7, ఫిబ్రవరి 2025, శుక్రవారం

🔱 అంతర్యామి 🔱

 శ్రీ రామ జయ రామ జయజయ రామ:
🔱 అంతర్యామి 🔱

# మౌన దీక్ష ...

🍁సాధనలో భాగంగా కొందరు మౌనం పాటిస్తారు. ఇది అనేక మతాల్లో ఉన్న అభ్యాసమే. నిశ్శబ్దమే దైవమని, దైవమే నిశ్శబ్దమనీ అంటారు స్వామి రామా. దైవాన్వేషణ- అంత తేలికైన విషయం కాదు. మౌనం స్వరూప స్వభావాన్ని పూర్తిగా ఆకళింపు జేసుకుని, అభ్యసించేందుకు ప్రయత్నించాలి.

🍁కళ్లు మూసుకుని మౌనంగా కూర్చుంటే సాధన అనిపించుకోదు. సాధనలో ఉన్నవారు మౌనంగా ఉండటంతోబాటు ఉపవాసం, బ్రహ్మచర్యం, నిద్రను అధిగమించడం చేస్తారు. పాటించే పద్ధతులన్నీ ఆధ్యాత్మికంగా ఒకదానికొకటి సాయపడతాయి. మాట్లాడకుండా ఉండటం మొదటిరకం. తరువాతది మరింత కష్టమైంది. కళ్లు, చేతుల సైగలు, ముఖ కవళికలు రాతల ద్వారా తెలియపరచటం... ఏదీ చేయకూడదు. అసలైన మౌనదీక్ష ఒక పద్ధతిలో సాగి క్రమక్రమంగా మనసులోని అంతర్గత సంభాషణని తగ్గిస్తుంది.

🍁మనసంటే ఒక శక్తి. అందులో జ్ఞానేంద్రియాల ద్వారా అలవాట్లు, భావోద్వేగాలకు అనుగుణంగా ఆలోచ తరంగాలు ఉత్పత్తి అవుతాయి. అవి మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తూ, అంతర్గత రొదకు కారణమై మాటలు, చర్యల రూపంలో బయటపడేలా చేస్తాయి. ఏ మాత్రం శిక్షణ లేని మనసు తక్కువ శక్తి వ్యాప్తికే కంపిస్తుంది. సాధన మనసుకు శిక్షణను ఇవ్వడానికే. సాధకుడు క్రమం తప్పకుండా పాటించే మౌనం, ధ్యానం, అంచెలంచెలుగా లోతుల్లోకి చేరుకున్నాక ప్రశాంత స్థితిని చేరుకుంటాడు. సంకల్పం తీసుకున్నాక మౌనదీక్ష వల్ల అవగాహన, సమదృష్టి పెరిగి ఆధ్యాత్మిక సాధన వేగవంతం అవుతుంది.

🍁 సంక్లిష్ట పరిస్థితుల్లో సైతం ప్రశాంతంగా, స్థిమితంగా ఉండటం సాధ్యమవుతుంది. అవసరానుగుణంగా మనసు లోతుల్లోంచి మాట్లాడటం అలవాటు అవుతుంది. మాట మీద పట్టు వచ్చాక హితం-మితం-ప్రియం అనే మూడు సూత్రాలను అనుసరించాలి. అంటే, వీలైనంత తక్కువగా మంచిగా మాట్లాడాలి.

🍁నిశ్శబ్దం దైవభాష, అందులోంచే అన్నిభాషలూ పుట్టుకొచ్చాయనిపిస్తుంది. వ్రతం అంటే వాగ్దానం. మౌనవ్రతం ఆత్మశక్తికి దోహదపడుతుంది. ఆచితూచి మాట్లాడతారు. ఎదుటివారి మనసులను నొప్పించే ప్రమాదం ఉండదు. మానవజన్మకు ఒక సార్ధకత ఏర్పడాలంటే ముందు మనిషి శబ్దంలోంచి నిశ్శబ్దంలోకి ప్రవేశించాలంటారు. మౌనాన్ని పాటించడమంటే నిశ్శబ్దాన్ని సంపూర్ణంగా ఆస్వాదించటం. అది తీసుకొచ్చే శాంతిని అనుభూతి చెందటం. ఆ నిశ్శబ్దంలోని ఆనందానికి పారవశ్యం చెందటం. మర్మజ్ఞులు కొండలు, అడవుల బాట పట్టడానికి కారణం నిశ్శబ్దంలో, ఆనంద స్థితిలో జీవిత పరమార్థం అన్వేషించటానికే.

🍁వాస్తవాన్ని ఎరుకపరచటానికి మాటలు అవసరంలేదని భావించారు రమణమహర్షి. నిశ్శబ్దంగా ఉండాలని బలవంతంగా ప్రయత్నిస్తే ఫలితం ఉండదు. ఆ పరిస్థితిని కల్పించుకోవాలి. సారవంతమైన నేలలో విత్తనం నాటి నిరీక్షించటమే.🙏

✍️- మంత్రవాది మహేశ్వర్

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మహా శివ రాత్రి : శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?

శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగివున్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి?             తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమ...