2, మే 2024, గురువారం

మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి.


 పరుల సొమ్ము ఎంత విలువైనదైనా అది మనది కాదు.
మనది కానిది ఆశించటం మంచిది కాదు.
మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి.
మీరు ఎంత శ్రమించి పెంచుతున్నారో చూడనివ్వండి.
అప్పుడు వారు ప్రతి రూపాయి విలువైనదని గ్రహిస్తారు.
మీతో కలసి నడుస్తారు. మీ శ్రమలో భాగం అవుతారు.
మిమ్మల్ని ప్రభుత్వాలో, అనాధ వృద్ధాశ్రమాలో,  
మరొకరో చూడాల్సిన అవసరం రాదు.

-శివ భరద్వాజ్

మన ఓటు - మన కర్తవ్యం.

గమనించగ నాయకుల హామీలు,
కుక్కకు విసిరెడి గుప్పెడు మెతుకులు.
సంపద దొంగలకి, నువ్వే కాపలా!
ఆ సంపద నీదేనని తెలుసుకోవు,
నువ్వే యజమానివని మరిచేవు.

ఓట్ల వ్యాపారం చేసే రాజకీయ వ్యాపారి,
కోట్ల లాభం చూసేను, కానీ
నీ క్షేమం కోరునా! సంక్షేమం చూసేనా!

క్వార్టరిస్తే రోజంతా నిలబడి ఓటేస్తారు,
500 ఇస్తే రోజు కూలనుకుని ఓటేస్తారు,
ఉచితాలిస్తే ఊపుకుంటూ ఓటేస్తారు.
మరి మన బతుకెలా మారుతుంది!

నిన్ను కులం,మతం,ప్రాంతం,వర్గాలుగా
విభజిస్తారు, నీ ఐకమత్యం చీలుస్తారు.
వారు గెలుస్తారు.
మన బతుకులు మార్చరు!
నీటి మూటలు! వారిచ్చిన హామీలు.

మరో ఐదేళ్లవరకు నీకు శక్తి రాదు.
అందుకే, మనసులో ఏమున్నా
మన కర్తవ్యం మనం చేయాలి.
నాయకులు నాకేం చేసారు,
నేనెందుకు ఓటేయాలనకు.
ఆ నాయకుడినే మార్చే శక్తి
నీ ఓటుకుంది!
ఆ శక్తి ఉపయోగించవెందుకు ?
నీ తలరాత మార్చుకోవెందుకు?

మన ఓటు - మన కర్తవ్యం.

-శివ భరద్వాజ్

1, మే 2024, బుధవారం

సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడానికి కారణాలు - సామాజిక దురాచారాలు

సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడానికి కారణాలు - సామాజిక దురాచారాలు:
అయితే ఆ తప్పు సనాతన ధర్మానిది కాదు - అవి హిందూ మతంలోని లోపాలు. కాలక్రమంలో కొందరు చేర్చిన మూఢ విధానాలు.
ప్రధానంగా వీటికి రెండు మూలాలు ఉన్నాయి. అవి

1. కుల వ్యవస్థ వలన ఏర్పడినవి:
అస్పృశ్యత: బాగా తగ్గింది.
వెట్టి చాకిరి: చాలా వరకు లేదు.
సంఘ బహిష్కరణ లేక వెలి: చాలా వరకు లేదు.
దేవాలయ ప్రవేశ బహిష్కరణ: చాలా వరకు లేదు.
నిమ్న కుల విద్యా నిషేధం: చాలా వరకు లేదు.
వేదవిద్య నిషేధం: ఉంది

2. లింగ అసమానత వలన ఏర్పడినవి:
సతీ సహగమనం: ఉనికిలో లేదు.
బాల్య వివాహాలు: చాలా వరకు లేవు.
వివాహమైన స్త్రీ మొదటిరోజు బ్రాహ్మణునితో గడపాలి అనడం:    ఉనికిలో లేదు.
వితంతు వ్యవస్థ: ఉంది
బహు భార్యత్వం: చాలా వరకు లేదు.
స్త్రీ విద్య నిషేధం : లేదు.
స్త్రీకి వారసత్వపు ఆస్తి హక్కు: లేదు
వరకట్నం: ఉంది
దేవదాసి/జోగిని వ్యవస్థ: చాలా వరకు లేదు.

మనం కులవ్యవస్థ నిర్మూలించి, లింగ సమానత్వం తీసుకువస్తే హిందూ మతంలో ప్రధానంగా చెప్పబడుతున్న లోపాలు నివారించవచ్చు. పై వాటిలో కొన్నిటిని నివారించటానికి  చట్టపరమైన భద్రత ఉంది.
సనాతన ధర్మంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. అది భారతీయ జీవన విధానం. హిందూ మతంలో కాలక్రమంలో వచ్చి చేరిన కలుషితాలను శుభ్ర పరిస్తే అది మళ్ళీ పవిత్ర గంగానది అవుతుంది. వీటి కారణంగా మొత్తం ధర్మాన్నే వ్యతిరేకించటం, అవమానించటం సరి కాదు.

మన శరీరంలోకి జబ్బులు వస్తే ఆ జబ్బు పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. కానీ శరీరాన్ని నిర్మూలించము కదా!

-శివ భరద్వాజ్

30, ఏప్రిల్ 2024, మంగళవారం

మరణం లేని కవి - అస్తమించని రవి - శ్రీ శ్రీ

 


కార్మిక దినోత్సవ ముందురోజు
విప్లవ వేగు చుక్కై,
తూరుపు తీరాన ఉప్పెనై,
'ప్రభవించిన మరో
వెలుగుల రేడు శ్రీ శ్రీ

అభ్యుదయ సిరాతో
'మహా ప్రస్థానం' సాగించి,
'మరో ప్రపంచం' సృజించి,
పద 'ఖడ్గ సృష్టి' చేసి,
విప్లవ కవితా వృష్టిచే,
'రివల్యూషన్ రెక్కలు
విప్పి, స్వేచ్ఛగా ఎగిరినాడు
'ప్ర-జ'ల హృదయముల శ్రీశ్రీ

ఆ గొంతే శంఖారావం,
అక్షరమే నిప్పు కణం,
పదాల కత్తులు దూసి,
చీకి పోయిన కవితా వస్తువుల
కుత్తుక కోసెనదిగో,
అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ,
కుక్కపిల్ల కాదేదీ కవితకనర్హం
అన్న  'అనంత' శయనుడు
మహాకవి  శ్రీశ్రీ

మరణం లేని కవి,
అస్తమించని రవి.

- శివ భరద్వాజ్

29, ఏప్రిల్ 2024, సోమవారం

అద్భుతము జరుగునదే!

అద్భుతములు సృష్టించగ,
అద్భుత యత్నములు, అవసరము లేదు సుమా!
సద్బుద్ధి, యత్నములచే
అద్భుతము జరుగునదే! నిరంతర శ్రమచే!!

-శివ భరద్వాజ్ 

27, ఏప్రిల్ 2024, శనివారం

కొత్త తేజమును పొంది గెలవగ తిరిగి రండి

సీస పద్యం:

ఫలితము లొచ్చెను,  పిల్లల రాతకు,
వివరము తెలిసెను, విజయములను
పొందిన వారి, విశ్రాంతి నందిన వారి,
చింత వలదు  ఫలితంబు గూర్చి,
వదలి పెట్టి, కొనసాగవలె నీ గెలుపుకై,
అలసిన గుండెకు తాతల ఒడి
సేద తీర్చును, ఊరు వెళదాం, పదండిక
నాయనమ్మల చేతి వంట తినగ!

 
తేటగీతి(పంచపాది):

వారి యాశీసులంది, ఊరంత తిరిగి,
పచ్చటి పొలముగట్లపై పరుగులెత్తి,
ఉసిరి కాయల చెట్టుతో ఊసులాడి!
లేత మామిళ్ల రుచులు చూసేసి, కొత్త
తేజమును  పొంది గెలవగ తిరిగి రండి!!

-శివ భరద్వాజ్

26, ఏప్రిల్ 2024, శుక్రవారం

రాజువి బానిసగ మారి యాచకుడయ్యావ్

రాజులు చేయగ ప్రజలను,
వజ్రాయుధ సదృశ, ఓటు రాజ్యాంగ మిచ్చె!
భాజాలు కొట్టుటలవడి,
రాజువి బానిసగ మారి యాచకుడయ్యావ్!! 

-శివ భరద్వాజ్

అసాధ్యము సాధ్యమగు నీకిక

||హరిణగతి రగడ||

ప్రయత్నము చేయవలె వీడక,
ఫలితము దేవునకే వదులిక,
మనోధైర్యం అండ నుండగ,
పరిస్థితి చింతలే  వదులిక,
అసాధ్యము సాధ్యమగు నీకిక.

-శివ భరద్వాజ్

23, ఏప్రిల్ 2024, మంగళవారం

నిందించుటేల ఆప్తుల

నిందించుటేల ఆప్తుల

||కందము||

నిందించుటేల ఆప్తుల,
నిందించుట మాని తోడు నిలచిన, మద్ధతు
నందించి, సున్నితముగ
స్పందించిన, బంధము బలపడి నిలుచు ఉమా!

-శివ భరద్వాజ్

పెళ్ళైన పదకొండేళ్ల తర్వాత దంపతులకు ఓ అబ్బాయి పుట్టాడు. వారిద్దరికి ఒకరంటే మరొకరికి  ప్రాణం మరియు ఆ అబ్బాయి వారి కళ్ళకు రత్నం. అంతే అపురూపంగా ఆ పిల్లవాడిని చూసుకునేవారు.

ఆ అబ్బాయికి రెండు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఒక రోజు ఉదయం భర్త ఆఫీసుకు వెళుతుండగా ఒక మెడిసిన్ బాటిల్ తెరిచి ఉండటం గమనించాడు. అతని  ఆఫీసుకు ఆలస్యం అవుతుందని, తన భార్యను ఆ సీసా మూతపెట్టి అల్మారాలో ఉంచమని అడిగాడు. వంటగదిలో పనిలో నిమగ్నమై ఉన్న అతని భార్య, ఓపెన్ మెడిసిన్ బాటిల్ గురించి పూర్తిగా మర్చిపోయింది.

ఆ పిల్లవాడు బాటిల్‌ని చూసి దాని రంగుకు ముగ్ధుడై సీసా దగ్గరకు వెళ్లి మందు అంతా తాగాడు.  కానీ ఆ మందు,  చిన్న మోతాదులలో పెద్దలకు ఉద్దేశించిన విషపూరిత ఔషధం. మందు తాగిన పిల్లవాడు కుప్పకూలిపోవడంతో, ఆ తల్లి అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లింది,  కానీ ఆ పిల్లవాడు అక్కడ  మరణించాడు. ఆ తల్లి తల్లడిల్లిపోయింది.  తన భర్త వచ్చి ఏమంటాడో, అతనిని ఎలా ఎదుర్కోవాలో అని  ఆమె విపరీతంగా భయపడింది.

దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ తండ్రి ఆసుపత్రికి వచ్చి చనిపోయిన బిడ్డను చూసి, తరువాత తన భార్యను చూసి నాలుగు పదాలు మాత్రమే చెప్పాడు.

ఆ పదాలు "నేను నీతో ఉన్నాను డార్లింగ్."  తన భర్త నుండి అస్సలు ఊహించని స్పందన అది.

పిల్లవాడు చనిపోయాడు. అతన్ని ఎప్పటికీ తిరిగి బ్రతికించలేము.

తల్లి లో తప్పులు వెతికినా ప్రయోజనం లేదు. అదీగాక,  తనే ఆ బాటిల్‌ని దూరంగా ఉంచడానికి కొంత సమయం తీసుకుంటే, ఇది జరిగేది కాదు కదా అని ఆలోచించిన ఫలితంగా వచ్చిన స్పందన అది.

ఇందుకు ఎవరినీ నిందించకూడదు. ఆమె కూడా తన ఏకైక బిడ్డను కోల్పోయి తల్లడిల్లిపోతుంది. ఆ క్షణంలో ఆమెకు కావలసింది తన భర్త నుంచి ఓదార్పు, సానుభూతి.  సరిగ్గా అదే అతను ఆమెకు ఇచ్చాడు.


కొన్నిసార్లు అనుకోకుండా తప్పులు జరుగుతాయి. అప్పుడు మనం మన సమయాన్ని ఆ తప్పుకు ఎవరిని భాద్యులని చేయాలి, ఎవరిని నిందించాలి అని ఆలోచిస్తాం.  అది మన సంబంధలలో కావచ్చు, ఉద్యోగంలో లేదా మనకు తెలిసిన వ్యక్తుల విషయంలో కావచ్చు.  ఈ విధమైన ప్రవర్తన కారణంగా  మనం మానవ సంబంధాలలో గల ఆత్మీయతను కోల్పోతాము, ఒక్కోసారి పూర్తిగా ఆ బంధాలనే కోల్పోవచ్చును.  ( - మూలం వాట్సప్ ఆంగ్ల కథనం)


నిందించుటేల ఆప్తుల,
నిందించుట మాని తోడు నిలచిన, మద్ధతు
నందించి, సున్నితముగ
స్పందించిన, బంధము బలపడి నిలుచు ఉమా!

మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి.

 పరుల సొమ్ము ఎంత విలువైనదైనా అది మనది కాదు. మనది కానిది ఆశించటం మంచిది కాదు. మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి. మీరు ఎంత శ్రమించి పెంచు...