిచ్చమేస్తే,
మా తలరాతలు మీ చేతితో రాసేకిచ్చి సిగ్గు పడుతున్నాం.

ఓటుని నమ్ముకోక,
ఓటుని అమ్ముకొని,
బతుకుతో నిత్యం పోరాటం చేస్తున్నాం,
మీ కోసం నిత్యం కొట్టుకు చస్తున్నాం.

జనం నిజం తెలుసుకునే రోజు ఎంతో దూరం లేదు,
ఏదో ఒకరోజు కుల మత మాయ పొరలు తొలగక మానవు,
ఆ రోజు తూరుపు ప్రసవిస్తుంది నెత్తుటి రంగున భానుని,
ప్రజలందరి నుదుట సింధూరమై అరుణ కిరణం భాసిస్తుంది.
చీకటి తొలిగి ఏర్పడుతుంది,
నిజమైన ప్రజల చేత, ప్రజల కోసం,
ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామ్య స్వరాజ్యం.

- శివ భరద్వాజ్






చరితలు కథలు అయినప్పుడు కథలు చరితలు అవుతాయి!

 కథలు చరితలౌతాయా! - చరితలు కథలు అయినప్పుడు కథలు చరితలు అవుతాయి!
         -సంపాదకీయం నవతెలంగాణకు నా సమాధానం

మన దేశంలో ఆవిర్భవించిన సాహిత్యాన్ని చదువుకోవచ్చు. ఆస్వాదించవచ్చు. అధ్యయనమూ చేయవచ్చు. కానీ కావ్యాలను, పురాణ కథలను వాస్తవిక చరిత్రగా చదవటం వలన సమాజం పట్ల శాస్త్రీయ అవగాహన లోపిస్తుంది.

కావ్యాలు, పురాణ కథలు అన్నీ వాస్తవం కానంత మాత్రాన అన్ని కావ్యాలు, పురాణ కథలు వాస్తవం కాదు అని చెప్పగలమా! కల్పన ఏమిటో వాస్తవమేమిటో తెలియక గందరగోళమవుతుందన్న మాట నిజం.
భారతీయ జీవన విధానాన్ని విమర్శించే ప్రతి ఒక్కరూ తరచుగా ఉపయోగించే పదం నిచ్చెన మెట్ల సామజిక జీవనం. దీన్ని చరిత్ర గమనిస్తే జన్మతః కుల వ్యవస్థ అనేది పూర్వ కాలంలో లేదన్న సత్యం బోధపడుతుంది. అలాగే ఈ వ్యవస్థ ఇప్పుడు ఉంది, ఇక ముందు ఉంటుంది.

బ్రాహ్మణులు - గురువులు, బోధకులు, పురోహితులు  అంటే ఈనాటి ఉపాధ్యాయులు, పూజారులు
క్షత్రియులు - రాజ్యాన్ని పాలించేవారు, మరియు రక్షించేవారు అంటే ఈనాటి రాజకీయ నాయకులు, పోలీసులు, సైనికులు
వైశ్యులు - వ్యాపారం,వాణిజ్యం, వ్యవసాయం చేసేవారు అంటే ఈనాటి వ్యాపారస్తులు, కంపెనీల అధిపతులు, నిర్వాహకులు, రైతులు
శూద్రులు - పై ముగ్గురికి ఆయా పనులు చేయడానికి సహాయం చేసేవారు అంటే ఈనాటి కూలీలు, శ్రామికులు, ఉద్యోగస్తులు.   

అయితే దురదృష్టవశాత్తు మనం దానిని జన్మతః స్థిరీకరించాము. దీనివల్లే గందరగోళం తలెత్తింది. మనం చేయవలసింది, సమూలంగా నిర్ములించాల్సింది జన్మ వలన వచ్చే కులాన్ని, అది ప్రస్తుత కాలంలో అవసరం లేదు, దాని వలన ఏ ఉపయోగము లేదు. కేవలం ప్రజల మధ్య దూరం పెంచి వైషమ్య విషాన్ని వెదజల్లేందుకు మాత్రమే అది ఉపయోగపడుతుంది. జాతీయ భావన ప్రాధాన్యతను తగ్గించి, కుల మతాల ప్రాధాన్యతను మాత్రమే పెంచేందుకు దోహదం చేస్తుంది. మనమనమంతా ఒకే కులం, భారతీయులం అనే భావన పెంచండి, అందుకొఱకు ప్రయత్నం చేయండి.

