నిన్ను చూసిన ఆ అపురూప క్షణం,
కణ కణాన నీ రూపు స్థిరబడి పోయింది,
మాటలు రాక ఒక్క క్షణం మౌనమే భాషయిపోయింది.
నీ ఒంపుసొంపులు చూసి,
కిన్నెరసాని అసూయ పడుతుందేమో,
గంభీరమైన నాభిలోయలో,
ఫణిరాజు కూడా సేద తీరాలనుకుంటాడేమో,
నీ పెదవి చివర కురిసే చిరులాస్యపు జల్లుకి,
ఝల్లుమని గుండె జలదరించకుండా ఉండలేకపోతోంది.
నీ కనులలోని ప్రణయ జ్యోతులు చూసిన కనులు
మరిక దేనిని చూడమని మారాము చేస్తున్నాయి.
నీవు విద్యుల్లతలా మెరిసి మాయమైన క్షణాన,
స్పందన లేని రాయి కూడా స్పందించి,
నిలువెత్తు నీ రూపాన్ని బంధించి,
తానొక అపురూప శిల్పమై నిలిచిపోయింది.
నిమ్నోన్నతాల నీ సొగసు చూసిన తరుణాన
మేరునగధీరుడైన మోకరిల్లి ప్రేమాంజలి ఘటిస్తాడేమో!
నిను వర్ణించ పదాలు చాలక నా కలం ముందుకు సాగనంటుంది!
- శివ భరద్వాజ్
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
30, నవంబర్ 2023, గురువారం
నిన్ను చూసిన ఆ అపురూప క్షణం
29, నవంబర్ 2023, బుధవారం
ప్రజా సమస్యలు సాంబ్రాణి పొగలో కలిపి వేతురు
*ప్రజా సమస్యలు సాంబ్రాణి పొగలో కలిపి వేతురు*
అవిశ్రాంతంగా అరిచిన మైకులు మూగబోయినవి,
అలుపెరుగక సొదపెట్టిన లౌడుస్పీకర్లు ఆగిపోయినవి.
అడిగినవారికి లేదనక జరిపే మద్యోదక శాంతులు,
కావాల్సినవారికి కొసిరి కొసిరి బిరియాని నైవేద్యాలు,
అదుగో అప్పుడే మొదలయ్యాయి తాంబూల తాయిలాలు
ఓటరు దేవుని ప్రసన్నతకై సదక్షిణ తాంబూల సమర్పణలు,
ఎవరి మొక్కులు వారు మొక్కుకొని,
ఒక్కరోజు ఓటరు దేవుని ప్రసన్నతకై
నిరీక్షిస్తున్నారు నాయకులు,
గెలిచిన తరువాత తాము మొక్కిన మొక్కులు
మెక్కగ ఓటు వేసిన పాపమునకు శాపవశమున
కౌంటింగు రోజున మనిషిగ పుట్టిన ఓటరు దేవునికి
తామే వినాయకులై తొలిపూజ తమకనుచు,
ప్రతి పథకమునకు ప్రథమ నివేదన నివేదించుకొని,
కరి మింగిన వెలగపండును ప్రజలకు ప్రసాదింతురు,
ప్రజా సమస్యలు సాంబ్రాణి పొగలో కలిపి వేతురు.
-శివ భరద్వాజ్
24, నవంబర్ 2023, శుక్రవారం
నీ ఓటు నిన్ను మనిషిగా నిలబెట్టేటోనికేయి
*నీ ఓటు నిన్ను మనిషిగా నిలబెట్టేటోనికేయి*
ఒక్కొక్కడు వస్తున్నాడు ఓట్లు అడుగుతున్నాడు,
నోట్లు ముట్ట జెప్పుతా నీ ఓటు నా కంటున్నాడు,
ముందు నాకు ఓటేస్తే మందు నేకేనంటున్నాడు,
నువ్వు నా కులపోడివి నీకు నేనున్నానంటున్నాడు,
నిన్ను ఓటేయమని చవులూరించే విందు పెడుతున్నాడు,
నీవు ఓటేస్తే ఉండటానికి ఇల్లు ఇస్తానంటున్నాడు.
నీవు ఓటేస్తే ఏ పని చేయకుండా పోషిస్తానంటున్నాడు,
నీవు ఓటేస్తే నెత్తిన పెట్టుకు పూజిస్తానంటున్నాడు,
ఇంత ఘనం పైసలు యాడికెళ్ళి వస్తున్నాయి సోచాయించు బిడ్డా,
పని చేయకుండా మనకు రాని పైసలు వానికెట్లొస్తాయి బిడ్డా,
చంద్రమండలాన్ని తలపించే రోడ్లపై నీ ప్రయాణం,
చదువుకొన్న పిల్లలకు కానరాని కొలువుల దుకాణం,
మన బతుకులు బానిస బతుకులేనా,
మనకెప్పుడు పచ్చడి మెతుకులేనా,
కల్తీ లేని ఆహారం లేదు,
కల్తీ కానీ పాలన లేదు.
న్యాయం నీకు ఉచితం కాదు,
చట్టంతో చుట్టరికం లేదు,
వైద్యం మిధ్య,
ఆరోగ్యం మిధ్య,
చదువుకు ఫీజులు లక్షలోనే,
కూరగాయల రేట్లు ఆకాశంలోనే,
నిత్యావసరాల ధరలు చుక్కల్లోనే,
కరెంట్ వాతలు, గ్యాస్ మంటలు,
ఇంధన ధరలు ఆలోచించు ఇక పైన,
నీ ఓటు నిన్ను మనిషిగా నిలబెట్టేటోనికేయి,
నిన్ను బిచ్చగాని చేసి నిలబెట్టేటోనికి గాదు.
- శివ భరద్వాజ్
23, నవంబర్ 2023, గురువారం
వేగంగా ముందు "పోవాలని" తొందరెందుకు.
ఒక నిమిషం ముందు బయలుదేరితే పోయేదేముంది,
ఒక నిమిషం ఆలస్యమయితే పోయేదేముంది,
ఆదర బాదర ప్రయాణపు గమ్యం ఎచ్చటికోయి,
అతివేగపు ఆనందం ఆవిరగునోయి,
నిమిష కాలం లేటు కాదెప్పుడు చేటు,
క్షణ కాలపు అజాగ్రత్త కాటికే నీ రూటు,
మద్యపు మత్తున వాహనం నడపవద్దు,
వధ్యపు శిలన ప్రాణములు నిలపవద్దు.
వేగంగా ముందు పోవాలని తొందరెందుకు,
వేగంగా ముందు "పోవాలని" తొందరెందుకు.
-శివ భరద్వాజ్
20, నవంబర్ 2023, సోమవారం
ఆత్మీయ సమ్మేళనం,
వేద పండితుల ఆశీర్వాదం తోడైంది.
భారతీయ వారసత్వనికి చిహ్నమై శోభిల్లుతున్న
ఉండవల్లి గుహల దర్శన భాగ్యం కలిగింది.
విష్ణుకుండినులు నిర్మించిన విష్ణు గుహాలయం
ఆధ్యాత్మిక భావన పంచితే,
హాయి గొలిపే హాయ్ లాండ్ లో జల సరాగాలు ,
మరిచిపోలేని వేవ్ పూలు ఊపులతో,
ఉత్సాహం ఊపందుకుంది,
వర్షపు పాటల మధురానుభూతులతో ఉత్తేజం పొంది,
మెకానికల్ రైడ్స్ లో గిర గిరా తిరుగుతూ,
అలసివచ్చిన వారికి చల్లటి శీతల గదులు సేద తీర్చాయి.
ప్రతి ఒక్కరి ప్రతిభను వెలికి తీసిన మధు పానీయాలు,
చింతకుంట శీను అందించిన మధుర రుచులు,
పిళ్ళే ఏర్పాటు చేసిన కలల వసతులు
రసానుభూతికి దగ్గర చేసాయి.
ఉండవల్లి శీను మాటల విరుపులు,
ఉయ్యాల రాము సింధూరపువ్వు పాటలు,
పైడి రాజు, లేవిల ఊపుల డాన్సులు,
నాగేశ్వర రావు ఈలల గోలలు,
చల్లా రవి వెటకారపు మాటలు,
మరిచిపోలేని అక్కయ్య, ఆదినారాయణల చిందులు.
గుర్రం, మల్లాడి చంద్ర శేఖర్ స్పీడ్ బ్రేకర్ మాటలు,
రానని ఆగలేక వచ్చిన సముద్రాలు, శివాజిలు
రేణు, రమేష్, నాదెళ్ల ప్రసాదుల గెస్ట్ అప్పీయరెన్సులు
ఆత్మీయ సమ్మేళనకు సరికొత్త హంగులు చేర్చాయి.
దూరభారమైన క్రమం తప్పక వచ్చే రాజు,
మధు సీసాలను చంటిపాపలా లాలించే గణేషు,
స్పాన్సర్ చేసే కె వి యల్ ను,మా పెద్ద మనిషి రాపోలు శీను,
హాయ్ ల్యాండ్ గురించి సమాచార మందించిన శివ నాగేశ్వర రావు,
ఫిట్టెస్ట్ మాన్ బ్యాంకు రాంబాబు, డీజే మాస్టారు మూర్తి, ప్రొఫెసర్ నాయుడు,
సూపర్ స్టార్ పున్నారావు, స్కూలు మనతోనే ఉన్న భావన కలిగించిన అతి దగ్గరి నేస్తం
రాజా పంతుల లక్ష్మణ రావులు చక్కటి తోడ్పాటు నిచ్చారు.
విత్త మంత్రి రాజ్ కుమారు చక్కటి సహకారం అందించాడు.
తాము రాకున్నా ఆర్ధిక బాగస్వామ్యం అందించి ప్రోత్సహించిన
విదేశీ మిత్రులు, వివిధ కారణాలతో మనతో కలవలేకున్నా
మనసంతా మనతోనే ఉంచిన స్వదేశీ మిత్రులు,
మనతో కలవాలని, గడపాలని ప్రతి ఒక్కరికి ఉన్న
రాలేని కారణాలతో రణం చేస్తున్న ప్రతి మిత్రునికి
మన: పూర్వక స్నేహ సుమాంజలులు.
నారాయణ మాస్టారి ఆశీర్వచనములు,
తమ్ముడు ఢిల్లీరావు ఆత్మీయ పలకరింపులు,
తమ పిల్లలు ఎలా ఉన్నారో చూడాలని
కోరుకుంటున్న మాస్టార్ల మనోగతాలు
వెరసి ఒక సంవత్సరానికి సరిపడు
సరికొత్త ఉత్సాహం పంచాయి,
మన ఆయుష్షు మరొక సంవత్సరం పెంచాయి.
-శివ భరద్వాజ్
15, నవంబర్ 2023, బుధవారం
ఆత్మీయ సమ్మేళన ఆహ్వానం
మీ స్నేహాన్ని ఆశిస్తూ,
మీ సహచర్యం ఆస్వాదిస్తూ,
మీ అందరితో మరోసారి గడిపి,
తీరికలేని ప్రస్తుతానికి విరామమిచ్చి,
మన బాల్యానికి తిరిగివెళ్లి,
ఆ చిలిపి తగాదాలు,
ఏ బేషజాలు లేని ఆ కాలాన్ని
తిరిగి తీసుకు వద్దాం.
మన జీవితంలో రెండు రోజులు
మధురంగా మిగుల్చుకుందాం.
మరువకండి.
ఒకరోజు సంతోషం కోల్పోతే, ఒక రోజు కోల్పోయినట్లే
ఒకరోజు సంతోషం పొందితే, ఒక రోజు పొందినట్లే
అదే బాల్య స్నేహితులతో అయితే .....!!!!!
-శివ భరద్వాజ్
12, నవంబర్ 2023, ఆదివారం
*ఊరు పిలుస్తుంది - ఊరడిల్లమంటుంది*
మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
*ఊరు పిలుస్తుంది - ఊరడిల్లమంటుంది*
మీ రాక కోసం కళ్ళలో కాకరపువ్వొత్తులు పెట్టుకొని కన్నఊరు ఎదురుచూస్తుంది.
మీరందరు వచ్చి భూచక్రంలా ఊరంతా కలతిరగాలని ఆశ పడుతుంది.
మిత్రుల ఆత్మీయ ఆలింగనలలో తాడులా వెలుగుతూ అల్లుకుపోవాలంటుంది.
కోపతాపాల బాంబుల మోతలతో దద్దరిల్లింది చాలు,
చిచ్చుబుడ్డీల ఆనందాలు వెదజల్లాలని ఆశపడుతుంది.
విష్ణుచక్రంలా బతుకు చక్రంలో తిరిగే మీరు ఆటవిడుపుకు రమ్మంటుంది.
పాము బిళ్ళల బుసబుసలు మాని అన్నంముద్ద వెలుగులు వెదజల్లమంటుంది.
మీరు తారాజువ్వలా మీ జీవితాలలో విజయం సాధించాలని,
కానీ నేలనున్న మీ స్నేహితులను మరిచిపోవద్దని,
కలుసుకునేందుకు ఒకసారి తీరుబడి జేసుకు రమ్మంటుంది.
మిమ్మల్ని కాసింత ఊరడిల్లమంటుంది.
- శివ భరద్వాజ్
ఏడుచేపల కథ - అంతరార్ధం
ఈ కథ ఎందుకు పుట్టింది.!! అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.. ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు. ఎన్నో అసహజాల...
-
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు మాయెడల దయ చూపు ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
మా ప్రధానాచార్యులు ముళ్ళపూడి వారింట ముద్దులొలుకుతూ, సన్యాసి రాజు, సీతమ్మల కలలు పంటగా, తండ్యం గ్రామానుదయించిన, చదువుల సూరీడు, మారేడు దళ...