3, ఆగస్టు 2025, ఆదివారం

స్నేహమే జీవిత సారథి

పంచప్రాణాలే జీవితానికి పునాది,
ఆరోప్రాణం స్నేహమే దానికి సారథి. 

ఉపిరి లేని శరీరంలా, పంజరంలోని పక్షిలా,
స్నేహం లేని హృదయం, మౌనపు శిలలా.

చూపులే మాటలు, నవ్వులే గీతాలు,
స్నేహితుడే పాడు జీవిత రాగాలు.

ఆయువు కొలిచేది నాడుల శబ్దమే,
ఆయువు పెంచేది మిత్రుల శబ్దమే. 

జీవించడమే కాదు, జీవితం అనుభవించడమూ కళే,
ఆ కళకు రంగుల అద్దేది స్నేహ మాధుర్యమే.

జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. 
-శివ భరద్వాజ్

1, ఆగస్టు 2025, శుక్రవారం

సత్సంగం - అంతరార్థం

 ఒక వ్యక్తి పట్టణంలో జరుగుతున్న సత్సంగానికి  ప్రతిరోజు వెళ్ళుతుండేవాడు.

ఆ వ్యక్తి ఒక చిలుకను పంజరములో ఉంచి పోషించేవాడు.

ఒక రోజు చిలుక తన యజమానిని అడిగింది, 'మీరు ఎక్కడకు రోజు వెళ్తున్నారు' అని?

అతను ఇలా అన్నాడు, "మంచి విషయాలు తెలుసుకోవడానికి నేను రోజూ సత్సంగానికి వెళతాను."

"మీరు నాకు ఒక సహాయం చేయగలరా?" అని అడిగింది ఆ చిట్టిచిలుక ఆ యజమానిని. "నేను ఎప్పుడు స్వేచ్ఛ పొందగలను అని మీ గురువు గారిని అడిగి చెప్పండి" అని.

మరుసటి రోజు, యజమాని సత్సంగానికి వెళ్ళాడు.

సత్సంగం ముగిసిన తర్వాత, అతను గురువు దగ్గరకు వెళ్లి, "మహారాజ్, నా ఇంటిలో ఒక చిలుక ఉంది, అది స్వేచ్ఛ ఎప్పుడు పొందగలదో మిమ్మలను అడిగి తెలుసుకోమని ప్రాధేయపడింది" అని.

అది విన్న వెంటనే, గురువుగారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

ఇది చుాసిన చిలుక యజమాని భయపడి,నిశ్శబ్దంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

అతను ఇంటికి చేరుకొన్నాడు. అతని చిలుక అతనిని అడిగింది, 'మీరు నా ప్రశ్నను గురువుగారిని అడిగారా?' అని.

యజమాని బదులిచ్చాడు- 'నేను అడిగాను కానీ నీ అదృష్టం బాగాలేదు. నేను నీ ప్రశ్న అడిగిన వెంటనే, గురువుగారు అపస్మారక స్థితి లోకి వెళ్లిపోయారు' అని.

"సరే సరే, నేను అర్థం చేసుకున్నాను" అన్నది ఆ చిలుక.

మరుసటి రోజు సత్సంగానికి వెళ్తూ, యజమాని పంజరంలో ఉన్నచిలుక అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూశాడు.

యజమాని పరీక్షగా చూసి చిలుక చనిపోయిందనుకుని  బయటకు తీసాడు. దానిని నేలమీద ఉంచాడు. వెంటనే ఆ చిలుక రివ్వుమంటూ ఎగిరిపోయింది. 

చేసేది లేక సత్సంగం కోసం మామూలుగా వెళ్లాడు ఆ యజమాని.

గురువు అతనిని చూసి, దగ్గరకు పిలిచి, "నీ చిలుక ఎక్కడ ఉంది?" అని అడిగాడు.

"నేను ఉదయం సత్సంగానికి వచ్చేటప్పుడు, నా చిలుక అపస్మారక స్థితికి గురై, పంజరంలో పడి ఉంది. దాని ఆరోగ్యం తనిఖీ చేయడానికి నేను పంజరం తెరిచి దానిని నేలమీద ఉంచినప్పుడు, అది పారిపోయింది" అని దిగులుగా చెప్పాడు.

గురువు నవ్వి, "మీ చిట్టిచిలుక మీ కన్నా ఎక్కువ తెలివిగలది. అది నేను ఇచ్చిన చిన్న సూచన అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి స్వేచ్ఛను పొందగలిగింది.

కానీ మీరు చాలా రోజుల పాటు సత్సంగానికి వస్తూ కూడా సాధన చేయక, ఈ ప్రపంచంలోనే  భ్రమ అనే పంజరంలో చిక్కుకొని ఉన్నారు."

అని అన్నాడు.

