నిందించుటేల ఆప్తుల
||కందము||
నిందించుటేల ఆప్తుల,
నిందించుట మాని తోడు నిలచిన, మద్ధతు
నందించి, సున్నితముగ
స్పందించిన, బంధము బలపడి నిలుచు ఉమా!
-శివ భరద్వాజ్
పెళ్ళైన పదకొండేళ్ల తర్వాత దంపతులకు ఓ అబ్బాయి పుట్టాడు. వారిద్దరికి ఒకరంటే మరొకరికి ప్రాణం మరియు ఆ అబ్బాయి వారి కళ్ళకు రత్నం. అంతే అపురూపంగా ఆ పిల్లవాడిని చూసుకునేవారు.
ఆ అబ్బాయికి రెండు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఒక రోజు ఉదయం భర్త ఆఫీసుకు వెళుతుండగా ఒక మెడిసిన్ బాటిల్ తెరిచి ఉండటం గమనించాడు. అతని ఆఫీసుకు ఆలస్యం అవుతుందని, తన భార్యను ఆ సీసా మూతపెట్టి అల్మారాలో ఉంచమని అడిగాడు. వంటగదిలో పనిలో నిమగ్నమై ఉన్న అతని భార్య, ఓపెన్ మెడిసిన్ బాటిల్ గురించి పూర్తిగా మర్చిపోయింది.
ఆ పిల్లవాడు బాటిల్‌ని చూసి దాని రంగుకు ముగ్ధుడై సీసా దగ్గరకు వెళ్లి మందు అంతా తాగాడు. కానీ ఆ మందు, చిన్న మోతాదులలో పెద్దలకు ఉద్దేశించిన విషపూరిత ఔషధం. మందు తాగిన పిల్లవాడు కుప్పకూలిపోవడంతో, ఆ తల్లి అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లింది, కానీ ఆ పిల్లవాడు అక్కడ మరణించాడు. ఆ తల్లి తల్లడిల్లిపోయింది. తన భర్త వచ్చి ఏమంటాడో, అతనిని ఎలా ఎదుర్కోవాలో అని ఆమె విపరీతంగా భయపడింది.
దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ తండ్రి ఆసుపత్రికి వచ్చి చనిపోయిన బిడ్డను చూసి, తరువాత తన భార్యను చూసి నాలుగు పదాలు మాత్రమే చెప్పాడు.
ఆ పదాలు "నేను నీతో ఉన్నాను డార్లింగ్." తన భర్త నుండి అస్సలు ఊహించని స్పందన అది.
పిల్లవాడు చనిపోయాడు. అతన్ని ఎప్పటికీ తిరిగి బ్రతికించలేము.
తల్లి లో తప్పులు వెతికినా ప్రయోజనం లేదు. అదీగాక, తనే ఆ బాటిల్‌ని దూరంగా ఉంచడానికి కొంత సమయం తీసుకుంటే, ఇది జరిగేది కాదు కదా అని ఆలోచించిన ఫలితంగా వచ్చిన స్పందన అది.
ఇందుకు ఎవరినీ నిందించకూడదు. ఆమె కూడా తన ఏకైక బిడ్డను కోల్పోయి తల్లడిల్లిపోతుంది. ఆ క్షణంలో ఆమెకు కావలసింది తన భర్త నుంచి ఓదార్పు, సానుభూతి. సరిగ్గా అదే అతను ఆమెకు ఇచ్చాడు.
కొన్నిసార్లు అనుకోకుండా తప్పులు జరుగుతాయి. అప్పుడు మనం మన సమయాన్ని ఆ తప్పుకు ఎవరిని భాద్యులని చేయాలి, ఎవరిని నిందించాలి అని ఆలోచిస్తాం. అది మన సంబంధలలో కావచ్చు, ఉద్యోగంలో లేదా మనకు తెలిసిన వ్యక్తుల విషయంలో కావచ్చు. ఈ విధమైన ప్రవర్తన కారణంగా మనం మానవ సంబంధాలలో గల ఆత్మీయతను కోల్పోతాము, ఒక్కోసారి పూర్తిగా ఆ బంధాలనే కోల్పోవచ్చును. ( - మూలం వాట్సప్ ఆంగ్ల కథనం)
నిందించుటేల ఆప్తుల,
నిందించుట మాని తోడు నిలచిన, మద్ధతు
నందించి, సున్నితముగ
స్పందించిన, బంధము బలపడి నిలుచు ఉమా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి