6, సెప్టెంబర్ 2023, బుధవారం

కృష్ణాష్టమి సందేశం

కృష్ణాష్టమి సందేశం:

మనలో చాలా మందికి సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలను మనం ఎలా చూస్తున్నాం?ఎలా అర్ధం చేసుకుంటున్నాం? ఎలా స్పందిస్తున్నాం?అన్న దాని మీద అతని ఎదుగుదల, జీవితంలోని విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి. అయితే చాలామంది తమకు మాత్రమే వచ్చిన సమస్య పెద్దదని, తనలాంటి సమస్య మరొకరికి లేదని, తనకున్న సమస్యలు కారణంగానే ఇలా ఉండిపోయానని, మారిపోయానని అంటూ ఉంటారు. 


కర్ణుడు సమస్యలు :
1. పుట్టగానే తల్లి వదిలేసింది.
2. సూతుడి ఇంట్లో పెరిగాడు.
3. నువ్వు క్షత్రియుడవు కాదు అని కారణం చెప్పి ద్రోణుడు విద్య నేర్పలేదు.
4. క్షత్రియుడని అబద్ధం చెప్పి పరశురాముడు దగ్గర విద్య నేర్చుకున్నాడు.
5. అబద్ధం బయటపడి పరశురాముడు అవసరమైన సమయంలో విద్యను మరిచిపోయేలా శాపం ఇచ్చాడు.
6. కర్ణుడు, ఒకసారి శబ్దభేది బాణం ప్రయోగిస్తున్నప్పుడు, ఒక ఆవును అడవి జంతువుగా భావించి, దానిపై ప్రయోగించి చంపుట కారణంగా ఆ గోవు యజమాని అయిన బ్రాహ్మణుడి వల్ల శపించబడ్డాడు.
7. ద్రౌపది స్వయంవరంలో సూత పుత్రుడినని పరాభవం జరిగింది.
8. దుర్యోధనుడు ఒక్కడే నాకు గౌరవం ఇచ్చాడు. అందువల్ల నేను అతని పక్షాన యుద్ధం చేయటం తప్పెలా అవుతుందని సమర్ధించుకొన్నాడు. తన ప్రాణాలని కోల్పోయాడు.

కృష్ణుడు సమస్యలు:
1. చెరసాలలో పుట్టాడు. పుట్టగానే తల్లి నుండి వేరుచేయబడ్డాడు.
2. రాజకుమారుడిలా పెరగాల్సినవాడు గోశాలల దగ్గర పెరిగాడు.
3. పుట్టినప్పటినుండి ఎంతోమంది చంపటానికి ప్రయత్నించారు.
4. 16 సంవత్సరాలకు గాని విద్య నేర్చుకోవడం ప్రారంభించలేదు.
5. కోరుకున్న యువతిని పెండ్లి చేసుకోలేకపోయాడు.
6. జరాసంధుని నుండి తనవారిని రక్షించుకోవడంకోసం స్వంత ఊరిని వదలి ద్వారకకు వెళ్లాల్సి వచ్చింది. పిరికివాడు అని అందరిచేత అనిపించుకున్నాడు.
7. అతని మొదటి కొడుకుకూడా పుట్టగానే అతని నుండి వేరు చేయబడ్డాడు.
8. శమంతకమణి అపహరించావని అవమానిస్తే ఆ అపవాదుని కష్టపడి తొలగించుకొన్నాడు.
కానీ కృష్ణుడు ఎప్పుడు కుంగిపోక యోగ సాధనపై దృష్టి పెట్టాడు. అందరికి పూజ్యుడయ్యాడు. గీతను ఉపదేశించి జగద్గురువయ్యాడు.

ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు, సవాళ్ళు ఉంటాయి. ఏ ఒక్కరి జీవితం పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగా సాగదు. ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుస్తుంది.. మనకు ఎంత అన్యాయం జరిగినా..ఎన్ని అవమానాలు ఎదురైనా మనకు దక్కాల్సింది దక్కకపోయినా.. ఏ సందర్భంలోనైనా మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం. ఇదే మనిషికి చాలా ముఖ్యమైంది. ఎన్ని బాధలు పడ్డా, అవమానాలు ఎదురైనా ధర్మాన్ని వదులరాదన్న జీవిత సారం  కృష్ణుడు బోధించాడు.

జయహో కృష్ణం వందే జగద్గురుం

5, సెప్టెంబర్ 2023, మంగళవారం

జన్మదిన శుభాకాంక్షలు నాలోని సగమా

 నీవు లేనిదే నేను పూర్తికాను
చావు రానిదే నిను వదలిపోను.
జన్మదిన శుభాకాంక్షలు నాలోని సగమా
మన్మదిలో సతతం శోభించే నా ప్రియ ఉమా!

4, సెప్టెంబర్ 2023, సోమవారం

తననుకున్నది జరగకపోతే చావాలి! - తనకనుకూలంగా జరగకపోతే చంపాలి!. ఇదెక్కడి సంస్కారం?

 తననుకున్నది జరగకపోతే చావాలి
తాను కోరుకున్నది దక్కకపోతే చావాలి
తనను తిరస్కరిస్తే చావాలి
తనను తిరస్కరిస్తే చంపాలి
తనకు కావాల్సింది దక్కకుంటే చంపాలి
తనకనుకూలంగా జరగకపోతే చంపాలి

చావటంలోనైనా చంపటంలోనైనా
ముగిసిపోయేది ఒక జీవితమని
మిగిలిపోయేది కన్నవారి కలలని
మిగిల్చిపోయేది అంతులేని విషాదమని
పగిలిపోయేది వారి గుండెలని
ఒక్క క్షణకాలం ఆలోచించలేని
ఆలోచింప చేయలేని కులమెందుకు?
మతమెందుకు? ధనమెందుకు?
పరువెందుకు? చదువెందుకు?

అరచేతిన ప్రపంచ జ్ఞానం ఒడిసి పట్టిన మానవుడా!
మర బొమ్మల చేసి మర బొమ్మవైన రాక్షసుడా!
మధురమైన బంధమంటే మగువ పొందొకటే కాదు.  
నువు బ్రతికి, బ్రతికించటం నేర్చుకో
పోయేదంతా మంచికని తెలుసుకో
ధర్మం వీడకుంటే అంతకు మించి దక్కుతుందని తెలుసుకో
నిత్యం గీతను స్మరించుకో
నిన్ను నువ్వు సంస్కరించుకో

3, సెప్టెంబర్ 2023, ఆదివారం

తోడబుట్టిన అక్కను చంపె, పాడు మోహము

తోడబుట్టిన అక్కను చంపె,

పాడు మోహము, పాపము చేసె

తోడుగ ప్రియుండు ఉమరుడుండ.

చూడు నీ బతుకును


బాగుచేయతరమా! అందరు

వాగుచుందురు చులకన చేసి

వేగు చుందురు వేడినూనెన

కాగు మిడతల వలె


కామానికి, మోహానికి, ప్రేమకు

తేడా తెలియక క్షణికావేశంలో

ఎంతకైనా తెగించే

ఈ వైఖరికి కారణం ఎవ్వరు?

 

సాధించాలని సరదా పడితే చాలదు

సాధించాలని సరదా పడితే చాలదు
సాధించగలనన్న నమ్మకం సడల రాదు
సాధించాలన్న తపన వదల రాదు
సాధించాల్సిన లక్ష్యం నుండి దృష్టి మరల రాదు
సాధించాల్సిన లక్ష్యం వైపు పయనం ఆపరాదు

25, ఆగస్టు 2023, శుక్రవారం

మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు

 మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు
అడిగిన  తరుణమున మురియ,  ఆదుకొనగ చేత గాదు
సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా?   కాదు
మాయెడల దయ  చూపు  మా మహా  దేవుడవే కదూ!

తెలుసుకుంటావా ఓ మానవుడా !

 డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు
నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా సిగ్గు పడటం లేదు పడినా పట్టించుకోవడం లేదు.
జవసత్వాలు ఉడిగినా మానవత్వపు జాడ మరుగవుతున్నా మతం చిచ్చు ఆరడం లేదు  ఆరినా రాజేయడం ఆపడం లేదు.
యవ్వన మోహంలో కన్నవారిని, తమ కన్నవారిని, కట్టుకున్న వారిని కడతేర్చగ వెనకాడడం లేదు ఆడినా మోహపు మత్తు ఆగనివ్వడం లేదు.

తాము బ్రతుకుతున్నది అద్దాల మేడలో అని రాయి తాము విసిరినా
తమపై ఎదుటి వారు విసిరినా నిలువ నీడ లేనిది తమకేనని ఏనాటికైనా
తెలుసుకుంటావా ఓ మానవుడా ! విధి ఆటకు నువ్వు రాజువైన
బంటువైన చేరేది ఒకే విడిదికని తెలుసుకుంటావా ఓ మానవుడా !

3, మే 2023, బుధవారం

కాలం కరుణ లేనిది

కాలం కరుణ లేనిది


కాలం కరుణ లేనిది
క్షణకాలం నీ కోసం నాకోసం అగనంటుంది
తీపి జ్ఞాపకాలున్నా
చేదు నిజాలున్నా
ఏది ఏమైనా
సంతోష శుభోదయమైనా
విషాదసంధ్యా సమయమైనా
ఏ పరిస్థితెదురైనా
కాలం ఆగక ముందుకెళుతూనే ఉంటుంది

ఒక బంధాన్ని నిర్దయగా తుంచేస్తుంది
ఒక బంధాన్ని కొత్తగా చిగురింపచేస్తుంది
నువ్వు పొగిడినా పొంగిపోదు
నువ్వు తిట్టినా కుంగిపోదు
ఎన్నడూ తన పయనం మాత్రం ఆపబోదు
ఎప్పుడు తన గమనం మాత్రం ఆగిపోదు

కాలం కరుణ లేనిది
నువ్వు గెలిచావని ఆకాశాన్ని తాకినా
నువ్వు ఓడావని నేలపైన పడినా
తాను ముందుకెళుతూనే ఉంటుంది
కాలం కరుణ లేనిదని ఆడిపోసుకోకు
అన్నిటిని అర్ధం చేసుకో
ఆగిపోక ముందుకు సాగిపో
జీవితాన్ని జీవించడం నేర్చుకో  
కాల తత్వాన్ని అర్ధం చేసుకో
 

- శివ భరద్వాజ్
లైఫ్ కోచ్, వెల్త్ అడ్వైజర్ & కన్సల్టెంట్

7, మార్చి 2023, మంగళవారం

తాయత్తుకు నిజంగా మహిమ ఉందా? మనం కోరుకున్నది నెరవేరుస్తుందా?

తాయత్తుకు నిజంగా మహిమ ఉందా? మనం కోరుకున్నది నెరవేరుస్తుందా?

 

9 నెలలు నీ తల్లి మోస్తే నీవు పుట్టావు.

9 సంవత్సరాలు నీ లక్ష్యాన్ని మోస్తే నీ భవిష్యత్తు పుడుతుంది.

 

మరి నీ భవిష్యత్తు విజయవంతంగా ఉండాలంటే, విజయాన్ని నువ్వు సాధించాలంటే నీకొక విజన్ ఉండాలి. నీకొక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. నీ లక్ష్యం చేరుకోవాలంటే నీవు ఒక తాయత్తు కట్టుకోవాలి. 


తాయత్తు కట్టుకుంటే దుష్ట శక్తులు దగ్గరకు రావని, అద్భుత శక్తులు వస్తాయని, ఏ విధమైన అనారోగ్యాలు రాకుండా 

కాపాడుతుందని, కష్టాలు రాకుండా చేస్తుందని,భయాన్ని పోగొడుతుందని, మనం కోరుకున్నది జరిగేలా చేస్తుందని  రక రకాల నమ్మకాలూ, భావనలు ప్రజలలో ఉన్నాయి. ఇది బలంగా నమ్మినవారికి, మూఢంగా నమ్మేవారికి, చాలా సందర్భాలలో వారు పెట్టుకున్న నమ్మకాలు, భావనలు నిజం అయ్యాయి కూడా. నిజంగా తాయత్తుకు అంత మహత్యం ఉందా?. తాయత్తు అంత శక్తి వంతమైనదా? తెలుసుకునే ముందు అసలు తాయత్తు అంటే ఏమిటి? దాని పుట్టు పూర్వోత్తరములు ఏమిటి? ఒకసారి తెలుసుకొందాం


తమిళంలో తాయి అంటే తల్లి, అత్తు అంటే ఖండించబడింది అని అర్ధం. తాయత్తు అంటే తల్లి నుండి ఖండించబడిందని అర్ధం. బిడ్డ పుట్టగానే తల్లి, పిల్లవాడిని కలిపివుంచే బొడ్డు తాడును కత్తిరిస్తారు. పూర్వకాలంలో ఇలా కత్తిరించిన బొడ్డు తాడును రక్తాన్ని కొన్నిరకాల పసర్లతో కలిపి ఒక లోహపు గొట్టంలో పురుడు పోసిన మంత్రసాని ఉంచేది.  బారసాల తరువాత దానిని ఎప్పుడూ బిడ్డ దగ్గరే ఉండేలా బిడ్డ మొలకు కట్టిఉంచేవారు. 


ఆ బిడ్డ జీవితాంతం అది మొలకు ఉండేది. కాలక్రమంలో ఎప్పుడైనా అంతుపట్టని పెద్ద జబ్బు వస్తే ఆయుర్వేద వైద్యులు వైద్యం చేయడం కోసం మొలకు కట్టిన బొడ్డుతాడు ముక్కను పసర్లతో కలిపి మందు తయారు చేసి ఇచ్చేవారు.రోగం నయమయ్యేది.  కాలంతో పాటు ఆ వైద్య విధానం కనుమరుగై పోయింది. అయినా ఆచారం కొనసాగుతుంది. ఇప్పుడు అది తగ్గిపోయి మొలతాడు కట్టుకుంటున్నారు, కొందరు అది కూడా మానేశారు. అయితే ఈ తాయత్తు వాడకం తప్పనిసరి చేయడం కోసం, పిల్లలు తీసివేయకుండా ఉండడం కోసం  రక రకాల కథలు అల్లారు. ఆ కథలే మనం ముందు చెప్పుకున్న మహత్యాలు. మరి అవి కథలైతే నిజం ఏమిటి? ఎందుకు తాయత్తుని కట్టుకుంటే మన కోరిక నెరవేరుతుంది!


"యాద్భావం తద్భవతి" -  అద్భుతమైన వాక్యం. దీనర్ధం మనం ఏది అనుకుంటే అది అవుతుంది. 


మనం ఏది జరగాలని బలంగా కోరుకుంటే, మనం  ఏది జరగాలని బలంగా విశ్వసిస్తే అది జరిగేందుకు అనుగుణంగా మన ఆలోచనలు మొదలవుతాయి. మన మెదడు మనం ఆ దిశగా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. దానికి అనుగుణంగా మన చర్యలు లేదా పనులు ఉంటాయి. మన కోరిక నెరవేరేలా ప్రతీ రోజూ ఆ దిశగా పని చేయడం వలన, ఆ పనులు మన అలవాట్లుగా మారుతాయి. మన అలవాట్లు మనల్ని మనం అనుకున్న దిశగా నడిపిస్తాయి, మనం అనుకున్నది జరుగుతుంది. ఇదే తాయత్తు మహిమ.


 

తన మీద తనకు నమ్మకం లేని వ్యక్తి, మానసికంగా బలం లేని వ్యక్తి, తాయత్తుని నమ్మేవారు చెప్పే మాటలు విని తన కోరికలు నెరవేర్చే శక్తి తాయత్తులో ఉందని బలంగా విశ్వసిస్తాడు, నమ్ముతాడు. దాంతో ఆ మూఢనమ్మకం వల్ల మనం ముందు చెప్పుకున్న ఆలోచన చర్యల పరంపర మొదలై అతని కోరిక నెరవేరే దిశగా అతని పయనం సాగుతుంది. అతను ఏ ఉద్దేశ్యంతో అయితే తాయత్తు ధరించాడో ఆ ఉద్దేశ్యం నెరవేరుతుంది. 


దీనిగురించి ఒక కథ చెబుతాను. ఒక ఊరిలో శివ అనే వ్యక్తి ఉండేవాడు. అతను జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు. అతను ఒకటి అనుకుంటే మరొకటి జరిగేది.  వ్యాపారం చేద్దామనుకుంటే నష్టాలు వచ్చేవి. ఉద్యోగం చేద్దామనుకుంటే ఎవరూ ఇచ్చేవారు కాదు. ఊరంతా అతనిని దురదృష్టవంతుడు అనేవారు, అతను ఎందుకు పనికిరానివాడని హేళన చేసేవారు. ఈ కష్టాలకు, సాటి వారు అనే మాటలకు నొచ్చుకున్న అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అతను నివసించే ప్రదేశానికి దూరంగా ఎత్తైన కొండ పైకి చేరుకున్నాడు. ఆ కొండ పై నుంచి దూక బోతున్నాడు. ఇంతలో ఒక బైరాగి అక్కడికి వచ్చాడు. ఆ బైరాగి నువ్వు ఎందుకు చనిపోవాలని కుంటున్నావు నాయనా అని శివని అడిగాడు. తన పరిస్థితి అంతా వివరంగా ఆ బైరాగికి చెప్పాడు. అప్పుడు ఆ బైరాగి పక పకమని నవ్వి నువ్వు దురదృష్టవంతుడివి కావు. చాలా అదృష్టవంతుడివి అందుకే ఆ సంఘటనలన్నీ నీ జీవితంలో జరిగాయి. నువ్వు చనిపోవడానికి నిశ్చయించుకొని ఇక్కడికి వచ్చావు. నాకు కనిపించావు. లేకుంటే నువ్వు నాకు కనిపించేవాడివి కావు. నీ అదృష్టం వలన ఆ సంఘటనలన్నీ నీ జీవితంలో జరిగాయి. 

నేను ఎంతోకాలం నుండి హిమాలయాలలో తపస్సు చేసి సాధించిన తపోశక్తితో ఒక అద్భుతమైన తాయత్తు చేశాను. ఆ తాయత్తును ఇవ్వడానికి యోగ్యత ఉన్న వ్యక్తి కోసం చూస్తున్నాను. ఆ యోగ్యత ఉన్న వ్యక్తి ఇన్నాళ్లకు నాకు కనిపించాడు. ఆ వ్యక్తివి నువ్వే అని ఆ తాయత్తులో మంత్రాక్షరాలతో రాసిన పేపర్ పెట్టి ఇచ్చాడు.

కుమారా ఈ తాయత్తుని జాగ్రత్తగా కాపాడుకో. పొరపాటున కూడా దీనిని ఎప్పుడూ ఓపెన్ చేయకు. ఆ పేపర్ లో ఏముందో చదవకు. అలా నువ్వు చేస్తే ఈ తాయత్తు దాని మహిమను కోల్పోతుంది. దీనిని ధరించడం వలన నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా మారుతుంది. నువ్వు నీ జీవితంలో అనుకున్నవి అన్ని సాధించాక,ఇంక జీవితంలో సాధించడానికి ఏమి లేదు అనుకున్నప్పుడు, నీ చివరి రోజులలో దీనిని ఓపెన్ చేసి చదువు. అప్పుడు ఈ తాయత్తు మహత్తు నీకు తెలుస్తుందని చెప్పి వెళ్లి పోయాడు.


శివ ఆనందంతో పొంగి పోయాడు. తన కష్టాలన్నిటికి కారణం, తాను చనిపోవాలనుకోవడానికి వెనుక ఇంత కథ ఉందన్నమాట, నేను చాలా అదృష్టవంతుడిని. ఈ తాయత్తు పొందడానికి నా జీవితంలో ఇన్ని కష్టాలు మాటలు పడ్డానన్న మాట అని అనుకున్నాడు. తన గతాన్ని మరిచిపోయాడు. తాను సాధించబోయే విజయాల గురించి ఊహించటం మొదలుపెట్టాడు. తన ఊహల్ని నిజం చేసుకోవటానికి ప్రయత్నం మొదలు పెట్టాడు. ఒక్కక్కటిగా జీవితంలో తాను అనుకున్నది సాధించటం మొదలు పెట్టాడు. భయపడటం మాని ప్రయత్నించటం మొదలు పెట్టాడు. విజయాలను అలవాటుగా మార్చుకున్నాడు. మంచి ఉద్యోగం వచ్చింది. మంచి భార్య లభించింది. బంగారం లాంటి పిల్లలు పుట్టారు. తాను అనుకున్నట్టుగా ఒక స్టార్ట్అప్ మొదలు పెట్టాడు. అది సక్సెస్ అయ్యి ఒక సక్సెస్ ఫుల్ entrepreneur అయ్యాడు. ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. లగ్జరియస్ కార్లు కొన్నాడు. విలాసవంతమైన బంగ్లాలోకి అతని నివాసం మారిపోయింది. దేశవిదేశాలు తిరిగాడు. మంచి స్కూళ్ళు కట్టించాడు. విద్యను ప్రోత్సహించాడు. అనాధలకు ఆశ్రయం కల్పించాడు. సమాజానికి తన వంతు సేవ చేసాడు. పిల్లలు పెద్ద వాళ్లయ్యి బిజినెస్ చూసుకోవడం మొదలు పెట్టారు. తన జీవితంలో సాధించాలనుకున్నవి అన్ని సాధించాడు. ఇప్పుడు ముసలివాడయ్యాడు. తన జీవితం ధన్యమైంది అనుకున్నాడు. ఇక మనఃశాంతిగా చనిపోవచ్చనుకున్నాడు.  అప్పుడు అతనికి బైరాగి అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. తాయత్తు గుర్తుకు వచ్చింది అది అతని చేతికి అలాగే ఉంది. ఆతృతగా దానిని తెరిచి ఆ పేపర్ లో ఏముందో చదివాడు. చదివి నిర్ఘాంత పోయాడు. కాసేపటికి తేరుకున్నాడు. నిజంగానే ఇది అద్భుతమైన, ప్రతిఒక్కరు తెలుసుకోదగిన సత్యం అని సంతోషించాడు. అందులో రాసి ఉన్న మంత్రం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే జాగ్రత్తగా వినండి. ఇది చాలా శక్తివంతమైన మంత్రం. అందులో ఇలా రాసి ఉంది.


"కుమారా! ఈ తాయత్తులో ఏమి లేదు. అనంతమైన శక్తి నీలోనే ఉంది. నీ ఆలోచనల్లోనే ఉంది. నీ మనస్సే సర్వ శక్తివంతమైనది. నీవు గడిపిన విజయవంతమైన నీ జీవితమే అందుకు గొప్ప ఉదాహరణ." 


అవును ఇది బైరాగి చెప్పిన గొప్ప జ్ఞానం. అనంతమైన శక్తి నీలోనే ఉంది. వివేకానందుడు చెప్పింది ఇదే, వేదాలు, పురాణాలు ఘోషించేది ఇదే..


మన విజయానికి అవసరమైన తాయత్తు మన మనస్సులోనే ఉంది. దానిని బయటకు తీద్దాం 


మనం విజయానికి అవసరమైన మనో తాయత్తు కట్టుకుందాం.

మనం విజయాలను అలవాటుగా మార్చుకుందాం.


ధన్యవాదములు మిత్రులారా!


జై హింద్

జై భారత్

వందే మాతరం. 

 

Watch on Youtube https://youtu.be/nv7sKm-5cLA 

 

భారతీయ మహిళ ఔన్నత్యం

 నిజంగా లోతైన ఆలోచన కలిగించే వ్యాసం👇 🌼 మహిళల తెలివితేటలను అర్థం చేసుకోవడానికి ఎవరైనా ఎప్పుడైనా నిజంగా ప్రయత్నించారా? 🌼  మనం తరచుగా తెలివి...