వైదికమతం ప్రచారం చేయాల్సిన పని లేదు. అది భారతీయుల జీవన విధానం ముఖ్యంగా అసలు వైదిక మతమే లేదు ఉన్నదంతా కేవలం ధర్మమే, దానిని చేరుకోవడానికి ఉన్న వివిధమార్గాలన్నిటిని ఏకం చేసి ఆది శంకరులు ఒక తాటికి తెచ్చి అద్వైత సిద్ధాంతం తీసుకుని వచ్చారు. మతం అంటే కేవలం మార్గం మాత్రమే, ఇది తెలియక విదేశీయులు హిందూ మతం అంటే మనం గొర్రెలమై తలలూపుతున్నాం. కాదు, కాదు మెకాలే విద్య విధానంతో గొర్రెలుగా మార్చి, తలలూపేలా చేసారు.
అందుకనే మనం అప్పుడప్పుడు హరికథలు చెప్పకురా! అని కాదు అనేది, కథలు చెప్పమాకు అంటాం. ఇక్కడ నవ తెలంగాణ సంపాదకులు వారి మైలేజి కోసం హరిని అదనంగా చేర్చారు.

ఇన్నాళ్లు చరిత్రను వక్రీకరించి చెప్పినప్పుడు, మన అసలైన చరిత్రను కప్పెట్టినప్పుడు మాట్లాడనివారు ఇప్పుడు చరిత్రను వక్రీకరించడం, వాస్తవిక చరిత్రను తొలగించడం చేస్తున్నారు అని గగ్గోలు పెడుతున్నారు. సమకాలీన సమాజంలోనే అనేక కఠిన వాస్తవాలను దాచిపెట్టి చాలామందిని దేవుళ్ళని చేసి పూజిస్తున్నారు, దాని అర్ధం ఎవడైతే గెలుస్తాడో వాడే చరిత్రను మార్చగలడని, రాయగలడని అటువంటప్పుడు చరిత్ర పుస్తకాల్లో రాసినవన్నీ వాస్తవాలా ? అనేది కూడా చరిత్రకారులు, మేధావులు, విద్యావేత్తలు ఆలోచించాలి. అలాగే పురాణ, ఇతిహాసాలలో ఉన్న వాస్తవాలను బయటకు తీసేందుకు ప్రయత్నించాలి.

శాస్త్రం కూడ విశ్వాసం నుండే పుడుతుంది. విశ్వాసం లేనివాడు శాస్త్రవేత్త కాలేడు. శూన్యం నుండే సమస్తం పుట్టింది అన్న భావనే కదా బిగ్ బ్యాంగ్ థియరీ కి మూలం. పొగని మాత్రమే చూసి అదే ఆకాశమనుకుంటే ఎలా?

ఈ వేద పురాణేతిహాసాలు చదువుతూనే కదా భారతీయులు ప్రపంచంలోనే గొప్ప నాగరికతను సృజించుకున్నది. ప్రకృతితో సహజీవనం చేయడం నేర్చుకున్నది. ప్రతి కొండను,కోనను పుట్టను,చెట్టును, చివరకు ప్రాణం లేని రాయిని పూజించడం నేర్చుకున్నది. 

భారతీయులు, హిందూ ధర్మం ప్రపంచానికి అందించినవి. సున్న,వైశేషిక సూత్రాలు,చరక సంహిత,పతంజలి యోగ,కామ సూత్ర,ఖగోళ శాస్త్రం,అద్భుత శిల్ప శాస్త్రం, ధ్యానం,ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, భారతీయ నృత్య కళలు, ఆఖరికి బడి పిల్లలకు వేసే శిక్షల వెనుక కూడా విశేషమైన విజ్ఞానం ఉంది. ప్రతి భారతీయుని వంటిల్లు కూడా ఒక ప్రధమ చికిత్సాలయంలా ఉండేది. ఇలా చెప్పుకుంటూ పొతే ఈ ఉదాహరణలు అనేకం చెప్పవచ్చు, మన దేశం అందించిన విశేష వారసత్వ సంపద ప్రపంచంలో ఏ దేశం అందించలేదు. 

ఒక సహస్రాబ్దం పరాయి పాలనలో ఉండి, మన దేశం వెనుకబడింది కానీ, లేకుంటే అప్పుడు, ఇప్పుడు , ఎప్పుడూ మన దేశం విశ్వానికి వెలుగుచూపే విశ్వగురువే.
జయహో అఖండ భారతం ! జయహో హైందవ ధర్మం!

