🔱 అంతర్యామి 🔱
# మనోమౌనం #
🍁మనిషికి భగవంతుడిచ్చిన వరం- మాట. మాట్లాడే శక్తి మనిషికే ఉంది, అయితే అయినదానికి, కానిదానికి మాట్లాడవలసిన అవసరంలేదు. మాట్లాడకుండా కూడా చాలా పనులు చక్కబెట్టవచ్చు. భావాన్ని వ్యక్తం చేయనూ వచ్చు. అలాచేస్తే మాట్లాడటానికి ఖర్చయ్యే శక్తి ఆదా అవుతుంది. పైగా అనవసర వివాదాలకు ఆస్కారం ఉండదు. నిజానికి కొన్ని సమయాల్లో మాట్లాడటంకన్నా మౌనం వహించడం మరీ మంచిది. దానికెంతో ఓర్పు, నేర్పు, నిగ్రహశక్తి, సంయమనం కావాలి.
🍁అనవసర పదజాలాన్ని, మాటలను నియంత్రించి పరిపూర్ణత కలిగిన ఆలోచనా విధానానికి తొలి మెట్టు మౌనం. దీన్ని వహించడం వల్ల సాత్వికత ఏర్పడుతుంది. సాత్వికత మంచిచెడుల విచక్షణను తెలియజేస్తుంది.
🍁మౌనం రెండు రకాలు. అవి వాక్ మౌనం (మాట్లాడకుండా మౌనంగా ఉండటం), మనోమౌనం(ధ్యానం) అని గీతాచార్యులు వివరించారు. ఒక్కొక్కసారి ఎదుటివారి కాఠిన్యపు మాటలుగాని, ఆధారరహిత ఆరోపణలను కానీ ఖండించవలసిన అవసరం ఏర్పడుతుంది. కానీ వాటిని వారు వినే స్థితి లో ఉండరు. అలాంటి సమయంలో మాట్లాడకుండా ఊరు కోవడమే ఉత్తమం. అదీకాక మనం చెప్పే మాటలకు విలువ, ఆచరణ లేనప్పుడు సైతం మాట్లాడకుండా ఉండటం మేలు. దీన్నే వాకామౌనం అంటారు. ఇంద్రియాలు మనసును విషయాదుల వైపు లాగుతాయి. వాటి వైపు మనసు మరలకుండా జాగ్రత్తలు తీసుకోవడం మనోమౌనం.
🍁ధ్యానం చేయడంలో మౌనం ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇది ఆత్మశక్తిని పెంచుతుంది. పరిణతి చెందిన మనస్తత్వానికి, ఆలోచనా పరిధికి మౌనం నిదర్శనం. గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు మౌనం కవచంలా కాపాడుతుంది. కాబట్టి మౌనం వహించడం చేతగానితనం మాత్రం కాదు. మౌనం అర్ధాంగీకారం అనే నానుడి ఉంది. అంటే మౌనంగా ఉంటే సగం అంగీకరించినట్లే అని. కానీ అలా ఉండటం అంగీకారం కాదు. ఆలోచన, విశ్లేషణ కారణకారణాల సమతుల్యతను బేరీజు వేసుకునే సంధిసమయం మాత్రమే.
🍁మౌనం మానసిక తపస్సు అంటే మానసిక మౌనమే విలక్షణమని గ్రహించాలి. అయితే మనోమౌనం కోసం ప్రయత్నించకుండా వాక్ మౌనం మాత్రమే కలిగి ఉంటే... మనసు అనేక సంకల్పాలతో కూడిఉండి. చంచలమవుతుంది. అంటే ఆ మౌనం వల్ల అంతగా ప్రయోజనం ఉండదు.
🍁మౌనాన్ని అభ్యసించాలి. దైనందిన జీవితంలో ఎన్నో ఆటుపోట్లుంటాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, సందిగ్ధావస్థలో పడినప్పుడు, విరుద్ధ విషయాలను చర్చిస్తున్నప్పుడు, మౌనం శక్తిమంతమైన ఆయుధమై గట్టున పడేస్తుంది. ప్రశాంతమైన పరిసరాలు మౌన ధారణకు తోడ్పడతాయి. ధ్యానాది విషయాల్లో ఏకాగ్రతను కలిగించే ఇంధనం మౌనం. అయితే అవసర సమయాల్లో మౌనం వహిస్తే అగచాట్లు తప్పవు. అశక్తతను, చేతగానితనాన్ని తెలియజేస్తుంది. మౌనం దివ్యాయుధం. సందర్భోచితంగా ప్రయోగించినప్పుడు సత్ఫలితాన్ని ఇస్తుంది.
🍁మౌనం పాటించినప్పుడు ఆ వ్యక్తి సులభంగా మానసిక స్థైర్యాన్ని పొందగలడని గుర్తిస్తాం. భోజనం చేసినప్పుడు మౌనంగా భుజించడ0 అవసరం. జాతిపిత మహాత్మాగాంధీ వారాని ఒకరోజు మౌనం పాటించేవారట. కొంతమంది ఇప్పటికీ వారానికి ఒకరోజు ఆనవాయితీగా మౌనవ్రతం పాటిస్తుంటారు.🙏
✍️- వి. ఎస్. రాజమౌళి
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
16, జులై 2024, మంగళవారం
అంతర్యామి - మనోమౌనం
14, జులై 2024, ఆదివారం
అంతర్యామి - హారతి
🔱 అంతర్యామి 🔱
# హారతి #
🍁శాస్త్రోక్తంగా చేసే పూజ- పునస్కారాల్లో పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, మంత్రపుష్పం, హారతి, ప్రదక్షిణం వంటివన్నీ దేవతార్చనలోని అంశాలే. హారతిని ఆర్తితో స్వామికి అర్పిస్తాం.. తరచుగా అన్ని విధాలైన శుభకార్యాల్లో హారతినందిస్తాం. హారతి ఇస్తున్నప్పుడు ” మంత్రోచ్చారణ, మంగళవాద్యాలు, గంటానాదం, సంకీర్తనలు, శంఖం పూరించడం- ఇలాంటివన్నీ ఆయా దేవాలయాల్లోని ఆచారాలు, సంప్ర దాయాలను బట్టి అనుసరిస్తారు.
🍁హారతిని వలయాకారంలో గడి యారంలోని ముళ్ల దిశగా భగవంతుడి విగ్రహం ముందు తిప్పుతారు. ఆ జ్యోతి నుంచి ఉత్పన్నమయ్యే సాత్విక తరంగాలు వలయాకారంగా పరిభ్రమిస్తాయి. ఈ తరంగాల కవచం భక్తుల భక్తి భావనను ఉద్దీప్తం చేస్తుంది. ఆత్మ సమర్పణ భావానికి హారతి ప్రముఖమైన ఆలంబనం. ఏకాగ్రతకు, తాదాత్మ్యతకు హారతి స్పూర్తి అవుతుంది. హారతి భక్తుడిలో దాగి ఉన్న అహంకారాన్ని కరిగే కర్పూరంలా హరిస్తుంది. హారతిని స్వామివారి వదనానికి రెండు అరచేతులతో చూపి, ఆ తరవాత భక్తులందరూ శ్రద్ధాభక్తులతో కళ్లకద్దుకుంటారు.
🍁వ్రతాలు, నోములు, ఆరాధనలు, అర్చనలు, అభిషేకాలు, యజ్ఞయాగాదులు, వ్రతాలు, పుష్కరాలు, పర్వదినాలు, ఆయుధపూజలు, గృహప్రవేశాలు, వివాహాది శుభకార్యాలు... ఇలా అనేక సందర్భాల్లో హారతిని ఇస్తారు.
🍁ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం- మూడు పూటలా కొన్ని దేవాలయాల్లో హారతి ఇస్తారు. కాకడారతి, పూజారతి, ముఖ్యారతి, ధూపారతి, తేజారతి- ఇలా పలు పేర్లతో వీటిని పిలుస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మహాహార ఇస్తారు.
🍁హారతికి తరచుగా కర్పూరాన్నే వినియోగిస్తారు. కొన్ని హారతులను వత్తులతో వెలిగిస్తారు. అందుకు నేతినే ఉపయోగిస్తారు. క్షత్రియవీరులు రణరంగానికి బయలుదేరేముందు, తిరిగి విజేతలై వచ్చాక హారతినిస్తారు. నూతన దంపతులకు ఇచ్చే హారతి మంగళహారతి. పుట్టినరోజుల సందర్భాల్లో, సంక్రాంతి మొదలైన పర్వదినా. చిన్నారులకు హారతి పట్టి ఆశీస్సులిస్తారు.
🍁ఆశ్వయుజ పూర్ణిమనాడు జ్యేష్ఠాపత్య నీరాజనం, నరక చతుర్దశినాడు నారీకర్తుక నీరాజనం, బలిపాడ్యమినాడు, పతినీరాజనం, యమ విదియరోజున భ్రాతృ నీరాజనం వీటిని 'ఔక్షణ' నీరాజనం అంటారు. ఇంకా నేత్రహారతి, బిల్వహారతి, నందిహారతి, పంచహారతి, నాగహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, ధేనుహారతి, గజహారతి- ఇలా పలు సందర్భాలను బట్టి హారతులిస్తారు.
🍁దేహం ప్రమిదకు వత్తి వైరాగ్యానికి ప్రతీక.. జ్యోతి ఆత్మకు ప్రతీక. తైలం సాధనకు ప్రతీక. కాంతి జ్ఞానానికి ప్రతీక- ఇదే హారతికి గల అంతరార్థం, హారతికి నువ్వులనూనె, ఆవునెయ్యి, అవిశనూనె, కొబ్బరినూనె, అష్టమూలికా తైలం, ఆయా ప్రాంతాల ఆచారాలననుసరించి వినియోగిస్తారు. పాపపరిహారార్థం కొందరు ఆవనూనె, వేపను వాడతారు. హారతికి అయిదు నుంచి 365 వత్తుల వరకు వినియోగిస్తారు. పత్తిగింజల నుంచి తీసిన పత్తితో చేసిన వత్తులు మాత్రమే శ్రేష్ఠమైనవి. బూరుగు దూది నుంచి, చేనేత వస్త్రం ముక్కలతోను వత్తులు చేస్తారు.
🍁హారతి సమర్పణ చేసినవారికి, హారతి కాంతిని కళ్లకు అద్దుకున్నవారికి అనంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.🙏
✍️చిమ్మపూడి శ్రీరామమూర్తి
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అంతర్యామి - మోక్ష మార్గం
🙏శ్రీరస్తు-శుభమస్తు🙏
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🌹ఒకసారి ఒక కాపలాదారుడు ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది, అందుచేత రాజువద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది.
ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు, ఇందుకు అనుమతించండి” అని వేడుకొన్నాడు, రాజు అందుకు సమ్మతించాడు.
ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకొన్నాడు.
ఆ కాలంలో రాజులు మారు వేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది! ... రాత్రి అయింది.
అది మొదటి యామం, తప్పెట చేతపుచ్చుకొని ఆ బాలుడు వీథి కాపలా కాయసాగాడు, రాజు అతణ్ణి వెంబడించసాగాడు, హెచ్చరిక చేసే సమయం వచ్చింది.అప్పుడు మూగవాడు ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు:
“కామం క్రోధంచ - లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః
జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః."
మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు...
కాబట్టి జాగ్రత్త! - ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు; నిశ్చేష్టుడయ్యాడు.
'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు.
ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది, కనుక ఇతణ్ణి వెంబడించి, గమనిస్తూ ఉంటాను' అని రాజు భావించాడు.
మళ్ళా రెండవ ఝాము వచ్చింది, అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు:
“జన్మదుఃఖం జరాదుఃఖం
జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః.”
పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త - అని హెచ్చరిక.
ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు, తృతీయ యామం వచ్చింది:
“మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః
అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః”
తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు (ఇదంతా మిథ్య అని అర్థం) జాగ్రత్త! జాగ్రత్త! - అని చాటాడు.
ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు, అయినా వెంబడిస్తూనే ఉన్నాడు...
ఇంతలో నాలుగవ యామం వచ్చింది, అప్పుడు ఆ బాలుడు...
“ఆశయా బధ్యతే లోకే - కర్మణా బహుచింతయా
ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః.”అని చాటింపు వేశాడు.ఆశాపాశంచేత కట్టువడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే! కాబట్టి జాగ్రత్త జాగ్రత్త - అని చాటాడు...
ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది, అతడు సాధారణ ఊరి కాపరి కాడు.
పవిత్రమైన ఆత్మగల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు.
కాబట్టి ఈతణ్ణి తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికిపోయాడు.
మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు...
అతడితో రాజు ఇలా అన్నాడు: “ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగ కాడు.
అతడు పూర్వజన్మజ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు, అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను, నా కోరిక తీర్చమని అతడిని అడుగు.”
తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు.
అప్పుడు రాజు, “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్ని చేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు.
తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతూన్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు.
అప్పుడు ఆ జీవన్ముక్తుడు, “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష విధిస్తారు?” అని అడిగాడు.
అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు.
“అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి.
నా చేతులమీద, నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెల్పాడు ఆ పసివాడు.
రాజు అమితాశ్చర్యపోయాడు, అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు.
ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు,
ఇలా కొంతకాలం గడిచింది.
దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించబోయాడు.
“ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతూన్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు.
అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు: “ఓ బ్రహ్మదేవా! ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని ఇప్పుడు ఎందుచేతనో చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు.
నా ధర్మ నిర్వహణ జరగడం లేదు, మరి భూలోకంలో పాపాత్ములే లేరా! లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది, ఇదే నా విచారానికి కారణం.”
బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు.
అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు.
వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతూన్నారు.
ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు.
అప్పుడు అక్కడ జరుగుతూన్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది...అదేమంటే:..*
మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి.
అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి, చూసేవారి మనస్సు భక్తిపరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది...
అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి.
ఆ చోటు దేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది...
మరణశిక్ష విధింపబడి కొనిరాబడినవారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి, వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు...
అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు.
అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు...
దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.
ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు.
బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు.
"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో
అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు, అని బ్రహ్మ, జ్ఞానిని అడిగాడు.
అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు: ...
ఓ బ్రహ్మదేవా! మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా?
నా గత జన్మలోమరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు కలిగిన తలంపుల వలన నాకిలా జన్మించాల్సి వచ్చింది.
భగవానుడు గీతలో 'ఎంతటి క్రూరకర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు !!!...
కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను, నా అనుభవం ఒక పాఠమైనది.”
అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి సత్యలోకం చేరుకొన్నాడు.
మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది.
సత్ చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది.
కాబట్టి అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తూన్నది...
నామస్మరణే సులభోపాయం, ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం గాక!
కావున మరణ సమయము ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కావున భగవన్నామ స్మరణ నిత్యము అన్ని వేళలలో ఏ పని చేస్తున్నా మానసికముగా చేస్తూ ఎదుటి మనిషిలో ఉన్న భగవంతుని గౌరవిస్తూ ప్రవర్తిస్తే తప్పకుండా అంత్యకాల నామ స్మరణ తప్పక లభిస్తుంది...
భగవద్గీత లో చెప్పినటుల "అద్వేష్టా సర్వ భూతానాం" ఆచరించుతూ ఉంటేనే ఇది సాధ్యము.
ఏ ఒక్కరి మీద ద్వేషము లేని వారికే ఇది సుసాధ్యము...
ఎందుకనగా తను వేరొకరిని ద్వేషించే సమయములో ఒకవేళ మరణము సంభవస్తే అదే ద్వేషముతో పాము-కప్ప జన్మలను, మరియు గజ-కచ్చప (ఏనుగు-తాబేలు) జన్మలను పొంది అనేక యుగములు తగవులాడుకొనే అవకాశము ఉన్నదని పురాణములు చెప్పుచున్నవి. కావున మొట్టమొదలు మనము శత్రువులు అనుకునే వారిమీద మన అభిప్రాయములను సరిదిద్దుకుని "అద్వేష్టా సర్వభూతానాం" గా తయారు అవడము అత్యంతావశ్యకము.
🙏🙏🙏🙏🙏🙏
🌹🚩జై శ్రీ కృష్ణ🚩🌹
🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం పరమాత్మ పాదార విందార్పణమస్తు*
🙏🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹🌹🌹
లోకాసమస్త సుఖినోభవంతు
🌹🌹🌹🌹🌹🌹🌹
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌹🌹🌷🙏🌷🌹🌹
10, జులై 2024, బుధవారం
సుభాషితం - జూలై 2024
సుభాషితం - 1:
व्यवस्थितः प्रशांतात्मा कुपितोऽप्यभयंकरः ।
अव्यवस्थितचित्तस्य प्रसादोऽपि भयंकरः ॥
వ్యవస్థితః ప్రశాంతాత్మా కుపితోప్యభయంకరః ।
అవ్యవస్థితచిత్తస్య ప్రసాదోపి భయంకరః ॥
భావము:
ప్రశాంత చిత్తముతో యోజన చేసి కార్యము చేయువారు, కోపముతో ఉన్నప్పటికీ, భయపడనక్కరలేదు. అస్తవ్యస్త మనస్సుతో యోజన చేసి కార్యము చేయువారు, ప్రసన్నముగా కనిపించినప్పటికీ భయపడవలసినదే.
సుభాషితం - 2:
धर्मो जयति नाधर्मः, सत्यं जयति नानृतम् ।
क्षमा जयति न क्रोधो, देवो जयती नासुरः॥
ధర్మో జయతి నాధర్మః , సత్యం జయతి నానృతమ్ ।
క్షమా జయతి న క్రోధో, దేవో జయతి నాసురః॥
భావము:
ఎప్పటికైనా
ధర్మమే జయిస్తుంది కాని, అధర్మము కాదు. సత్యమే జయిస్తుంది కాని అసత్యము
కాదు. సహనమే జయిస్తుంది కాని కోపము కాదు. విష్ణువే జయించును కాని రాక్షసుడు
కాదు.
21, జూన్ 2024, శుక్రవారం
అంతర్జాతీయ యోగా దినోత్సవం
యోగేన చిత్తస్య పదేన వాచాం ।
మలం శరీరస్య చ వైద్యకేన॥
యోపాకరోత్తం ప్రవరం మునీనాం ।
పతంజలిం ప్రాఞ్జలిరానతోస్మి॥
యోగా ద్వారా మనస్సులోని మలినాలను,
వ్యాకరణం ద్వారా మాటలలోని మలినాలను,
వైద్యం ద్వారా శరీరంలోని మలినాలను,
తొలగించడంలో నిపుణుడైన, మునులలో అద్భుతమైన పతంజిలి మహర్షికి ముకుళిత హస్తాలతో నమస్కరిస్తున్నాను.
అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రపంచంలో యోగాకు గుర్తింపుగా ఒక రోజు. దీనిని 2014లో ఐక్యరాజ్యసమితి ఆమోదించిన తర్వాత ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. యోగా వ్యాయామాలు శారీరక మరియు మానసిక శ్రేయస్సు కోసం గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయి, యోగా అనేది భారతదేశంలో పురాతన కాలం నుండి వస్తున్న సాంప్రదాయం, 5,000 సంవత్సరాల పూర్వం నుండి మనకు ఆధారాలు లభ్యమవుతున్నాయి. ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన ఈ సంక్షేమ అభ్యాసాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం ఐక్యరాజ్యసమితి ముఖ్యమైనదిగా భావించింది. అందుకే అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుతోంది.
ఈ సంవత్సరం "యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ" అనే థీమ్‌తో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. యోగ అనేది ఒక పరివర్తన సాధన, మనస్సు మరియు శరీరం యొక్క సామరస్యాన్ని, ఆలోచన మరియు చర్యల మధ్య సమతుల్యతను తీసుకు వస్తుంది. ఇది మనోనిగ్రహంతో పనులు నెరవేర్చుకోగగల సామర్ధ్యం పెంచుతుంది. ఇది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక సాధనలను మిళితం చేస్తుంది. ఇది శరీరం, మనస్సు, ఆత్మ మరియు పరమాత్మలను ఏకీకృతం చేస్తుంది, ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం సంపూర్ణ విధానాన్ని అందజేస్తుంది, ఇది మన కష్టతరమైన జీవితాలకు శాంతిని అందిస్తుంది.
యోగ దినోత్సవ చరిత్ర : 11 డిసెంబర్ 2014న, ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి అశోక్ ముఖర్జీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డ్రాఫ్ట్ టెక్స్ట్‌కు 177 సభ్య దేశాల నుండి విస్తృత మద్దతు లభించింది, అందువల్ల ఇది ఓటింగ్ లేకుండా ఆమోదించబడింది. ఈ విధంగా ఆమోదించబడినటువంటి తీర్మానాలలో రికార్డు సంఖ్యలో అత్యధిక దేశాల మద్దతు పొందినటు వంటి తీర్మానమిది. తదనంతరం, న్యూయార్క్, పారిస్, బీజింగ్, బ్యాంకాక్, కౌలాలంపూర్, సియోల్ మరియు న్యూ ఢిల్లీతో సహా ప్రపంచవ్యాప్తంగా జూన్ 21, 2015న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకున్నారు.
దీనికి బీజం, 27 సెప్టెంబర్ 2014 ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ "యోగా దినోత్సవం" కోసం చొరవ తీసుకుంటూ చేసిన ప్రసంగం. అయన తన ప్రసంగంలో "యోగా అనేది భారతదేశ పురాతన సంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి. ఇది మనస్సు మరియు శరీరం యొక్క ఐక్యతను ప్రతిబింబిస్తుంది; ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ఒక సంపూర్ణమైన విధానం. అయన దీనిని జూన్ 21ని తేదీన చేయాలనీ ప్రతిపాదించారు, ఎందుకంటే ఉత్తర అర్ధగోళంలో (దక్షిణ అర్ధగోళంలో అతి చిన్నది) ఈ తేదీ అత్యంత పొడవైన పగలు గల రోజు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఈరోజు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉందని మోదీ చెప్పారు. భారతీయ క్యాలెండర్లలో, వేసవి కాలం దక్షిణాయనానికి పరివర్తనను సూచిస్తుంది. వేసవి కాలంలో వచ్చే రెండవ పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. హిందూ పురాణాలలో, శివుడే మొదటి యోగి (ఆది యోగి), అయన ఈ రోజున మిగిలిన మానవాళికి యోగా జ్ఞానాన్ని అందించడం ప్రారంభించాడని, అందుకే మొదటి గురువు (ఆది గురువు) అయ్యాడని చెప్పబడింది.
21 జూన్ 2015న ప్రపంచవ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని
జరుపుకున్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ భారతదేశంలో అవసరమైన ఏర్పాట్లను
చేసింది. PM మోడీ మరియు 84 దేశాలకు చెందిన ప్రముఖులతో సహా 35,985 మంది
వ్యక్తులు న్యూ ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో 35 నిమిషాల పాటు 21 ఆసనాలు (యోగా
భంగిమలు) ప్రదర్శించారు, ఇది ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద యోగా
క్లాస్‌గా నిలిచింది మరియు అత్యధిక సంఖ్యలో 84 దేశాలనుండి ప్రతినిధులు
పాల్గొన్నారు. ఇది రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పింది. అప్పటి నుండి
ప్రతి సంవత్సరం భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో ఇలాంటి
రోజులు నిర్వహించబడుతున్నాయి.
2015లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని 10-రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేసింది. ఏప్రిల్ 2017లో, UN పోస్టల్ అడ్మినిస్ట్రేషన్ (UNPA) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకే షీట్లో ఆసనాలపై 10 స్టాంపులను విడుదల చేసింది.
ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ఆమోదించిన తరువాత, భారతదేశంలోని ఆధ్యాత్మిక ఉద్యమానికి చెందిన పలువురు నాయకులు ఈ చొరవకు తమ మద్దతును ప్రకటించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్, మోడీ ప్రయత్నాలను ప్రశంసించారు, "రాజ్యాధికారం లేకుండా ఏ తత్వశాస్త్రం, మతం లేదా సంస్కృతి మనుగడ సాగించడం చాలా కష్టం. యోగా ఇప్పటివరకు దాదాపు అనాథలా ఉంది. ఇప్పుడు, అధికారిక గుర్తింపు UN యోగా యొక్క ప్రయోజనాన్ని మరింత విస్తృతం చేస్తుంది."
2015లో ఒక అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక మొదటి "అంతర్జాతీయ యోగా దినోత్సవం"లో "మిలియన్ల కొద్దీ యోగా ఔత్సాహికులు" పాల్గొన్నారని పేర్కొంది, ఢిల్లీలోని ప్రధాన రహదారి ఈ సందర్భంగా వ్యాయామ ప్రదేశంగా మారిందని, మోదీ "శాంతి మరియు సామరస్యం" గురించి మాట్లాడుతున్నప్పుడు, యోగాను ప్రచారం చేయడం పక్షపాత హిందూ కార్యక్రమమని భారతదేశంలోని కొందరు భావించారని పేర్కొంది. సూర్య నమస్కారం (సూర్య నమస్కారాలు) యొక్క క్రమం తొలగించబడిందని ఇది నివేదించింది, ఎందుకంటే సూర్యుని ఆరాధించడం హిందూ దేవతారాధన అని ముస్లింలు దీనిని వ్యతిరేకించారు; హిందూ పవిత్ర అక్షరం "ఓం" యొక్క జపం కూడా తొలగించబడింది. మరికొందరు ఈ కార్యక్రమానికి వెచ్చించిన డబ్బును ఢిల్లీ వీధులను శుభ్రం చేయడానికి వెచ్చించవచ్చని భావించారు.
క్రిస్టియన్ సైన్స్ మానిటర్ 2016లో వ్రాస్తూ, 2014 ఐక్యరాజ్యసమితి తీర్మానం "విపరీతమైన ప్రజాదరణ పొందింది". అయితే యోగాలో "ధ్యానం" ఉందని మరియు అది శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మానసిక మరియు ఆధ్యాత్మిక సాధన. యోగా అనేది దేవునికి ఒక మార్గం కాగలదనే ఆలోచన గురించి రోమన్ క్యాథలిక్‌లను హెచ్చరిస్తూ పోప్ ఫ్రాన్సిస్ చేసిన 2015 ఉపన్యాసాన్ని ఇది సాక్ష్యంగా ఇచ్చింది; ఈ రోజు హిందూమతాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది అనే ఆరోపణకు "యోగా అనేది ఇతర జీవితానికి సంబంధించినది కాదు. స్వీయ జీవితానికి సంభందించినది కాబట్టి, ఇది మతపరమైన ఆచారం కాదు" అని మోదీ ప్రత్యుత్తరం ఇచ్చారని కూడా పేర్కొంది.
2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవాలను నిర్వహించడంలో భారత ప్రభుత్వ ఉద్దేశ్యం యోగాను "భారతదేశ సాంస్కృతిక ఆస్తి"గా ప్రపంచవ్యాప్తంగా గుర్తించడమేనని వీక్ పత్రిక పేర్కొంది, పాశ్చాత్య ప్రపంచంలో అనేక రకాల యోగాలు ఇప్పటికే ఆచరించబడుతున్నందున ఇది విజయవంతం అయ్యే అవకాశం లేదని వీక్ రాసింది. యోగా "ప్రధానంగా హిందూ ఆధ్యాత్మిక అభ్యాసం" అని క్రైస్తవ మత ప్రచారకులు ప్రచారం చేసారు. అయితే పాశ్చాత్య యోగా చాలావరకు పాశ్చాత్య దేశాలలో ఉండటం వల్ల చాలా మార్పు వచ్చిందని మత పండితుడు ఆన్ గ్లీగ్ పేర్కొన్నాడు. ఎవరు ఏమైనా అనుకోని మనం మాత్రం దీనిని మరింత ముందుకు తీసుకు వెళదాం ఎందుకంటే
ధైర్యం యస్య పితా క్షమా చ జననీ శాంతిశ్చిరం గేహినీ ॥
సత్యం సూనురయం దయా చ భగినీ భ్రాతా మనః సంయమః ।
శయ్యా భూమితలం దిశోస్పి వసనం జ్ఞానామృతం భోజనం
ఏతే యస్య కుటిమ్బినః వద సఖే కస్మాద్ భయం యోగినః ।
యోగికి ధైర్యము తండ్రి, క్షమా తల్లి, శాంతచిత్తం అనేది భార్య, సత్యం అనేది పుత్రుడు, దయా అనేది సోదరి, మనో నిగ్రహం అనేది సోదరుడు. భూమియే మంచము, దిశలే వస్త్రాలు, జ్ఞానమే ఆహారము. ఇవన్నీ అతనికి కుటుంబం అయినప్పుడు, అతడు ఇక దేనికి భయపడాలి?