యజమాని సిగ్గుతో తలదించు కొన్నాడు.

దూరం నుంచి చిలుక గురువుకు కృతజ్ఞతలు తెలుపుకుంది.

*నీతి :: సత్సంగం యొక్క ఉద్దేశం కేవలం భక్తికోసం కాదు, కాలక్షేపం కోసం కానే కాదు. అజ్ఞానం నుండి, అంధకారం నుండి, భ్రమ నుండి మనం బయటపడి స్వేచ్ఛగా విముక్తలమై దైవానికి చేరువకావడం కోసం అని గ్రహించాలి.

భజన అంటే ఏమిటి?

"భజన" అనే పదం సంస్కృత భాషలో "భజ్" అనే ధాతు నుండి వచ్చింది, దీని అర్థం "భక్తితో సేవ చేయడం", "పూజించడం", లేదా "గురించిచింతన చేయడం". భజన అంటే భగవంతుని నామస్మరణ చేయడం, గాత్రంతో లేదా వాద్యాలతో పాటలు పాడడం ద్వారా భక్తి వ్యక్తపరచడం. ఇది భక్తి మార్గంలో ఒక ముఖ్యమైన విధానం.

భజనలలో ఎక్కువగా భగవంతుని గుణగణాల గురించి, అవతారల చరిత్రలు, భక్తుల కధలు ఉంటాయి. ఇవి శ్రావణానందాన్ని కలిగిస్తూ, శ్రద్ధా-భక్తులను పెంచే విధంగా ఉంటాయి. భజనలో ప్రతి ఒక్కరు ఒక పాట పాడే విధముగా ప్రేరేపించాలి. సాధన చేసే ప్రయత్నం చేయాలి. భగవంతుని కృపకు అందరూ పాత్రులు కావాలి. 

భజనకు ఉండవలసిన లక్షణాలు:

భజన అర్థవంతంగా, శ్రద్ధగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన లక్షణాలు పాటించాలి:

    భక్తి:
    భజనలో అత్యంత ముఖ్యమైన లక్షణం భక్తి. మనస్పూర్తిగా, ఏకాగ్రతతో భగవంతుని పట్ల ప్రేమతో భజన చేయాలి.

   * శ్రద్ధ:*
    పాటల అర్థాన్ని అర్థం చేసుకుని, అందులోని తాత్పర్యాన్ని గ్రహించి, శ్రద్ధతో పాడాలి.

    శుద్ధ భావన:
    భజన స్వార్థరహితం, విశుద్ధమైన ఉద్దేశ్యంతో ఉండాలి. పొగరు, ప్రదర్శనల కోసం కాకుండా, అంతర్ముఖతతో జరగాలి.

    స్వర సరస్యత:
    భజన స్వరంలో సరళంగా, శ్రావ్యంగా ఉండాలి. వాద్యాలు, గానం కలసి హార్మోనిగా ఉండాలి.

    నామస్మరణ ప్రాధాన్యత:
    భజనలలో భగవంతుని నామము పదే పదే వచ్చేటట్లు ఉండాలి. నామస్మరణే భజనకు ప్రాణం.

    సమూహ భక్తి (సత్సంగ్):
    భజనలు తరచూ సమూహంగా చేస్తారు. ఇది సమూహంలో ఉన్న అందరికీ ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది.

    అనుసంధానం (కథన - గానం):
    భజనలలో గానం మధ్యలో చిన్న చిన్న వ్యాఖ్యానాలు, చివరిలో సత్సంగం ఉండడం వల్ల శ్రోతలకూ అవగాహన పెరుగుతుంది. అధ్యాత్మిక దృష్టికోణం అలవడుతుంది. సత్సంగం లేని భజన ఆత్మ లేని దేహం వంటిది.

    వినయము:
    భజన చేసే వారిలో వినయము ఉండాలి. తమ ప్రతిభను చూపించాలనే గర్వం కాకుండా, భగవంతుని సేవ భావన ఉండాలి.

ముగింపు:

భజన అనేది శుద్ధమైన హృదయంతో జరిగే ఒక భక్తి ప్రక్రియ. ఇది మనసుని శాంతింపజేస్తుంది, భగవంతుని సమీపానికి తీసుకెళ్తుంది. నిజమైన భజన భగవంతుని నామాన్ని, రూపాన్ని, మహిమను శ్రద్ధతో స్మరించడం మరియు భాగవతత్వాన్ని గ్రహించడం.

స్నేహమే జీవిత సారథి

పంచప్రాణాలే జీవితానికి పునాది, ఆరోప్రాణం స్నేహమే దానికి సారథి.  ఉపిరి లేని శరీరంలా, పంజరంలోని పక్షిలా, స్నేహం లేని హృదయం, మౌనపు శిలలా. చూపుల...