16, జనవరి 2025, గురువారం

🔱 అంతర్యామి 🔱

 శ్రీ రామ జయ రామ జయజయ రామ:
🔱 అంతర్యామి 🔱

# భక్తి పారవశ్యాo...

🍁దైవభక్తి, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి... భక్తికి రూపాలు. ఏ భక్తి అయినా పూర్తి విశ్వాసంతో స్థిరంగా ఉండాలి. భగవంతుడు పూజలకు, జపతపాలకు, అభిషేకాలకు పొంగిపోననీ, నిష్కల్మషమైన భక్తికి లొంగిపోతాననీ అనేక సందర్భాల్లో చెప్పాడు. భక్తులకు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఉండకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆంజనేయుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు, ధృవుడు, నారదుడు, అంబరీషుడు మొదలైన వారు అచంచలమైన భక్తికి మారు రూపాలు.

🍁భగవంతుడి మాయ ఆయనకి తప్ప వేరెవ్వరికీ అర్థం కాదు. ఆయన భక్తులకు చిన్న, చిన్న పరీక్షలు పెడుతుంటాడు. వాటికి తట్టుకుని నిలబడటం సంపూర్ణ భక్తి ప్రపత్తులు కలవారికి మాత్రమే సాధ్యం. అచంచల, నిష్కల్మష, నిస్వార్థ భక్తికి అర్ధం చెప్పే అద్భుతమైన సంఘటన ఒకటి భాగవతంలో ఉంటుంది. ఒకసారి కృష్ణ పరమాత్మకి భరించలేని తలనొప్పి వచ్చింది. ఎవరికీ చెప్పకుండా మౌనంగా బాధని భరిస్తున్నాడు. ఆయన భార్యలకు విషయ తెలిసి ఎన్నో ఉపచారాలు చేశారు. కానీ ఫలితం శూన్యం. పరమాత్ముడి బాధను చూసి వారంతా తల్లడిల్లిపోయారు. రాజ వైద్యులను పిలిపించారు. వాళ్లూ అనేక రకాల చికిత్సలు చేశారు.

🍁కృష్ణపరమాత్మ బాధ మాత్రం తగ్గలేదు. నారద మహర్షి, పలువురు మునులు, దేవతలు వచ్చారు. వారూ ఏమీ చేయలేకపోయారు. సృష్టి, స్థితి, లయ కర్త అయిన పరమాత్ముడికి వచ్చిన బాధని ఎవరు తగ్గించగలరు? నివారణోపాయం ఆయనకి తప్ప ఎవరికి తెలుసు? శ్రీకృష్ణ పరమాత్మ భార్యలు, ఆ బాధ తగ్గే విధానం చెప్పమని ఆయననే ప్రార్థించారు. తన భక్తులు ఎవరైనా వారి పాదధూళిని తన శిరస్సుపైన ఉంచితే, తలనొప్పి తగ్గుతుందని చెప్పాడాయన. ఆ మాటకి చుట్టూ ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. తమ పాదధూళి భగవంతుని శిరస్సుపై ఉంచడమా? ఎంత పాపం!? రౌరవాది నరకాలలో పడిపోతాం... అనుకున్నారు. అందరూ ముక్తకంఠంతో అటువంటి మహా పాపానికి పాల్పడలేమన్నారు. మీ ఇష్టం అన్నట్టుగా శ్రీకృష్ణపరమాత్మ తల పట్టుకుని బాధపడసాగాడు.

🍁తమ ప్రియసఖుడు బాధ పడుతున్నాడనే వార్త గోపికలకి తెలిసింది. పరుగున వచ్చారు. ఆయన బాధను చూసి కన్నీరుమున్నీరయ్యారు. వారికి అక్కడున్న వారు విషయం చెప్పారు. కానీ భగవంతుని శిరస్సుపై పాదధూళి ఉంచడం మహా పాపమని హెచ్చరించారు. దానికి గోపికలు తమను కోట్ల జన్మలవరకు పాపాలు వేధించినా పరవాలేదనీ, స్వామి బాధ తగ్గితే చాలనీ, తమ పాదధూళిని శ్రీకృష్ణ పరమాత్మ తలపై ఉంచారు. అది గోపికల భక్తి పారవశ్యానికి పరాకాష్ఠ. క్షణంలో ఆయన నొప్పి మటుమాయమయ్యింది. ఆయన బాధ కేవలం మాయ అని, భక్తులని పరీక్షించడానికి ఆడిన నాటకమని అందరికీ తెలిసింది. గోపికలు సంతోషంతో పొంగిపోగా మిగిలినవారంతా తలదించుకున్నారు.🙏

✍️-ఎం.వి.ఎస్.ఎస్. ప్రసాద్

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే!

 డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే! డబ్బు చేసిన మనిషి, జబ్బు చేసిన మనిషి ఒకటే, ఇదీ నిజమే! పడవ పయనం సాగాలంటే, నీటి అవసరం నిజమే! పడవలోకి నీరు పయనిస్...