విజయ్ ఒక చిన్న ఊరిలో పుట్టాడు. చదువంటే ఇష్టం, కానీ ఇంటిలో పరిస్థితుల వల్ల స్కూల్ కు వెళ్లే ముందు, వచ్చిన తరువాత ఇంటి పనిలో సహకరించాల్సివచ్చేది. ఫలితంగా పదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. ఊరంతా “వీడెక్కడ చదవగలడు, ఇతనితో ఏమవుతుంది?” అని మాట్లాడుకున్నారు. విజయ్ కూడా చాలా నిరాశపడ్డాడు. తనమీద తానే నమ్మకం కోల్పోయాడు.
కానీ ఒకరోజు తన ఊరి లైబ్రరీలో పాత పుస్తకాలు సర్దే పనికి వెళ్ళాడు. పని విరామంలో ఒక పుస్తకంలో పేజీలు తిప్పుతూ ఉండగా ఒక వాక్యం కనిపించింది:
“విజయం నీ గమ్యమైతే నిరాశ తప్పదు. విజయం నీ మార్గమైతే నిరాశ కలగదు.”
ఆ పదాలు
అతని మనసులో బాగా నాటుకుపోయాయి.
“నేను పరీక్షలో విజయం సాధించాలన్న ధ్యాసలోనే ఉన్నాను. దానిపై దృష్టి పెట్టాను. కానీ చదవడంపై దృష్టి పెట్టాలి. నేర్చుకోవడమే నా మార్గమైతే? ఆ మార్గంలో పయనించడాన్ని నేను ఆస్వాదించాలి ” అని అనుకున్నాడు.
ఆ రోజు నుంచి విజయ్ తన లక్ష్యాన్ని మార్చుకున్నాడు.
పాస్ కావడం తన లక్ష్యం కాదు, ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకోవడం తన ధ్యేయంగా మార్చుకుని, నేర్చుకోగలిన రోజు గెలుపుగా, నేర్చుకొని రోజు ఓటమిగా భావించాడు.
ఒకరోజు గణితం, ఒకరోజు తెలుగు, ఇంకొక రోజు ఇంగ్లీష్, మరో రోజు సైన్సు ఇలా అన్ని సబ్జెక్టులు నేర్చుకోవడం ఆస్వాదించాడు. క్రమేపి గెలుపు రోజులు పెరిగాయి. ఈ విజయ మార్గం బావుంది.
మళ్లీ పరీక్ష రాశాడు. ఈసారి క్లాస్ లో టాప్ రాలేదు. కానీ ఫెయిల్ కూడా కాలేదు. అప్పుడు అతనికి “నేను ముందుకు వెళ్తున్నాను” అన్న నమ్మకం ఏర్పడింది.
సంవత్సరాలు గడిచాయి. విజయ్ ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ కూడా పదోన్నతి వెంటనే రాలేదు. కానీ ప్రతి పనిని నేర్చుకునే అవకాశంగా తీసుకున్నాడు.
నెమ్మదిగా అతను టీమ్ లీడర్ అయ్యాడు. ఆ తర్వాత మేనేజర్. ఆ కంపెనీలో అతని పనితీరు, నేర్చుకునే స్వభావం, సమస్యలు పరిష్కరించే విధానాలు నచ్చి మరొక కంపెనీ ఏకంగా జనరల్ మేనేజర్ గా పదోన్నతి ఇచ్చి గౌరవించింది.
ఒక రోజు తాను చదువుకున్న స్కూల్ annual day కి అతన్ని ముఖ్య అతిథి గా పిలిచారు.
పిల్లలు అడిగారు:
“సార్, మీ విజయ రహస్యం ఏమిటి?”
విజయ్ నవ్వుతూ అదే వాక్యం చెప్పాడు:
“విజయం నా గమ్యం కాదు. నా ప్రయాణం. అందుకే నేను ఎప్పుడూ నిరాశపడలేదు.”
పిల్లల కళ్లలో ఆశ మెరిసింది.
అదే విజయ్ సాధించిన నిజమైన విజయం.
“విజయం నీ గమ్యమైతే నిరాశ తప్పదు.
విజయం నీ మార్గమైతే నిరాశ కలగదు.”
- శివ భరద్వాజ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి