26, జులై 2025, శనివారం

పంచేంద్రియాల్లో ప్రమాదకరమైంది ఏది?

 పంచేంద్రియాల్లో ప్రమాదకరమైంది ఏది?* 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కనిపించని ఏదో ఒక దివ్యశక్తి ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ శక్తినే దైవశక్తి అంటాం. అలాగే కనిపించని ఏదో శక్తి ఈ మనిషి జీవితాన్ని నడిపిస్తోంది. దాన్నే మనసు అంటాం. మనసు ఎక్కడుందో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మన శరీరంలో రక్తం ప్రవహించినంత కాలం ఆ మనసు ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉంటుంది. మనం ఊపిరి తీస్తున్నంత కాలం, ఆ మనసు మనల్ని ఆడిస్తూనే ఉంటుంది.

మనసు సముద్రం లాంటిది. సముద్రం అనంతమైనది. అపారమైనది. లోతైనది. సముద్రంలో జలచరాలుంటాయి. జలసంపదలుంటాయి. అమృతం, హాలాహలం అక్కణ్నుంచే పుట్టాయంటాయి పురాణాలు. సముద్రంలోంచి ఉప్పెనలొస్తాయి. సముద్రం అందమైనది. కల్లోలమైనది. చెలియలికట్ట దాటనంతవరకు సముద్రంతో ఏ ప్రమాదం ఉండదు.

మనసూ అంతే! మనసు ప్రపంచాన్ని ఉద్ధరించగలదు. ప్రపంచాన్ని భస్మం చెయ్యగలదు. మనిషిలో సత్వగుణం అమృతం. సత్వగుణం పెంచుకుంటే మనిషి వల్ల సమాజానికెంతో మేలు జరుగుతుంది. తమోగుణం పెరిగితే జరిగేవన్నీ చెడ్డ పనులే!
నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. ప్రపంచంలో విషయాలన్నీ మనసును చేరతాయి.

మనిషికి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలున్నాయి. ప్రపంచంలో ప్రతి దృశ్యాన్నీ కన్ను ఆకర్షిస్తుంది. అందమైన వస్తువులన్నీ సొంతం కావాలనుకుంటుంది. చెవి మంచి, చెడు శబ్దాలను వింటుంది. మంచిని మాత్రమే గ్రహించి, చెడును విడిచిపెట్టగలిగితే మనిషి ఉన్నతుడవుతాడు. ముక్కు సువాసనలే పీలుస్తుంది. దుర్వాసనలను ఎలాగూ పీల్చదు. జిహ్వ రుచులను కోరుతుంది. దీంట్లో తినరానివి తినకూడదని విడనాడితే మనసు నిర్మలమవుతుంది. చర్మం సుఖాన్ని కోరుతుంది. ఇలా పంచేంద్రియాలు మనిషి మనసును, మంచి చెడులవైపు ప్రేరేపిస్తాయి.

పంచేంద్రియాల్లో ప్రమాదకరమైనది నోరు. ఇది రెండు పనులు చేస్తుంది- తింటుంది, మాట్లాడుతుంది. రెండూ మితమైనప్పుడే మనసు సత్వ సంపన్నమవుతుంది. అప్పుడే సమాజ సేవ, ఆధ్యాత్మిక చింతన, అరిషడ్వర్గాల అదుపు పెరిగి మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.

ధర్మరాజు జూదమాడాడు. ఆస్తిపాస్తులను, భార్యను పణంగా పెట్టాడు. పరాజితుడయ్యాడు. అతడిలో తప్పున్నా లోకం అతణ్ని పన్నెత్తు మాటనలేదు. కారణం ఆయన మనసు వెన్న లాంటిది. దానధర్మాలు చేస్తాడు. దైవభక్తి కలవాడు. దుర్యోధనుడు అసూయాపరుడు కావడం, ధర్మవ్యతిరిక్తమైన పనులు చెయ్యడంతో అతడు లోక నిందితుడయ్యాడు. కారణం అతడి మనసు. సకల శాస్త్ర పారంగతుడు, పరాక్రమశాలి, సకల సంపన్నుడు రావణుడు. మనసు చెడ్డతనం వల్ల లోకనిందకు గురయ్యాడు. రాక్షస కులంలో పుట్టినా విభీషణుడు మనసును ధార్మిక చింతన వైపు మళ్ళించడంతో లోకం అతణ్ని మెచ్చుకుంది. అందుకే మనసును అదుపులో ఉంచుకోకపోతే జీవితం కష్టాల కడలి తరంగాల సంక్షుభితం అవుతుంది. మనసును అదుపులో ఉంచుకుంటే ఆనందాల నందనవన సంశోభితమే అవుతుంది!

🚩 హరహర మహాదేవ శంభోశంకర 🚩

25, జులై 2025, శుక్రవారం

గర్విష్ఠి న్యాయవాది Vs చమత్కారి గురువు



ఒక గర్విష్ఠి న్యాయవాది తనకు చెందిన బావిని ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడికి అమ్మేశాడు. రెండు రోజుల తర్వాత న్యాయవాది అతని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు:

"సార్, నేను మీకు బావిని అమ్మాను కానీ... దానిలో ఉన్న నీటిని కాదు. మీరు ఆ నీటిని వాడాలంటే, విడిగా చెల్లించాలి."

దానికి గురువు చిరునవ్వుతో ఇలా స్పందించాడు:

"నిజమే నాయనా! నేను కూడా ఇప్పుడు మీ దగ్గరకే రాబోతున్నాను. మీరు నా బావి నుండి పూర్తిగా మీ నీటిని ఖాళీ చేయాలి.  లేకుంటే, మీరు నా బావిలో నీరు నిల్వ చేసినందుకు, రేపటి నుండి నాకు అద్దె చెల్లించాలి అని చెప్పడానికి!"

ఈ మాటలు విని న్యాయవాది కంగారుపడి, తడబడుతూ చెప్పాడు:

"అరే సార్, నేను సరదాగా అన్నాను!"

గురువు మళ్లీ చిరునవ్వు చిందిస్తూ అన్నారు:

"నాయనా, నీ లాంటి ఎంతో మందికి పాఠాలు చెప్పి, వారిని న్యాయవాదులుగా తయారు చేశాను! కానీ తెలివిగా ఉండడం అందరూ నేర్చుకోవాల్సిందే!"

ఎంతైనా గురువు గురువే..! 🙏

9, జులై 2025, బుధవారం

అబ్బబ్బ వెధవ బండి 💥

 అబ్బబ్బ వెధవ బండి 💥

{వ్యాకరణం (తెలుగు) తెలిసిన వారికి విందు భోజనం}
🌺🌺🌺🌺🌺🌺

   ఈ సంఘటన చాలా పాతకాలం నాటిది. ఒక పండితుడు వేరొక పండితుడి గ్రామానికి బస్సులో వస్తున్నానని కబురు చేశాడు. తన ఇంటికి వస్తున్న పండితుడిని ఆహ్వానించి, ఇంటికి తీసుకెళ్లడానికి ఎడ్లబండి కట్టుకొని బస్సు వచ్చే చోటికి వెళ్లాడు.

 బస్ స్టాండ్ గ్రామానికి 3, 4 మైళ్ళ దూరంలో ఉంది. అందునలన, వేరే బండివాడిని తీసుకరాకుండా, తానొక్కడే ఎద్దులను కట్టి, బండి తోలుకుంటూ బస్టాండ్ కు వచ్చాడు. బస్సు దిగిన సోదర పండితుడిని సాదరంగా ఆహ్వానించి, బండిలో కూర్చోబెట్టుకొని తన గ్రామానికి బయలుదేరాడు.

 పల్లెటూరుకు వెళ్లే త్రోవ కాబట్టి, అంత బాగా ఉండదు. నల్లేరు మీద బండి నడక కాకుండా, ఎగుడు దిగుడు బండల మీద త్రోవ వల్ల, ఎద్దుల బండి బాగా కుదుపులతో వెళుతూవుంది. 
కుదుపులు ఎక్కువ ఉండడం వలన పోరుగూరి నుంచి వచ్చిన పండితుడు 'అబ్బబ్బ వెధవ బండి' అన్నాడు.

 దానికి, బండి యజమానియైన పండితుడు, ఏమండీ మీరంటున్నది షష్టీ తత్పురుషమా! లేక కర్మధారయమా! అన్నాడు నవ్వుతూ. షష్టీ తత్పురుషము అయితే 'వెధవ యొక్క' బండి అనే అర్థము వస్తుంది. అదే కర్మధారయమైతే 'వెధవ (యైన) బండి' అనే అర్థము వస్తుంది. (బండి యొక్క యజమాని వెధవనా? బండి వెధవదా?).

దానికి పొరుగూరి పండితుడు నవ్వుతూ, "యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి" అన్నాడు. (అంటే వెధవ కొఱకు బండి) అని. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. ఆ కాలంలో పండితులు మాటల్లో కూడా అలాంటి చెణుకులు విసురుకొని ఆనందించేవారు.

**

ఇంకొక చమత్కార సంభాషణను ఆస్వాదిద్దాం.
 ఒక శిష్యుడు, గురువుగారి దగ్గర విద్య అభ్యసించి,
పెళ్ళి చేసుకొని ఊరికి వెలుపల ఇల్లు కట్టుకొని స్థిరపడ్డాడు. ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద శిష్యుడి గ్రామం దారిలో వెళుతూ, ఒకసారి చూసి వెళ్దామని, శిష్యుడి యింటికి వచ్చాడు.

రాక రాక వచ్చిన గురువు గారికి, శిష్యుడూ, అతడి భార్య చక్కని ఆతిథ్య మిచ్చి, తాంబూల సహిత పంచలచాపు యిచ్చి పాదాలకు నమస్కారం చేశారు. అప్పుడు గురువు గారు, ఒక శార్దూల వృత్తంలో (పద్యము), వేదమంత్రము వచ్చేట్టుగా చెప్పి ఆశీర్వదించారు.

అప్పుడు చమత్కారియైన శిష్యుడు నవ్వుతూ, "గురువుగారూ, ఆతిథ్యం స్వీకరించి మా యింట శార్దూలమును (పులిని) విడిచి వెళ్ళుట మీకు న్యాయమేనా?" అన్నాడు.

దానికి గురువుగారు నవ్వుతూ, "ఆ శార్దూలమును మంత్రించి వదిలేశాను. నీకు ఏలాంటి అపకారం చేయదు. అదీగాక, నీవు ఊరి వెలుపల ఇల్లు కట్టుకున్నావు. పంచమీ తత్పురుషము లేకుండా ఈ షష్టీని కాపలాగా పెట్టానని" అన్నారు.

పంచమీ తత్పురుషానికి అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగవలన భయము'. షష్టీ తత్పురుషానికి 'కుక్క యొక్క కాపలా'. అంటే, గురువుగారు, దొంగ వలన భయము లేకుండా శార్దూలాన్ని కాపలా పెట్టారన్నమాట.

ఆ కాలం వాళ్లు, ఈ కాలం వాళ్ల లాగా, గుమ్మం దగ్గర నుండే టాటా, బై బై చెప్పేవారు కాదు. గురువుగారిని బండిలో ఎక్కించి, "మీరు మళ్ళీ మా యింటికి దయచేయాలి" అని మర్యాద పూర్వకంగా అనేవారు. 
శిష్యుడు కూడా అలాగే అన్నాడు.

అందుకు గురువు గారు నవ్వుతూ, "నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే" అన్నాడట. ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ, 'భార్యా భర్తలు', 'తలిదండ్రులు', 'అక్కాచెల్లెళ్లు' అని ఉంటుంది.

ద్వంద్వాతీతుడంటే మీ భార్యాభర్తలు తలిదండ్రులు అయినప్పుడు, అంటే, "మీకు సంతానం కలిగినప్పుడు మళ్ళీ వస్తానని" అర్థము. పూర్వకాలము పండితులు కలిసినప్పుడు, ఇంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.

 మనం ఎలాగూ మాట్లాడలేము. కనీసం విని ఆనందిద్దామని మీకు ఈ వ్యాసంలో తెలియజేస్తున్నాను.

చదివినందుకు ధన్యవాదాలు.అబ్బబ్బ వెధవ బండి 💥

*తిరస్కరణ కావాలి - ఆవిష్కరణ*

నిన్ను తిరస్కరిస్తే, నమస్కరించు,  నిరాశపడక ప్రయత్నించు,  నిరంతర సాధనతో పురోగమించు,  నిన్ను నవీకరించి, ఆవిష్కరించు,  గెలుపు పథాన తిరిగి పయనిం...