22, డిసెంబర్ 2023, శుక్రవారం

మా ప్రధానాచార్యులు

మా ప్రధానాచార్యులు

ముళ్ళపూడి వారింట ముద్దులొలుకుతూ,
సన్యాసి రాజు, సీతమ్మల కలలు పంటగా,
తండ్యం గ్రామానుదయించిన, చదువుల సూరీడు,
మారేడు దళ ప్రియుడు, కోటేశ్వర నామధేయుడు.

పొందూరులో ఉన్నత విద్య,
విజయనగరాన కళాశాల విద్య,
ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి B.Ed, M.Ed పట్టాలు పొంది,
SGT గా కొండబారిడి అనే చిన్న ఊరిలో,
చిన్నగా మొదలిడిన ప్రస్థానం, పదోన్నతితో B.Ed టీచర్ గా
శ్రీకాకుళం ప్రభుత్వ బాలికల పాఠశాలకు విస్తరించి,
విద్యా విస్తరణాధికారిగా, ఉప పర్యవేక్షణాధికారిగా ,
సారవకోట,లావేరు,రణస్థల ప్రాంతాల్లో వికసించింది.

ఆయన ప్రతిభకు పట్టం కట్టిన రాష్ట్ర ప్రభుత్వం,
లండన్ నగరాన పాఠశాల విద్యా స్థితిగతులపై అధ్యాయానానికి పంపింది.
యూనివర్సిటీ అఫ్ లండన్ నుండి బోధన, అభ్యాస ప్రక్రియలలో
శిక్షణా సర్టిఫికెట్ పొందేందుకు కారణమయ్యింది.

వెనుకబడిన తరగతుల అభ్యున్నతికై రాష్ట్ర ప్రభుత్వం,
సింహాద్రి నాధుని పాదాల చెంత ఆరంభించిన,
శ్రీ వరాహ లక్ష్మి నృసింహ  గురుకుల పాఠశాల
ప్రప్రథమ ప్రధానాచార్యులుగా, ఎందరో విద్యార్థులను
సమాజానికి వెలుగులు పంచేలా తీర్చిదిద్ది,
వారి తలరాతలు మార్చిన విద్యా విధాత.

జవహర్ నవోదయ విద్యాలయాల ప్రధానాచార్యులుగా,
విజయనగరం , కియోంఝర్, వరంగల్, శ్రీకాకుళంలలో పనిచేసిన,
అపార అనుభవంతో పాఠ్య పుస్తక రచయితగా శోభిల్లి,
పదవీ విరమణ చేసినా, విరామ మెరుగక సంబల్ పూర్, భర్గడ్
ప్రైవేట్ పాఠశాలల ప్రధానాచార్యులుగా,
విద్యార్థి కోటి భవితను వికసింప చేసి,
కోటేశ్వర సార్ధక నామధేయులు అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ నివాసితుల సంక్షేమ సంఘ సభ్యుడిగా,
స్వచ్ఛ భారత్ సేవలందించి నాలుగు సార్లు అవార్డులందుకున్న,
స్వచ్ఛమైన మనసున్న మారాజు, ప్రస్తుతం విశాఖ జిల్లా
నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శిగా,
తన మహా ప్రస్థానం కొనసాగిస్తూనే ఉన్నారు.

వారిలాగే వేయి పున్నముల చంద్రుడై,
వందేళ్లు ఆరోగ్యంగా తన జీవన ప్రస్థానం కొనసాగించాలని,
చంద్రబింబం లాంటి ఆ మోము,
ఎల్లప్పుడూ చిరునవ్వుల వెన్నెల కురిపించాలని, మనస్ఫూర్తిగా
ఆ సింహాద్రి నాధుని, మా విద్యార్థి కోటి ప్రార్థిస్తున్నాం.

- శివ భరద్వాజ్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేం రాజకీయ నాయకులం

కడుపు నిండుగా మాంసాహారం, గొంతు నిండుగా మద్యపానం, జేబు నిండుగా నల్లధనం, ఉచిత హామీలు ఎరగా పెట్టి గేలం వేస్తాం. చిక్కిన చేపల దన్నుగ చిక్కని చేప...