16, డిసెంబర్ 2025, మంగళవారం

అందరూ అడిగేవాళ్లైతే!— ఇచ్చే వారు ఎవరు?

తూరుపు కనుమల కొండల మధ్య, ఒక చిన్న అందమైన గ్రామం మనసాపురం.

ఆ గ్రామంలో ప్రతి ఉదయం కొండల మధ్య జరిగే సూర్యోదయం చాలా అద్భుతంగా ఉంటుంది.
అలాగే ప్రతి నిత్యం అక్కడి మనుషుల మనసుల్లో అందమైన ఊహలు ఉదయించేవి. 
అందరూ మంచి విషయాలు జరగాలని కోరుకునే వారు…


గ్రామంలో జీవించే ప్రతి మనిషి మనసులో
ప్రతిరోజూ ఒకే స్వరం మోగుతూనే ఉండేది…

“ఇది ఇలా మారితే ఎంత బాగుంటుంది…
అది అలా జరిగితే ఎంత సంతోషం…
ఈ పని ఎవరో ఒకరు ముందుకొచ్చి చేస్తే…!”

కానీ
ఆ “ఎవరో” ఎవరు…
పక్కింటి వాడా? ఎదురింటి మనిషా?
లేదా కాలం తానే పంపే అద్భుతమా?

అందరి మనసుల్లో కోరిక ఉంది,
కానీ దాన్ని భుజాన వేసుకునే ధైర్యం మాత్రం
ఎవరూ తమదని అనుకోరు.

అలా…
కోరికలు వారి మనసుల్లోనే మిగిలిపోతాయి,
గ్రామం మాత్రం
ఎప్పటిలానే ఎదురు చూపుల్లోనే నిల్చుంటుంది.



రాఘవ – అదే గ్రామంలో నివసించే యువకుడు. 
రాఘవకు మంచి మనసు ఉంది, కానీ ఒక అలవాటు ఉంది—
ఏదైనా పని తన చేతితో చేయకుండా, ఎదుటివారు చేయాలని కోరుకునేవాడు.

అతను ఎక్కడికైనా వెళ్లాలని రోడ్డుపై నిలబడినప్పుడు
“ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండేది…” అని ఆశపడేవాడు.

తన బాల్యంలో ఒలింపిక్స్ చూస్తూ “ఒక రోజు మన దేశం అత్యధిక గోల్డ్‌ మెడల్స్ గెలవాలి!”
అనుకుని గర్వపడేవాడు.

కానీ ఇప్పుడు తన చిన్న తమ్ముడు ఆటల్లో ఆసక్తి చూపితే మాత్రం, 
“చదువు ముఖ్యంరా తమ్ముడు, ఊరికే ఆడుతూ కూర్చుంటే ఏదీ దక్కదు.”
అని అడ్డుకునేవాడు.

ఎన్నికల సమయాల్లో, 
“రాజకీయాలు పూర్తిగా చెడిపోయాయి… గుండాలు, రౌడీలు, నేర చరితులే ఎక్కువగా పోటీ చేస్తున్నారు. ఇది మారాలి, మార్చగలిగే మంచివాళ్లు రాజకీయాల్లోకి రావాలి…”
అని అందరిలాగే తాను కూడా రోజుకి పది సార్లు ఇతరులతో మాట్లాడేవాడు.

కానీ నిజంగా ఓటు వేసే రోజున మాత్రం 
“ఈసారి తప్పనిసరిగా అతను గెలుస్తాడులే… నా ఒక్క ఓటు వేసినా, వేయకపోయినా ఫలితం ఏం మారుతుంది. గెలిస్తే మాత్రం వాడేమి  ఉద్ధరిస్తాడు.  అనుకుని అసలుఓటు వేయడానికివెళ్లేవాడు కాదు! ఇంట్లోనే కూర్చునేవాడు."

అతనికి ఈ విషయాలు తప్పు అని తెలిసినా మారడానికి గాని, మార్చడానికి కానీ ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. 



ఒకరోజు రాఘవ అత్యవసరంగా పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది.
వర్షం బాగా పడుతోంది.
బస్సులు రావడం లేదు.
మొబైల్ ఫోన్‌కి నెట్ లేదు.
రోడ్డు మధ్యలో అతను ఒంటరిగా నిలబడి ఉన్నాడు.

అతని ఒక్కటే మాట బలంగా అనుకున్నాడు. 
“ఇప్పుడు ఎవరో సాయం చేస్తే… దేవుడిలా భావిస్తా.”

సుమారు అరగంట తర్వాత ఒక పాత జీప్ ఆగింది.
డ్రైవర్ జుట్టు తెల్లగా ఉంది, ముసలి వయసు.
అతను చిరునవ్వుతో అడిగాడు:

“ బాబు వర్షంలో నిలబడి ఉన్నావు. నేను పట్నానికి వెళుతున్నాను? నీవు పట్నానికే అయితే వచ్చి ఎక్కుబాబు.”

జీప్‌లో కూర్చున్న తరువాత రాఘవ అటు యిటూ చూసి అడిగాడు:

“తాతయ్య… మీరు కూడా నాలాగే రోడ్డుపై ఇబ్బంది పడుతుంటే, ఇలాగే ఎవరైనా సాయం చేస్తారా?”

ఆ ముసలివ్యక్తి మృదువుగా అన్నాడు:

“బిడ్డా… ఏదైనా మనం ఇస్తేనే తిరిగి వస్తుంది.
అందరూ అడిగేవాళ్లైతే, ఇచ్చేవాళ్లు ఎవరు ఉంటారు?” మా సంఘ శాఖలో ఒక పద్యం చెప్పేవారు

పరోపకారాయ ఫలన్తి వృక్షాః (చెట్లు పరుల కోసం పండ్లిస్తాయి)
పరోపకారాయ వహన్తి నద్యః (నదులు పరుల కోసం ప్రవహిస్తాయి)
పరోపకారాయ దుహన్తి గావః (గోమాతలు పరుల కోసం పాలిస్తాయి)
పరోపకారార్థమిదం శరీరమ్ (ఈ శరీరం కూడా పరుల సేవకే). 
సారాంశం:
ఈ శ్లోకం ప్రకృతిలోని జీవన విధానాన్ని వివరిస్తూ, మనిషి కూడా నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయాలని, తన శరీరాన్ని పరుల హితం కోసం వినియోగించాలని బోధిస్తుంది. 

ఆ మాట… ఆ శ్లోకం 
రాఘవ హృదయాన్ని బలంగా తాకింది.


పట్టణం చేరే దాకా, వాన చినుకుల మధ్య చిన్న చిన్న ప్రశ్నలు రాఘవను వెంటాడాయి:

    నాకు లిఫ్ట్ కావాలి… అన్నప్పుడు ఎదురు చూసాను. కానీ నేను ఎప్పుడైనా ఇచ్చానా?

    నాకు క్రీడల్లో గెలిచిన వారిని చూడాలి… అని కోరిక ఉంది. భారతదేశం ఒలింపిక్ క్రీడల్లో అత్యధిక స్వర్ణాలు గెలవాలన్న కోరిక ఉంది. కానీ నా తమ్ముడు ఆటలకు వెళతానంటే పంపానా?

    నీతి, నిజాయితీ కల నాయకులు రావాలి… కానీ నేను ఎప్పుడైనా ఓటు వేసానా? నిజాయితీ గల అభ్యర్థిని సమర్థించానా?

    నాకు ఎప్పుడూ ఎవరో ఒకరు సహాయం చేయాలన్న కోరిక ఉంది…  కానీ నేను ఎప్పుడైనా ఇతరులకి సహాయం చేసానా?

జవాబు ఒక్కటే—
లేదు.

 నిజం, మనకి ఇతరుల నుండి సహాయం లభించనప్పుడు బాధగా ఉంటుంది. అదే బాధ వారికీ ఉంటుంది కదా! ఆ ఆలోచనతో తన మీద తనకే అసహ్యం కలిగింది. తీవ్రంగా పశ్చాతాపం పడ్డాడు.ఆ బాధే అతనిలో నిజమైన మార్పుకి శ్రీకారం చుట్టింది.  


ఆ రోజు నుంచి రాఘవ కొద్దిగా మారడం మొదలుపెట్టాడు:

చిన్న సాయం

రెండురోజుల తర్వాత, రోడ్డుపై బైక్ మీంచి పడి దాని కింద చిక్కుకున్న యువకుడిని చూసి, తానే స్వయంగా ముందుకు వెళ్లి సహాయం చేశాడు. అంబులెన్సుకి ఫోను చేసి రప్పించాడు. 

ఆ యువకుడు “అన్నయ్యా, నిజంగా ఈ రోజు మీరు నా ప్రాణం కాపాడారు” అని చెప్పగానే, రాఘవకు ఆ రోజు జీప్ పై లిఫ్ట్ ఇచ్చిన ముసలివ్యక్తి గుర్తొచ్చాడు.
 

తమ్ముడి కల:

రాఘవ తమ్ముడు ఒక రోజు క్రీడాపోటీలో పాల్గొనాలని అడిగాడు.
మొదట రాఘవ నోటికి వచ్చిన మాట—“చదువు ముఖ్యం…” కానీ వెంటనే ఆగిపోయాడు.

“వెళతావా తమ్ముడు… రా ! నేను నిన్ను తీసుకు వెళ్తాను.  నీకు అండగా ఉంటాను”
అని ప్రోత్సహించాడు.

ఆ చిన్న తమ్ముడు చూపులోని ఆనందం…
రాఘవ గుండెల్లోకి జారి కరిగి తన కంట్లోనుండి వచ్చింది.
 

ఓటు నా బాధ్యత:

ఎన్నికల రోజు వచ్చింది.
ఈసారి రాఘవ ఉదయం నుంచే సిద్ధంగా నిలబడ్డాడు.
ఓటు వేసి బయటికి వస్తూ…
ఆ నీలిరంగు ముద్ర తన వేళ్లపై కనిపించినప్పుడు
అతనికి అది  ఒక పెద్ద విజయంలా అనిపించింది.

“ఇది మార్పు వైపు వేసిన మొదటి అడుగు” అన్న భావన కలిగింది. 

 

సహాయం చేసే అలవాటు: 

రోజూ ఎవరో ఒకరికి చిన్నపాటి సేవ చెయ్యడం…
రాఘవ రోజువారీ జీవితంలో భాగం అయిపొయింది.

తాను చేసేవి పెద్ద పనులు కాదు—
ఎవరైనా పడిపోయిన తాతగారిని లేపడం,
తన పక్కింటి అమ్మాయికి పరీక్షలకు వెళ్లేందుకు లిఫ్ట్ ఇవ్వడం,
పొలంలో నీటితో ఇబ్బంది పడుతున్న రైతుకు సాయం చెయ్యడం…

కానీ ఆ అభిమానం మాత్రం గ్రామమంతా వచ్చేసింది.

“రాఘవంటే మంచి మనిషి” అనే మాట నెమ్మదిగా వ్యాపించింది.


రాఘవ చేసే ఈ చిన్నచిన్న సహాయాలు  గ్రామంలోని పిల్లలు, యువత, పెద్దలు అనుసరించడం మొదలుపెట్టారు.

    ఎవరికైనా ఇబ్బంది అయితే “నన్ను పిల్వయ్యా” అని పలకడం మొదలయ్యింది.

    క్రీడల్లో పిల్లలను ప్రోత్సహించడం మొదలైంది.

     గ్రామంలో ఓటింగ్ శాతం 90% దాటింది.

    పక్కవాడికి సాయం అవసరమైతే ఎవరూ వెనుకంజ వేయడం లేదు.

మనసాపురం…
పేరు లాగానే, మనసులు మారిపోయాయి. సంవత్సరాలు గడిచిపోయాయి. 
 

… ఒకరోజు

రాఘవ కారుపై వెళుతుండగా …
రోడ్డుపై ఒక వృద్ధ వ్యక్తి బస్సు కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు.
రాఘవ వెంటనే కారును ఆపి అతన్ని ఎక్కించుకున్నాడు.

ముసలివ్యక్తి ముఖంలో చిరునవ్వు.
అతను నిశ్శబ్దంగా అన్నాడు:

“ఈ ఊరి వాళ్లే రా బిడ్డా… నిజమైన మనుషులు.”

రాఘవ ఆశ్చర్యపోయి చూశాడు—
అతడే…
కొన్నేళ్ల క్రితం జీప్‌లో తనకి లిఫ్ట్ ఇచ్చిన అదే తాతయ్య.

తాతయ్య రాఘవ చేతిని పట్టుకుని అన్నాడు:

“లోకం మంచిగా మారాలి అనుకుంటే,
ఆ మారే మొదటివాడు ఎవరైనా కావాలి.
అది ఇప్పుడు నువ్వయ్యావు బిడ్డా.”

రాఘవ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

“మనకి మంచి జరిగితే బాగుంటుంది…” అని కోరుకోవడం సులభం.
కానీ ఆ మంచి జరగడం మనతోటే మొదలయితే ప్రపంచం నిజంగా మారుతుంది.

ఎందుకంటే—

ఇవ్వని చేతికి, అందుకునే అర్హత లేదు.
అందరూ అడిగేవాళ్లైతే— ఇచ్చే వారు ఎవరు?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఓడిపోతున్న క్షణాల్లో విజయం సాధించిన సత్య కథ

 "ఓడిపోతున్నట్టే అనిపించే రోజులు… ఫలితం రాకపోయినప్పుడు వచ్చే నిరాశ… ఇవే, మీ జీవితాన్ని మార్చే సీక్రెట్ కీ అవుతాయంటే… విశ్వసించగలరా?...