6, సెప్టెంబర్ 2023, బుధవారం

కృష్ణాష్టమి సందేశం

కృష్ణాష్టమి సందేశం:

మనలో చాలా మందికి సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలను మనం ఎలా చూస్తున్నాం?ఎలా అర్ధం చేసుకుంటున్నాం? ఎలా స్పందిస్తున్నాం?అన్న దాని మీద అతని ఎదుగుదల, జీవితంలోని విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి. అయితే చాలామంది తమకు మాత్రమే వచ్చిన సమస్య పెద్దదని, తనలాంటి సమస్య మరొకరికి లేదని, తనకున్న సమస్యలు కారణంగానే ఇలా ఉండిపోయానని, మారిపోయానని అంటూ ఉంటారు. 


కర్ణుడు సమస్యలు :
1. పుట్టగానే తల్లి వదిలేసింది.
2. సూతుడి ఇంట్లో పెరిగాడు.
3. నువ్వు క్షత్రియుడవు కాదు అని కారణం చెప్పి ద్రోణుడు విద్య నేర్పలేదు.
4. క్షత్రియుడని అబద్ధం చెప్పి పరశురాముడు దగ్గర విద్య నేర్చుకున్నాడు.
5. అబద్ధం బయటపడి పరశురాముడు అవసరమైన సమయంలో విద్యను మరిచిపోయేలా శాపం ఇచ్చాడు.
6. కర్ణుడు, ఒకసారి శబ్దభేది బాణం ప్రయోగిస్తున్నప్పుడు, ఒక ఆవును అడవి జంతువుగా భావించి, దానిపై ప్రయోగించి చంపుట కారణంగా ఆ గోవు యజమాని అయిన బ్రాహ్మణుడి వల్ల శపించబడ్డాడు.
7. ద్రౌపది స్వయంవరంలో సూత పుత్రుడినని పరాభవం జరిగింది.
8. దుర్యోధనుడు ఒక్కడే నాకు గౌరవం ఇచ్చాడు. అందువల్ల నేను అతని పక్షాన యుద్ధం చేయటం తప్పెలా అవుతుందని సమర్ధించుకొన్నాడు. తన ప్రాణాలని కోల్పోయాడు.

కృష్ణుడు సమస్యలు:
1. చెరసాలలో పుట్టాడు. పుట్టగానే తల్లి నుండి వేరుచేయబడ్డాడు.
2. రాజకుమారుడిలా పెరగాల్సినవాడు గోశాలల దగ్గర పెరిగాడు.
3. పుట్టినప్పటినుండి ఎంతోమంది చంపటానికి ప్రయత్నించారు.
4. 16 సంవత్సరాలకు గాని విద్య నేర్చుకోవడం ప్రారంభించలేదు.
5. కోరుకున్న యువతిని పెండ్లి చేసుకోలేకపోయాడు.
6. జరాసంధుని నుండి తనవారిని రక్షించుకోవడంకోసం స్వంత ఊరిని వదలి ద్వారకకు వెళ్లాల్సి వచ్చింది. పిరికివాడు అని అందరిచేత అనిపించుకున్నాడు.
7. అతని మొదటి కొడుకుకూడా పుట్టగానే అతని నుండి వేరు చేయబడ్డాడు.
8. శమంతకమణి అపహరించావని అవమానిస్తే ఆ అపవాదుని కష్టపడి తొలగించుకొన్నాడు.
కానీ కృష్ణుడు ఎప్పుడు కుంగిపోక యోగ సాధనపై దృష్టి పెట్టాడు. అందరికి పూజ్యుడయ్యాడు. గీతను ఉపదేశించి జగద్గురువయ్యాడు.

ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు, సవాళ్ళు ఉంటాయి. ఏ ఒక్కరి జీవితం పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగా సాగదు. ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుస్తుంది.. మనకు ఎంత అన్యాయం జరిగినా..ఎన్ని అవమానాలు ఎదురైనా మనకు దక్కాల్సింది దక్కకపోయినా.. ఏ సందర్భంలోనైనా మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం. ఇదే మనిషికి చాలా ముఖ్యమైంది. ఎన్ని బాధలు పడ్డా, అవమానాలు ఎదురైనా ధర్మాన్ని వదులరాదన్న జీవిత సారం  కృష్ణుడు బోధించాడు.

జయహో కృష్ణం వందే జగద్గురుం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తేటగీతి: అప్పు చేయకు ఆడంబరాల కొఱకు

  అప్పు చేయకు, ఆడంబరాల కొఱకు, తప్పు చేయకు, సంబరాల కొఱకు, మరి వినక చేసిన ముప్పువాటిల్లు, పట్టు నీకు జీవితకాలంబు తేరుకొనగ! -శివ భరద్వాజ్ Mean...