25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

గీతా సారం

 భగవద్గీత


ఏది లేదో ఏది ఉండదో దానిని(మాయ) సృష్టించుకొని దాని గురించి మనిషి పాకులాడతాడు. వాస్తవాన్ని మరచి వెంపర్లాడతాడు. ఈ సృష్టిలో ప్రతి జీవి ఆలోచన ఆహారం వరకే, ఆత్మ రక్షణ కొరకే, పునరుత్పత్తి వరకే.  కాని మనిషి మాత్రమే ఈ రెండిటిని దాటి ముందుకు వెళ్లగలిగాడు. ఆలోచించగలిగాడు. ఆ ఆలోచనిచ్చిన మనస్సు గొప్పది. దానిలోని తర్కము, విచక్షణ జ్ఞానమే బుద్ధి. ఇది మనస్సు కంటే గొప్పది.  కానీ ఈ మనస్సు, బుద్ధి లకు ఏది ఆధారభూతం? రూపము,బుద్ధి, మనస్సు కాలంతో మారుతుంటుంది. కానీ ఇవన్నీ మారినా ఏది మారదో, ఏది నీ పుట్టుక యందు (బ్రహ్మ) , ఏది నీ ప్రస్తుత స్థితి(విష్ణువు) యందు, ఏది నీ అంత్య(శివ)మందు ఉన్నదో, దేనికి ఈ వికారములు అంటవో అదియే నేను అనెడి ఆత్మ. ఈ నేను అనేది సర్వభూతములయందు ఉంది. నీరు ఎటులయితే అది ఆశ్రయించిన పాత్ర రూపం పొందునో, ఎటులయితే అది కలసిన పదార్ధము యొక్క గుణములు పొందునో అటులే అన్ని ఆత్మలు "నేను" అనే ఆత్మ(పరమాత్మ) స్వరూపమే అయిన అది ఆశ్రయించియున్న శరీరమును బట్టి రూపమును, బుద్ధిని బట్టి గుణమును పొందును. ఎప్పుడయితే నీ ఇంద్రియాలను బాహ్యమునుండి వేరుచేసి, మనస్సు లగ్నం చేసి నీ బుద్ధిని నీలోకి పయనింప చేస్తావో అప్పుడు నీకు ఆత్మ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు నీ ఇంద్రియాలను నిగ్రహించుకొని కోరికలు అనే శత్రువును జయించగలుగుతావు. అప్పుడు అంతా నేనే అనే స్పృహ కలుగుతుంది.  

-- భగవద్గీత నుండి నాకు అర్ధమైనది మీ కోసం
-- శివ భరద్వాజ్
భాగ్యనగరం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి.

 పరుల సొమ్ము ఎంత విలువైనదైనా అది మనది కాదు. మనది కానిది ఆశించటం మంచిది కాదు. మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి. మీరు ఎంత శ్రమించి పెంచు...