 కానీ శాస్త్రం ఏమి చేస్తుంది. మన స్వార్ధం కోసం ఇవేమి మిగలకుండా చేస్తుంది. కలుషితం చేస్తుంది. అలాగని శాస్త్రం మొత్తం తప్పు  కాదు, దానిని మనం వినియోగించుకునే విధానమే తప్పు.

అలాగే అన్యాయాలు ఎప్పుడూ వ్యక్తులే చేసారు కానీ ధర్మం చేయలేదు.

నిజమే శాస్త్ర విజ్ఞానం వలన చంద్రుడిపై కాలు పెట్టగలిగే విజ్ఞానం సంపాదించుకున్నాం, కానీ అదే శాస్త్ర విజ్ఞానం మనం ఉంటున్న భూమిపై నిలబడలేకుండా చేస్తుందన్న మాట కూడా అంతే నిజం.

శాస్త్రమైన, ధర్మమైన ప్రజల పురోభివృద్ధికి సహాయం చేయాలి. మూఢ నమ్మకాలతో ధర్మం ఎలా భ్రష్టు పోయిందో, అలాగే మూర్ఖుల చేతిలో పడి విజ్ఞానము మనల్ని నాశనం చేస్తుంది. కరోనా, గ్లోబల్ వార్మింగ్, ప్లాస్టిక్ , రసాయనాలు కలిసిన ఆహార పదార్ధాలు ఇందుకు కొన్ని ఉదాహరణలు.

-శివ భరద్వాజ్


10, డిసెంబర్ 2023, ఆదివారం

ఏది శాశ్వతం కాదనే ఎరుకే మనిషిని సమస్త దుఃఖముల నుండి విముక్తుడిని చేయగలదు.

*ఏది శాశ్వతం కాదనే ఎరుకే మనిషిని సమస్త దుఃఖముల నుండి విముక్తుడిని చేయగలదు.*

నీ బలం శాశ్వతం కాదు.
నీ బలగం శాశ్వతం కాదు.
నీ దుఃఖం శాశ్వతం కాదు.
నీ సంతోషం  శాశ్వతం కాదు.
నీ ఓటమి   శాశ్వతం కాదు.
నీ గెలుపు శాశ్వతం కాదు.
నీ ధనం శాశ్వతం కాదు.
నీ లేమి శాశ్వతం కాదు.
నీ మిత్రుడైనా, శత్రుడైన,
ఏ బంధమైనా, బంధుత్వమైనా,
ఏది శాశ్వతం కాదనే ఎరుకే మనిషిని సమస్త దుఃఖముల నుండి విముక్తుడిని చేయగలదు.

-శివ భరద్వాజ్

8, డిసెంబర్ 2023, శుక్రవారం

మనసుకు ముసుగేసి బతికేస్తున్నాం

*మనసుకు ముసుగేసి బతికేస్తున్నాం*


మనసులో మాట్లాడాలని ఉంటుంది, కానీ
మాట్లాడితే ఏమనుకుంటారోనని భయం,
మాట్లాడితే ఏమవుతుందోనని భయం,
మాట్లాడితే నవ్వుతారని భయం.

మనసులో డాన్సు చేయాలని ఉంటుంది, కానీ
డాన్సు చేస్తే అందరు నవ్వుతారని భయం,
బాగా చేయకపోతే నవ్వుతారని భయం,
ఇంత వయసులో సిగ్గులేకుండా చేస్తున్నారంటారని భయం,

మనసులో పాడాలని ఉంటుంది, కానీ
గొంతు పాడడానికి పనికిరాదని భయం,
పాడితే అందరు నవ్వుతారని భయం,
సరిగా పాడలేకపోతే పగలబడి నవ్వుతారని భయం.

పిల్లలతో సరదాగా ఆడాలని ఉంటుంది, కానీ
మన పెద్దరికం అడ్డువచ్చి ఆగిపోతాం,
పిల్లలకు లోకువయిపోతామని భయం,
సరిగా ఆడలేకపోతే నవ్వుతారని భయం. 

నలుగురూ ఏమనుకుంటారోనని,
మనసు ఏమంటున్నా పట్టించుకోకుండా,
మనసు మాట వినకుండా,
మనసు గొంతుని నొక్కేసి,
నలుగురి మెప్పుకోసం,
మనసుకు ముసుగేసి బతికేస్తున్నాం.

-శివ భరద్వాజ్ 

*పర్యావరణ సంరక్షణ - మన బాధ్యత.*
*ఆరోగ్య సంరక్షణ  - మన సౌభాగ్యం.*
*ధర్మ పరిరక్షణ - మన కర్తవ్యం.*

7, డిసెంబర్ 2023, గురువారం

ప్రకృతిని ప్రేమించి సహజీవనము చేయుము

 *ప్రకృతిని ఆరాధించు భారతీయ సంస్కృతి పునరుజ్జీవింప చేయవోయి*

ప్రాణ వాయువిచ్చెడి చెట్ల ప్రాణాలు  తీయబోకు,
మన ఆయువు పెంచగ పరిశుభ్ర వాయువు నిచ్చునోయి,
జీవనాధార జలము కలుషితము చేయమాకు,
నది సంరక్షణ చేసిన, నీకది సురక్షిత జలము నిచ్చునోయి,

వనములను విచక్షణ రహితముగ నరకబోకు,
వన సంరక్షణ చేసిన, వనసంపదలిచ్చి ఆశీర్వదించునోయి,
వన మూలికలనిచ్చి ఆరోగ్యంబందించునోయి,
అనేక జంతువులకది ఆవాసంబుగ మారునోయి.

పంటపొలంబులు ప్లాట్లుగా మార్చబోకు,
ఆహారంబు దొరకక పాట్లు పడెదవోయి,
అవసరమునకు మించి చేయునదేదైనా,
అనర్ధములకు ఆలవాలమగునోయి.

ప్రకృతిని ప్రేమించి సహజీవనం చేయవోయి,
ప్రకృతిని ఆరాధించు భారతీయ సంస్కృతి పునరుజ్జీవింప చేయవోయి.

-శివ భరద్వాజ్ 

*పర్యావరణ సంరక్షణ - మన బాధ్యత.*
*ఆరోగ్య సంరక్షణ  - మన సౌభాగ్యం.*
*ధర్మ పరిరక్షణ - మన కర్తవ్యం.*

 

1, డిసెంబర్ 2023, శుక్రవారం

*పుడమి తల్లిని రక్షించు మిత్రమా*

 *పుడమి తల్లిని రక్షించు మిత్రమా*

కాలాన్ని అరచేత బట్టాలన్న నీ కోరిక నెరవేరదెన్నటికి,
వాయువు శ్వాసించకుండా బతకలేవు ఎన్నటికి,
ఆయువు అస్తమించకుండా ఆపలేవు ఎన్నటికి,
మరి దేని కోసం అర్రులు చాస్తున్నావు,
ఎవరికోసం ఇదంతా చేస్తున్నావు?


పచ్చని అడవులను నరికేస్తున్నావు,
ప్రకృతి శ్వాసను ఆపేస్తున్నావు.
కొండలన్నీ తవ్వేస్తున్నావు,
నదులకు పుట్టిల్లు లేకుండా చేస్తున్నావు.


పట్టించుకోకుండా ప్లాస్టిక్ వాడేస్తున్నావు,
పర్యావరణం కలుషితం చేసేస్తున్నావు.
నేలలో, నీటిలో, నీ వంటిలో
ప్రవేశించిన ప్లాస్టిక్, మేఘాలకు సైతం పాకేస్తుంది,
కురిసే వర్షాలు సైతం ప్లాస్టిక్కునే కురిపిస్తే
పంట ఏమవుతుంది,
యాడికెల్లి తిండి తినగ వస్తుంది. 


నీ ఇంట చల్లదనానికి వాడే ఏసీలు, రిఫ్రిజరేటర్లు
పుడమంతా వేడిని పెంచేస్తున్నాయి,
ఓజోను కవచాన్ని సైతం తూట్లు పొడిచేస్తున్నాయి. 


కాన్సర్లు పలకరిస్తున్నా కనికరం కలగటం లేదు,
పర్యావరణ హానికరాలను వాడటం ఆపటం లేదు.
మేలుకో మిత్రమా, పుడమి తల్లిని రక్షించు మిత్రమా.

-శివ భరద్వాజ్



ఏడుచేపల కథ - అంతరార్ధం

 ఈ కథ ఎందుకు పుట్టింది.!! అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.. ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు. ఎన్నో అసహజాల...