16, డిసెంబర్ 2023, శనివారం

చరితలు కథలు అయినప్పుడు కథలు చరితలు అవుతాయి!

 కథలు చరితలౌతాయా! - చరితలు కథలు అయినప్పుడు కథలు చరితలు అవుతాయి!
         -సంపాదకీయం నవతెలంగాణకు నా సమాధానం

మన దేశంలో ఆవిర్భవించిన సాహిత్యాన్ని చదువుకోవచ్చు. ఆస్వాదించవచ్చు. అధ్యయనమూ చేయవచ్చు. కానీ కావ్యాలను, పురాణ కథలను వాస్తవిక చరిత్రగా చదవటం వలన సమాజం పట్ల శాస్త్రీయ అవగాహన లోపిస్తుంది.

కావ్యాలు, పురాణ కథలు అన్నీ వాస్తవం కానంత మాత్రాన అన్ని కావ్యాలు, పురాణ కథలు వాస్తవం కాదు అని చెప్పగలమా! కల్పన ఏమిటో వాస్తవమేమిటో తెలియక గందరగోళమవుతుందన్న మాట నిజం.
భారతీయ జీవన విధానాన్ని విమర్శించే ప్రతి ఒక్కరూ తరచుగా ఉపయోగించే పదం నిచ్చెన మెట్ల సామజిక జీవనం. దీన్ని చరిత్ర గమనిస్తే జన్మతః కుల వ్యవస్థ అనేది పూర్వ కాలంలో లేదన్న సత్యం బోధపడుతుంది. అలాగే ఈ వ్యవస్థ ఇప్పుడు ఉంది, ఇక ముందు ఉంటుంది.

బ్రాహ్మణులు - గురువులు, బోధకులు, పురోహితులు  అంటే ఈనాటి ఉపాధ్యాయులు, పూజారులు
క్షత్రియులు - రాజ్యాన్ని పాలించేవారు, మరియు రక్షించేవారు అంటే ఈనాటి రాజకీయ నాయకులు, పోలీసులు, సైనికులు
వైశ్యులు - వ్యాపారం,వాణిజ్యం, వ్యవసాయం చేసేవారు అంటే ఈనాటి వ్యాపారస్తులు, కంపెనీల అధిపతులు, నిర్వాహకులు, రైతులు
శూద్రులు - పై ముగ్గురికి ఆయా పనులు చేయడానికి సహాయం చేసేవారు అంటే ఈనాటి కూలీలు, శ్రామికులు, ఉద్యోగస్తులు.   

అయితే దురదృష్టవశాత్తు మనం దానిని జన్మతః స్థిరీకరించాము. దీనివల్లే గందరగోళం తలెత్తింది. మనం చేయవలసింది, సమూలంగా నిర్ములించాల్సింది జన్మ వలన వచ్చే కులాన్ని, అది ప్రస్తుత కాలంలో అవసరం లేదు, దాని వలన ఏ ఉపయోగము లేదు. కేవలం ప్రజల మధ్య దూరం పెంచి వైషమ్య విషాన్ని వెదజల్లేందుకు మాత్రమే అది ఉపయోగపడుతుంది. జాతీయ భావన ప్రాధాన్యతను తగ్గించి, కుల మతాల ప్రాధాన్యతను మాత్రమే పెంచేందుకు దోహదం చేస్తుంది. మనమనమంతా ఒకే కులం, భారతీయులం అనే భావన పెంచండి, అందుకొఱకు ప్రయత్నం చేయండి.

వైదికమతం ప్రచారం చేయాల్సిన పని లేదు. అది భారతీయుల జీవన విధానం ముఖ్యంగా అసలు వైదిక మతమే లేదు ఉన్నదంతా కేవలం ధర్మమే, దానిని చేరుకోవడానికి ఉన్న వివిధమార్గాలన్నిటిని ఏకం చేసి ఆది శంకరులు ఒక తాటికి తెచ్చి అద్వైత సిద్ధాంతం తీసుకుని వచ్చారు. మతం అంటే కేవలం మార్గం మాత్రమే, ఇది తెలియక విదేశీయులు హిందూ మతం అంటే మనం గొర్రెలమై తలలూపుతున్నాం. కాదు, కాదు మెకాలే విద్య విధానంతో గొర్రెలుగా మార్చి, తలలూపేలా చేసారు.
అందుకనే మనం అప్పుడప్పుడు హరికథలు చెప్పకురా! అని కాదు అనేది, కథలు చెప్పమాకు అంటాం. ఇక్కడ నవ తెలంగాణ సంపాదకులు వారి మైలేజి కోసం హరిని అదనంగా చేర్చారు.

ఇన్నాళ్లు చరిత్రను వక్రీకరించి చెప్పినప్పుడు, మన అసలైన చరిత్రను కప్పెట్టినప్పుడు మాట్లాడనివారు ఇప్పుడు చరిత్రను వక్రీకరించడం, వాస్తవిక చరిత్రను తొలగించడం చేస్తున్నారు అని గగ్గోలు పెడుతున్నారు. సమకాలీన సమాజంలోనే అనేక కఠిన వాస్తవాలను దాచిపెట్టి చాలామందిని దేవుళ్ళని చేసి పూజిస్తున్నారు, దాని అర్ధం ఎవడైతే గెలుస్తాడో వాడే చరిత్రను మార్చగలడని, రాయగలడని అటువంటప్పుడు చరిత్ర పుస్తకాల్లో రాసినవన్నీ వాస్తవాలా ? అనేది కూడా చరిత్రకారులు, మేధావులు, విద్యావేత్తలు ఆలోచించాలి. అలాగే పురాణ, ఇతిహాసాలలో ఉన్న వాస్తవాలను బయటకు తీసేందుకు ప్రయత్నించాలి.

శాస్త్రం కూడ విశ్వాసం నుండే పుడుతుంది. విశ్వాసం లేనివాడు శాస్త్రవేత్త కాలేడు. శూన్యం నుండే సమస్తం పుట్టింది అన్న భావనే కదా బిగ్ బ్యాంగ్ థియరీ కి మూలం. పొగని మాత్రమే చూసి అదే ఆకాశమనుకుంటే ఎలా?

ఈ వేద పురాణేతిహాసాలు చదువుతూనే కదా భారతీయులు ప్రపంచంలోనే గొప్ప నాగరికతను సృజించుకున్నది. ప్రకృతితో సహజీవనం చేయడం నేర్చుకున్నది. ప్రతి కొండను,కోనను పుట్టను,చెట్టును, చివరకు ప్రాణం లేని రాయిని పూజించడం నేర్చుకున్నది. 

భారతీయులు, హిందూ ధర్మం ప్రపంచానికి అందించినవి. సున్న,వైశేషిక సూత్రాలు,చరక సంహిత,పతంజలి యోగ,కామ సూత్ర,ఖగోళ శాస్త్రం,అద్భుత శిల్ప శాస్త్రం, ధ్యానం,ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, భారతీయ నృత్య కళలు, ఆఖరికి బడి పిల్లలకు వేసే శిక్షల వెనుక కూడా విశేషమైన విజ్ఞానం ఉంది. ప్రతి భారతీయుని వంటిల్లు కూడా ఒక ప్రధమ చికిత్సాలయంలా ఉండేది. ఇలా చెప్పుకుంటూ పొతే ఈ ఉదాహరణలు అనేకం చెప్పవచ్చు, మన దేశం అందించిన విశేష వారసత్వ సంపద ప్రపంచంలో ఏ దేశం అందించలేదు. 

ఒక సహస్రాబ్దం పరాయి పాలనలో ఉండి, మన దేశం వెనుకబడింది కానీ, లేకుంటే అప్పుడు, ఇప్పుడు , ఎప్పుడూ మన దేశం విశ్వానికి వెలుగుచూపే విశ్వగురువే.
జయహో అఖండ భారతం ! జయహో హైందవ ధర్మం!

 కానీ శాస్త్రం ఏమి చేస్తుంది. మన స్వార్ధం కోసం ఇవేమి మిగలకుండా చేస్తుంది. కలుషితం చేస్తుంది. అలాగని శాస్త్రం మొత్తం తప్పు  కాదు, దానిని మనం వినియోగించుకునే విధానమే తప్పు.

అలాగే అన్యాయాలు ఎప్పుడూ వ్యక్తులే చేసారు కానీ ధర్మం చేయలేదు.

నిజమే శాస్త్ర విజ్ఞానం వలన చంద్రుడిపై కాలు పెట్టగలిగే విజ్ఞానం సంపాదించుకున్నాం, కానీ అదే శాస్త్ర విజ్ఞానం మనం ఉంటున్న భూమిపై నిలబడలేకుండా చేస్తుందన్న మాట కూడా అంతే నిజం.

శాస్త్రమైన, ధర్మమైన ప్రజల పురోభివృద్ధికి సహాయం చేయాలి. మూఢ నమ్మకాలతో ధర్మం ఎలా భ్రష్టు పోయిందో, అలాగే మూర్ఖుల చేతిలో పడి విజ్ఞానము మనల్ని నాశనం చేస్తుంది. కరోనా, గ్లోబల్ వార్మింగ్, ప్లాస్టిక్ , రసాయనాలు కలిసిన ఆహార పదార్ధాలు ఇందుకు కొన్ని ఉదాహరణలు.

-శివ భరద్వాజ్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తేటగీతి: అప్పు చేయకు ఆడంబరాల కొఱకు

  అప్పు చేయకు ఆడంబరాల కొఱకు , తప్పు చేయకు సంబరాల కొఱకు , మరి వినక చేసిన ముప్పువాటిల్లు , పట్టు నీకు జీవితకాలంబు తేరుకొనగ ! - శి...