10, జనవరి 2025, శుక్రవారం

🔱 అంతర్యామి 🔱

 శ్రీ రామ జయ రామ జయజయ రామ:
🔱 అంతర్యామి 🔱

# సమయం రావాలి!...

🍁ఒకసారి ఓ సాధువు శిష్యులతో ఓ గ్రామంలో బస చేసి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, పరిష్కార మార్గాలను సూచిస్తున్నాడు. అది తెలిసి పొరుగూరి రామయ్య, భీమయ్య ఆయన దగ్గరకు వచ్చారు. తమ గోడు విన్నవించుకున్నారు.
'మమ్మల్ని దరిద్రం పట్టిపీడిస్తోంది. మాకు నిధి నిక్షేపాలక్కరలేదు. మనులు మాన్యాలక్కరలేదు. కడుపునిండా తిండి దొరికే మార్గం చూపండి
స్వామీ!' అని వేడుకున్నారు. సాధువు సంచిలోంచి ఒక పొట్లం తీసి, దాంట్లోంచి రెండు విత్తనాలు ఇద్దరికీ ఇచ్చాడు. 'వీటిని తీసుకెళ్లి నాటండి. మొక పెరిగి మధురఫలాలను ఇస్తుంది. వాటి రుచి అమోఘం. మంచి ధర పలుకుతుంది. మీకు ఆస్తులు గడించి పెట్టకపోయినా, ఆకలిబాధ లేకుండా ఆదుకుంటుంది' అన్నాడు. వాళ్లు సంతోషించారు.

🍁తిరిగెళ్లాక నేల చదును చేసి విత్తనం నాటి నీళ్లు చల్లారు. నాటిన దగ్గర్నుంచీ రామయ్య గింజ ఎప్పుడు మొలుస్తుందా అని ఎదురు చూసేవాడు. వారమైంది, పదిరోజులైంది. మొలక రాలేదు. తవ్వి చూస్తే విత్తనం అలాగే కనిపించింది. ఇంకేం మొలకెత్తుతుందని కోపంగా తీసి పారేశాడు. మరో వారం తరవాత భీమయ్య పాతిన గింజ మొలిచి చకచకా ఎదిగి కాపు పట్టింది. మధురమైన ఆ పండ్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్న భీమయ్యను చూసి తాను ఆ అవకాశాన్ని కోల్పోయినందుకు రామయ్య బాధపడ్డాడు. గుడ్డు నుంచి కోడిపిల్ల రావటానికి 21 రోజులు పడుతుంది. గర్భంలోని శిశువు భూమ్మీద పడటానికి తొమ్మిది నెలలు పడుతుంది. ఏ పనులు నెరవేరాలన్నా కొంత సమయం పడుతుందన్న ఇంగితజ్ఞానం లేకపోతే ఫలితం అనుభవించక తప్పదు.

🍁ఒక్కోసారి మనం పడిన కష్టానికి తగిన గుర్తింపు వెంటనే లభించదు. అలాంటప్పుడు కుంగిపోవడం, నిగ్రహం కోల్పోవడం తగదు. బాణభట్టారకుడనే మహాకవి పద్దెనిమిదేళ్లకే 'కాదంబరి' అనే గ్రంథం రాసి, రాజాశ్రయానికెళ్లాడు. అక్కడున్న పండితులు ఇతణ్ని హేళన చేశారు. 'కాదంబరి' అంటే కల్లు. కల్లు తాగితే రుచి తెలియదని రాజు భావించి పరిపక్వత లేదు, పొమ్మన్నాడు. బాధపడిన బాణుడు ఇంటికెళ్లి కోపంతో కావ్యాన్ని తగలెట్టాడు.

రెండురోజుల తరువాత కాళిదాసు వెళ్లి 'అబ్బాయ్, నీ కాదంబరిని మరోసారి వినిపించు' అంటే బాణుడు. తెల్లముఖం వేసి విషయం చెప్పాడు. 'సరేలే, నేను చెప్తా రాసుకో' అని ఏకసంధాగ్రాహి అయిన కాళిదాసు తాను విన్న కాదంబరిని ఉన్నదున్నట్లుగా అప్పజెప్పాడు. లేకపోతే కాదంబరి మనకు దక్కేది కాదంటూ బహుళ ప్రచారంలో ఉన్న కథ తొందరపాటు చర్యలు ఎంత నష్టం కలిగిస్తాయో చెబుతుంది.

🍁మరికొందరుంటారు... పర్యవసానం గురించి ఆలోచించకుండా తోచిన పని చేసేస్తారు. అవివాహిత అయిన కుంతి దుర్వాసుడిచ్చిన వరాన్ని ముందుచూపు లేకుండా ఆచరణలో పెట్టబట్టే కదా అంత కడుపుకోత అనుభవించింది. ఏ పనికైనా ముందు వెనకలు ఆలోచించి, సమయాసమయాలు చూసి నిర్ణయాలు తీసుకోవాలి.

✍️- పి. వి. బి. శ్రీరామమూర్తి
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే!

 డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే! డబ్బు చేసిన మనిషి, జబ్బు చేసిన మనిషి ఒకటే, ఇదీ నిజమే! పడవ పయనం సాగాలంటే, నీటి అవసరం నిజమే! పడవలోకి నీరు పయనిస్...