తాయత్తుకు నిజంగా మహిమ ఉందా? మనం కోరుకున్నది నెరవేరుస్తుందా?
9 నెలలు నీ తల్లి మోస్తే నీవు పుట్టావు.
9 సంవత్సరాలు నీ లక్ష్యాన్ని మోస్తే నీ భవిష్యత్తు పుడుతుంది.
మరి నీ భవిష్యత్తు విజయవంతంగా ఉండాలంటే, విజయాన్ని నువ్వు సాధించాలంటే నీకొక విజన్ ఉండాలి. నీకొక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. నీ లక్ష్యం చేరుకోవాలంటే నీవు ఒక తాయత్తు కట్టుకోవాలి.
తాయత్తు కట్టుకుంటే దుష్ట శక్తులు దగ్గరకు రావని, అద్భుత శక్తులు వస్తాయని, ఏ విధమైన అనారోగ్యాలు రాకుండా
కాపాడుతుందని, కష్టాలు రాకుండా చేస్తుందని,భయాన్ని పోగొడుతుందని, మనం కోరుకున్నది జరిగేలా చేస్తుందని రక రకాల నమ్మకాలూ, భావనలు ప్రజలలో ఉన్నాయి. ఇది బలంగా నమ్మినవారికి, మూఢంగా నమ్మేవారికి, చాలా సందర్భాలలో వారు పెట్టుకున్న నమ్మకాలు, భావనలు నిజం అయ్యాయి కూడా. నిజంగా తాయత్తుకు అంత మహత్యం ఉందా?. తాయత్తు అంత శక్తి వంతమైనదా? తెలుసుకునే ముందు అసలు తాయత్తు అంటే ఏమిటి? దాని పుట్టు పూర్వోత్తరములు ఏమిటి? ఒకసారి తెలుసుకొందాం
తమిళంలో తాయి అంటే తల్లి, అత్తు అంటే ఖండించబడింది అని అర్ధం. తాయత్తు అంటే తల్లి నుండి ఖండించబడిందని అర్ధం. బిడ్డ పుట్టగానే తల్లి, పిల్లవాడిని కలిపివుంచే బొడ్డు తాడును కత్తిరిస్తారు. పూర్వకాలంలో ఇలా కత్తిరించిన బొడ్డు తాడును రక్తాన్ని కొన్నిరకాల పసర్లతో కలిపి ఒక లోహపు గొట్టంలో పురుడు పోసిన మంత్రసాని ఉంచేది. బారసాల తరువాత దానిని ఎప్పుడూ బిడ్డ దగ్గరే ఉండేలా బిడ్డ మొలకు కట్టిఉంచేవారు.
ఆ బిడ్డ జీవితాంతం అది మొలకు ఉండేది. కాలక్రమంలో ఎప్పుడైనా అంతుపట్టని పెద్ద జబ్బు వస్తే ఆయుర్వేద వైద్యులు వైద్యం చేయడం కోసం మొలకు కట్టిన బొడ్డుతాడు ముక్కను పసర్లతో కలిపి మందు తయారు చేసి ఇచ్చేవారు.రోగం నయమయ్యేది. కాలంతో పాటు ఆ వైద్య విధానం కనుమరుగై పోయింది. అయినా ఆచారం కొనసాగుతుంది. ఇప్పుడు అది తగ్గిపోయి మొలతాడు కట్టుకుంటున్నారు, కొందరు అది కూడా మానేశారు. అయితే ఈ తాయత్తు వాడకం తప్పనిసరి చేయడం కోసం, పిల్లలు తీసివేయకుండా ఉండడం కోసం రక రకాల కథలు అల్లారు. ఆ కథలే మనం ముందు చెప్పుకున్న మహత్యాలు. మరి అవి కథలైతే నిజం ఏమిటి? ఎందుకు తాయత్తుని కట్టుకుంటే మన కోరిక నెరవేరుతుంది!
"యాద్భావం తద్భవతి" - అద్భుతమైన వాక్యం. దీనర్ధం మనం ఏది అనుకుంటే అది అవుతుంది.
మనం ఏది జరగాలని బలంగా కోరుకుంటే, మనం ఏది జరగాలని బలంగా విశ్వసిస్తే అది జరిగేందుకు అనుగుణంగా మన ఆలోచనలు మొదలవుతాయి. మన మెదడు మనం ఆ దిశగా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. దానికి అనుగుణంగా మన చర్యలు లేదా పనులు ఉంటాయి. మన కోరిక నెరవేరేలా ప్రతీ రోజూ ఆ దిశగా పని చేయడం వలన, ఆ పనులు మన అలవాట్లుగా మారుతాయి. మన అలవాట్లు మనల్ని మనం అనుకున్న దిశగా నడిపిస్తాయి, మనం అనుకున్నది జరుగుతుంది. ఇదే తాయత్తు మహిమ.
తన మీద తనకు నమ్మకం లేని వ్యక్తి, మానసికంగా బలం లేని వ్యక్తి, తాయత్తుని నమ్మేవారు చెప్పే మాటలు విని తన కోరికలు నెరవేర్చే శక్తి తాయత్తులో ఉందని బలంగా విశ్వసిస్తాడు, నమ్ముతాడు. దాంతో ఆ మూఢనమ్మకం వల్ల మనం ముందు చెప్పుకున్న ఆలోచన చర్యల పరంపర మొదలై అతని కోరిక నెరవేరే దిశగా అతని పయనం సాగుతుంది. అతను ఏ ఉద్దేశ్యంతో అయితే తాయత్తు ధరించాడో ఆ ఉద్దేశ్యం నెరవేరుతుంది.
దీనిగురించి ఒక కథ చెబుతాను. ఒక ఊరిలో శివ అనే వ్యక్తి ఉండేవాడు. అతను జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు. అతను ఒకటి అనుకుంటే మరొకటి జరిగేది. వ్యాపారం చేద్దామనుకుంటే నష్టాలు వచ్చేవి. ఉద్యోగం చేద్దామనుకుంటే ఎవరూ ఇచ్చేవారు కాదు. ఊరంతా అతనిని దురదృష్టవంతుడు అనేవారు, అతను ఎందుకు పనికిరానివాడని హేళన చేసేవారు. ఈ కష్టాలకు, సాటి వారు అనే మాటలకు నొచ్చుకున్న అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అతను నివసించే ప్రదేశానికి దూరంగా ఎత్తైన కొండ పైకి చేరుకున్నాడు. ఆ కొండ పై నుంచి దూక బోతున్నాడు. ఇంతలో ఒక బైరాగి అక్కడికి వచ్చాడు. ఆ బైరాగి నువ్వు ఎందుకు చనిపోవాలని కుంటున్నావు నాయనా అని శివని అడిగాడు. తన పరిస్థితి అంతా వివరంగా ఆ బైరాగికి చెప్పాడు. అప్పుడు ఆ బైరాగి పక పకమని నవ్వి నువ్వు దురదృష్టవంతుడివి కావు. చాలా అదృష్టవంతుడివి అందుకే ఆ సంఘటనలన్నీ నీ జీవితంలో జరిగాయి. నువ్వు చనిపోవడానికి నిశ్చయించుకొని ఇక్కడికి వచ్చావు. నాకు కనిపించావు. లేకుంటే నువ్వు నాకు కనిపించేవాడివి కావు. నీ అదృష్టం వలన ఆ సంఘటనలన్నీ నీ జీవితంలో జరిగాయి.
నేను ఎంతోకాలం నుండి హిమాలయాలలో తపస్సు చేసి సాధించిన తపోశక్తితో ఒక అద్భుతమైన తాయత్తు చేశాను. ఆ తాయత్తును ఇవ్వడానికి యోగ్యత ఉన్న వ్యక్తి కోసం చూస్తున్నాను. ఆ యోగ్యత ఉన్న వ్యక్తి ఇన్నాళ్లకు నాకు కనిపించాడు. ఆ వ్యక్తివి నువ్వే అని ఆ తాయత్తులో మంత్రాక్షరాలతో రాసిన పేపర్ పెట్టి ఇచ్చాడు.
కుమారా ఈ తాయత్తుని జాగ్రత్తగా కాపాడుకో. పొరపాటున కూడా దీనిని ఎప్పుడూ ఓపెన్ చేయకు. ఆ పేపర్ లో ఏముందో చదవకు. అలా నువ్వు చేస్తే ఈ తాయత్తు దాని మహిమను కోల్పోతుంది. దీనిని ధరించడం వలన నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా మారుతుంది. నువ్వు నీ జీవితంలో అనుకున్నవి అన్ని సాధించాక,ఇంక జీవితంలో సాధించడానికి ఏమి లేదు అనుకున్నప్పుడు, నీ చివరి రోజులలో దీనిని ఓపెన్ చేసి చదువు. అప్పుడు ఈ తాయత్తు మహత్తు నీకు తెలుస్తుందని చెప్పి వెళ్లి పోయాడు.
శివ ఆనందంతో పొంగి పోయాడు. తన కష్టాలన్నిటికి కారణం, తాను చనిపోవాలనుకోవడానికి వెనుక ఇంత కథ ఉందన్నమాట, నేను చాలా అదృష్టవంతుడిని. ఈ తాయత్తు పొందడానికి నా జీవితంలో ఇన్ని కష్టాలు మాటలు పడ్డానన్న మాట అని అనుకున్నాడు. తన గతాన్ని మరిచిపోయాడు. తాను సాధించబోయే విజయాల గురించి ఊహించటం మొదలుపెట్టాడు. తన ఊహల్ని నిజం చేసుకోవటానికి ప్రయత్నం మొదలు పెట్టాడు. ఒక్కక్కటిగా జీవితంలో తాను అనుకున్నది సాధించటం మొదలు పెట్టాడు. భయపడటం మాని ప్రయత్నించటం మొదలు పెట్టాడు. విజయాలను అలవాటుగా మార్చుకున్నాడు. మంచి ఉద్యోగం వచ్చింది. మంచి భార్య లభించింది. బంగారం లాంటి పిల్లలు పుట్టారు. తాను అనుకున్నట్టుగా ఒక స్టార్ట్అప్ మొదలు పెట్టాడు. అది సక్సెస్ అయ్యి ఒక సక్సెస్ ఫుల్ entrepreneur అయ్యాడు. ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. లగ్జరియస్ కార్లు కొన్నాడు. విలాసవంతమైన బంగ్లాలోకి అతని నివాసం మారిపోయింది. దేశవిదేశాలు తిరిగాడు. మంచి స్కూళ్ళు కట్టించాడు. విద్యను ప్రోత్సహించాడు. అనాధలకు ఆశ్రయం కల్పించాడు. సమాజానికి తన వంతు సేవ చేసాడు. పిల్లలు పెద్ద వాళ్లయ్యి బిజినెస్ చూసుకోవడం మొదలు పెట్టారు. తన జీవితంలో సాధించాలనుకున్నవి అన్ని సాధించాడు. ఇప్పుడు ముసలివాడయ్యాడు. తన జీవితం ధన్యమైంది అనుకున్నాడు. ఇక మనఃశాంతిగా చనిపోవచ్చనుకున్నాడు. అప్పుడు అతనికి బైరాగి అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. తాయత్తు గుర్తుకు వచ్చింది అది అతని చేతికి అలాగే ఉంది. ఆతృతగా దానిని తెరిచి ఆ పేపర్ లో ఏముందో చదివాడు. చదివి నిర్ఘాంత పోయాడు. కాసేపటికి తేరుకున్నాడు. నిజంగానే ఇది అద్భుతమైన, ప్రతిఒక్కరు తెలుసుకోదగిన సత్యం అని సంతోషించాడు. అందులో రాసి ఉన్న మంత్రం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే జాగ్రత్తగా వినండి. ఇది చాలా శక్తివంతమైన మంత్రం. అందులో ఇలా రాసి ఉంది.
"కుమారా! ఈ తాయత్తులో ఏమి లేదు. అనంతమైన శక్తి నీలోనే ఉంది. నీ ఆలోచనల్లోనే ఉంది. నీ మనస్సే సర్వ శక్తివంతమైనది. నీవు గడిపిన విజయవంతమైన నీ జీవితమే అందుకు గొప్ప ఉదాహరణ."
అవును ఇది బైరాగి చెప్పిన గొప్ప జ్ఞానం. అనంతమైన శక్తి నీలోనే ఉంది. వివేకానందుడు చెప్పింది ఇదే, వేదాలు, పురాణాలు ఘోషించేది ఇదే..
మన విజయానికి అవసరమైన తాయత్తు మన మనస్సులోనే ఉంది. దానిని బయటకు తీద్దాం
మనం విజయానికి అవసరమైన మనో తాయత్తు కట్టుకుందాం.
మనం విజయాలను అలవాటుగా మార్చుకుందాం.
ధన్యవాదములు మిత్రులారా!
జై హింద్
జై భారత్
వందే మాతరం.
Watch on Youtube https://youtu.be/nv7sKm-5cLA