25, జనవరి 2025, శనివారం

🔱 అంతర్యామి 🔱

 శ్రీ రామ జయ రామ జయజయ రామ:
🔱 అంతర్యామి 🔱

# బుద్ధి సూక్ష్మత...

🍁సబ్బునీటితో బుడగ సృష్టించి సంబరపడటం చిన్నతనం. మనిషి జీవితం నీటి బుడగన్నది గ్రహించడం పెద్దరికం. ఆటబొమ్మగా చిన్నకారును చూసి సంబరపడే పిల్లాడికి, కారు కొనుక్కుని దాన్ని వివిధ భంగిమల్లో చూసి మురిసిపోయే పెద్దవారికి తేడా ఏమీ లేనట్టే! అవసరార్థం వనరులు సమకూర్చుకోవడం వేరు, ఆడంబర ప్రదర్శనకు వస్తువులను ఏర్పాటు చేసుకోవడం వేరు. మనసు కన్నా బుద్ధి శక్తిమంతమైనది అంటోంది గీత. బుద్ధి పదునవుతున్నకొద్దీ మనసు దానంతటది నియంత్రితమవుతుంది. వయసుతో పాటు బుద్ధి వికసించాలి. ఆలోచనల్లోని పరిణతి ఆచరణలో కనిపించాలి. వ్యక్తిత్వవికాసం అంటే అది!

🍁జ్ఞానం మూడు స్థితులలో పనిచేస్తుంది. మొదటిది అంతః ప్రేరణ తెలివి, రెండోది సహజ జ్ఞానం (ఇదే బుద్ధి)- బాహ్య ఉపకరణాల ద్వారా నేర్చుకోవడం, పరిసరాలూ-పరిస్థితుల నుంచి గ్రహించడం వల్ల కాకుండా సహజసిద్ధంగా హృదయ లోతుల నుంచి ఉద్భవిస్తుంది. ఇదే వాస్తవమైంది. దీన్నే శాస్త్రాల్లో బుద్ధి, ధీః, హృదయకమలం, జ్ఞాననేత్రం అంటారు ఈ సహజ జ్ఞానం ఉద్దీపనం అవడమే బుద్ధియోగం అన్నది గీతాప్రవచనం. పవిత్ర హృదయంతో, ప్రార్థనలతో, గాయత్రి వంటి మంత్రజపాలతో బుద్ధిసూక్ష్మత పొందడం మూడోది. బుద్ధి పరిధిని పెంచుకుంటూ, మనసు ప్రమేయాన్ని నామమాత్రం చేసుకుని ఆత్మజ్ఞానం పొందడం మానవజన్మ లక్ష్యం. జాగృతి చెందిన బుద్ధిని సారథిగా చేసుకొన్న వ్యక్తి భగవంతుడి సాన్నిధ్యాన్ని తేలిగ్గా చేరతాడు.

🍁మందబుద్ధి సారథ్యంలోని వ్యక్తి గమనం లౌకికతతో కొట్టుమిట్టాడుతూ అగమ్యగోచరమవుతుంది అన్నది. కఠోపనిషత్తు వాక్యం. కర్తవ్యసాధనలో  తలమునకలయ్యే సాధకుడు వ్యక్తులతో, వస్తువులతో సంబంధాలు పెంచుకోడు. వివిధ దశల్లోని భవబంధాలను, వస్తువుల పట్ల ఆపేక్షను ఎప్పటికప్పుడు తేలిగ్గా వదిలించుకుంటూ కడపటి గమ్యం చేరతాడు. చెట్టు నుంచి పచ్చని ఆకును, దోర కాయను, విరబూసిన పువ్వును విడదీయడానికి బలం కావాలి. కానీ పండిన ఆకు, కాయ, పరిపూర్ణంగా వికసించి ఎండిన పువ్వు సులువుగా నేలరాలి మట్టిలో కలిసిపోతాయి. ఒక్కోదానికి ఒక్కో చివరి దశ ఉంటుంది. అక్కడికి చేరుకున్నాక అనీ విడిపించుకుని మనసును, శరీరాన్ని తేలిక చేసుకోవాలి.

🍁గొంగళిపురుగు తన చుట్టూ తానే గూడు అల్లుకుని, దాంట్లో బందీ అవుతుంది. అందులోనే ఉండి అది ఎంత రోదించినా దానికి సాయం చేయడానికి ఎవరూ రారు. చివరికి అదే జ్ఞానం పొంది, అందమైన సీతాకోకచిలుకలా బయటికి వస్తుంది.

🍁ప్రాపంచిక బంధాలకు సంబంధించి మనిషి పరిస్థితీ ఇదే. వ్యామోహాలను ఛేదించుకుని మోక్షం సాధించాలి. ఉన్నతమైన జీవితం గడపాలంటే శరీరాన్ని, ఇంద్రియాలను తదనుగుణంగా మలచుకోవాలి. మనసు కోరికలకు ఆజ్యం పోస్తుంది.

🍁కృత్రిమ వస్తువులపట్ల మొదట ఆకర్షితమై, తర్వాత్తర్వాత దాసోహమై చివరికీ అదే జీవితమన్న భ్రమకు లోనవుతుంది. ఆ మాయలోంచి బయట పడగలిగిన మానవ జన్మే ధన్యమవుతుంది.🙏

✍️-ప్రతాప వెంకట సుబ్బారాయుడు
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

🔱 అంతర్యామి 🔱

 శ్రీ రామ జయ రామ జయజయ రామ: 🔱 అంతర్యామి 🔱 # బుద్ధి సూక్ష్మత... 🍁సబ్బునీటితో బుడగ సృష్టించి సంబరపడటం చిన్నతనం. మనిషి జీవితం నీటి బుడగన్నది ...