26, డిసెంబర్ 2025, శుక్రవారం

ఓడిపోతున్న క్షణాల్లో విజయం సాధించిన సత్య కథ

 "ఓడిపోతున్నట్టే అనిపించే రోజులు…
ఫలితం రాకపోయినప్పుడు వచ్చే నిరాశ…
ఇవే, మీ జీవితాన్ని మార్చే సీక్రెట్ కీ అవుతాయంటే… విశ్వసించగలరా?"

"ఈ కథలో, ఒక యువకుడు తన వైఫల్యాలను ఎలా విజయానికి మెట్టులుగా మార్చుకున్నాడో తెలుసుకుందాం."


"ఈ కథలోని ప్రతి క్షణం మీకు ప్రేరణ ఇస్తుంది! అంతేకాదు, మీ ప్రయాణాన్ని ఎలా విజయవంతం చేయాలో తెలుపుతుంది!"   


"ఇది సత్య అనే యువకుడి కథ... ఆతను ప్రతి దినం విఫలమవుతూ...  జీవితాన్ని ముగించాలనుకున్నాడు, కానీ ఒక ఫోన్ కాల్, కేవలం ఒక క్షణం అతని జీవితాన్ని మార్చింది. అతను ఆగిపోతాడా లేక మళ్లీ లేచి పోరాడుతాడా?"

 

సత్య  ఆ రోజు కూడా ఓడిపోయాడు.
అతను వెళ్ళిన ఇంటర్వ్యూ ఫలితం rejected.
ఇంటికి వెళ్లే ధైర్యం లేక, రైల్వే ట్రాక్ పక్కన కూర్చున్నాడు.

"అమ్మ ఇంకోసారి నన్ను నమ్ముతుందా?"
"నాన్న మౌనంలో ఇంకెంత బాధ దాచుకుంటాడు?"
ఆ ఆలోచనలు గుండెను చీల్చాయి.

అప్పుడే మొబైల్ రింగ్ అయ్యింది.
అమ్మది.

"ఏమైందిరా సత్య?"
"ఆ ఒక్క మాటలోనే అమ్మ ప్రేమ, ఆశ…
అమ్మ అందించిన సానుభూతి…"

సత్య తట్టుకోలేకపోయాడు.
"నేను మళ్లీ ఫెయిల్ అయ్యానమ్మా…" అన్నాడు.

అక్కడ క్షణం మౌనం.

"ఆ మౌనం సత్యకి భయంగా అనిపించింది.…
ఒక క్షణం శూన్యం ఆవరించింది, చీకటి, … కమ్ముకున్నట్లయింది. 
తర్వాత, మెల్లగా అమ్మ చెప్పింది."

"సెలెక్ట్  అయితేనే నా కొడుకవుతావా రా?"

"అమ్మ మాటల్లో ప్రేమ తగ్గలేదు…
ఆ మాటలు సత్యను ఆలోచింపజేశాయి."

సత్య కన్నీళ్లు ఆగలేదు.

"నువ్వు ప్రతి రోజూ ప్రయత్నిస్తున్నావు…
అదే మాకు విజయం.
నువ్వు నీ ప్రయత్నం ఆపకుండా, కొనసాగిస్తున్నావు…
అదే మాకు గర్వకారణం."

"ఆ మాటలతో సత్య…
పూర్తిగా కదిలిపోయాడు.
ట్రాక్ పక్కన కూర్చుని పిల్లాడిలా ఏడ్చాడు…"

"ఆ రాత్రి ఇంటికి వెళ్లాడు…
నాన్న మౌనంగా ఉన్నాడు…
కానీ, భోజనం పెట్టేటప్పుడు, ప్లేట్లో అదనంగా కూర వడ్డించాడు…
ఆది ప్రేమ…"

ఏళ్ల తర్వాత…
వేదికపై సత్య నిలబడ్డాడు…
చేతిలో అవార్డు మెరిసింది…
కెమెరాలు, చప్పట్లు, వెలుగులు…

కానీ అతని చూపు మాత్రం
ముందు వరుసలో కూర్చున్న
అమ్మ  ముఖం మీదే నిలిచింది…

కింద కూర్చుని ఉన్న అమ్మ కళ్ళలో నీళ్లు…
అవి ఓటమి కన్నీళ్లు కాదు,
ఆకలితో చదివించిన రోజుల జ్ఞాపకాలు…
రైల్వే ట్రాక్ పక్కన కూర్చుని
“అమ్మా నేను ఓడిపోయాను” అన్న రోజు ప్రతిధ్వనులు…

ఈ రోజు అవే కన్నీళ్లు
విజయానికి సాక్ష్యాలయ్యాయి.
అవార్డు సత్య చేతిలో ఉన్నా,
గెలుపు మాత్రం అమ్మదే.

సత్య మైక్ పట్టుకుని ఒక్క మాట అన్నాడు:

"ఈ అవార్డు నేటి నా విజయానికి కాదు…
నన్ను నేను కోల్పోకుండా కొనసాగించిన నా ప్రయాణానికి."

వేదిక మీద నిలబడ్డప్పటికీ,

అతని ఆలోచనలు మాత్రం ఆ రోజు రైల్వే ట్రాక్ పక్కన
అమ్మ మాటలు విన్న ఆ క్షణానికే వెళ్లాయి."

"ప్రతి విఫలమైన ప్రయత్నం, అతన్ని మరింత ఉన్నతంగా ఎదిగేలా చేసింది.
కష్టాలు, బాధలు, అతన్ని ధృడ మనస్కుడిలా, మరింత బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి.
ప్రయత్నం ఆపక, నిలబడి పోరాడిన ప్రతి క్షణం, తన శక్తిని తనే తెలుసుకునేలా చేసింది. 

జీవితం ముగించడానికి ఒక్క బలహీన క్షణం చాలు.
కానీ ఆ ఒక్క క్షణం ఆగి, ఆలోచిస్తే, మనం మన జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఆ క్షణం, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం కావచ్చు.
మన జీవితం, మరికొన్ని జీవితాల్లో వెలుగు నింపవచ్చు."

సరైన మార్గాన్ని ఎంచుకుని, ప్రయత్నించడమే నిజమైన విజయం.


"విజయం నీ గమ్యమైతే నిరాశ తప్పదు,
విజయం నీ మార్గమైతే నిరాశ కలగదు."

 

-శివ భరద్వాజ్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఓడిపోతున్న క్షణాల్లో విజయం సాధించిన సత్య కథ

 "ఓడిపోతున్నట్టే అనిపించే రోజులు… ఫలితం రాకపోయినప్పుడు వచ్చే నిరాశ… ఇవే, మీ జీవితాన్ని మార్చే సీక్రెట్ కీ అవుతాయంటే… విశ్వసించగలరా?...