15, జూన్ 2024, శనివారం
అ ఆ లతో గెలుపు పథం
*అ*మ్మతో సమము *అ*వురా
*ఇం*టిలోన *ఈ*శుని కొలువురా
*ఉ*ద్యమించి లక్ష్యమునే చేరరా
*ఊ*హలన్ని లక్ష్యముకై చేయరా
*ఋ*షివోలే లక్ష్యతపము చేయరా
*ఎ*దురుదెబ్బలెన్ని తగిలినా
*ఏ*డవక ఎదురుతిరిగి సాగరా
*ఐ*రావతమైన వశమగు నీకురా
*ఒం*టరివే కాదు ఎన్నటికీ
*ఓం*కారమే తోడు ఎప్పటికీ
*ఔ*రాయను విజయాలను సాధించు.
*అం*తేరా సోదరా, గెలుపు
అం*తః*పురం నీ సొత్తురా
- శివ భరద్వాజ్
12, జూన్ 2024, బుధవారం
కరుణ లేక ప్రాణములు హరించును వారు.
ఆటవెలది:
కరుణ లేక ప్రాణములు హరించును వారు.
దారుణములు చేయ మానబోరు.
తీవ్రవాదులందలి మతరాజ్యపు కాంక్ష
ఆగబోదు, తిరగబడక ప్రజలు.
భావం: ప్రజలు తిరగబడనంత వరకు, తీవ్రవాదులలో మత రాజ్యపు కాంక్ష ఆగదు. అప్పటివరకు వారు ప్రజల ప్రాణములు కరుణ చూపక తీస్తూనే ఉంటారు. దారుణములు చేస్తూనే ఉంటారు.
-శివ భరద్వాజ్
కరుగునేమో కరుకు గుండెయైన
తేటగీతి:
కరుగునేమో కరుకు గుండెయైన ఆర్తి
వేడుకొన, కరగదు ముష్కరి హృదయంబు,
కరుణయన్నది లేక ప్రాణములు తీయు,
మారుట జరుగదు మహిలో వారు. రామ!
భావం: రామ! కరుకు గుండె అయినా ప్రార్ధిస్తే కరగవచ్చునేమో, తీవ్రవాదముతో తుపాకి పట్టిన వాడి హృదయం కరగదు, కరుణ చూపక ప్రాణములు తీస్తూనే ఉంటారు. ఈ భూమిపై వారు మారుట జరగదు.
-శివ భరద్వాజ్
11, జూన్ 2024, మంగళవారం
తలచునందరు! లోకము మార్పుకొఱకు.
*తేటగీతి:*
తలచునందరు! లోకము మార్పుకొఱకు,
కొలదిమంది కూడా మార్పుకొఱకు సిద్ధ
పడరు, నడుము బిగించరు మార్పు తేవ,
ఎటుల మార్పు సాధ్యమగు సమాజమందు.
*భావం:* ప్రతిఒక్కరూ ప్రపంచం మారాలనుకుంటారు. కానీ కొంతమంది కూడా తాము మారాలనుకోరు. మార్పుకోసం నాయకత్వం వహించరు. మరి సమాజంలో మార్పు ఎలా సాధ్యమవుతుంది.
-శివ భరద్వాజ్
భారతీయ మహిళ ఔన్నత్యం
నిజంగా లోతైన ఆలోచన కలిగించే వ్యాసం👇 🌼 మహిళల తెలివితేటలను అర్థం చేసుకోవడానికి ఎవరైనా ఎప్పుడైనా నిజంగా ప్రయత్నించారా? 🌼 మనం తరచుగా తెలివి...
-
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు మాయెడల దయ చూపు ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
స్పందించేందుకు సమయం లేదు వివరించేందుకు విషయం లేదు వినేటందుకు ఓపిక లేదు తెలుసుకునేంత తీరిక లేదు మన బ్రతుకేదో బ్రతికేస్తున్నాం మన చావేదో చస్త...