16, డిసెంబర్ 2023, శనివారం

ఒకరోజు కుల మత మాయ పొరలు తొలగక మానవు

మతాన్ని మారణాయుధం చేసి
మానవత్వం పై ఎక్కుపెట్టిన మత నాయకులారా!
కులాన్ని అడ్డం పెట్టి కుత్తుకలు కోసి,
కూసింత జాలి లేకుండా కుమ్ములాటలు పెట్టే పాలకులారా!

రాజరికం పోయి, ప్రజాస్వామ్య రాజరికం పురుడు పోసుకుంది,
పదవి కోసం ప్రాణ త్యాగాలే తప్ప, ప్రజల కోసం చేసేవారేరి,
మేము కట్టే టాక్సులనే, మాకు బిచ్చమేస్తే,
మా తలరాతలు మీ చేతితో రాసేకిచ్చి సిగ్గు పడుతున్నాం.

ఓటుని నమ్ముకోక,
ఓటుని అమ్ముకొని,
బతుకుతో నిత్యం పోరాటం చేస్తున్నాం,
మీ కోసం నిత్యం కొట్టుకు చస్తున్నాం.

జనం నిజం తెలుసుకునే రోజు ఎంతో దూరం లేదు,
ఏదో ఒకరోజు కుల మత మాయ పొరలు తొలగక మానవు,
ఆ రోజు తూరుపు ప్రసవిస్తుంది నెత్తుటి రంగున భానుని,
ప్రజలందరి నుదుట సింధూరమై అరుణ కిరణం భాసిస్తుంది.
చీకటి తొలిగి ఏర్పడుతుంది,
నిజమైన ప్రజల చేత, ప్రజల కోసం,
ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామ్య స్వరాజ్యం.

- శివ భరద్వాజ్






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఏడుచేపల కథ - అంతరార్ధం

 ఈ కథ ఎందుకు పుట్టింది.!! అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.. ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు. ఎన్నో అసహజాల...