20, ఫిబ్రవరి 2026, శుక్రవారం

మనసు గోడలపై వేలాడే జ్ఞాపకాలు - ఆ తరగతి గదులు

 జ్ఞాపకాల తరగతి గది

 

అప్పుడు ప్రాణంగా గడిపిన కాలం...
ఇప్పుడు మౌనంగా వదిలేసిన తీరం...
మళ్ళీ వెళ్ళినా అందుకోలేని ఆ మధుర క్షణం...
ఇప్పటికీ వెదజల్లు జ్ఞాపకాల పరిమళం!

కాకి ఎంగిళ్లు.. పంచుకున్న చిరుతిళ్లు..
ప్రాణ స్నేహితులమై మెలిగిన ఆ రోజులు!
వీడలేమనుకున్న ప్రాణ బంధాలు..
నేడు చిరునామాలే తెలియని దూరాలు!
అయినా.. గుండెల్లో పదిలం ఆ జ్ఞాపకాలు.

స్వార్థం లేని స్నేహం.. కల్మషం లేని బంధం..
నవ్వులతో వికసించిన ఉదయాలు,
ఆటపాటలతో ముగిసిన సాయంత్రాలు!
చిన్న చిన్న అలకలు.. చెక్కబల్లలపై గీతలు..
నల్లబోర్డు సాక్షిగా సాగిన మన కథలు!
ఆ తరగతి గదులు.. మనసు గోడలపై చెదరని చిత్రాలు.

కాలం కరిగిపోయినా.. కదిలే ఆ క్షణాలు,
మన నవ్వుల ప్రతిధ్వనులు వినిపించే ఆ మూలలు!
బెంచీల మధ్యే మన బాల్యం ఆగిపోయింది..
మన కలలన్నీ ఆ గదిలోనే మిగిలిపోయాయి.

కాలం మనుషుల్ని దూరం చేసినా,
ఆ బెంచీల గీతల్లో మన పేర్లు ఇంకా పదిలం..
మనసు మాత్రం అక్కడే ఆగి ఉంది—
వరుసనున్న బెంచీలపై పేర్లలో..
పంచుకున్న చిరునవ్వుల గలగలలో..
మరువలేని ఆత్మీయ స్నేహంలో!

మళ్ళీ ఆ రోజుల్ని తాకలేమని తెలిసినా,
గుండె మాత్రం అక్కడే కొట్టుకుంటోంది..
మన స్నేహం ఇప్పటికీ ఊపిరి పీల్చుకుంటోంది!
అక్కడే సజీవమై మన బాల్యం నిలిచివుంది
మనసు గోడలపై వేలాడే జ్ఞాపకాల ఫోటోల రూపంలో.

మనసు గోడలపై ఇంకా వేలాడుతున్న మీ జ్ఞాపకాలకు —
నా స్నేహితులకు ఈ కవిత అంకితం.

-శివ భరద్వాజ్

మనసు గోడలపై వేలాడే జ్ఞాపకాలు - ఆ తరగతి గదులు

 జ్ఞాపకాల తరగతి గది   అప్పుడు ప్రాణంగా గడిపిన కాలం... ఇప్పుడు మౌనంగా వదిలేసిన తీరం... మళ్ళీ వెళ్ళినా అందుకోలేని ఆ మధుర క్షణం... ఇప్పటికీ వెద...