13, ఫిబ్రవరి 2025, గురువారం

🔱 అంతర్యామి 🔱

 🔱 అంతర్యామి 🔱

#  జీవిత మకరందం..

🍁శరీరం సుఖం కోరుతుంది, మనసు ఆనందం ఆశిస్తుంది. ఆరంకెల జీతం, విలాసవంతమైన నివాస భవనం ఉంటే చాలు... జీవితం ఆనందమయం అనిపిస్తుంది. డబ్బులో శరీరానికి సుఖాన్ని, తద్వారా మనసుకు నచ్చిన వస్తు సముదాయాన్ని కొనగలం. అంతేకానీ, ఆనందాన్ని కాదు. సుఖ సంతోషాలతో గడపడానికి మనిషికి తగినంత ధనంతో పాటు తృప్తి, వ్యక్తుల మధ్య భావ సమన్వయం, సర్దుబాటు తత్వం ఉండాలి. తమ స్వభావాలకు అనుకూలంగా పరిస్థితులను, పరిసరాలను మలచుకోవాలి. కుదరనప్పుడు వాటికి అనుకూలంగా స్వభావాన్ని మార్చుకోవాలి. నేడు చాలా కుటుంబాల్లో శాంతి లోపించడానికి కారణం ఈ సర్దుబాటుతత్వం లేకపోవడమే.

🍁తీయదనం అనేది చేతితో పట్టుకుని కంటితో చూసే పదార్ధం కాదు. నోట్లో పెట్టుకున్నప్పుడు కలిగే రసానుభూతి. అలాగే ఆనందం కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా మనసు పొందే అనుభూతి. సహజంగా మనిషికి మంచి సంగీతం విన్నా, ప్రకృతి రమణీయతను కన్నా, మధురమైన పదార్థాన్ని రుచి చూసినా, సున్నితమైన వాటిని తాకినా, సుగంధాన్ని ఆస్వాదించినా ఆనందం కలుగుతుంది. పుస్తక పఠనం, సత్సాంగత్యం వంటి సత్కాలక్షేపాలతో కొందరు, భావనాలోకంలో విహరిస్తూ మరికొందరు, భక్తి రసామృతంలో మునకలు వేస్తూ ఇంకొందరు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ కొందరు... ఎవరి అభిరుచికి, తాహతుకు తగ్గట్టు వారు ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దుఃఖమైనా, ఆనందమైనా మనిషి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. నిర్మల హృదయంతో పరిశీలిస్తే లోకంలో ప్రతిదీ ఆనందకారకమే. ఆనందపు లోతులు అనుభవించడం మనిషి విజ్ఞత, రసజ్ఞత, జీవనశైలి, మానసిక పరిణతి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం ఒక కళ, నేర్పు. ఆనందాన్ని ఇచ్చేవాటి కోసం వెతకడంకన్నా ఆనందం పొందగల గుణాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిది.

🍁ఆనందం పొందడం వేరు, ఆనందంగా ఉండటం వేరు. భోగి ఆనందం పొందుతాడు. యోగి ఆనందంగా ఉంటాడు. మొదటిది కర్మేంద్రియాలను కేవలం బాహ్య వస్తువులపై, పరిసరాలపై ఆధారపడేది. రెండోది జ్ఞానంతో పొందేది. జ్ఞానులకు ఆత్మస్వరూపం, ఆనందం వేరు వేరు కాదు. భగవంతుడు ఆనంద స్వరూపుడు. ఆయన సృష్టి ఆనందమయం. ప్రతి జీవాత్మ సహజ స్థితి ఆనందమే. ఆ ఆత్మానందాన్ని పొందేందుకు జ్ఞానులు తపిస్తారు, సాధన చేస్తారు. అది భౌతిక అంశాలకు సిరిసంపదలకు అతీతమైంది. ఆ జ్ఞానమే మోక్షం. మోక్షమే ఆనందం. చీమ నుంచి ఏనుగు వరకు మానవుల నుంచి దేవతల వరకు ఎవరైనా కోరుకునేది ఆనందానుభవమే కదా.

🍁సుఖసంతోషాలు జీవన కుసుమానికి రంగులు, సుగంధాలయితే ఆనందం మకరందం. మనిషి మకరందాన్ని మృదువుగా ఆస్వాదించే తుమ్మెద కావాలి.🙏

✍️- కస్తూరి హనుమన్నా గేంద్ర ప్రసాద్

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మహా శివ రాత్రి : శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?

శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగివున్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి?             తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమ...