28, డిసెంబర్ 2024, శనివారం

సావడి కబుర్లు -2

 సావడి కబుర్లు -2

వందేమాతరం

ఈమధ్య ఇతరత్రా కార్యక్రమాల వల్ల సాయంత్రం వ్యాహ్యాళికి, అదేనండి నేడు మనం మాట్లాడుకునే ఈవినింగ్ వాక్ వెళ్లడం కుదరలేదు. మొన్న ఆదివారం బజార్లో శ్రీకృష్ణభగవాన్లు గారు కలిసి అవీ ఇవీ మాట్లాడుతూ నువ్వు అమ్మ పక్షపాతివయ్యా అన్నారు. అదేంటండి అంత మాట అనేసారు అంటే,  ఆరోజు అమ్మ గురించి బాగానే చెప్పావు మరి నాన్నని మర్చిపోయావేం అన్నారు.

అమ్మంటే ప్రొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే అన్ని పనుల్లోనూ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వెంటనే చెప్పగలిగాను. మరి నాన్న అలా కాదు కదా, సంసార సాగరంలో ఎన్నో  విస్ఫోటనాలు తనలో దాచుకుని పైకి పున్నమి రోజు చంద్రోదయంలో అందరిని మైమరపించే సముద్రపు అలలలా  కనిపిస్తాడు. అమ్మ చూసేది ఆకలి, నాన్న చూసేది అభివృద్ధి,  నేర్పేది పాలన.  మార్గం అమ్మ చూపిస్తే, మార్గనిర్దేశం నాన్న ఆలోచిస్తాడు. వర్తమానాన్ని అమ్మని నడిపిస్తుంటే, మన  భవిష్యత్తుని మనకంటే ముందు నాన్న ఆలోచిస్తాడు. దానికై రేయింబగళ్లు శ్రమిస్తూ మన నడకకి బంగారు బాట నిర్మించే కృషీవలుడు నాన్న. నాన్న మన బలానికి క్రమశిక్షణకి మూల స్తంభం వంటివాడు. అమ్మతో గడిపిన అంత సమయం నాన్నతో గడిపే అదృష్టం ప్రపంచంలో ఎవరికో గాని దొరకదు. అందుకే తల్లితో ఉన్నంత చనువు తండ్రి దగ్గర ఉండదు.  తండ్రి నిస్వార్ధంగా నిరంతరం కుటుంబం గురించి రగిలే ఒక జ్వాల. ఆ బాధ్యత అనే వేడి పిల్లలకు తెలియకూడదని వారు భరించలేరని దానిని తనలోనే రగులుచుకుంటూ చాలా సందర్భాల్లో తండ్రి ఒంటరితనం అనే యాత్ర సాగిస్తుంటాడు. విచిత్రం ఏమిటంటే మన అవసరాలకు పోపులుడబ్బాలో దాచిన డబ్బులు ఇచ్చిన అమ్మని దేవతలా చూస్తాం కానీ తన కష్టాలని ఆ డబ్బులుగా మార్చిన నాన్నను గుర్తించం.  అమ్మది భూదేవంత ఓర్పు సహనం అనే చెప్పకుంటాం కానీ  ఆకాశమంత నాన్న ఔనిత్యాన్ని గుర్తించం.  మనల్ని నవమాసాలు మోసిన అమ్మని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం కానీ మనతో పాటు అమ్మను కూడా మోసే నాన్న గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నాం.‌ చిన్నప్పుడు మనల్ని దండించిన నాన్న గుర్తుంటాడు, గానీ దానికి కారణమైన మన తప్పును దిద్ది క్రమశిక్షణ నేర్పించిన తండ్రి మార్గదర్శకత్వాన్ని మర్చిపోతాం. ఆ కోపం వెనక నాన్న మనసులోని చల్లదనం  గుర్తించం. నాన్న కూడా అంతే ఎప్పుడూ తన గుర్తింపు కోరుకోడు. గుర్తింపు తెచ్చుకున్న పిల్లలను చూసి గర్వించడం తప్ప. ప్రపంచానికి మనని పరిచయం చేసేది అమ్మ అయితే ప్రపంచాన్ని మనకు పరిచయం చేసేది నాన్న.

అమ్మంటే బోళా, నాన్నేమో కాఠిన్యం అనుకుంటారు అందరూ, కానీ ఆ కోపం వెనుక నాన్నకు ప్రేమ లేక కాదు మన విజయానికై ఉన్న ఆరాటం అలా కనిపిస్తుందని గుర్తించాలి. మనం గెలిస్తే అభినందిస్తాడు ఓడిపోతే ధైర్యం చెబుతాడు అదే నాన్నంటే.

 అభిజ్ఞాన శాకుంతలంలో
 ‘అంగాదంగాత్ సంభవతి పుత్రః
 హృదయాదభిజాయతి ఆత్మావై పుత్ర నామాసి అంటారు, అంటే పుత్రుడు తండ్రి  శరీర కణాల నుంచే కాదు, హృదయ అనుభూతితో జన్మించేవాడు అని. ఆ అదృష్టాన్ని పుత్రులు నిలుపుకోవాలి కానీ, దురదృష్టం ఏమిటంటే చిన్నప్పుడు నాన్న భుజాల మీద స్వారీ చేస్తాం, కానీ పెద్దయ్యాక ఆ రెక్కల భారాన్ని పంచుకునే ప్రయత్నం కూడా చేయం. ఒకవేళ అరా-కొర చేయి వేసినా ఆ భారాన్ని మొత్తం తామే మోసినట్లు చెమటలు ఓడ్చే పిల్లలను చూస్తున్నాం. పైగా వారి ఢాంబికాలు, అతిశయోక్తులు ప్రచారం చేసుకునేందుకు ఈ మధ్య సాంఘిక మాధ్యమాలు కూడా తోడయ్యాయి. అటువంటి  పిల్లలను  తండ్రులు క్షమించాలి. అయినా క్షమ తండ్రులకు కొత్త కాదులే, వారు ఎన్ని క్షమిస్తే, ఎన్ని భరిస్తే ఈరోజు ఈ స్థితిలో ఉన్నమో పిల్లలు గుర్తించాలి.
మనము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే  మన అభివృద్ధే నాన్న జ్ఞాపకం, మన భవిష్యత్తే నాన్న వ్యాపకం. మన ఆలోచనలే నాన్న జీవితం. ఒక కవిగారు అంటారు నాన్న తన భుజాల మీద మనని ఎందుకు కూర్చోబెట్టుకుంటాడో తెలుసా,  తన పిల్లలు తనకంటే ఎత్తు నుండి ప్రపంచాన్ని చూడాలని.  నాన్న చూపించిన దారిలో మనం అనుకున్న విజయాలు సాధించవచ్చు సాధించకపోవచ్చు, కానీ అపజయం మాత్రం ఉండదు. పిల్లల గెలుపులో తన ఓటమిని ఆనందించేవాడు తండ్రి ఒక్కడే. నాన్న అమ్మని ఎందుకు గౌరవిస్తాడో తెలుసా? అమ్మ గౌరవం పిల్లలకు సురక్షితం కాబట్టి.  

చివరిగా అమ్మది ప్రేమ, నాన్నది దీవెన.

యస్మాత్పార్దివ దేహః ప్రాదుర
భూద్యేన భగవతా గురుణా

ఎవరివల్ల ఈ భౌతిక శరీరం జన్మించిందో అలాంటి భగవత్ స్వరూపుడు, సర్వజ్ఞమూర్తి అయిన తండ్రికి వేలాది నమస్కారాలు'

ఉంటా
మృశి
దశిక ప్రభాకర శాస్త్రి
23.12.2024

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే!

 డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే! డబ్బు చేసిన మనిషి, జబ్బు చేసిన మనిషి ఒకటే, ఇదీ నిజమే! పడవ పయనం సాగాలంటే, నీటి అవసరం నిజమే! పడవలోకి నీరు పయనిస్...