ఒక్క క్షణం,
మనసులో ఒక ఆలోచన,
విద్రోహం జన్మించి,
వికృతంగా నవ్వింది.
మరుక్షణం, ఆ ఆలోచన,
మలుపు తిరిగి,
ఆకులలో, చీకటిలో,
ఇరుకైన కనుమలలో, లోయలలో,
పర్వత శిఖరాలలో పయనించి,
పహల్గామ్ పచ్చికబయళ్ళలో,
తేలి వికటాట్టహాసం చేసింది.
ఒక్క క్షణంలో,
నవ్వుతో నిండిన ముఖములు,
రంగులు వెలసిన పువ్వులవలె,
విషణ్ణ వదనములై,
ముష్కరుల విధ్వంసపు గుర్తులై,
నేల రాలిపోయాయి.
ఒక క్షణంలో,
బంధం తెగిపడి వేరుపడి,
వేదన కమ్మివేసింది.
ఒక్క క్షణంలో,
మొత్తం ప్రపంచం! మారిపోయింది.
తూటా గుళ్ల శబ్దంలో,
నవ్వులు వేగంతో వెనక్కి వెళ్లిపోయాయి.
రోదనతో అలసిన
గుండెలలో... ఇప్పుడు నిశ్శబ్దం.
కళ్లు, కన్నీటి తెరల వెనుక,
ఆనందం ఆవిరై,
ఆశతో, నిజం అబద్ధమై,
మరలా లేచొస్తావా నేస్తం,
అని ఎదురుచూస్తున్నాయి.
ఈ క్షణంలో,
దాయాదితో దశాబ్దాల వైరం,
అంతంచేయాలన్న ప్రతిన,
భారతీయుల మనోరథంలో,
వేగంగా దూసుకుపోతోంది.
హృదయపు కొండలలో,
ఆ ప్రతిజ్ఞ మారుమోగుతోంది.
-శివ భరద్వాజ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి