30, నవంబర్ 2023, గురువారం

నిన్ను చూసిన ఆ అపురూప క్షణం

నిన్ను చూసిన ఆ అపురూప క్షణం,
కణ కణాన నీ రూపు స్థిరబడి పోయింది,
మాటలు రాక ఒక్క క్షణం మౌనమే భాషయిపోయింది.

నీ ఒంపుసొంపులు చూసి,
కిన్నెరసాని అసూయ పడుతుందేమో,
గంభీరమైన నాభిలోయలో,
ఫణిరాజు కూడా సేద తీరాలనుకుంటాడేమో,
నీ పెదవి చివర కురిసే చిరులాస్యపు జల్లుకి,
ఝల్లుమని గుండె జలదరించకుండా ఉండలేకపోతోంది.

నీ కనులలోని ప్రణయ జ్యోతులు చూసిన కనులు
మరిక దేనిని చూడమని మారాము చేస్తున్నాయి.

నీవు విద్యుల్లతలా మెరిసి మాయమైన క్షణాన,
స్పందన లేని రాయి కూడా స్పందించి,
నిలువెత్తు నీ రూపాన్ని బంధించి,
తానొక అపురూప శిల్పమై నిలిచిపోయింది.

నిమ్నోన్నతాల నీ సొగసు చూసిన తరుణాన
మేరునగధీరుడైన మోకరిల్లి ప్రేమాంజలి ఘటిస్తాడేమో!
నిను వర్ణించ పదాలు చాలక నా కలం ముందుకు సాగనంటుంది!

- శివ భరద్వాజ్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి.

 పరుల సొమ్ము ఎంత విలువైనదైనా అది మనది కాదు. మనది కానిది ఆశించటం మంచిది కాదు. మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి. మీరు ఎంత శ్రమించి పెంచు...