*సుప్రభాతం:*
15 Feb 2025
ఉండేటి ఇల్లు నీ బహుమతి,
పండేటి పంట నీ బహుమతి,
వీచేటి గాలి నీ బహుమతి,
ఓ పరమేశ్వరా! నీ బహుమతులు అనుభవిస్తూ,
ఇతరులను ప్రశంసించే వారినేమనాలి.
భావం: ఓ పరమేశ్వరా! పీల్చేగాలి, తినే తిండి, ఉండే ఇల్లు అన్ని నీ అనుగ్రహమే, దీనిని గుర్తించక అవి ఇతరుల వల్ల లభించాయని, వారిని ప్రశంసించే అజ్ఞానులనేమనాలి.
-దేవర దాసిమయ్య,
స్వేచ్చానువాదం: శివ భరద్వాజ్
14 Feb 2025
పాలిండ్లు వచ్చిన పడతియందురు,
గడ్డ మీసంబులొచ్చిన పురుషుడందురు.
నడుమ తిరుగుయాత్మ,
స్త్రీ గాదు, పురుషుండు కాడు! రామనాథ!!
భావం: ఓ పరమేశ్వరా! స్త్రీ పురుషుల భేదభావం శరీరమునకే గాని, ఆత్మకు కాదు.
విస్తృత అర్ధం: జన్మ చేత లభించే భేద భావములు శరీరమునకు మాత్రమే సంబందించినవి. అది కులమా, ధనమా, వర్ణమా, వర్గమా, ప్రాంతమా, లింగ భేదమా అన్నది పట్టించుకోవలసిన అవసరం లేదు. ఇవేవి ఆత్మకు సంభందించినవి కావు.
-దేవర దాసిమయ్య,
స్వేచ్చానువాదం: శివ భరద్వాజ్
16 Feb 2025
ఉదయము లేదు, అస్తమయము లేదు,
మధ్యాహ్నం లేదు, విషువత్తులు లేవు,
పౌర్ణమి లేదు, అమావాస్యయు లేదు.
శివునిలో లీనమైన వ్యక్తి, ఇంటి ప్రాంగణమే
నిజమైన కాశి క్షేత్రము ఓ రామనాథ
భావం: ఓ పరమేశ్వరా! అన్ని సమయములలోను, నీతోనే లీనమైన మనిషికి వేరే క్షేత్రములతో పని ఏమున్నది. అతని నివాసమే నిజమైన కాశీ క్షేత్రము కదా!
-దేవర దాసిమయ్య వచనములు.
స్వేచ్చానువాదం: శివ భరద్వాజ్
17 Feb 2025
అగ్ని జ్వలిస్తుంది కానీ కదలలేదు.
గాలి కదులుతుంది కానీ జ్వలించలేదు.
ఆ అగ్ని,వాయువులు కలిసినప్పుడు గాని అగ్ని ముందుకు కదలదు.
ఓ ఈశ్వరా! తెలుసుకోవడం(జ్ఞానం) మరియు ఆచరించడం(క్రియ) కూడా అలాగే ఉంటుందని నరులకు తెలుసా?
భావం:
మంట పుట్టినప్పుడు ఒకే చోట ఉంటుంది. కానీ వ్యాపించదు.
గాలి వ్యాపిస్తుంది కానీ మండలేదు.
గాలి, మంట కలిసినప్పుడు అవి రెండూ కలిసి మండుతూ వ్యాపిస్తాయి.
అలాగే మనకు ఒక విషయం తెలియడం అంటే మంట పుట్టటం లాంటిది. అది మీలోనే ఉంటుంది.
మనకేమి తెలియకుండా మనం ఆచరించటం వలన అంత ఉపయోగం ఉండదు.
కానీ మనం తెలుసుకున్నది ఆచరించ గలిగినపుడు దాని వలన ప్రయోజనం పొందుతాము. ఆ ప్రయోజనం అందరికీ పంచగలుగుతాము.
-దేవర దాసిమయ్య వచనములు.
స్వేచ్చానువాదం: శివ భరద్వాజ్
18 Feb 2025
*దేవర దాసిమయ్య వచనములు.*
ఓ పరమేశ్వరా! శివభక్తిలో ఐక్యమైన వానికి
ఉదయం అమావాస్య,
మధ్యాహ్నం సంక్రాంతి,
మరల సాయంత్రం నిండుచంద్రుని పున్నమి.
అటువంటి పవిత్ర భక్తుని ఇంటి ప్రాంగణం కాశీలా భాసిస్తుంది.
భావం: శివ భక్తిలో లీనమైన పవిత్ర భక్తునికి ఉదయం అమావాస్యగా, మధ్యాహ్నం సంక్రాంతిగా, సాయంత్రం నిండు పున్నమిలా ఉంటుంది. అటువంటి భక్తుని ఇల్లు కాశితో సమానమని భావం.
వివరణ: పై వచనం మామూలుగా పరిశీలిస్తే అన్నివేళల శివభక్తిలో మునిగి తేలేవారి ఇల్లు కాశితో సమానమని చెప్పినట్లుగా కనిపిస్తుంది. కానీ దాసిమయ్య విస్తృతమైన అర్ధాన్ని ఇందులో ఇమిడ్చరాని నాకు అనిపిస్తుంది. అది మీతో పంచుకుంటున్నాను. ఈ వచనం చీకటి (అమావాస్య) నుండి పరివర్తన (సంక్రాంతి) వరకు, ఆపై ఆధ్యాత్మిక అనుభవ పరిపూర్ణత (పౌర్ణమి) వరకు భక్తుడి ప్రయాణంలోని వివిధ దశలను అందంగా చిత్రీకరిస్తుంది. ఈ దశలు ఉదయం నుండి సాయంత్రం వరకు రోజువారీ కాలచక్రంతో సమన్వయం చేసి చెప్పబడ్డాయి. ఒక భక్తుడి ఆధ్యాత్మిక సాధనలో మరియు శివుడితో సంబంధాన్ని చక్కటి రూపకాలంకారంతో వివరించ బడ్డాయి.
అమావాస్య (అమావాస్య) అంటే చీకటి. శివభక్తిలో లీనమైన వారి అధ్యాత్మిక ప్రయాణం ప్రారంభాన్ని సూచిస్తుంది, ఇక్కడ మొదట్లో వారి ఆత్మ కాంతి లేకుండా దైవికతను అన్వేషిస్తుంది.
సంక్రాంతి (మధ్యాహ్నం) అంటే ఒక స్థితి నుండి మరొక స్థితికి పరివర్తన మరియు పురోగతి సమయాన్ని సూచిస్తుంది, ఈ స్థితిలో భక్తుడు ఆధ్యాత్మిక ప్రకాశం మరియు పరివర్తనను అనుభవిస్తాడు.
పౌర్ణమి (పౌర్ణమి) ఆధ్యాత్మిక సాక్షాత్కారం యొక్క ఉన్నత స్థాయిని సూచిస్తుంది, ఇక్కడ భక్తుడు సంపూర్ణత్వం, స్వచ్ఛత మరియు దైవిక ఆనందాన్ని పొందుతాడు.
అప్పుడు ఆ భక్తుడి ఇల్లు దైవిక శక్తిని ప్రసరింపజేస్తుందనే భావనతో ఈ శ్లోకం ముగుస్తుంది, అతడున్న ప్రదేశం శివుని యొక్క దివ్యమైన ఉనికి అత్యంత బలంగా అనుభూతి చెందే ప్రదేశం(కాశి సమ క్షేత్రం) అవుతుంది.
*-దేవర దాసిమయ్య*
స్వేచ్చానువాదం: శివ భరద్వాజ్
26 Feb 2025
*మహాశివరాత్రి శుభాకాంక్షలు*
*దేవర దాసిమయ్య వచనములు*
జ్ఞానం గ్రహించమని,
గురుతు చేతికిచ్చావు.
జ్ఞానం మరచి గురుతునే గ్రహించిన,
ఈ గొర్రెల కాపరులకింకెక్కడిది ముక్తి!
రామనాథా!
భావం: ఓ ఈశ్వరా! జ్ఞానం పొందమని గుర్తు మా చేతికి ఇచ్చావు. కానీ జ్ఞానం మరిచిపోయి గుర్తుకు ప్రాధాన్యత ఇస్తున్నాము. అలా చేస్తున్న మనకు మోక్షం ఎలా కలుగుతుంది.
వివరణ:
నిరాకారుడు, త్రిగుణాతీతుడు, సర్వ వ్యాపి, ఆద్యంత రహితుడు అయిన ఆ ఈశ్వరుని యొక్క తత్వం తెలుసుకొనడానికి, ఒక సాకార రూపాన్ని అనగా కొన్ని గుర్తులను(విగ్రహాలు,మంత్రాలు,తంత్రాలు,యంత్రాలు) మనకు అనుగ్రహించాడు. వాటిని ఉపయోగించుకొని నీలోను, ఈ సృష్టిలోను గల, ఆ పరమేశ్వరుని తత్వం తెలుసుకోవాలి. కానీ ఇందుకు విరుద్ధంగా, మనం సత్యమైన జ్ఞానాన్ని అంగీకరించకుండా, మనలో ఉన్న ఆ పరమేశ్వరుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా, మానవ సంబంధాలు, వ్యక్తిగత అభిరుచులు, ఆచారాలు, సంస్కృతులు మరియు ఇతర భ్రమలు మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే, కేవలం లౌకిక సుఖాలకోసం ఆరాధిస్తుంటే, దుఃఖ కారణములైన చావు,పుట్టుకల వలయం నుండి విముక్తి(మోక్షం) పొందలేము. గొర్రెలకాపరి పదం గురువులను ఉద్దేశించి చెప్పినది, ఎందుకంటే గొర్రెలు(సామాన్య జనులు) కాపరి(గురువు) ఎలా తీసుకువెళితే అలా వెళ్తాయి.
స్వేచ్చానువాదం: శివ భరద్వాజ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి